పిఎంఇండియా
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి… నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కార్యక్రమంతో అనుసంధానమైన యువతలో, భారత ఉజ్వల భవితను నేను చూస్తున్నాను. కొద్ది గంటల కిందటే నేను ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాను. జీ–7 సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాల నాయకులనూ నేను కలిశాను. నేడు ప్రపంచమంతా భారత యువశక్తి గురించి మాట్లాడుతోంది. భారత ప్రతిభ, నైపుణ్యం, సామర్థ్యం గురించి అంతటా చర్చ జరుగుతోంది. భారతీయ యువత సామర్థ్యాన్ని ప్రపంచం నిజంగా గుర్తించడం ప్రారంభించింది. ఇలాంటి తరుణంలో, దేశంలోని ప్రతి యువకుడు తమ సామర్థ్యాన్ని అవకాశంగా మలుచుకునేలా చూడటమే మా లక్ష్యం. ఈ దృక్పథంతోనే ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన‘ ప్రారంభించాం. ఈ ఉపాధి పథకం సాధారణ ఉపాధి ప్రణాళికల పరిధిని మించినది. ఇది తమ తొలి ఉద్యోగాన్ని పొందుతున్న యువత కలలకు బలాన్నిచ్చే పథకం. ఇది యువతకు, పరిశ్రమలకు మధ్య బలమైన వారధిని నిర్మించే పథకం.
మిత్రులారా,
పథకాలను ఉద్యోగుల కోసమో, పరిశ్రమల కోసమో రూపొందించడం సాధారణం. ఇది సమర్థులైన, జ్ఞాన సంపన్నులైన యువతను ఉజ్వల భవిష్యత్తు దిశగా, పారిశ్రామిక అభివృద్ధి దిశగానూ నడిపిస్తుంది. ఒక యువకుడు తన తొలి ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీనివల్ల, ఆ వ్యక్తి ఒంటరిగా రాలేదనీ, వారి వెనక పూర్తి ప్రభుత్వం ఉందని పారిశ్రామికవేత్త భావిస్తారు. తద్వారా, వారి పట్ల పారిశ్రామికవేత్తల దృక్పథం మారుతుంది. కొత్త ఉపాధిని కల్పించే సంస్థలనూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గతంలో, ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఎలా ఉండేవంటే… వ్యాపారం పెద్దదైతే అనేక ఆంక్షల్లో చిక్కుకుపోతామనే భయంతో ప్రజలు ఎదగడానికీ వెనకాడేవారు. అందుకే చిన్న స్థాయిలోనే ఉండిపోవడం మంచిదని భావించేవారు. ఒకవేళ వృద్ధికి అవకాశం ఉన్నా… ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి బదులుగా మరొక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారు. నేడు ఆ ఆలోచనా విధానం మారింది. ప్రతి ఒక్కరికీ పెద్దగా ఎదగాలనే ధైర్యం కలగాలి. వారి ఆశలకు రెక్కలు రావాలి. పరిశ్రమలకూ ఇదే అవసరం. ఈ పథకం అందుకు అవకాశాన్ని కల్పించింది. ఇదే దీని ప్రత్యేకత. కొద్ది సమయం కిందటే నేను ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కొందరు యువకులతో మాట్లాడి, వారి అనుభవాలు తెలుసుకున్నాను. వారిలో కొందరు తమ తొలి ఉద్యోగాన్ని పొందినవారు ఉంటే… మరికొందరు ఈ పథకం కింద ఇతరులకు ఉద్యోగాలు కల్పించినవారూ ఉన్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ యువతలో కనిపించిన ఆత్మవిశ్వాసం అద్భుతమైనది. వారు ప్రపంచాన్నే జయించినట్లుగా అనిపించింది. వారి కలలు, వారి నమ్మకం – ఇవే నిజానికి మన గొప్ప సంపద.
మిత్రులారా,
‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన‘ మద్దతుతో ఇప్పటివరకు సుమారు 70 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన దాదాపు 70 లక్షల మందికి సామాజిక భద్రతా కవచం లభించింది. సుమారు 20 లక్షల మంది యువత తమ మొదటి ఉద్యోగంలో ఇప్పటికే ఆరు నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ రోజు, వీరిలో దాదాపు 10 లక్షల మంది యువత ఈ పథకం కింద లబ్ధిదారులుగా ప్రోత్సాహకాలను అందుకున్నారు. 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు చేరాయి. ఈ మొత్తం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు – ఇది వారి కఠిన శ్రమకు దక్కిన గౌరవం. ఇది వారి ఉజ్వల భవిష్యత్తుపై దేశపు విశ్వాసానికి ప్రతీక.
