Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ వైద్య సంఘం (ఎన్ఎమ్ సి) బిల్లులో ప్రతిపాదిత ఆధికారిక సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం జాతీయ వైద్య సంఘం (ఎన్ఎమ్ సి) బిల్లు లో కొన్ని ఆధికారిక సవరణలకు ఆమోదం తెలిపింది.

జాతీయ వైద్య సంఘం (ఎన్ఎమ్ సి) బిల్లు కు సంబంధించి 2018 జనవరి 2 వ తేదీ న లోక్ సభలో ప్రభుత్వం ఇచ్చిన హామీ, అనంతరం పార్లమెంటరీ స్థాయీ సంఘం అందించిన సూచనల నేపథ్యంలో ఈ సవరణలు అవసరం అయ్యాయి.

2018 మార్చి నెల 20వ తేదీన స్థాయీ సంఘం తన నివేదికను పార్లమెంటు కు సమర్పించింది. బిల్లు లోని కొన్ని అంశాలపై వచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకొంది. అలాగే, వైద్య విద్యార్థులు, వైద్యులు అందించిన సలహాలను కూడా పరిగణన లోకి తీసుకోవడమైంది.

వివరాలు:

చేర్చనున్న సవరణలు ఈ కింది విధంగా ఉన్నాయి-

• ఎమ్ బిబిఎస్ చివరి సంవత్సరం పరీక్ష ను దేశవ్యాప్తంగా ఏకీకృత పరీక్ష (కామన్)గా చూస్తారు. దీనిని నేశనల్ ఎగ్జిట్ టెస్ట్ (NEXT) గా పిలుస్తారు:

వైద్య విద్య పూర్తయిన తర్వాత, వైద్య వృత్తిని ప్రారంభించుకునేందుకు లైసెన్సు జారీ పరీక్షను నిర్వహించి విద్యార్దులపై భారం పెంచవద్దంటూ విద్యార్థుల నుండి సూచనలు వచ్చాయి. ఇక నుండి వైద్య విద్య పూర్తి అయిన వారికి మరో పరీక్షను నిర్వహించకుండా, ఎమ్ బిబిఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షనే ఎగ్జిట్ పరీక్షగా భావిస్తారు. దీనివల్ల ఎమ్ బిబిఎస్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ లైసెన్సు కోసం ప్రత్యేకంగా పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. దీనికి కేంద్ర మంత్రి వర్గం తన ఆమోదాన్ని తెలిపింది. విదేశాలలో ఎమ్ బిబిఎస్ చదివి, స్వదేశంలో ప్రాక్టీస్ చేసుకోవాలని భావించే విద్యార్థులకు కూడా ఇదే అర్హత పరీక్ష అవుతుంది.

• ఆయుష్ వైద్యులు.. ఆధునిక వైద్యం చేసుకొనేందుకు వీలుగా ఉన్న బ్రిడ్జి కోర్సు ను రద్దు చేయాలని నిర్ణయించారు:
పరిమిత స్థాయిలో ఆయుష్ వైద్యులు ఆధునిక వైద్యాన్ని ఉపయోగించుకొనే బ్రిడ్జి కోర్సు ను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక వైద్య సౌకర్యాలను కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే వదలివేశారు.

• ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాలలో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజు నియంత్రణ:
ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాలలో 40 శాతం సీట్లకు సంబంధించి మాత్రమే రుసుము ను ఇప్పటి వరకు నియంత్రిస్తున్నారు. అయితే, దీనిని 50 శాతానికి పెంచారు. నిర్ణయించిన రుసుం లోనే ఇతర రుసుములన్నీ కలిసి ఉండాలని స్పష్టం చేశారు.

• ఎన్ఎమ్ సి లో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం 3 నుండి 6 కు పెంపు:
రాష్ట్రాల నుండి వస్తున్న డిమాండ్ల ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 నుండి 6 కు పెంచారు. ఎన్ఎమ్ సి లో 25 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 21 మంది తప్పనిసరిగా డాక్టర్లు అయి ఉండాలి.

• నిబంధనలను పాటించని వైద్య కళాశాలలకు నగదు రూపంలో జరిమానా విధిస్తారు. వివిధ జరిమానాలను ప్రతిపాదిస్తూ, వాటిని పాటించవలసిన నిబంధనలలో చేర్చారు.

నిబంధనలను పాటించని కళాశాలలపై జరిమానాల విషయమై సంబంధిత కళాశాలల నుండి ఆందోళన వ్యక్తమైంది. ఒక బ్యాచ్ విద్యార్ధుల నుండి వసూలు చేసిన ఫీజుకు ఒకటిన్నర నుండి పది రెట్లు రుసుము ను జరిమానా గా వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిని మార్చి, జరిమానా ను ఒకేసారిగా విధించకుండా, దశల వారీగా తీవ్రతను పెంచాలని నిర్ణయించారు. ముందు హెచ్చరికలు ఇవ్వడం, ఒక మోస్తరు జరిమానాలు, విద్యార్ధుల ప్రవేశాలను కుదించడం, ప్రవేశాలపై నిషేధం, అంతిమంగా గుర్తింపు ను రద్దు చేయడం.. ఈ తరహా లో దశలవారీ గా చర్యలు తీసుకుంటారు.

• అర్హతలు లేని వైద్యులు, నకిలీ వైద్యులపై కఠిన శిక్షలు

ప్రజలకు సురక్షితమైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉంది. విద్యార్హతలు లేకుండా వైద్యాన్ని అందిస్తున్న వారి పైనా, నకిలీ వైద్యుల పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వారికి ఏడాది పాటు జైలు, 5 లక్షల రూపాయల వరకు జరిమానా ను విధిస్తారు.

***