Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిబ్రూగ‌ఢ్ స‌మీపంలోని లెపెట్ కాటా వ‌ద్ద బ్ర‌హ్మ‌పుత్ర క్రాక‌ర్ అండ్ పాలిమ‌ర్ లిమిటెడ్ ను, ఇంకా నుమాలీగ‌ఢ్ రిఫైన‌రీస్ లిమిటెడ్ మైన‌పు ఉత్పాద‌క విభాగాన్ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

డిబ్రూగ‌ఢ్ స‌మీపంలోని లెపెట్ కాటా వ‌ద్ద బ్ర‌హ్మ‌పుత్ర క్రాక‌ర్ అండ్ పాలిమ‌ర్ లిమిటెడ్ ను, ఇంకా నుమాలీగ‌ఢ్ రిఫైన‌రీస్ లిమిటెడ్ మైన‌పు ఉత్పాద‌క విభాగాన్ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు డిబ్రూగ‌ఢ్ స‌మీపంలోని లెపేట్ కాటా లో పెట్రో-ర‌సాయ‌నాల ప్రాంగ‌ణమైన‌ బ్ర‌హ్మ‌పుత్ర క్రాక‌ర్ అండ్ పాలిమ‌ర్ లిమిటెడ్ ను దేశానికి అంకితం చేశారు. అలాగే, నుమాలీగ‌ఢ్ రిఫైన‌రీస్ లిమిటెడ్ మైన‌పు ఉత్పాద‌క విభాగాన్ని కూడా దేశానికి ఆయ‌న అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, దేశానికి ఈ రోజు అంకితం చేస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు రెండు కార‌ణాల రీత్యా ముఖ్య‌మైన‌వి అని తెలిపారు. ప్రాకృతిక ముడి ప‌దార్థాల‌కు అవి జోడించే విలువ ఒక కార‌ణం అని, ఈ ప్రాజెక్టులు అస్పాం యువ‌త‌కు క‌ల్పించే ఉపాధి అవ‌కాశాలు రెండో కార‌ణం అని వివ‌రించారు. ఈ ప్రాజెక్టుల‌ను దేశానికి అంకితం చేయ‌డంతో, దేశ‌మంత‌టా సంతోషం (ఆనంద్) వెల్లివిరియ‌డంతో పాటు అస్సాంలో ఎల్లెడ‌లా హ‌ర్షం (స‌ర్బానంద్) వ్య‌క్తం అయిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ప్రాజెక్టుల‌ను స‌కాలంలో పూర్తి చేయ‌డానికి ఎంతో ప్రాముఖ్యం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెబుతూ, దీని వ‌ల్ల ఉపాధి ల‌భించ‌డ‌మే కాకుండా నిర్మాణ వ్య‌యాలు భారీఎత్తున పెరిగిపోకుండా క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌న్నారు. భార‌త‌దేశ యువ‌తీయువ‌కుల‌కు ఉపాధిని సృష్టించాలంటే దేశంలో పారిశ్రామిక పురోగ‌తి వేగంగా జ‌ర‌గ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఈ దృష్టికోణంలో నుంచే తాను ‘ప్రగ‌తి’ అనే ఒక కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ప్ర‌గ‌తి.. మ‌ధ్య‌లో ప‌నులు నిల‌చిపోయిన ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు ఉత్తేజం క‌లిగిస్తోంద‌న్నారు.

భార‌త‌దేశం అన్ని రంగాల‌లోనూ పురోగ‌మించాలంటే దేశంలోని తూర్పు ప్రాంతాలు అభివృద్ధి ప‌థంలో సాగాల‌ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈశాన్య ప్రాంతాల‌లో మౌలిక స‌దుపాయాలను, క‌నెక్టివిటీని పెంచ‌డం ద్వారా ఈశాన్య ప్రాంతాల పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌ని ఆయ‌న చెప్పారు.

‘ముద్ర‌’, స్టార్ట‌ప్ ఇండియా కార్య‌క్ర‌మాలు స‌హా కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న‌ కార్య‌క్ర‌మాలు యువ‌త‌కు స‌రికొత్త అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డమే ధ్యేయంగా రూపొందిన కార్య‌క్ర‌మాలు అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఉపాధి అవ‌కాశాలను ఒక్క పెద్ద న‌గ‌రాల‌లో మాత్ర‌మే కాకుండా, చిన్న ప‌ట్ట‌ణాల‌లో కూడా క‌ల్పించాల‌ని ఆయ‌న అన్నారు. స‌హ‌కారాత్మ‌క‌మైన స‌మాఖ్య సిద్ధాంతం ప్రాతిప‌దిక‌న కేంద్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని, అభివృద్ధి సాధ‌న‌కు అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు క‌ల‌సి న‌డ‌వాల‌న్నారు.

***