పిఎంఇండియా
పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహక విభాగం (డిఐపిపి) చేసిన ఈ దిగువ ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎ) ద్వారక లో ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ (ఇసిసి), ఇంకా అనుబంధ మౌలిక వసతులు (ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించుకొనే ప్రదేశం; ఎరీనా; ట్రంక్ మౌలిక వసతులు; మెట్రో/ఎన్ హెచ్ఎఐ అనుసంధానం; హోటళ్లు, కార్యాలయాలు, రిటైల్ వ్యాపారాలకు ప్రదేశం) పిపిపి, నాన్- పిపిపి విధానంలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఏర్పాటు చేయదలుస్తున్న ఈ ప్రాజెక్టుకు 25,703 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా.
బి) ఈ ప్రాజెక్టును చేపట్టి అభివృద్ధి చేయడానికి 100 శాతం ప్రభుత్వ వాటాలతో డిఐపిపి సారథ్యంలో ఒక ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్ సెంటర్‌లో భాగంగా ట్రంక్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, ప్రవేశ శాల, సమావేశ మందిరం, మెట్రో అనుసంధానత, డిడిఎ కు చెల్లించవలసిన భూసేకరణ పరిహారంతో సహా ఎన్‌హెచ్ఎఐ రోడ్డు అనుసంధానత కల్పించేందుకు, మురుగునీటి పారుదల వసతులు కల్పించేందుకు, మెట్రో అనుసంధానతకు రైల్వే భూములు కొనుగోలు చేసేందుకు, నాన్- పిపిపి వ్యయాలు భరించేందుకు ఈ ఎస్‌పివి కి ప్రభుత్వం బడ్జెట్‌లో 2037.29 కోట్ల రూపాయలు ఈక్విటీగా మూడు సంవత్సరాల కాలపరిమితిలో అందజేస్తుంది.
సి) మార్కెట్ నుండి 1,381 కోట్ల రూపాయలను ప్రభుత్వ హామీతో కూడిన రుణం రూపంలో సమీకరిస్తారు. ప్రభుత్వ యాజమాన్యం లోని భూముల విక్రయం, ఎస్‌పివి వార్షిక ప్రాజెక్టు ఆదాయాల రూపంలో 4,000 కోట్ల రూపాయలు సమకూర్చుకొంటారు. భూవిక్రయం ద్వారా సమకూరే నిధులు, ఎస్‌పివి వార్షిక రాబడుల నుండి వచ్చే ఆదాయాన్ని నాన్- పిపిపి వ్యయాల కోసం కేటాయిస్తారు.
డి) డిఎంఐసిడిసి ప్రాజెక్టు విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తుంది. 5 కోట్ల రూపాయలు కనిష్ఠ, 10 కోట్ల రూపాయలు గరిష్ఠ చెల్లింపు ప్రాతిపదికన ఎస్‌పివి అంతర్గత వనరుల నుండి ఒక శాతం చొప్పున వార్షిక రుసుమును చెల్లించేర నిబంధనపై ప్రాథమికంగా 10 సంవత్సరాల కాలానికి ఈ భాగస్వామ్యం ఉంటుంది.
ఇ) సవివరమైన వ్యయ అంచనాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకొనే అధికారంతో పాటు, ప్రాజెక్టు లోని వివిధ దశలను వేరు చేసుకోవడం, ప్రాజెక్టు దశలు నిర్ణయించడం, పరిధిలో మార్పు వంటి సవరణలు చేసుకునే అధికారం ఎస్‌పివి బోర్డు కు ఉంటుంది. ప్రాజెక్టు అమలు లోని వివిధ దశల అవసరాలకు అనుగుణంగా నిర్ణయించిన ఆర్థిక వనరుల పరిమితి లోనే ఈ మార్పులను చేసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడం ద్వారా లేదా రుణ సమీకరణ ద్వారా వనరులు సేకరించుకొనే స్వేచ్ఛను ఎస్‌పివి కి దఖలు పరుస్తారు.
ట్రంక్ ఇన్‌ఫ్రా సహా ఎగ్జిబిషన్ మరియు సమావేశ మందిరం నిర్మాణాన్ని తొలి దశలో 2019 డిసెంబరు లోగా పూర్తి చేస్తారు. ఇవి నాన్- పిపిపి విభాగంలోకి వస్తాయి. మిగతా ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని రెండో దశలో 2025 నాటికి పూర్తి చేస్తారు. హోటళ్లు, రిటైల్ ప్రదేశాలు, కార్యాలయ ప్రదేశాలతో కూడిన ఈ దశ, పిపిపి విధానంలో అమలు జరుగుతుంది.
ఇది సమగ్రంగా పూర్తయితే ఏడాదికి 100 భారీ అంతర్జాతీయ, స్థానిక ప్రదర్శనల నిర్వహణకు అవసరమైన వసతుల డిమాండును తీర్చగలుగుతుంది. ఒకటో దశలో (2019-20) ఈ ఎగ్జిబిషన్‌లను ఏటా 10 మిలియన్ ప్రజలు (ఫీజు చెల్లించే సందర్శకులు), రెండో దశ పూర్తయ్యే నాటికి (2025) 23 మిలియన్ ప్రజలు సందర్శిస్తారని అంచనా. రెండో దశ కూడా పూర్తయ్యే సరికి ఇక్కడ జరిగే వివిధ ప్రదర్శనలకు, సమావేశాలకు ప్రతినిధులుగా హాజరయ్యే సందర్శకుల సంఖ్య వార్షికంగా 1.5 మిలియన్ ఉంటుందని అంచనా.
ఈ ప్రాజెక్టు వల్ల 5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి. ఇసిసి సౌకర్యాలు; రిటైల్, ఆతిథ్య, కార్యాలయ వసతులకు భూ వినియోగం ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
పూర్వరంగం:
ప్రపంచ స్థాయి కొనుగోలుదారులతో స్థానిక తయారీదారులు అనుసంధానం కావడానికి, వ్యాపార ఆలోచనల మార్పిడికి సమావేశాలు, ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయి. స్థలం, ప్రాజెక్టు సదుపాయాలు, రవాణా అనుసంధానత వంటివి పూర్తి స్థాయిలో ఉండే అంతర్జాతీయ నాణ్యత గల ఎగ్జిబిషన్, కన్వెన్షన్ వసతుల డిమాండును తీర్చగల సమావేశ ప్రదేశాలు ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేవు. ద్వారక లో అన్ని రకాల వసతులు కలిగిన ఇసిసి ఒకసారి పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టిందంటే గనక ఎగ్జిబిషన్ మార్కెట్ క్షేత్రంలో శంఘాయి, హాంగ్‌కాంగ్, సింగపూర్ ల సరసన న్యూ ఢిల్లీ ని చేర్చుతుందని భావిస్తున్నారు.
***