పిఎంఇండియా

పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమికూడిన నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ రోజు, నాకు ద్వారక విలక్షణమైన రీతిలో కనిపిస్తోంది. ప్రతి చోటా ఇనుమడించిన ఉత్సాహం ప్రతిఫలిస్తోంది. ప్రజల్లో కనిపిస్తున్న స్ఫూర్తి అమోఘమైన స్థాయిలో ఉంది. ద్వారక లో ఇప్పుడు వినూత్న స్ఫూర్తి నా అనుభూతి లోకి వస్తోంది. ద్వారక ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి నా అభినందనలు. ద్వారక లో ఈ రోజు మొదలైన పని బెట్ ద్వారకాను చేరుకోవడానికి వంతెనను నిర్మించడం మాత్రమే కాదు. బెట్ ద్వారకాకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వాన్ని వేల సంవత్సరాల సంబంధాలతో అను సంధానించడం అని తెలుసుకోవాలి.
నేను ఎప్పుడైనా బెట్ ను సందర్శించినప్పుడు ఈ వంతెనను చూసే వాడిని, ఇక్కడి స్పష్టమైన జలాలను గమనించే వాడిని. ఇక్కడ అపరిమితమైన పర్యాటక శక్తి నాకు కనిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకోండి.. మీకు బాగా తెలుసు, గతంలో కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ అంటే ఎంత ఇష్టం ఉండేదో. గతంలో మనం ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాం ? బెట్ ప్రజల స్థితిగతులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. సూర్యాస్తమయం కాక ముందే వారు తమ పనులన్నింటినీ పూర్తి చేసుకొనే వారు. రాత్రి పూట కదలికలు లేకుండా ఆపే వారు. ప్రయాణం కోసం ఒక్క నీటి మార్గం మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు జీవితం చాలా కష్టాలతో, కడగండ్ల తో కూడుకొని ఉండేది. వీటి గురించి బెట్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులకు బాగా తెలుసు. ఎవరికైనా అనారోగ్యం వచ్చి, వారిని రాత్రి పూట ఆసుపత్రికి తీసుకుపోవలసి వస్తే అప్పుడు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేదో బెట్ ప్రజలకు బాగా తెలుసు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ఇక్కడకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న సౌకర్యం వారికి ఒక బహుమతిగా ఉండబోతున్నది.
బెట్ ప్రజల నిత్య జీవిత అవసరాలను తీర్చడానికి ఈ సౌకర్యం చక్కగా ఉపయోగపడుతుంది. బెట్ తీర ప్రాంతంలోను, సముద్ర తీర ప్రాంతాల వెంబడీ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. ఇక్కడకు ఒక పర్యాటకుడు వచ్చి ఠాకూర్ గారికి నమస్కారాలు తెలిపి వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోతే అది ద్వారక ఆర్ధిక వ్యవస్థకు పెద్దగా మేలు చేయదు. అదే పర్యాటకుడు ఇక్కడే రాత్రి పూట బస చేసి, రెండు రోజుల పాటు ఉండి వేయి, రెండు వేల రూపాయల వరకు ఖర్చు పెడితే అది ద్వారకలో నివసించే పేదవారి ఉపాధికి ఉపయోగపడుతుంది. ద్వారకాధీశుని ఆశీస్సుల కోసం ప్రజలు ద్వారక కు వస్తారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించగలిగితే, వారు ఇక్కడ మరికొంత కాలం ఉంటారు. అందుకే మేం అటువంటి సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నాం. ఎవరైనా పర్యాటకుడు ఇక్కడకు వస్తే, ఒకటి రెండు రోజుల ఇక్కడే ఉండాలని భావించాలి. సాయంత్రం పూటను సముద్రం ఒడ్డున గడపాలని, సూర్యాస్తమయాన్ని చూసి సంతోషించాలని ఆ పర్యాటకుడు భావించాలి. అందుకోసం కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం క్రమం తప్పకుండా పని చేస్తోంది.
ఎనిమిది- పది సంవత్సరాల కిందట ద్వారక ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఒక సారి పోల్చి చూడండి. పరిస్థితులు ఎంత మేరకు మారాయి ? ఒక మారు మూల ప్రాంతాన్ని అభివృద్ధి చేసినంత మాత్రాన అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందదు. దీనికి రవాణా మార్గం ఉండాలి. మొదట ఉన్న ప్రాంతాన్ని రెండో ప్రాంతంతో, రెండో దాన్ని మూడో దాంతో అలా అన్నింటినీ అనుసంధానించాలి. గిర్ అడవుల్లో వున్న సింహాలను చూడడానికి ప్రపచమంతా తరలి వస్తోంది. గిర్ సింహాలను చూడడానికి వచ్చిన పర్యాటకులు ఇతర ప్రాంతాలను చూడాలని అనుకుంటారు. ఇక్కడ వెడల్పయిన రహదారులు, రెండు, నాలుగు, ఆరు దోవల రహదారులు ఉంటే పోర్ బందర్, ద్వారక ప్రాంతాలను చూడడం వారికి వీలుగా ఉంటుంది. అప్పుడే వారికి కొత్త ప్రాంతాలను సందర్శించాలని అనిపిస్తుంది. గిర్ సింహాలను చూడడానికి వచ్చే వారు ద్వారకాధీశుడిని సందర్శించాలని భావించే లాగా మనం పరిస్థితులను తయారు చేయాలి. గిర్ సింహాలను చూడడానికి మాత్రమే అనువుగా సౌకర్యాలు ఉంటే, ద్వారకాధీశుడిని చూడడానికి ఎవరు వస్తారు ? అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే నెట్ వర్క్ నిర్మాణంలో మార్పులు చేసింది. రహదారుల నిర్మాణంతో పాటు, వేగాన్ని, సౌకర్యాలను కల్పిస్తూనే ఇక్కడ అభివృద్ధి అనేది ఆర్ధిక రంగానికి నేరుగా సంబంధం ఉండేలా మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న సౌకర్యం ఆర్ధిక కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది.
ఈ రోజు, మనం ఘనుతక్ వరకు జాతీయ రహదారులను విస్తరిస్తున్నాం. ఘను గురించి నేను ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా, అక్కడి నా మనుషులు నాకు గుర్తుకువస్తారు. అక్కడ మనకు ఎప్పటి నుండో పరిచయం ఉన్న పనివాళ్లు ఉన్నారు. రైతులు ఎన్నారు. వాళ్లు అనేక విషయాల గురించి ఆలోచించే వారు. ఈ పని చేస్తే మంచిది, ఆ పని చేస్తే మంచిది అంటూ వారు ఆలోచిస్తూ ఉండే వారు. వారు నిరంతరం ఈ విషయాన్ని గురించి ఆలోచించే వారు. ఈ రోజు మనం అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఘను వరకు రహదారిని విస్తరిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం కోసం మరో జిల్లాను కలుపుకొని ముందుకుపోతున్నాం. జామ్ నగర్, జునాగఢ్, పోర్ బందర్ జిల్లాలను కలిపే ఈ కార్యక్రమానికి రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. శ్రీ మాధవ్ సింగ్ సోలంకి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులను ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి.. ఆ రోజుల్లో ఓ సారి ఓ దినపత్రిక మొదటి పేజీలో ఒక ఫోటో ప్రచురితమైంది. ఆ ఫోటో నాకు ఇప్పటికీ జ్ఞాపకముంది. ఆ రోజుల్లో నేను రాజకీయాల్లో లేను. సామాజిక సేవారంగంలో పని చేస్తున్నాను. జామ్ నగర్ లోనో, లేదా జామ్ నగర్ జిల్లా లోనో ఏర్పాటు చేసిన ఒక వాటర్ ట్యాంకును ప్రారంభించడానికి శ్రీ మాధవ్ సింగ్ సోలంకి వచ్చారు. ఆ రోజుల్లో ప్రభుత్వాల భావన అలా ఉండేది. మరి ఈ ప్రభుత్వం యొక్క భావనను గమనించండి. మేం నిర్మిస్తున్న రహదారులను, సేతువులను చూడండి. వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి ఒక పత్రికలో పూర్తి పేజీ ప్రకటనలో మీ ఫోటోను ప్రచురింపచేసుకోవడం, దీనికే అభివృద్ధి విషయంలో వారి భావన పరిమితం అయింది.
ప్రపంచం మారుతోంది. ఈ మారిన ప్రపంచంలో అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకోవలసి ఉంది. అందుకోసం ప్రతి భారతీయుడు ఈ ప్రపంచాన్ని సంకల్ప బలంతో ఎదుక్కోవలసి ఉంటుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించడమనేది ప్రతి భారతీయుని కల. ఇది ఒక్క నరేంద్ర మోదీ కల మాత్రమే కాదు. మీ స్వప్నాలలో రంగులను నింపాలనే నేను ప్రయత్నిస్తున్నాను. నూతన భారతదేశ సాధన కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం కష్టపడి పని చేస్తున్నాను. శ్రీ నితిన్ గడ్ కరీ కొద్ది సేపటి క్రితమే చెప్పిన ప్రకారం, బ్లూ ఇకానమి విషయానికి వస్తే సీ కేపిటల్ ఆఫ్ గుజరాత్ తో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అపారమైనటువంటి బలాన్ని ఇవ్వగల ఒక ప్రాంతం ఉంది. గుజరాత్ 1600 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని కలిగివుంది. మన మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులు తీర ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. మన సముద్రాలను ఆధారం చేసుకున్న బ్లూ ఇకానమి కి మంచి భవిష్యత్తు ఉంది. మన నౌకాశ్రయాలను అభివృద్ధి పరచాల్సివుంది. అలాగే నౌకాశ్రయాల మీద ఆధారపడ్డ అభివృద్ధి నమూనాను కూడా మన అనుసరించవలసి ఉంటుంది. నౌకాశ్రయాలను రహదారుల తోను, రైలు మార్గాల తోను, విమానాశ్రయాల తోను కలపగలిగేలా మనం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా గోదాముల నుండి సామాన్లను సులువుగా నౌకాశ్రయాలకు చేరవేయవచ్చు.
మన రైతుల వ్యవసాయ ఉత్పత్తులు చాలా తక్కువ సమయంలో అంతర్జాతీయ విపణులకు చేరుకోగలుగుతాయి. దాంతో మన రైతుల ఉత్పత్తులకు అత్యధిక ధర లభిస్తుంది. అందుకే మేం ఈ సదుపాయాలను అభివృద్ధి చేయడానికిగాను క్రమక్రమంగా అనేక చర్యలు తీసుకొంటున్నాం. నా మత్స్యకార సోదరులు మరియు సోదరీమణుల కోసం బ్లూ ఇకానమి లో భాగంగా ఒక నూతన పథకాన్ని మేం రూపొందించాం. ఈ పథకం ఎలా ఉంటుందో వివరంగా మీకు చెబుతాను. ఒక చిన్న పడవ గల మత్స్యకారుడిని తీసుకొందాం. ఆ చిన్న బోటును తీసుకొని ఆ మత్స్యకార సోదరుడు సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు.. అందులో 10- 12 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేడు. ఈ ప్రాంతంలో అతను తగినన్ని చేపలను పట్టుకోలేడు. ఎంతో కష్టపడ్డప్పటికీ, తనకు కావలసిన వాటిలో సగం చేపలను మాత్రమే పట్టుకొని తీరానికి తిరిగివస్తున్నాడు. నా మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులు ఇటువంటి కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే నేను చూస్తూ ఉండిపోవాలా ? వారిని వారి విధి రాతకు వదలివేయాలా ? మన మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులకు వారి జీవితంలో పురోగతిని సాధించాలని ఉండదా ? నా మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులు వారి పిల్లలకు సరైన విద్యను అందించాలి అని అనుకో కూడదా ? నా మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులు ప్రస్తుతం నివసిస్తున్న గుడిసెల్ని వదలివేసి మెరుగైన గృహాలలో జీవించ కూడదా ? ఈ సౌకర్యాలన్నింటినీ వారికి కల్పించాలంటే, వారిని ఆర్ధికంగా శక్తి వంతులను చేయాలి. వారికి సాధికారితను అందించాలి. అందుకోసమే మేం ఒక మంచి పథకంతో ముందుకొచ్చాం. మత్స్యకార సోదరులు మరియు సోదరీమణులు కలిసికట్టుగా వస్తే వారికి రాయితీతో కూడిన వడ్డీ రేటుతో రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. రూ.
1.5 – 2 కోట్ల వరకు రుణ రూపంలో నిధులను అందించడం జరుగుతుంది. ఈ భారీ రుణంతో వారు రూ. 1.5 – 2 కోట్ల వరకు వ్యయమయ్యే పెద్ద బోటును కొనుగోలు చేయగలుగుతారు. పెద్ద పడవ లో వారు 10- 12 నాటికల్ మైళ్ల కంటే మించి సముద్రం లోపలికి వెళ్లి చేపలను పట్టుకోవచ్చు. లోతైన సముద్ర ప్రాంతంలో అత్యధికంగా చేపలు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సాధారణ పరిస్థితుల్లో 3-4 రోజుల్లో వేటాడే చేపల్ని అర రోజు లోనే పట్టుకోగలరు. ఇలా భారీ వేటకు తగినట్టుగానే వాటిని అవసరమైనన్ని రోజులు దాచడానికి సముద్రతీర ప్రాంతంలో శీతల గిడ్డంగులు కూడా ఉంటాయి. ఇటువంటి సౌకర్యాలను మా మత్స్యకారులకు అందజేయాలని అనుకొంటున్నాం. ప్రతి మత్స్యకారుడు ఈ సౌకర్యాల నుండి లబ్ధిని పొందాలి. ఈ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో పెను మార్పులు తెస్తుంది.
ఒక సారి కాండ్లా నౌకాశ్రయం అభివృద్ధి గురించి చూద్దాం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాండ్లా నౌకాశ్రయం స్థితిగతుల గురించి నాకు బాగా తెలుసు. కాండ్లా నౌకాశ్రయ అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అర్ధించే వాళ్లం. కాండ్లాను అభివృద్ధి చేసే చక్కటి అవకాశం గత కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. కానీ వారి ప్రాధాన్యాల జాబితాలో కాండ్లా లేదు. మేం కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత గుజరాత్ లోని నౌకాశ్రయాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేయడంపై దృష్టిని కేంద్రీకరించాం. దీనివల్ల గత 25 సంవత్సరాలలో ఎన్నడూ అభివృద్ధి చెందని విధంగా కాండ్లా నౌకాశ్రయం ఈ మధ్య కాలంలో ప్రగతి సాధించింది. దీని కారణంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇక అలంగ్ ను తీసుకుంటే, ఎన్నో సంవత్సరాలుగా అలంగ్ గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. అలంగ్ అభివృద్ధిని గురించి చర్చించడం జరిగింది. అలంగ్ పారిశుధ్యాన్ని గురించి చర్చించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మన ఉనికికి భావ్ నగర్ లోని అలంగ్ ఒక కారణమని చెప్పవచ్చు. అదే సమయంలో పర్యావరణం పేరు మీద వందలాది ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేవదీశాయి. వీటిని గురించి ఆలోచించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలంగ్ లో పని చేస్తున్న కార్మికుల కోసం ఏదైనా చేసి వారి జీవితాల్లో మార్పులు తేవలసిన బాధ్యత కేంద్రానిదే. గతంలో నేను నిరంతరం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ భారత ప్రభుత్వాన్ని మేల్కొలపలేకపోయాను. కానీ ఈ రోజు సేవ చేసే అవకాశం మాకు లభించడంతో జపాన్ సహాయంతో మేం ఒక పెద్ద పథకాన్ని రూపొందించాం. సాధారణంగా జపాన్ అంటే చాలా మందికి బులెట్ రైలు గుర్తుకువస్తుంది. జపాన్ సహకారంతో అలంగ్ అభివృద్ధి కోసం ఒక భారీ పథకాన్ని రూపొందిస్తున్నామనే విషయాన్ని కొంత మంది మరచిపోతున్నారు. దీనితో అలంగ్ లోని నా శ్రామిక సోదరులు మరియు సోదరీమణుల జీవితాల్లో ఒక పెద్ద మార్పు రాబోతున్నది.
సామాన్య ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మేం అనుసరిస్తున్న మార్పుకు సంబంధించిన దిశ, అలాగే నూతన అంశాల్లో ప్రగతిని సాధించడానికిగాను మేం చేస్తున్న కృషి కారణంగా ఆశించిన ఫలితాలు రాబోతున్నాయి. మాంగ్రోల్, వీరావల్ మన సాంప్రదాయక చేపల వేట కేంద్రాలు. ఈ మధ్యనే మన రాష్ట్రపతి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రాష్ట్రపతి మంగ్రోల్లో పునాది రాయి వేసినందుకు నాకు ఎంతో సంతోషంగా వుంది. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికిగాను ఆయన ఎంతో భారీ పథకానికి పునాది రాయి వేశారు. రాబోయే రోజుల్లో మాంగ్రోల్ చేపల వేట కేంద్రం ఈ మొత్తం బెట్ ప్రాంతంలోనే మత్స్య పరిశ్రమలో శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. బ్లూ ఇకానమి కారణంగానూ, పర్యాటక రంగం కారణంగానూ మొత్తం తీరప్రాంతం అభివృద్ధి చెందుతోంది. తద్వారా మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతోంది.
ఈ రోజు, గుజరాత్ ప్రజల కోసం ఒక బహుమతిని ప్రకటించబోతున్నాను. ఇది గుజరాత్ కే కాదు, దేశానికి కూడా ఉపయోగకరం. మన తీర ప్రాంతంలో, పవిత్ర ప్రాంతమైన ద్వారకలో ఇది సాకారం కాబోతోంది. తీర ప్రాంత సరిహద్దులను రక్షించుకోవడానికిగాను మరీన్ పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయడానికి భారతదేశం చర్యలు చేపట్టింది. మరీన్ పోలీసులకు ఇచ్చే శిక్షణలో, సాధారణ పోలీసులకు ఇచ్చే శిక్షణలో చాలా తేడా ఉంటుంది. మన తీర ప్రాంత భద్రతకు మరీన్ పోలీసులు పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. సముద్రంలో అయిదు కిలోమీటర్ల వరకు మరీన్ పోలీసులదే బాధ్యత. దేశంలోని మొత్తం మరీన్ పోలీసు వ్యవస్థకు అవసరమయ్యే శిక్షణను, పరిశోధనను అందించడానికిగాను పవిత్ర ద్వారక ప్రాంతానికి సమీపం లోని మొజాప్ లో ఒక అతి పెద్ద సంస్థను నెలకొల్పడం జరుగుతుంది. జామ్ నగర్ విమానాశ్రయంలో గల శిక్షణ కేంద్రంలో వైమానికదళ సిబ్బంది కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అదే విధంగా పవిత్ర ద్వారక ప్రాంతంలో నెలకొల్పే శిక్షణా కేంద్రం నుండి మరీన్ పోలీసులు శిక్షణ పొందుతారు. ఇది ఎంత పెద్దదంటే, ఇక్కడ వేల మందికి వసతి సౌకర్యాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా గల పలు ప్రాంతాల నుండి వచ్చే పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతారు. దీనికి సంబంధించి ప్రారంభం కాబోయే ఆర్ధిక కార్యక్రమాలు ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయో మీరు ఒకసారి ఊహించుకోగలరు.
సోదరులు మరియు సోదరీమణులారా,
మీరంతా దీపావళి పండుగ పనులలో తలమునకలై ఉన్నారు. గుజరాత్ ప్రజలకు దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైంది. వ్యాపార వర్గాలకు మరింత ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది. ఈ రోజు నేను దేశవ్యాప్త సమాచారాన్నిచ్చే పత్రికలను చదువుతుంటే, పదిహేను రోజులకు ముందే దీపావళి వచ్చినట్టుగా ప్రధాన వార్త ఒకటి కనపడింది. నిన్న వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి)కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నందుకు అన్ని వైపులా దీపావళి వంటి వాతావరణం ఏర్పడింది. ఈ విషయాన్ని మేం ముందే చెప్పాం. ఇది అమలులోకి రాగానే మొదటి మూడు నెలల పాటు దీని అమలు ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తామన్నాం. ఈ మూడు నెలల్లో ఎదుర్కొనే కష్టాలను, సాంకేతికంగా ఎదుర్కొనే సమస్యలను, నియమాల ప్రకారం ఏర్పడే సమస్యలను, ధరలకు సంబంధించిన సమస్యలను, వ్యాపార వర్గాలు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలను.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేస్తామని ముందే చెప్పాం. ఎందుకంటే, దేశం లోని వ్యాపార వర్గాలు కాలయాపన తంతులో చిక్కుకొని పోకూడదు. ఫైళ్ల మధ్య ఇరుక్కుపోయి అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో మునిగి తేలకూడదు. ఇటువంటి పరిస్థితి ముందు ముందు భారతదేశంలో ఉండకూడదు.
అందుకే నిన్న మా ఆర్ధిక శాఖ మంత్రి జిఎస్ టి మండలిని ఒప్పించి పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం పొందగలిగారు. గత మూడు నెలల్లో సేకరించిన సమాచారం ఆధారంగానే ఆయన జిఎస్ టి మండలిని ఒప్పించగలిగారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనికి ఏక కంఠంతో స్వాగతం పలకడం నాకు సంతోషంగా ఉంది. ఇదే మన దేశం యొక్క బలం. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ప్రభుత్వ విధానాలలో నిజాయతీ ప్రతిఫలిస్తే, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేశం వాటికి పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఈ విషయం నాకు అనుభూతిలోకి వస్తోంది. సులువైన జిఎస్ టిని మరింత సరళంగా చేయడానికి ప్రభుత్వం చేసిన కృషిని స్వాగతించినందుకు నా దేశ పౌరులకు నేను కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాను.
ద్వారక సోదరులు మరియు సోదరీమణులారా,
శ్రీకృష్ణుని ద్వారక సముద్రంలో మునిగిపోయింది. సముద్రం లోపలికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న ద్వారకను తడిమి, పవిత్ర అనుభూతిని పొందాలనేది దేశ ప్రజల యొక్క మరియు ప్రపంచ ప్రజల యొక్క ఆకాంక్ష. సముద్ర గర్భంలోని ద్వారకను తడిమి రావడం సాధ్యమేనా అని అనేక మంది నిపుణులను నేను అడిగాను. శ్రీకృష్ణ భగవానుడు నివసించిన, పరిపాలించిన పురాతన నగరమైనటువంటి ద్వారకకు ప్రజలు వెళ్లి రావడం తాలూకు సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ద్వారకలోని శిలలను చూసి వాటిని స్పర్శించి రావడం సాధ్యమయితే అప్పుడు మొత్తం భారతదేశమంతా ద్వారకకు వచ్చి బారులు తీరి నిలబడుతుంది. మాటల తోనే అభివృద్ధి అనేది సిద్ధించదు. దీనికి ఒక ముందు చూపు, దృక్పథం ఉండాలి. ఈ రోజు దేశం లోని మారుమూల ప్రాంతాల సామాన్యప్రజలకు మా ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడింది. అభివృద్ధి మీద వారు అంచనాలను కలిగివున్నారు. అభివృద్ధి ద్వారా లబ్ధిని పొందాలని భావిస్తున్నారు. పేదరికం అనే విష వలయంలో వారి ముందు తరాలు చిక్కుకుపోకూడదని వారు భావిస్తున్నారు. ప్రస్తుత తరం పేదరికంలోకి నెట్టబడి జీవిస్తుంటే.. ఇక ముందు వారి పిల్లలు అదే పేదరికంలో మగ్గకుండా చూడాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం అభివృద్ధి ప్రయాణం ప్రస్తుతం దేశంలో కొనసాగుతోంది. అభివృద్ధికి సంబంధించిన నూతన ప్రమాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రపంచం అంతా తన వైపు చూడగలిగేలా భారతదేశం కృషి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గల పెట్టుబడిదారులు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. దీని వల్ల దేశంలోని యువతకు భవిష్యత్తులో అనేక నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాదు, ఈ పెట్టుబడుల కారణంగా దేశంలోని రైతుల జీవితాలను మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. గుజరాత్ లోని పల్లెలను సాధికారిత కలిగిన గ్రామాలుగా మార్చడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అభివృద్ధి ప్రయాణంలో గుజరాత్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశాభివృద్ధిలో గుజరాత్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇందుకోసం నేను గుజరాత్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారికి నా అభినందనలు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోతున్నందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
జయ్ ద్వారకాధీశ్.
జయ్ ద్వారకాధీశ్.
జయ్ ద్వారకాధీశ్.
***
Today I am seeing a very different mood here in Dwarka. There is tremendous enthusiasm here. What we are working towards is not merely a bridge to reach Bet Dwarka, it connects us to our history and culture: PM @narendramodi pic.twitter.com/3DPwCOI79A
— PMO India (@PMOIndia) October 7, 2017
I still recall how tough it was for people of Bet Dwarka. Lack of infrastructure meant transportation was tough, people faced difficulties if an emergency came up. We wanted to change this with a push on infrastructure: PM @narendramodi pic.twitter.com/bE57rpOHd6
— PMO India (@PMOIndia) October 7, 2017
Development of the tourism sector cannot be in isolation. If we want to draw more tourists to Gir, we should also inspire the tourist to visit other parts like Dwarka: PM @narendramodi pic.twitter.com/KOOwRom8Xt
— PMO India (@PMOIndia) October 7, 2017
Building of infrastructure should enhance economic activities and add to the atmosphere of development: PM @narendramodi pic.twitter.com/x72LCGJCg5
— PMO India (@PMOIndia) October 7, 2017
When Madhavsinh Solanki ji was CM, I recall front page advertisements for the CM coming to Jamnagar to inaugurate a water tank. This is how narrow their conception of development was. We have come a long way since then & are looking at more all round & extensive progress: PM
— PMO India (@PMOIndia) October 7, 2017
When Madhavsinh Solanki ji was CM, I recall front page advertisements for the CM coming to Jamnagar to inaugurate a water tank. This is how narrow their conception of development was. We have come a long way since then & are looking at more all round & extensive progress: PM
— PMO India (@PMOIndia) October 7, 2017
Government of India is taking steps towards the empowerment of fishermen. We do not want our fishermen to live in poverty, we want to create more opportunities for them: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Kandla Port is seeing unprecedented growth. This is because we devoted resources to improve the port. New lease of life was added to Alang, steps were taken for the welfare of the labourers working there. These are steps we are taking towards development: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Marine policing is a sector we are looking at very closely. We are modernising marine security apparatus. An institute for this will be set up in this Devbhoomi of Dwarka. It will draw people and experts from all over India: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Diwali has come early for our citizens due to the decisions taken in the GST Council. We had said we will study all aspects relating to GST for 3 months, including the shortcomings. And thus, the decisions were taken with consensus at the GST council: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
When there is trust in a government and when policies are made with best intentions, it is natural for people to support us for the best interests of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
The common citizen of India wants the fruits of development to reach him or her. Nobody wants their children to live in poverty. We want to help our people fulfil that dream and want to fight poverty: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
The world's attention is being drawn to India. People are coming to invest here. All this will bring opportunities for the people of India. I see Gujarat contributing actively to the development of India & congratulate the Gujarat Government: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017