పిఎంఇండియా
నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీముకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీముకు రూ.10,000 కోట్ల నిధులను కేటాయించారు. 2019-20 కల్లా 50 లక్షల మందికి అప్రెంటిసులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఆంటర్ ప్రనర్ షిప్ (ఎమ్ ఎస్ డి ఇ) శాఖ అధీనంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ద్వారా అమలు కానుంది. అప్రెంటిసులను చేర్చుకొని, వారికి తగిన శిక్షణను ఇచ్చే సంస్థలకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తారు. అప్రెంటిసులకు చెల్లించే మొత్తం స్టైపెండ్ లో 25 శాతాన్ని యాజమాన్యాలకు ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. సంస్థలు అప్రెంటిసులను చే్ర్చుకున్నందుకుగాను ఆ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మొదటి సారి ఈ పథకాన్ని రూపొందించడమైంది. దీనికి తోడుగా, అప్రెంటిషిప్ ట్రైనింగులో ముఖ్య భాగమైన ప్రాథమిక శిక్షణకు కూడా సాయాన్ని అందించనున్నారు. ప్రాథమిక శిక్షణకు అయ్యే మొత్తం వ్యయంలో 50 శాతాన్ని భారతదేశ ప్రభుత్వంక సమకూర్చనుంది.
దేశంలోగల మొత్తం అప్రెంటిస్ షిప్ వ్యవస్థకే ఈ స్కీము ఉత్ప్రేరకంగా పనిచేయనుంది. ఈ వ్యవస్థలో భాగమైనవారందరూ లబ్ది పొందడానికి వీలుగా దీనిని రూపొందించారు. దేశంలో నైపుణ్యాల అభివృద్ధి సాధనాలలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా ఇది రూపొందగలదని ఆశిస్తున్నారు.
పూర్వ రంగం:
దేశం కోసం నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేసుకోవడానికి ఉపయోగపడే అత్యంత సమర్థమైన మార్గాలలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఒకటని భావిస్తున్నారు. పరిశ్రమ నాయకత్వంలో, అభ్యాసం ప్రధానంగా ఉండే, దీటైన పటిష్ఠమైన ప్రాథమిక శిక్షణను ఈ పథకం అందించనున్నది. 2015లో ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన నేషనల్ పాలసీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఆంట్రప్రనర్ షిప్ భారతదేశంలో నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయడంలో అప్రెంటిస్ షిప్ ఒక కీలకమైన భాగం అని పేర్కొంటోంది. ప్రస్తుత పథకాన్ని కూడా 2015 జాతీయ విధానంలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలనే తీసుకువచ్చారు. 2020కల్లా ఉపాధి రంగంలో పది రెట్లు ఉపాధి అవకాశాలు పెరిగేటట్లుగా ఎమ్ ఎస్ ఎమ్ ఇ లతో సహా పారిశ్రామిక రంగంతో కలసి చొచ్చుకుపోయే తత్వంతో పని చేయాలని ఈ విధానం ప్రతిపాదిస్తోంది.