Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“టిబి కి ముగింపు” సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

“టిబి కి ముగింపు” సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

“టిబి కి ముగింపు” సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి,

ఆరోగ్య శాఖ సహాయ మంత్రి,

నైజీరియా ఆరోగ్య శాఖ మంత్రి,

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్,

వేదికను అలంకరించిన ఇతర మాననీయ వ్యక్తులు,

ప్రపంచ దేశాలన్నింటి నుండి విచ్చేసిన అతిథులు,

మహిళలు మరియు సజ్జనులారా,

‘క్షయ వ్యాధికి ముగింపు’ సదస్సు లో పాల్గొనేందుకు మీ అందరూ భారతదేశానికి వచ్చారు. మీకందరికీ ఇవే నా ధన్యవాదాలు; మరియు హృదయాంతరాళంలో నుండి మీకు స్వాగతం పలుకుతున్నాను.

మిత్రులారా,

ప్రపంచ ఆరోగ్య సంస్థ 25 సంవత్సరాల క్రితమే క్షయ వ్యాధి (టిబి) ని ఒక అత్యవసర పరిస్థితి గా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వ్యాధి ని అరికట్టేందుకు వివిధ దేశాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం అందరం క్షయ వ్యాధి నిర్మూలన విషయంలో ఎంతో ముందుకు సాగాం; దానిని అంతం చేసేందుకు చాలా కృషి చేశాం.. అయినప్పటికీ మనం దానిని నిలువరించడంలో విజయవంతం కాలేదని క్షేత్ర స్థాయి వాస్తవాలు చెబుతున్నాయి.

మిత్రులారా,

ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు కనిపించలేదంటే మనం దానిని పరిష్కరించేందుకు చేపట్టే వైఖరిపై పునరాలోచన చేయవలసివుంటుందని నేను నమ్ముతున్నాను. క్షేత్ర స్థాయిలో మనం చేస్తున్న పని ఎలా ఉంది ?, ప్రణాళికలు ఏ విధంగా అమలవుతున్నాయి ? అనే అంశాలను విశాల దృష్టికోణంలో నుండి విశ్లేషించాలి. పాత విధానాలను గురించి తీవ్రంగా విశ్లేషించినట్లయితే కొత్తగా అనుసరించవలసిన మార్గం కనిపిస్తుంది.

ఈ అలోచనతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత విభాగం, స్టాప్ టిబి సంస్థల భాగస్వామ్యంలో భారత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆసియా, ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకు రావడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల లో ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ప్రధాన సమావేశం కూడా ఒకటి జరుగనుంది. యావత్ మానవాళి క్షేమానికి అత్యంత ప్రధానమైన ఆ సమావేశానికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సన్నాహాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. భూగోళం నుండి టిబి ని శాశ్వతంగా నిర్మూలించడంలో ఈ “ఢిల్లీ ఎండ్ టిబి సమిట్” ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఇదే విషయంలో భారతదేశం తీసుకొన్న ఒక ప్రధానమైన చొరవ కు ఇటీవలే ఏడాది పూర్తి అయింది. “ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతంలో 2030 కల్లా టిబి నిర్మూలనకు ఢిల్లీ కార్యాచరణ” పేరిట గత ఏడాది చేసిన ప్రతిపాదన ను అంతా ముక్తకంఠం తో స్వాగతించారు. ఈ ప్రతిపాదన అనంతరం అనుసరించిన విధానాలు ఆగ్నేయాసియా ప్రాంతంలో టిబి అదుపులో అత్యంత సానుకూల ఫలితాలు తెచ్చేవిగా ఉన్నాయి. ప్రజల జీవితాలను టిబి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ?, సమాజ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ?, దేశ ఆర్థిక వ్యవస్థ ను, భవిష్యత్తు ను ఎంతగా దెబ్బ తీస్తుంది ? వంటి అంశాలన్నీ పరిగణన లోకి తీసుకొంటే నిర్దిష్ట కాల పరిమితి లో దానిని సమూలంగా నిర్మూలించడం తప్పనిసరి అవుతుంది. భారతదేశం లో మరే అంటువ్యాధి కన్నా టిబి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని బాధితులు కూడా పేద ప్రజలే. అందువల్ల టిబి నిర్మూలనకు తీసుకొనే ప్రతి ఒక్క చర్య నేరుగా ప్రజాజీవితంతో ముడిపడి ఉంటుంది.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా టిబి నిర్మూలనకు విధించిన గడువు 2030.

