పిఎంఇండియా
పంజాబ్‌లో ఆహారధాన్యాల సేకరణ కార్యకలాపాల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ ఆహార నగదు పరపతి ఖాతాల (2014-15 పంట సంవత్సరం దాకా) పరిష్కారానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర వ్యయ విభాగం చేసిన ప్రతిపాదనను వ్యాపార లావాదేవీల నిబంధనలు,1961లోని 12వ నియమం కింద 02.01.2017 నాడు ప్రధాన మంత్రి ఆమోదించారు.
వారసత్వ సమస్యలను త్వరగా పరిష్కరించడం వల్ల బ్యాంకులు రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో ఆహార పరపతి పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా జాతి ఆహార భద్రతకు భరోసా ఇచ్చే విధంగా ఆహారధాన్యాల సేకరణ కార్యకలాపాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతాయి. కేంద్రం నుండి అందే స్వల్పకాలిక రుణాన్ని పంజాబ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని బకాయి పడిన నగదు పరపతి పరిమితి (సిసిఎల్) ఖాతాలను పరిష్కరిస్తే అది వడ్డీ ఆదాకు ఉపయోగపడుతుంది. పంజాబ్ ప్రభుత్వం మూలధన వ్యయాలు భరించేందుకు ఇది అదనపు వనరుగా అక్కరకొస్తుంది.
పంజాబ్ ప్రభుత్వ ఆహారధాన్యాల సేకరణ కార్యకలాపాల కోసం వారసత్వ నగదు పరపతి ఖాతాల (2014-15 పంట సంవత్సరం దాకా) పరిష్కారం కింది విధంగా ఉంటుంది:
అ) పంజాబ్‌లో 2014-15 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నగదు పరపతి ఖాతాలలోని దాదాపు రూ.31,000 కోట్ల బకాయిని కాలావధి రుణంగా మారుస్తారు. దీనిని ప్రతి ఆరు నెలలకొక వాయిదా వంతున 20 సంవత్సరాలలో – ముందస్తు చెల్లింపు వెసులుబాటు ఉంటుంది- తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలావధి రుణానికి నిబంధనలను, షరతులను రిజర్వ్ బ్యాంకుతో పాటు రుణాలను ఇచ్చే బ్యాంకులు ఖరారు చేస్తాయి.
ఆ) రాష్ట్రంలో 31.03.2015 నాటికి ఆహారధాన్యాల నిల్వల మద్దతు లేని ఇదమిత్థంగా తేలిన బకాయిలను రుణమొత్తంగా పరిగణిస్తారు. పంజాబ్ ప్రభుత్వ ఆహార-ప్రజా పంపిణీల విభాగం సహా ఇతర భాగస్వాములతో, రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపుల తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల సమూహం ఈ రుణమొత్తాన్ని ఖరారు చేస్తుంది.
ఇ) దేశంలో 2015-20 మధ్య కాలానికి సంబంధించి ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక మార్గ ప్రణాళికను నిర్దేశించింది. ఇందులో భాగంగా అన్నిరాష్ట్రాల ద్రవ్య లోటు పరిమితిని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిఎస్ డిపి)లో 3 శాతంగా నిర్ణయించింది. అయితే, పైన పేర్కొన్న విధంగా పంజాబ్ ప్రభుత్వానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసే ప్రతిపాదిత షరతులతో కూడిన రుణాన్ని ఆ సంవత్సరపు ద్రవ్య లోటు పరిమితిలో భాగంగా లెక్కించరు.
ఈ) వారసత్వ ఖాతాలను దీర్ఘకాలిక రుణంగా మార్చిన తర్వాత, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని తిరిగి చెల్లించే లక్ష్యానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా బాండ్లను జారీ చేయవచ్చు. ఇందుకు రిజర్వ్ బ్యాంకు మరియు బ్యాంకుల కన్సార్టియమ్ యొక్క ఆమోదం అవసరం. బాండ్లు జారీ చేసే సంవత్సరంలోనే ఈ రుణాన్ని వాటితో మార్చుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
ఉ) సదరు రుణంపై రిజర్వ్ బ్యాంకు, భారత ప్రభుత్వంతో పంజాబ్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి ఉంటుంది. దీని ప్రకారం రుణంలో అసలు లేదా వడ్డీని నిర్దేశిత తేదీలలో జమ చేయడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైతే అందుకు సమానమైన మొత్తాన్నికేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా నుండి భారత ప్రభుత్వం మినహాయించి, బ్యాంకుల కన్సార్టియమ్ కు జమ చేస్తుంది.
ఊ) ఈ వెసులుబాటు 2014-15 వరకు వారసత్వ ఖాతాల బకాయిని పరిష్కరించే ఒక్కసారి చర్యకు మాత్రమే పరిమితం. నగదు పరపతి పరిమితిలో వ్యత్యాసాలను క్రమబద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు, భవిష్యత్తులో ఆ పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు వీలుగా పంజాబ్ ప్రభుత్వం తన బడ్జెట్‌లో తగిన విధంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే తన సొంత వనరుల నుండి రుణ చెల్లింపులకు కేటాయింపుల పరిస్థితి రాకుండా చూసుకునేలా రాయితీ బిల్లును తగ్గించుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుంది.