పరమ పూజ్య స్వామి తేజోమయానందజీ, పూజ్య స్వామి స్వరూపానందజీ, పూజ్య స్వామి మిత్రానందజీ, పూజ్య స్వామి వివిక్తానందజీ, పూజ్యులైన సాధుసంతులు, ఆచార్యులు, చిన్మయ మిషన్ సేవకు అంకితమైన సేవకులందరికీ, దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకూ, ఆధ్యాత్మిక అన్వేషకులకూ, సోదరీ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
మీ అందరి ఆదరాభిమానాల వల్లే నేడు చిన్మయ మిషన్ అమృత మహోత్సవంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇది ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతి. మన సాధుసంతులు నాపై చూపుతున్న ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు, ఆశీస్సులకు ఇది నిదర్శనం. చిన్మయ మిషన్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. చిన్మయ ఋషి స్థాపించిన ఒక చిన్మయ ఆదర్శం. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంస్థ ప్రస్థానం పవిత్రమైన, చైతన్యభరితమైన సంకల్పాలతో నిండి ఉంది. చిన్మయమైన ప్రతిదీ సహజంగానే అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలిగి ఉంటుంది. నేడు భారత్ మండపంలో జరుగుతున్న ఈ వేడుకకు ‘చిన్మయ అమృత మహోత్సవం’ అనే పేరు ఎంతో సముచితంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్‌తో అనుబంధం కలిగిన సాధుసంతులకు, ఆచార్యులకు, లక్షలాది మంది ఆధ్యాత్మిక అన్వేషకులకు, అనుయాయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ రోజు నేను ఇక్కడకు రాగానే కలిగిన అనుభూతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత సజీవంగా మారింది. పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానంద జీ దర్శనం ఆయన హోలోబోట్తో సంభాషించే భాగ్యం లభించడంతో 33 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. 1993లో వడోదరలో గురుదేవ్‌తో జరిగిన భేటీ, ఆయనతో జరిపిన సంభాషణ, ఆయన చూపిన ఆప్యాయత, అందించిన ఆశీస్సులు – ఈ రోజు మళ్లీ కళ్లముందు సాక్షాత్కరించాయి. ఒక్క క్షణం పాటు నేను మళ్లీ గురుదేవుల భౌతిక సాన్నిధ్యంలో ఉన్నాననే అనుభూతి కలిగింది. ఇది నాకు ఎంతో భావోద్వేగభరితమైన అనుభవం. ఇంత అద్భుతమైన అనుభూతిని అందించిన చిన్మయ మిషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మిత్రులారా,
1993 ఫిబ్రవరి – మార్చి నెలల సమయంలో పూజ్య గురుదేవులను కలిశాను. అమెరికాలోని చికాగోలో జరగనున్న ప్రపంచ సర్వ మత పార్లమెంటు శతాబ్ది ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించేందుకు వెళ్లాను. అదే సమయంలో స్వామి వివేకానందజీ చారిత్రాత్మక ప్రసంగానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. పూజ్య గురుదేవులు నా ఆహ్వానాన్ని అంగీకరించారు. అమెరికాకు వెళ్లిన ఆయన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రపంచ సర్వ మత పార్లమెంటు శతాబ్ది ఉత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ వేడుకల్లో పాల్గొనాలని వారిని ప్రేరేపించారు. అయితే విధి మరోలా నిర్ణయించింది. ఆ సమ్మేళనం ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందే, ఆగస్టు 3న అమెరికాలోని శాన్ డియాగోలో గురుదేవులు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మనందరినీ శోకసంద్రంలో ముంచారు. సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటు జరిగినప్పుడు నేను అక్కడే ఉండడం నా అదృష్టం. పూజ్య గురుదేవులు లేకపోవడం మాలో ప్రతి ఒక్కరికీ ఎంతో లోటుగా అనిపించింది. ఆయన పలికిన ఎన్నో మాటలు నా మనసులో మారుమోగుతూనే ఉన్నాయి. ఆయనతో చివరిసారిగా జరిగిన భేటీలో సాగిన గంభీరమైన చర్చ నేటికీ నా జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసింది. ఆ చర్చలోని ప్రధాన భావం ఒక్కటే – యువశక్తిని నిర్మించడం! ఆ యువశక్తి ద్వారా శక్తిమంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని తీర్చిదిద్దడం!
మిత్రులారా,
గురుదేవులను కలిసిన కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల ఆశీస్సులతో గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించే అవకాశం నాకు లభించింది. అప్పటి నుంచి నేటి వరకు, గత 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా నా శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా నిరంతరం దేశసేవలో నిమగ్నమై ఉన్నాను. ఈ ప్రయాణంలో గురుదేవుల ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో దేశ యువతే నా కృషికి, విధానాలకు కేంద్రబిందువుగా నిలిచారు. చిన్మయ అమృత మహోత్సవంలోనూ యువత కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. మన యువ సహచరుల్లో ఎందరో దాదాపు 300 రోజుల పాటు 40,000 కిలోమీటర్ల ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో లక్షమందికి పైగా యువతను కలుసుకుని వారితో మమేకమయ్యారు. ఇంతటి విశేషమైన కృషి చేసిన మొత్తం బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
“వయమ్ అమృతస్య పుత్రాః” – అంటే మనం అమృత పుత్రులమనేదే మన ఉపనిషత్తుల ఉద్ఘోషణ. ఈ భావన కేవలం ఆధ్యాత్మిక తత్వం మాత్రమే కాదు. మన సాంస్కృతిక విశ్వాసం కూడా. అమరత్వమంటే భౌతిక దేహాలకు సంబంధించినది కాదు. మన చైతన్యం, జ్ఞానం, అవగాహన అమరమైనవని అర్థం. ఈ నిరంతర చైతన్యం వల్లే భారత్ వేల సంవత్సరాలుగా సజీవంగా నిలిచింది. ‘ భారత్‘ అనే పదానికి అసలైన అర్థం – జ్ఞానాన్వేషణలో, జ్ఞానజ్యోతిని వెలిగించే సాధనలో నిరంతరం నిమగ్నమై ఉండే నేల అని.
అందుకే మిత్రులారా,
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ సందర్భాన్ని కేవలం వికసిత భారత నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే వేదికగా మాత్రమే మలచకూడదు. శాశ్వతమైన విలువలతో జీవించడం తెలిసిన, వేల ఏళ్ల అనుభవసారంతో అన్ని కాలాల్లోనూ మానవాళి సంక్షేమం కోసం పాటుపడగల భారతదేశపు అంతరాత్మను కూడా మనం పునరుజ్జీవింపజేయాలి. అందుకే ఆ సందర్భాన్ని ‘అమృత మహోత్సవం’గా జరుపుకోవాలని నేను పిలుపునిచ్చాను. చూడండి, కాలం గడుస్తున్న కొద్దీ ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక అద్భుతమైన ప్రస్థానం తర్వాత మరొకటి జతకలుస్తూ వస్తోంది. ఈ కాలంలో అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలు తమ ప్రస్థానంలో కీలక మైలురాళ్లను చేరుకున్న సందర్భాల్లో అమృత సంకల్పాలను స్వీకరించాయి. ఇప్పుడు చిన్మయ మిషన్ కూడా తన అమృత మహోత్సవం ద్వారా భారతదేశ అమృతకాల ప్రస్థానంలో భాగస్వామి అవుతోంది. ఇదే భారతదేశ సంకల్పశక్తికి అసలైన బలం. మనం ‘అమృతస్య పుత్రాః’ – అమృతత్వపు బిడ్డలం అనడానికి ఇదే నిజమైన నిదర్శనం.
మిత్రులారా,
మన వేదాలు ఇచ్చిన పిలుపు – “వయం రాష్ట్రే జాగృయామ పురోహితాః”. అంటే, దేశ సంక్షేమాన్ని కాంక్షించే మనం దేశాన్ని నిరంతరం జాగృతంగా, ఉన్నతంగా ఉంచేందుకు కృషి చేయాలి. స్వామి చిన్మయానందజీ తన జీవితమంతా ఈ మంత్రాన్ని మార్గదర్శకంగా చేసుకుని జీవించారు. ఆధ్యాత్మిక విషయాలపై ఎంత భక్తిశ్రద్ధలతో ప్రసంగించేవారో, జాతీయ సమస్యలపై కూడా అంతే చొరవతో, స్పష్టమైన వాక్పటిమతో తన అభిప్రాయాలను వెలిబుచ్చేవారు. మన సంస్కృతికి జన్మస్థలం మన దేశమే. మన అస్తిత్వానికి పునాది కూడా ఈ దేశమే. ఆధ్యాత్మిక ప్రగతిని వ్యక్తిగత వికాసంతో అనుసంధానించుకోవాలని, వ్యక్తిగత వికాసాన్ని జాతీయ ప్రగతికి సాధనంగా మలచుకోవాలని స్వామీజీ ఎల్లప్పుడూ బోధించేవారు. భారతీయులలో దేశం పట్ల ఆత్మగౌరవాన్ని నింపడమే స్వామీజీ లక్ష్యం. ఈ ఆశయంతోనే ఆయన గీతా జ్ఞాన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఉపనిషత్తులు, వేదాంతం, మన ధర్మగ్రంథాల్లోని జ్ఞానసారాన్ని సామాన్య ప్రజలకు చేరవేసే ఉద్యమాన్ని ప్రారంభించారు. నేడు ఆయన సంకల్ప ఫలితాలను అనేక రూపాల్లో మనం చూడగలుగుతున్నాం. చిన్మయ మిషన్ కృషి వల్ల ప్రస్తుతం లక్షలాది మంది యువత భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయమవుతున్నారు. ఈ యువత కొత్త తరానికి భారతీయ విలువలను అందిస్తున్నారు. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో పూజ్య గురుదేవులు అందించిన ఈ సేవ ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోతుంది.
మిత్రులారా,
పూజ్య గురుదేవుల శతజయంతి సందర్భాన్ని కూడా ఈ రోజు నేను గుర్తుచేసుకుంటున్నాను. 2015లో ఆయన స్మారకార్థం ప్రత్యేక నాణేన్ని విడుదల చేసే అవకాశం నాకు లభించింది. అప్పుడూ నేను ఒక మాట చెప్పాను. స్వామీజీ జీవితం జ్ఞానం, కర్మ, భక్తి – ఈ మూడింటి అద్భుత సమ్మేళనం. ఆయన గురువు స్వామి శివానందజీ ఆశీస్సులు అందిస్తూ, “వెళ్లు, సింహంలా గర్జించు” అని దీవించారు. స్వామీజీ తన జీవితమంతా అదే స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన ప్రసంగాల్లోని ఆత్మవిశ్వాసం, అంతర్గత శక్తి శ్రోతల హృదయాలపై చెరగని ముద్ర వేసేవి. ఆయన ఆలోచనలను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపేవి. ఆయన నిర్వహించిన ‘ఆర్ట్ ఆఫ్ మేన్ మేకింగ్’ అనే రేడియో కార్యక్రమం అసంఖ్యాకులకు జీవితంలో సరైన దిశను చూపించింది.
మిత్రులారా,
మహనీయులు భౌతికంగా మన మధ్య నుంచి నిష్క్రమించినా, వారు ప్రారంభించిన మహత్తర కార్యాల ద్వారా వారి ఆశయాలు సజీవంగా కొనసాగుతాయి. అందుకే నేడు చిన్మయ మిషన్‌కు చెందిన 100కు పైగా విద్యాసంస్థలు లక్షలాది మంది బాలబాలికలు, యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. ఈ విద్యాసంస్థల్లో వారు ఆధునిక విద్యను అభ్యసిస్తూనే భారతీయ విలువలను కూడా అలవర్చుకుంటున్నారు.
మిత్రులారా,
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో స్వామి చిన్మయానందజీ వంటి దార్శనికులు కన్న కలలను సాకారం చేసే దిశగా నేడు దేశం తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. నూతన భారతదేశ అవసరాలకు అనుగుణంగా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చాం. ఈ నూతన విద్యావిధానంలో భారతీయ విజ్ఞాన సంప్రదాయాలకు, మాతృభాషలో విద్యాబోధనకు, ఆధునిక విజ్ఞానశాస్త్రానికి, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిచ్చాం.
మిత్రులారా,
భారతీయ వారసత్వం పట్ల గర్వభావాన్ని పెంపొందించడం, దాన్ని పరిరక్షించడం కూడా స్వామీజీ జీవిత లక్ష్యాల్లో మరొకటి! కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ గురించి మీ అందరికీ తెలుసు. సముద్రం మధ్యలో ఉన్న ఆ భారీ శిలపై స్వామి వివేకానంద స్మారకాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ఏకనాథ్ రానడేజీ తీసుకున్నారు. ఆ సమయంలో పూజ్య గురుదేవులు ఆయనకు అండగా నిలిచారు. ఈ మహత్తర కార్యానికి తొలి ఆర్థిక సహకారాన్ని కూడా పూజ్య స్వామీజీనే అందించారు. నేడు దేశవిదేశాల నుంచి అక్కడికి వచ్చే లక్షలాది మందికి వివేకానంద రాక్ మెమోరియల్ స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తోంది.
మిత్రులారా,
నేడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు భారతదేశంలోని సాంస్కృతిక కేంద్రాలన్నీ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటున్నాయి. నూతన రూపంలో తీర్చిదిద్దిన కాశీ విశ్వనాథ ధామ్, అయోధ్యలోని భవ్య శ్రీరామ మందిరం, ఉజ్జయినిలోని మహాకాళ్ మహాలోక్, కేదార్నాథ్, బదరీనాథ్ వంటి మన పవిత్ర క్షేత్రాలు ఇందుకు నిదర్శనం. మీరు ఇటీవల కేదార్నాథ్ సందర్శించి ఉంటే, ఆదిశంకరులు తమ భౌతిక దేహాన్ని విడిచిన ఆ పవిత్ర ప్రదేశంలో ఆదిశంకరాచార్యుల దివ్యమైన, భవ్యమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయాన్ని గమనించే ఉంటారు. నేడు ఈ క్షేత్రాలన్నీ తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు భారతదేశం నుంచి ఎన్నో విగ్రహాలు దొంగిలించి విదేశాలకు తరలించి, అక్కడ విక్రయించిన విషయం మీ అందరికీ తెలుసు. వాటిని అడ్డుకునేవారే లేరు. వాటి గురించి ప్రశ్నించేవారు కూడా లేరు. వాటిని పూజించే వారి సంగతి పక్కనపెడితే, కనీసం వాటి గురించి అడిగేవారు కూడా లేకపోయారు. అలా అపహరణకు గురైన 650కు పైగా ప్రాచీన విగ్రహాలను గత 12 ఏళ్లలో మనం తిరిగి భారత్‌కు తీసుకొచ్చాం. మన సాంస్కృతిక కేంద్రాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు సంపాదిస్తున్నాయి.
మిత్రులారా,
స్వామీజీ మన ధర్మాన్ని, తత్వశాస్త్రాన్ని ప్రపంచ ప్రజలకు చేరవేసినట్లుగానే, నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భారత్‌తోనూ, మన ప్రాచీన, వైభవోపేతమైన సంప్రదాయంతోనూ అనుసంధానిస్తోంది. మన వారసత్వం పట్ల గర్వంతో ముందుకు సాగుతున్న ఈ ఆత్మవిశ్వాసం, పరాధీన మనస్తత్వం నుంచి విముక్తి పొందామనే ఈ నమ్మకం – శతాబ్దాలుగా మన ఋషులు, దేశభక్తులు కలలుగన్న మార్గంలో నేడు దేశం పయనిస్తోందనడానికి నిదర్శనాలు. ఈ ప్రయాణంలో వారి ఆలోచనా బలమే మనకు అత్యంత విలువైన సంపద.
మిత్రులారా,
వివిధ సంస్థలు, సంఘాలకు వాటివాటి లక్ష్యాలు ఉండవచ్చు. కానీ అందరినీ ఏకం చేసే ఉమ్మడి ఆశయం, అన్ని మార్గాలూ కలిసే గమ్యం ఒక్కటే – దేశ అభివృద్ధి, దేశ గౌరవం. స్వామి చిన్మయానందజీ తన కాలంలో దేశం ఎదుర్కొన్న సవాళ్లకు అనుగుణంగా తన సంకల్పాలను రూపొందించుకున్నారు. దశాబ్దాలు గడిచేకొద్దీ కాలం మారింది. దేశం ముందుకు కొత్త సవాళ్లు వచ్చాయి. సమాజంలో కొత్త వక్రీకరణలు చోటుచేసుకున్నాయి. నేడు వీటికి పరిష్కారాలు కనుగొనాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయాలి. మన తోటి పౌరుల్లో స్వావలంబన పట్ల అవగాహన కల్పించాలి. 2047 నాటికి వికసిత భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరినీ అనుసంధానించాలి. ఈ లక్ష్యాల సాధన కోసం మనం మరింత చొరవతో ముందుకు సాగాలి.
మిత్రులారా,
భారత్ స్వాతంత్ర్యం సాధించి 2047లో వందేళ్లు పూర్తిచేసుకునే సమయానికి అటూఇటుగా చిన్మయ మిషన్ కూడా తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుంది. అంటే, చిన్మయ మిషన్ శతాబ్ది ప్రస్థానం, వికసిత భారత నిర్మాణ ప్రస్థానం రెండూ సమాంతరంగా ముందుకు సాగనున్నాయి. అందువల్ల మన లక్ష్యాలు ఒక్కట. మన ఆశయాలు ఒక్కటే. ఈ ప్రయాణాన్ని మనమంతా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి. మీకు గురుదేవుల మహత్తర వారసత్వం ఉంది. దశాబ్దాల అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంకితభావంతో పనిచేస్తున్న ఆచార్యులు, ఆధ్యాత్మిక అన్వేషకులు, సేవకులతో కూడిన విస్తృత కుటుంబం మీకు ఉంది. మీరంతా సమష్టిగా వికసిత భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసంతో మరోసారి పూజ్య గురుదేవుల పాదాలకు నమస్కరిస్తున్నాను. చిన్మయ మిషన్‌కు చెందిన సాధుసంతులకు, ఆచార్యులకు, ఆధ్యాత్మిక అన్వేషకులకు, సేవాభావంతో పనిచేస్తున్న సహచరులందరికీ అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హరి ఓం!
హరి ఓం!
హరి ఓం!
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
Delighted to join the Chinmaya Amrit Mahotsav Global Sammelan. The Chinmaya Mission has spent decades serving communities and sharing India's spiritual wisdom with the world. https://t.co/gvALnWbo91
— Narendra Modi (@narendramodi) October 23, 2026
चिन्मय मिशन केवल एक संस्था नहीं है। ये एक चिन्मय विचार है... जिसकी स्थापना एक चिन्मय ऋषि ने की थी... इतने दशकों की इसकी यात्रा भी, चिन्मय संकल्पों से भरी रही है। और, जो चिन्मय है... वो स्वाभाविक ही अमर है, अमृतमय है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
हमारा राष्ट्र ही हमारी संस्कृति की जन्मभूमि है। ये राष्ट्र ही हमारे अस्तित्व का आधार है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
चिन्मय मिशन के प्रयासों से आज लाखों युवा ऐसे हैं... जो भारत के सांस्कृतिक brand ambassador का काम कर रहे हैं। ये युवा भारतीय मूल्यों को नई पीढ़ी तक पहुंचा रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026