పిఎంఇండియా
2015-16 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో ఒక కొత్త ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐ ఐ ఎస్ ఇ ఆర్)ను తాత్కాలిక కేంపస్లో కార్యకలాపాలు ప్రారంభించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సంస్థ మొదట మూడు సంవత్సరాల పాటు (2015-18) విధులను నిర్వహించేందుకు రూ.137.30 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
పూర్వ రంగం
ఇదివరకటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 కింద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించిన తరువాత తీసుకున్నకొన్ని నిర్ణయాలలో జాతీయ ప్రాధాన్యం కలిగిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐ ఐ ఎస్ ఇ ఆర్)ను అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి. దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఐ ఐ ఎస్ ఇ ఆర్ కు ఒక శాశ్వత కేంపస్ నిర్మాణం కోసం యేర్పేడు మండలంలోని శ్రీనివాసపురం, పంగూరు, చిందేపల్లి గ్రామాలలో 244 ఎకరాల భూమిని కేటాయించింది. కాగా, ఇన్ స్టిట్యూట్ కు శాశ్వత కేంపస్ నిర్మాణం జరిగేటంత వరకు సైట్ సెలెక్షన్ కమిటీ సిఫారసు మేరకు 2015-16 విద్యా సంవత్సరానికి గాను ఐ ఐ ఎస్ ఇ ఆర్ను తిరుపతిలోని శ్రీ రామ ఇంజినీరింగ్ కాలేజీలో తాత్కాలిక కేంపస్ నుంచే విధులను ప్రారంభించేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు.