పిఎంఇండియా

భారతదేశం లో పోషకాహారం తక్కువ స్థాయిలో లభిస్తుండడాన్ని నివారించడానికి మరియు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సాగుతున్న ప్రయత్నాలను, అటువంటి కృషిలో చోటు చేసుకొంటున్న పురోగతిని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు సమీక్షించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ), నీతి ఆయోగ్ లతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
పౌష్టికాహార లోపం యొక్క ప్రస్తుత స్థితి, వృద్ధిలో ఆటంకాలు, మరియు సంబంధిత సమస్యలను గురించి ఈ సందర్భంగా సమీక్షించడమైంది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు కొన్నింటిలో విజయవంతంగా నడుస్తున్న పోషకాహారం అందజేత కార్యక్రమాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
రక్తహీనత, తక్కువ బరువు కలిగిన శిశువుల జననాలు, తక్కువ స్థాయిలో పోషకాహారం లభ్యత, వృద్ధికి ఆటంకం ఏర్పడటం.. వంటి సమస్యలను అధిగమించే దిశగా నిర్ధిష్ట లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోయే 2022 వ సంవత్సరం కల్లా గణనీయమైన ఫలితాలు కంటికి కనపడాలని ఆయన ఉద్ఘాటించారు.
ఈ విధమైన ఫలితాలను సాధించడం కోసం పోషకాహారం అందజేత దిశగా జరుగుతున్న ప్రయత్నాల పురోగతిని- ప్రత్యేకించి పేలవమైన పనితీరును కనబరుస్తున్న జిల్లాలలో- పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాన్ని గురించి చర్చించారు.
‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘మిషన్ ఇంద్ర ధనుష్’, ‘బేటీ బచావో – బేటీ పఢావో’ మరియు ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు పౌష్టికాహారం పైన సకారాత్మక ప్రభావాన్ని ప్రసరింపజేస్తున్నట్లు సీనియర్ అధికారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. పౌష్టికాహారం పై ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభావం చూపే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు అన్నింటినీ మేళవించాలంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆశించిన ఫలితాలను సాధించాలంటే పోషకాహారం యొక్క ప్రాముఖ్యంపై సామాజిక చైతన్యాన్ని పెంచి పోషించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ విధమైన జాగృతిని కలిగించేందుకుగాను అసాంప్రదాయక మార్గాలను ఉపయోగించుకోవడానికి పెద్ద పీట వేయాలని ఆయన స్పష్టంచేశారు.
Chaired a meeting to review efforts being made to reduce under-nutrition. Also discussed how real-time monitoring will help fight under-nutrition, especially in the worst performing districts. https://t.co/7UrTLpZmu0
— Narendra Modi (@narendramodi) November 25, 2017