కానీ, ఆ గడువు కన్నా అయిదు సంవత్సరాల ముందే, అంటే 2025 నాటికే, భారతదేశం టిబి ని పారదోలుతుందని ఈ వేదిక మీది నుండి నేను ప్రకటిస్తున్నాను. దేశంలో టిబి సమూల నిర్మూలన కోసం ప్రభుత్వం పూర్తిగా కొత్త వ్యూహంతో కూడిన సరికొత్త విధానాన్ని మా ప్రభుత్వం అనురిస్తోంది. ఆ కొత్త వ్యూహం ఎలా ఉందన్నది సంక్షిప్తంగా మీరు కూడా ఇక్కడ ఇచ్చే ప్రెజెంటేశన్ లో వీక్షించగలుగుతారు. టిబి నిర్మూలన ఆ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ కలిసికట్టుగా పని చేసేలా మా ప్రభుత్వం వారిని స్ఫూర్తివంతం చేస్తోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

2025 కల్లా క్షయవ్యాధి ని సంపూర్ణంగా నిర్మూలించడం లక్ష్యంగా రూపొందించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలులో ఉంది. టిబి సంబంధిత పథకాలకు ప్రభుత్వం నిరంతరాయంగా నిధుల కేటాయింపులు పెంచుతూనే ఉంది. ఈ ఏడాది బడ్జెట్ లో క్షయవ్యాధి తో బాధ పడుతున్న రోగులకు పోషకాహారాన్ని అందించేందుకు అదనంగా 100 మిలియన్ డాలర్లు కేటాయించాం. ఇలా పోషకాహారం కోసం వనరులు అవసరమైన, ఆర్థికంగా స్ధితిమంతులు కాని రోగుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నిధులు జమ చేస్తున్నాం. టిబి రోగులను గుర్తించడం, యాక్టివ్ కేసులకు సంబంధించిన సమాచారం సకాలంలో అందించడం, మందులు ఎంత సమర్థంగా పని చేస్తున్నాయో తెలుసుకోవడం, ఔషధ నిరోధక టిబి ని ట్రాక్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నాం. ప్రతి ఒక్క టిబి రోగికి సమర్థమైన చికిత్స అందించే కార్యక్రమాలలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామి ని చేస్తున్నాం. ఈ రంగంలో సరికొత్త అన్వేషణలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వినియోగించడంపై కూడా దృష్టి సారించాం. ఇంటర్ నెట్- ఆఫ్- థింగ్స్ మాధ్యమంగా అత్యాధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలు, అనుబంధ పనిముట్లు వినియోగించుకొంటున్నాం. చికిత్స పర్యవేక్షణ, వ్యాధిపై నిరంతర నిఘా కోసం మొబైల్- హెల్త్ సొల్యూశన్ లను కూడా వినియోగించుకొంటూ ఈ కార్యక్రమం నిర్వహణను మరింత సమర్థవంతం చేశాం.

డిజిటల్ ఎక్స్- రే లను చదవగల సామర్థ్యం గల మలెక్యులర్ డైగ్నోస్టిక్ పరికరాన్ని దేశీయం గానే తయారుచేశాం. కృత్రిమ మేధస్సు ఆధారంగా తయారు చేసిన ఈ యంత్రానికి ట్రూ నాట్ (True NAAT) అని పేరు పెట్టారు. మేక్ ఇన్ ఇండియా ప్రచార ఉద్యమంలో కూడా ఈ యంత్రం తయారీ ఒక కీలకమైన మైలురాయి. టీకామందులు, మెరుగైన ఔషధాలు, డైగ్నోస్టిక్స్, అమలు వంటి చర్యలన్నింటినీ మరింత బలోపేతం చేయడం కోసం ఇండియా టిబి రిసర్చ్ కన్సార్షియమ్ ను ఏర్పాటు చేయడమైంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టిబి నిర్మూలనలో ప్రధాన పాత్ర ను పోషిస్తున్నాయి. సహకార పూర్వక సమాఖ్య వాదం స్ఫూర్తి ని మరింత బలోపేతం చేయడం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ను కూడా పొందడం లక్ష్యంగా టిబి నిర్మూలన లో కీలక భాగస్వాములు కావాలంటూ ముఖ్యమంత్రులందరికీ నేను లేఖలు రాశాను. దేశం నుండి టిబి ని పూర్తిగా పారదోలేందుకు మేం తీసుకున్న కట్టుబాటు ఎంత బలమైందో అన్న దానికి ఇక్కడ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన మంత్రులు, ఆరోగ్య శాఖ అధికారులే సజీవ నిదర్శనం.

మిత్రులారా,

ఈ కార్యక్రమం ఏ దేశంలో అమలవుతోంది అనే అంశంతో సంబంధం లేకుండా దీని నిర్వహణలో క్షయవ్యాధి చికిత్సకులు, సిబ్బంది కీలక పాత్ర ను పోషిస్తారు. అలాగే వ్యాధి వ్యాప్తి ని నిర్వీర్యం చేసేందుకు అవసరమైన మందులు క్రమం తప్పకుండా తీసుకొంటూ చికిత్స పొందుతున్న రోగులు కూడా ప్రశంసనీయులే. ఆత్మస్థైర్యం తో వ్యాధి ని జయించిన టిబి రోగులు కూడా ఇతరులందరికీ స్ఫూర్తివంతులే. ఆత్మస్థైర్యం తో నిలచే రోగుల సహాయంతో భారతదేశం సహా ప్రపంచం లోని అన్ని దేశాలకు చెందిన టిబి కార్యకర్తలు లక్ష్యసాధన దిశగా విజయవంతంగా కదులుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేశంలో టిబి నిర్మూలన గడువు 2030 కాదు, 2025 సంవత్సరమే అన్న విషయాన్ని గుర్తుంచుకొని పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో పని చేయాలని ఆరోగ్య రంగం లోని వారందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మేం సరైన వ్యూహంతో సరైన బాట లోనే విధానాలు అమలుపరుస్తాం. అందువల్ల ఏ ఒక్కరూ ఈ లక్ష్యాన్ని చేరడంలో మమ్మల్ని నిరోధించలేరు.

మిత్రులారా,

వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయడం, ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతులను చేయడం, టిబి చికిత్స విధానాలు నిరంతరం పర్యవేక్షించడం వంటి బహుముఖీన విధానంలో మేం లక్ష్యాన్ని సాధించగలుగుతాం. టిబి రహిత గ్రామాలు, పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రం ఏర్పాటు దిశగా పంచాయతీలు, మ్యునిసిపాలిటీలు, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం స్థాయిలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన శక్తిని కేంద్రీకరించాలి.

మిత్రులారా,

కొంతమంది దృష్టిలో 2025 కల్లా టిబి రహిత భారతదేశం ఆవిష్కారం అసాధ్యం. కానీ అది అసాధ్యం ఏమీ కాదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా మా ప్రభుత్వం కొత్త విధానంలో పని చేస్తోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

మేం సమస్యలను, సవాళ్లను వేరుగా చూడం. ఒక పరిపూర్ణమైన ధోరణిలో సవాళ్లను ఎదుర్కొంటూ కృషి చేసినట్లయితే ఫలితాలు తప్పనిసరిగా సాధించగలం. నే ను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు. టీకా కార్యక్రమాన్ని గురించి చెప్పాలనుకొంటున్నాను. దేశంలో టీకాల కార్యక్రమం 30- 35 సంవత్సరాలుగా అమలవుతూంది. 2014 వరకు సంపూర్ణ టీకాల లక్ష్యాన్ని సాధించలేకపోయాం. అదే వేగంతో మేం కూడా ముందుకు సాగినట్లయితే సార్వత్రిక టీకా రక్షణ ను సాధించడానికి మరో 40 సంవత్సరాలయినా పట్టేది.