మిత్రులారా,
మన యువతకు అవకాశాలు కల్పించి, వారిలోని అంతర్లీన సామర్థ్యాన్ని గుర్తించిన సంస్థల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ అవకాశాలను అందించిన సంస్థలూ ప్రశంసలకు అర్హమైనవి. ఈ సంస్థలే ఇటీవలి కాలంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించాయి. మన్‌సుఖ్ భాయ్ ఇప్పుడే వెల్లడించిన గణాంకాలపై మీడియా దృష్టి సారిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంత భారీ స్థాయి కృషి జరుగుతోందని తెలుసుకుని దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి ముందుకు సాగినప్పుడు ఉద్యోగ కల్పన వేగం అనేక రెట్లు పెరుగుతుందని ఈ గణాంకాలు, అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన‘ ఈ నవ భారతానికి ఒక చిహ్నం – ఇందులో యువతకు అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు ప్రోత్సాహం దక్కుతుంది. ఉద్యోగ కల్పన ఒక జాతీయ ఉద్యమంగా మారుతుంది.
మిత్రులారా,
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి. అందువల్ల, అభివృద్ధి చెందిన భారత్ వైపు పయనించే మార్గం మన యువత కలలు, నైపుణ్యాలు, సామర్థ్యాల ద్వారా ముందుకు సాగుతుంది. దేశంలోని ప్రతి యువత తమ సామర్థ్యం మేరకు పురోగమించాలన్నదే మా ప్రయత్నం. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభించాలి. ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణల కోసం ఒక వేదిక లభించాలి. సొంతంగా ఏదైనా సాధించాలనుకునే వారికి పూర్తి మద్దతు అందాలి. భారత్ వంటి యువ దేశంలో, అవకాశాల వనరులు ఎంత ఎక్కువగా ఉంటే, యువత కలలు అంత ఉన్నత శిఖరాలకు ఎగురుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ దార్శనికతతో, గత 12 సంవత్సరాలుగా, ఉపాధికి సంబంధించిన ప్రతి మార్గాన్నీ బలోపేతం చేశాం. మౌలిక సదుపాయాల నుంచి ఆవిష్కరణల వరకు, తయారీ రంగం నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వరకు, అంతరిక్ష రంగం నుంచి అంకురసంస్థల వరకు – ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ‘మేక్ ఇన్ ఇండియా‘ ప్రచారం, ‘వోకల్ ఫర్ లోకల్‘, ‘టేక్ లోకల్ టు గ్లోబల్‘ మిషన్, ‘మిషన్ మానుఫ్యాక్చరింగ్‘ – ఈ కార్యక్రమాలన్నీ దేశంలో ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. నేడు, కార్ల నుంచి మెట్రో కోచ్‌ల వరకు, రైలు కంపార్ట్‌మెంట్ల నుంచి రక్షణ పరికరాల వరకు, అనేక రంగాల్లో ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో తయారీ రంగం వృద్ధి చెందడం, కర్మాగారాలు పెరగడం, వాటిలో పనిచేసే వారి సంఖ్య పెరగడమే దీనికి కారణం.
మిత్రులారా,
గత 12 ఏళ్లలో, భారత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు దేశంలో నిరంతరం కొత్త ఉపాధి రంగాలను సృష్టించాయి. మౌలిక సదుపాయాల కల్పనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి, లక్షలాది మంది యువత ఉజ్వల భవితకు పునాదిగా మారుతోంది. ‘ముద్రా యోజన‘ కింద అందించిన 33 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం, కోట్లాది మంది యువతకు తమ సొంత ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని కల్పించింది. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమయ్యారు. 3 కోట్ల మందికి పైగా “లఖ్‌పతి దీదీలు”గా మారారు. ‘స్వనిధి‘, ‘పీఎం విశ్వకర్మ‘ వంటి కార్యక్రమాలు చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులు, సాంప్రదాయిక చేతివృత్తుల వారికి కొత్త సాంకేతికతను, ఆర్థిక మద్దతును, కొత్త శక్తిని అందించాయి. కొద్దిసేపటి కిందట నేను మాట్లాడిన యువతలో… ఐటీఐ పూర్తి చేసిన ఒక యువకుడు ఎంతో ఉత్సాహంతో డ్రోన్ల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. డ్రోన్ రంగానికి సంబంధించిన ఒక ఉదాహరణను మీకు చెబుతాను. మందుల సరఫరా, పురుగుమందుల పిచికారీ, ‘స్వామిత్వ‘ పథకం కింద భూమి మ్యాపింగ్, రక్షణ రంగ వినియోగం – ఇలా దేశంలో డ్రోన్ల వాడకం నిరంతరం పెరుగుతోంది. డ్రోన్ల వినియోగంలో ఈ వృద్ధి యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన ఆ యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు: “కేవలం డ్రోన్ల వీడియోలను చూడటం మాత్రమే కాదు, మీరే స్వయంగా డ్రోన్లను తయారు చేయడం ప్రారంభించండి – మీరు దీన్ని చేయగలరు.” అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తూ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యువతకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది.
మిత్రులారా,
గత దశాబ్ద కాలంలో, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త అవకాశాల ప్రపంచాన్ని సృష్టించింది. గిగ్ ఎకానమీ, ప్లాట్‌ఫారమ్ ఎకానమీ, కంటెంట్ క్రియేషన్, సాంకేతిక సేవల రంగం – ఇలా అనేక కొత్త ఉపాధి రంగాలు వేగంగా ఆవిర్భవిస్తున్నాయి. ఒకప్పుడు ఊహించడం సాధ్యం కాని అవకాశాలు ఇప్పుడు లక్షలాది మంది యువతకు ఆదాయ వనరులుగా మారాయి. అంకురసంస్థల వ్యవస్థలోనూ ఇదే విధమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దేశంలో సుమారు 500 అంకురసంస్థలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,00,000కు పైగా నమోదిత అంకురసంస్థలు ఉన్నాయి. దేశంలోని ప్రతి జిల్లాలోనూ మీరు వీటిని చూడవచ్చు. రాబోయే సంవత్సరాల్లో వృద్ధి, ఆవిష్కరణలు, పారిశ్రామికతలో భారతీయ యువత ప్రపంచానికే మార్గదర్శనం చేస్తుందనే నమ్మకాన్ని ఈ గణాంకాలు కలిగిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ రోజు, యావత్ ప్రపంచం భారత భవిష్యత్తు గురించి ఉత్సాహంగా ఉంది. భారత యువత శక్తిపై ప్రతిఒక్కరూ విశ్వాసంతో ఉన్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన బృహత్తరమైన “ఇండియా ఇన్నోవేట్స్” కార్యక్రమాన్ని మీరు చూసే ఉంటారు. ఏఐ, అంతరిక్షం, హరిత ఇంధనం, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత అంకురసంస్థలు, ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తూ, ఒక నూతన శక్తిగా ఆవిర్భవిస్తున్నాయి. ఈ రోజు, భారత్ ప్రపంచంతో కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందాలు భారత పరిశ్రమలకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. భారత నిపుణులకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తున్నాయి. ఇటీవలి నెలల్లో, అనేక ఐరోపా దేశాలతోనూ పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు దేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారుతున్నాయి.
మిత్రులారా,
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ప్రపంచం భవిష్యత్తు సాంకేతికతల దిశగా అడుగులు వేస్తుండగా, భారత్ తన యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే దిశగా కృషి చేస్తోంది. భారత యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మనం దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
మిత్రులారా,
గడిచిన 12 సంవత్సరాల్లో, భారత ఉపాధి రంగంలో మరో ప్రధాన పరివర్తన చోటుచేసుకుంది. దీని గురించి తరచుగా తక్కువగా చర్చిస్తారు, కానీ అభివృద్ధి చెందిన భారత్ ప్రస్థానంలో దీని ప్రాముఖ్యత అపారమైనది. ఉపాధిని భద్రత, గౌరవంతో అనుసంధానించడమే ఈ పరివర్తన. సురక్షితమైన ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కల్పించడమే మా లక్ష్యం. అందుకే ఈ రోజు, సాంకేతికత ద్వారా ఈపీఎఫ్‌వో వ్యవస్థను ఆధునికీకరించడం… పింఛను ఏర్పాట్లను సరళంగా, మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నాయి. లక్షలాది మంది కొత్త కార్మికులకు ఆరోగ్య బీమా, సరసమైన చికిత్సా సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాయి.
