Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని

జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని


ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ఈ రోజు జరిగిన జాతీయ యువ దినోత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్డు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్వామి వివేకానంద జయంతి కూడా ఇదే రోజు అని, స్వామి వివేకానంద దేశ యువతీయువకులకు స్ఫూర్తి మూర్తిగా నిలిచారన్నారు. స్వల్ప ఆయు:పరిమాణంలోనే ఎంతో సాధించవచ్చనడానికి స్వామి వివేకానంద ఉజ్జ్వలమైన ఉదాహరణ అని ప్రధాని పేర్కొన్నారు.

దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి తరలివచ్చి ఛత్తీస్ గఢ్ లో సమావేశమైన యువత మన దేశ భిన్నత్వానికి ప్రతీకలుగా కనిపించినప్పటికీ, భారత మాతకు సేవ చేయాలనే ఒకే ఒక మంత్రం ద్వారా ఒక్కటయ్యారని ప్రధాని చెప్పారు.

ఒక్క తాటిపైన నిలవాలని చేసుకున్న తీర్మానమే ఇదివరకు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించిందని, ఇవాళ భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతున్నది కూడా ఈ ఐకమత్య భావనే అని ప్రధాని అన్నారు. 125 కోట్ల మంది ప్రజలు దేశాన్ని నూతన స్థాయిలకు తీసుకువెళ్లాలనే ధ్యేయంతోనే ఒకే బంధంలో ఇమిడిపోయారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో యువజనులను కలిగి ఉన్న దేశం ఎల్లలెరుగని లక్ష్యాలను, స్వప్నాలను కూడా కలిగి ఉండాలని ప్రధాని అన్నారు.

యువతరం అనే మాటకు నిర్వచనం గతాన్ని గురించిన ఆలోచన చేయకుండా తమ భావి లక్ష్యాల వైపు సాగిపోయే వారు అని ప్రధాని స్పష్టం చేశారు.

సామరస్యం, ఐకమత్యం ముఖ్యమని ప్రధాని ఉద్ఘాటించారు. శాంతి, సమైక్యత, సామరస్యం లేనిదే అభివృద్ధికి అర్థమే లేదు. మనం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, శాంతి మన మొట్టమొదటి అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. భిన్నత్వానికి నిలయమైనటు వంటి మన దేశంలో ఏకతాటిపైన నిలవగల విశిష్టమైన సద్భావనకు తావు ఉన్నదని ప్రపంచానికి భారత్ చాటిచెప్పిందని కూడా ప్రధాని అన్నారు. ఇది మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి గొప్పదనం. ఈ వారసత్వం వేదాల నుంచి వివేకానందుడి వరకు, ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల దాకా విస్తరించింది అని ప్రధాని వివరించారు.

ఈ శతాబ్దిని భారతదేశ శతాబ్దంగా మలచే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తన యువజనులకు ఇవ్వాలన్నదే భారత ధ్యేయం అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. నక్సలిజం సమస్యను ఎదుర్కొంటున్నా ఈ దిశగా పురోగమిస్తున్న ఛత్తీస్ గఢ్ రాష్ర్టానికి ఆయన అభినందనలు తెలిపారు.

శ్రమను గౌరవించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నొక్కిచెప్పారు. ప్రజలలో ఈ భావనను పాదుకొల్పాలని ఆయన అన్నారు. పల్లెల, పేదల జీవన శైలిని మార్చడం భారతదేశ ప్రగతికి గమ్యం కావాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 16న ఢిల్లీలో “స్టార్ట్ అప్ ఇండియా” కార్యక్రమం శ్రీకారం చుట్టుకోవడంలో పాలు పంచుకోవలసిందిగా యువతకు ప్రధాని పిలుపునిచ్చారు.

2019, మరియు 2022
సంవత్సరాలు .. వీటిలో ఒకటి మహాత్మ గాంధీ 150వ జయంతి సంవత్సరం కాగా రెండోది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యే సంవత్సరం; ఈ సంగతిని దృష్టిలో ఉంచుకొని గట్టి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని దేశ యువతకు ప్రధాని విజ్ఞ‌ప్తి చేశారు.

***