Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్‌ లో భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఝార్ ఖండ్‌ లో భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ (ఐఎఆర్ఐ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్య‌క్ష‌త‌ వహించారు. వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌- విద్యా శాఖ/భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ‌ (డిఎఆర్ఇ/ఐసిఎఆర్)ల ప్ర‌ణాళిక ప‌థ‌కం కింద 12వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో ‘భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ (ఐఎఆర్ఐ)- ఝార్ ఖండ్‌’ను ప్ర‌తిపాదించారు. దీనికి రూ. 200.78 కోట్లు (100 శాతం ఐసిఎఆర్ వాటా) అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా వేయ‌గా, ఝార్ ఖండ్‌ ప్ర‌భుత్వం ఇందుకోసం త‌మ రాష్ట్రంలోని హ‌జారీబాగ్ జిల్లా బ‌ఢీ స‌మితి లోని గౌరియా కర్మా గ్రామంలో 1,000 ఎక‌రాల భూమిని కేటాయిస్తుంది.

భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ (ఐఎఆర్ఐ)- ఝార్ ఖండ్‌ ఒక విశిష్ట సంస్థ‌..న్యూ ఢిల్లీలోని ఐఎఆర్ఐ కి గ‌ల గుర్తింపు, ఇత‌ర ప్ర‌మాణాలు దీనికీ ఉంటాయి. అంతేగాక అక్క‌డున్న త‌ర‌హాలోనే క్షేత్ర‌, ఉద్యాన పంట‌లు, వ్య‌వ‌సాయ అట‌వీ, ప‌శు సంవ‌ర్ధ‌క, మ‌త్స్య‌, కోళ్ల‌ు- పందులు, ప‌ట్టు- ల‌క్క- తేనెటీగ‌ల‌ పెంప‌కం స‌హా వ్య‌వ‌సాయానుబంధ రంగ కార్య‌క‌లాపాల‌న్నీ సాగుతాయి.

వ్య‌వ‌సాయ రంగం ఎదుర్కొంటున్న స‌వాళ్లతో పాటు తూర్పు భార‌తం లోని సంక్లిష్ట‌త‌ల‌పై ప్ర‌స్తుత కేంద్ర‌, రాష్ట్ర ప‌రిశోధ‌న‌- అభివృద్ధి సంస్థ‌లు, ప్రైవేటు రంగం స‌హ‌కారంతో ప‌రిష్కారాల‌ను అన్వేష‌ణ‌కు కృషి చేస్తుంది. త‌న బాధ్య‌త‌ల‌లో భాగంగా ప‌రిశోధ‌న‌, విద్య‌, విస్త‌ర‌ణ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంది. ఆ మేర‌కు నాణ్య‌మైన మాన‌వ వ‌న‌రుల సృష్టి, ఉత్పాద‌క‌త- నాణ్య‌త‌- లాభ‌దాయ‌క‌త‌ల‌ పెంపు వంటి రైతు హిత సాంకేతిక ప‌రిజ్ఞానాభివృద్ధికి పాటుప‌డుతుంది. వ్య‌వ‌సాయాధార ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం స‌హా తూర్పు ప్రాంతంలో వ్య‌వ‌సాయ రంగం సంపూర్ణ‌, సుస్థిర అభివృద్ధి దిశ‌గా ఉపాధి అవ‌కాశాల‌ను కూడా సృష్టిస్తుంది. న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ కి అనుబంధంగా స‌మీకృత బ‌హు ముఖ ప‌రిశోధ‌న‌లు స‌హా పంట‌ల-ప‌శు విజ్ఞాన శాస్త్రాలు, ప్ర‌కృతి వ‌న‌రుల నిర్వ‌హ‌ణ త‌దిత‌రాల‌ను ప్ర‌త్యేక శిక్ష‌ణ విభాగాల‌ ద్వారా నిర్వ‌హిస్తుంది.