మిత్రులారా,
ఈ దృక్పథంతోనే మేం కార్మిక సంస్కరణలనూ ముందుకు తీసుకువెళ్లాం. కార్మికులకు మరింత భద్రత, అధిక పారదర్శకత, మరిన్ని హక్కులను కల్పించడమే కొత్త కార్మిక చట్టాల ఉద్దేశం. నియామక పత్రాలకు చట్టపరమైన గుర్తింపునివ్వడం, నిర్ణీత కాల ఉద్యోగులకు సమాన సౌకర్యాలు కల్పించడం, కనీస వేతనాల పరిధిని విస్తరించడం వంటి ప్రతి ప్రయత్నం కార్మికుల గౌరవాన్ని, భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొనసాగుతోంది.
మిత్రులారా,
ప్రస్తుతం మన మహిళా శక్తి ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన, అవకాశాలతో నిండిన వాతావరణం అందుబాటులో ఉంది. రాత్రి షిఫ్టులకు సంబంధించిన పాత నిబంధనలను మార్చడం, ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని కల్పించడం, సురక్షితమైన కార్యాలయాలను నిర్ధారించడం వంటి చర్యల ద్వారా మేం మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం.
మిత్రులారా,
ఈ రోజు, పారిశ్రామిక రంగానికి చెందిన నా సహచరులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీ అందరికీ నాదొక విన్నపం. 21వ శతాబ్దంలో, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆవిష్కరణలు, నాణ్యత గల దేశాలకే అవకాశాలు దక్కుతాయి. ఈ మూడు రంగాల్లోనూ ముందుకు సాగడం కోసం భారత్ అపూర్వ సామర్థ్యాలను కలిగి ఉంది. అందుకే భారత పారిశ్రామిక రంగానికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే… ప్రస్తుతం మన ముందున్న అవకాశాలను మనం పూర్తి శక్తితో అందిపుచ్చుకోవాలి. మనం కొత్త మార్కెట్లను చేరుకోవాలి. కొత్త ఉత్పత్తులను సృష్టించాలి. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలతో పోటీపడాలి. ప్రపంచం భారత్ కోసం తన ద్వారాలను తెరుస్తోంది. మిత్రులారా, గతంలో మన కోసం కనీసం ఒక కిటికీ కూడా తెరుచుకునేది కాదు – కానీ ఇప్పుడు ద్వారాలే తెరుచుకుంటున్నాయి. భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది. మనం వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఒప్పందాలు కొత్త మార్కెట్లను సృష్టిస్తున్నాయి. కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘మేక్ ఇన్ ఇండియా‘ బ్రాండ్‌లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, మనం ఈ అవకాశాలను చేజారనివ్వకూడదు.
మిత్రులారా,
లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు, సాధించే విజయాలూ గొప్పగానే ఉంటాయి. ఈ దృక్పథం ప్రపంచ స్థాయికి విస్తరించినప్పుడు… విజయం, అవకాశాల పరిధులూ సహజంగానే విస్తరిస్తాయి. అందుకే శిక్షణ, మార్గదర్శనం, ఇంటర్న్‌షిప్‌లు ఇకపై కేవలం ఐచ్ఛికాలు కావు – అవి 21వ శతాబ్దపు ఆవశ్యకతలు. భారత పారిశ్రామిక రంగం తనకు అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేసుకోవడంతో పాటు, భవిష్యత్తు కోసం కొత్త అవకాశాలనూ సృష్టించాలి. అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగే మార్గం కేవలం పెట్టుబడులతోనే నిర్మితం కాదు… అది ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణల శక్తితో నిర్మితమవుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో అతిపెద్ద పరీక్ష ఒక్కటే. పారిశ్రామిక రంగంలోని నా సహచరులకు నేను తరచుగా చెప్పే విషయం ఇదే – ఈ పరిస్థితులన్నింటినీ సద్వినియోగం చేసుకోవడానికి అత్యంత శక్తిమంతమైన మార్గం ‘నాణ్యత‘. విద్యలో నాణ్యత, నైపుణ్యంలో నాణ్యత, సేవలో నాణ్యత, ఉత్పత్తిలో నాణ్యత, చివరికి ప్యాకేజింగ్‌లోనూ నాణ్యతే కీలకం. మనం ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే, ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలను అందుకోవాలి. మనం ప్రపంచంలో ముందుకు సాగాలంటే, ‘అత్యున్నత ప్రమాణాలు‘ మన గుర్తింపుగా మారాలి. ప్రపంచమంతా నేడు భారత్‌పై గొప్ప ఆశలు పెట్టుకుంది. భారత యువత ఆ ఆశలను అందుకోవడమే కాకుండా, వాటిని అధిగమించి ప్రపంచానికి గర్వంగా, ధైర్యంగా తమ సామర్థ్యాన్ని చాటుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదే అభివృద్ధి చెందిన భారత్ బలం. ఇదే నా యువ సహచరుల, మన యువత గుర్తింపు, సామర్థ్యం, శక్తి.
మిత్రులారా,
కలలు సాకారమయ్యే చోటే అవి మరింతగా విస్తరిస్తాయి. ఒక కల నెరవేరడం… మరో పెద్ద కలకు మార్గం సుగమం చేస్తుంది. నేడు భారత్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది. భారతీయ యువతలో ఉండే ఆత్రుతను నేను అర్థం చేసుకోగలను. వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను – నా యువ మిత్రులారా, మీ కలలే మోదీ సంకల్పం! విజయం దిశగా మీరు వేసే ప్రతి అడుగు నాకూ స్ఫూర్తినిస్తుంది. వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి వైఫల్యం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి నేను ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను – మీరు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు ఎవరూ ఓడిపోరు. ఒకరు గెలుస్తారు, మరొకరు పాఠం నేర్చుకుంటారు. ఎవరూ ఓడిపోరు. వైఫల్యాల నుంచి నిరంతరం నేర్చుకోవడం, కలలను సాకారం చేసుకోవడం, ప్రతి విజయం తర్వాత కొత్త కలలకు శ్రీకారం చుట్టడమే యువ మేధస్సుకు నిజమైన కొలమానం. భారతీయ యువత శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. భారత పారిశ్రామిక స్ఫూర్తిపైనా నాకు విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతో, మీ అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 2047 నాటికి, దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు (100 ఏళ్ల వేడుకలు) జరుపుకునే సమయానికి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఇదే మన కల, ఇదే మన సంకల్పం. నా యువ మిత్రులారా, మనం దీనిని మన కళ్లతోనే చూస్తామని, అభివృద్ధి చెందిన భారత్‌ను స్వయంగా చూస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
Through PM Viksit Bharat Rozgar Yojana, we are supporting employment generation, empowering youth and building a stronger workforce for the future.
— Narendra Modi (@narendramodi) June 19, 2026
https://t.co/UzweKrA6nk
PM Viksit Bharat Rozgar Yojana is about empowering first-time employees and building a bridge between youth and industry. pic.twitter.com/hlhr9u9Xh8
— PMO India (@PMOIndia) June 19, 2026
The aspirations, skills and potential of our youth shape the path to a Viksit Bharat. pic.twitter.com/wmWpy7GtnS
— PMO India (@PMOIndia) June 19, 2026
India's youth will be at the forefront of driving global growth, innovation and entrepreneurship in the years to come. pic.twitter.com/C96TwqjWjL
— PMO India (@PMOIndia) June 19, 2026
India is set to lead from the front. pic.twitter.com/WkZZoTHbh3
— PMO India (@PMOIndia) June 19, 2026
In the 21st century, opportunities will belong to nations that nurture skilled talent, foster innovation and uphold the highest standards of quality. pic.twitter.com/aU2GZ7HKu9
— PMO India (@PMOIndia) June 19, 2026
To compete globally, we must meet the highest quality standards. pic.twitter.com/GzHwzUnJXb
— PMO India (@PMOIndia) June 19, 2026