మిత్రులారా,

ఇప్పుడు నేను మాట్లాడుతున్న సరికొత్త వైఖరే దీనికి కారణం. మేం మొదట సంవత్సరాల తరబడి నామమాత్రంగానే కార్యక్రమం అమలు జరుగుతున్న టీకాల కార్యక్రమ కవరేజ్ కు దూరంగా ఉన్న జిల్లాల పైన దృష్టి సారించాం. మిశన్ ఇంద్రధనుష్ పేరిట ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి, క్షేత్రస్థాయిలో కృషి చేసింది. ఈ రోజు ఫలితాలు సుస్పష్టంగానే కనిపిస్తున్నాయి.

మిత్రులారా,

గతంలో టీకా కార్యక్రమాల అమలు వేగం ఒక శాతం మాత్రమే ఉండేది. కానీ మూడు, మూడున్నర సంవత్సరాల కాలంలోనే ఈ వేగం 6 శాతం దాటిపోయింది. వచ్చే ఏడాది లోగా 90 శాతం లక్ష్యాన్ని మేం సాధించగలం. ఇతర దేశాల నుండి వచ్చిన అతిథులు ఇదెలా సాధ్యం ! అని ఆశ్చర్యపోవచ్చు.

మిత్రులారా,

ఇదే సరికొత్త ధోరణిలో మా ప్రభుత్వం స్వచ్ఛ్ భారత్ ను కూడా చేపట్టింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం 2014లో 40 శాతం ఉండగా ఇప్పుడది 80 శాతానికి చేరింది. అతి తక్కువ కాలం లోనే మేం కార్యక్రమం అమలును రెట్టింపు చేయగలిగాం. 2019 అక్టోబర్ నాటికి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంగా మార్చే దిశగా త్వరితంగా ముందుకు సాగుతున్నాం. ఎంతటి భారీ, సంక్లిష్ట లక్ష్యాలనైనా సాధించగలమని చెప్పడానికే నేను ఈ రోజు ఈ విషయం ఈ అంతర్జాతీయ వేదిక ముందు చెబుతున్నాను. లక్ష్యనిర్దేశమే తొలి అడుగు కావాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఎవరూ ముందుకు సాగలేరు, గమ్యాన్ని చేరలేరు.

మిత్రులారా,

స్థిరమైన లక్ష్యంతో ముందుకు సాగి 2025 కల్లా టిబి రహిత దేశం కావాలన్న కట్టుబాటును భారతదేశం సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను. మిత్రులారా, మీరందరూ ఆరోగ్య రంగం నిపుణులే. వ్యాధి నిర్మూలనకు బహుళ రంగ వ్యూహం ప్రాధాన్యం ఏమిటో మీ అందరికీ తెలుసు. ఔషధాలు, చికిత్స పర్యవేక్షణ, పరిశోధన, పోషకాహారానికి ఆర్థిక సాయం వంటివన్నీ క్షయవ్యాధి పై సమర్థవంతంగా పోరాడడంలో కీలకమని మీరే నాకు చెప్పారు. వీటికి తోడు టిబి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో అత్యంత ఉపయోగకరంగా ఉండే మరిన్ని కార్యక్రమాలు కూడా భారతదేశం లో అమలవుతున్నాయి. వాటిలో స్వచ్ఛ్ భారత్ ఒకటి. భారత ప్రభుత్వం ఉజ్జ్వల యోజన వంటి పథకంతో టిబి కేసుల నిర్మూలన లో కీలక పాత్ర ను పోషిస్తోంది. ఈ పథకం లో భాగంగా దేశం లోని 8 కోట్ల మంది నిరుపేద మహిళలకు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా అందిస్తోంది. ఎల్ పిజి కనెక్షన్ లు ఇళ్లలో ఉండడంతో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యులు పొగ బారిన పడకుండా నిలువగలుగుతున్నారు. టిబి రిస్క్ నుండి బయటపడ్డారు. నాలుగు రోజుల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పోషణ్ పేరిట ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలకు పోషకాహారం అందించడమే కాదు, వారిలో పోషక విలువల లోపం కనీస స్థాయి కి తగ్గించే వాతావరణాన్ని కల్పించడం కూడా ఈ పథకం లక్ష్యం.

మిత్రులారా,

ఈ ఏడాది బడ్జెట్ లో ప్రపంచం లోనే అతి పెద్దదైన ఆరోగ్య హామీ పథకాన్ని భారతదేశం ప్రకటించింది. దీనికి “లాంగ్ లివ్ ఇండియా” అనే అర్ధం వచ్చే ఆయుష్మాన్ భారత్ అనే పేరు పెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక, మాధ్యమిక, చివరి చికిత్సా విధానాలను బలోపేతం చేస్తుంది. దేశ వ్యాప్తంగా 1.5 లక్షల ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంరక్షణ కేంద్రాలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా పని చేస్తాయి. ఇక్కడ ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చౌక ధరలకే ఔషధాలు అందుబాటు లో ఉంటాయి. ఇది కాకుండా 10 కోట్ల పేద కుటుంబాలు తీవ్ర వ్యాధుల నుండి రక్షణ కు ఏడాదికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ను ప్రయోజనం పొందుతాయి.

సోదరులు మరియు సోదరీమణులారా,

మా భారత తత్వ శాస్త్రం, ప్రాచీన భారతీయ శాస్ర్తాలు ఆరోగ్యంపై స్పష్టమైన వైఖరి కలిగివున్నాయి.

सर्वे भवन्तु सुखिनः,

सर्वे सन्तु निरामयाः

सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद्दुःखभाग्भवेत् ।

అని అవి బోధించాయి.

అంటే..

అందరూ ఆనందంగా ఉండాలిగాక, అందరూ ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలిగాక,

ఏది మంగళప్రదమో దానిని అంతా గమనించాలిగాక, ఏ ఒక్కరూ బాధపడకుండా ఉండుగాక

అని భావం.

ఈ తత్వశాస్త్రం నుండే ప్రాచీన ఆయుర్వేద, యోగ ల వంటివి భారత భూమి మీద ఉద్భవించాయి. ఇవి వందల సంవత్సరాలుగా భారతీయుల మదిలో నాటుకు పోయాయి. ఈ చికిత్స విధానాలకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ప్రాచీన భారతీయ వైద్య విధానాలను ఆధునిక వైద్య విధానాలతో కలిపి పని చేయించే కృషి ని భారత ప్రభుత్వం చేపట్టింది. టిబి వ్యాధి నిర్ధారణలో ఆయుర్వేద పాత్ర యొక్క పరిధిని మరింత విస్తరించి ఆ ఫలితాలను ఇతర దేశాలతో పంచుకోవలసిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనే మంత్రానికి ప్రాంతీయ ఎల్లలు లేవు. టిబి రహిత ప్రపంచాన్ని సృష్టించడంలో ఇతర దేశాలతో చేయీ చేయీ కలిపి పని చేయడం భారతదేశానికి ఆనందదాయకం. టిబి వ్యాధికి చికిత్స లో అవసరమైన ప్రధాన ఔషధాలను, వస్తువులను, సాంకేతిక సహాయాన్ని అందిచడం ద్వారా ప్రతి దేశానికి సహకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

మిత్రులారా,

ఏ ప్రణాళిక యొక్క విజయమైనా లేదా వైఫల్యమైనా పేద లపై చూపగల ప్రభావం మీదనే ఆధారపడివుంటుందని జాతి పిత గాంధీ చెప్పారు. జీవన ప్రమాణాలను మెరుగుపరచే క్రమంలో ఆ చిట్టచివరి పేద వ్యక్తి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

టిబి రహిత భారతదేశం ఆవిష్కారం లోను, కడపటి వ్యక్తి ని చేరుకోవడం లోనూ కీలక పాత్రధారి కావాలని ఈ రోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రభుత్వానికి, ప్రతి ఒక్క సంస్థకు, పౌర సమాజం ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టిబి రహిత భారతదేశం అనే తీర్మానం టిబి రహిత ప్రపంచపు స్వప్నం యొక్క సాకారానికి కూడా దోహద పడుతుంది.

ఈ మహా సంకల్పంతో మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకందరికీ ధన్యవాదాలు. అనేకానేక ధన్యవాదాలు.

***