Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జల వనరుల రంగంలో సహకారం కోసం భారత దేశం మరియు యురోపియన్ యూనియన్ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రివర్గం ఆమోదం


జల వనరుల రంగంలో భారతదేశం మరియు యురోపియన్ యూనియన్ లకు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ ఎమ్ ఒ యు సమానత్వం, ఆదాన ప్రదానం మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికలపై జల వనరుల నిర్వహణ రంగంలో భారతదేశం, యురోపియన్ యూనియన్.. ఈ రెండు పక్షాలకూ చెందిన సాంకేతిక విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, ఇంకా నిర్వహణ సంబంధమైన సామర్ధ్యాలను పటిష్టపరచేందుకు ఉద్దేశించినది. ఇది జల సంబంధ అంశాలపై – అధ్యయన బృందాల సందర్శనల ద్వారాను, నదీ హరివాణ ప్రాంతాల పరిధిలో జల వనరుల సమీకృత నిర్వహణ పథకాల ద్వారాను – సాంకేతిక విజ్ఞాన మార్పిడికి అవకాశం కల్పిస్తుంది.

స్థిరత్వంతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా అనుసరించదగిన కీలకమైన పర్యావరణ సంబంధ అంశాలను గుర్తించడం ఈ ఎమ్ ఒ యు ధ్యేయాలలో ఒకటి. దీని ద్వారా జల వనరుల నిర్వహణ రంగంలో భారతదేశానికి, యురోపియన్ యూనియన్ కు మధ్య సహకారాన్ని పటిష్టపరచడంతో పాటు మరింతగా పెంపొందించడానికి వీలుగా ఇరు పక్షాల అనుభవ సారాన్ని, సహకారాన్ని ఇచ్చి పుచ్చుకొనేందుకు రంగం సిద్ధం కానుంది. పెరుగుతున్న జనాభా, నీటి అవసరాలు మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జల వనరుల నిర్వహణ రువ్వే సవాళ్లను పరిష్కరించాలనే లక్ష్యంతో భారతదేశంలో నీటి వనరులను మరింత నిలకడైన రీతిలో నిర్వహించాలని ఈ ఎమ్ ఒ యు సూచిస్తోంది. ఎమ్ ఒ యు లక్ష్యాలను సాధించడం కోసం చేపట్టవలసిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

పూర్వ రంగం

జల వనరుల వికాసం మరియు నిర్వహణ కోసం ఇతర దేశాలతో ద్వైపాక్షిక సహకారం ఏర్పరచుకొనేందుకు జల వనరులు, నదుల వికాసం మరియు గంగానది శుద్ధి మంత్రిత్వ శాఖ పలు చొరవలు తీసుకొంటుంది. ఈ చొరవలలో విధాన సంబంధమైన మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన అనుభవం, శిక్షణ కోర్సుల, వర్క్ షాపుల, శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞాన సదస్సుల నిర్వహణ, నిపుణుల రాకపోకలు, అధ్యయన యాత్రలు భాగంగా ఉన్నాయి. జల వనరుల పంపకం, వాటర్ ప్రైసింగ్, సాగు పద్ధతులతో మార్పులను ప్రోత్సహించడం ద్వారా నీటిని సమర్ధంగా వినియోగించుకోవడం, జల వనరులను పొదుపుగా వాడుకోవడం, జల నాణ్యతను పర్యవేక్షించడం వంటి అంశాలలో యురోపియన్ యూనియన్ సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ కు ఉన్న అనుభవం నుండి, ప్రావీణ్యం నుండి లాభపడడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జల వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి వినియోగదారులకు తగినన్ని ప్రోత్సహకాలను అందజేసేందుకు ఇ యు దేశాలు వాటర్ ప్రైసింగ్ విధానాలను అవలంబిస్తున్నాయి. తద్వారా అవి, వాటి పర్యావరణ సంబంధ లక్ష్యాల సాధనలో ముందుకు సాగుతున్నాయి.