Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పదవ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

పదవ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

పదవ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


యువర్ ఎక్స్ లెన్సీ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మొహమ్మద్ నజీబ్

యువర్ మెజెస్టీ,

ఎక్స్ లెన్సీస్,

అందమైన నగరం కౌలాలంపూర్ లో శిఖరాగ్ర సమావేశాల కోసం అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రధాని శ్రీ నజీబ్ కు, మలేషియా ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో కార్యక్రమాల్ని అద్భుతంగా సమీక్షించినందుకు మీకు నా అభినందనలు.

ఇది చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం. ఆసియాన్ దేశాల ప్రజల భవిష్యత్ కోసం, 2025లోపు సాధించాల్సిన లక్ష్యాల కోసం ముందుచూపుతో వ్యవహరిస్తున్న ఆసియాన్ సంస్థ సభ్య దేశాల కృషిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం.

విస్తారమైన ప్రాంతీయ సమ్మిళిత అభివృద్ధి, సహకారం ఆవశ్యతకను ముందుగానే గ్రహించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి ఆసియాన్ దేశాలు. ఇదే కృషి ముంనుముందు కొనసాగాలని ఆశిస్తున్నాం.

ఎక్స్ లెన్సీస్,

ఇదే వేదికపైన గతంలో మనం ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ఒక ఉపరితల సమస్యగానే పరిగణించాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పారిస్ లో అత్యంత అనాగరికంగా ఉగ్రవాదులు చేసిన దాడులు, అంకారా, బీరూట్, మాలిలలో చేసిన విధ్వంసం, రష్యా విమానం కూల్చివేత తదితర సంఘటనలు మనకు ఒక ఘోరమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉగ్రవాద నీడలు అన్ని సమాజాలకు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమాయకులను ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడంలోనూ, దాడుల లక్ష్యాల ఎంపికను చూసినప్పుడు ఈ విషయం స్పష్టమవుతోంది.

ఉగ్రవాదంపై చేసే పోరుకోసం ప్రపంచమంతా ఒక తీర్మానం చేయాలి. అంతే కాదు కొత్త వ్యూహాలను తయారు చేసుకోవాలి. రాజకీయాలతో ఈ పోరాటాన్ని కలపకుండా ఈ పోరు సాగాలి. ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంగానీ, మద్దతు పలకడంగానీ చేయకూడదు. ఉగ్రవాద ముఠాలు అన్నీ ఒకటే. వాటి మధ్య తేడాలు లేవు. ఉగ్రవాదులు తలదాచుకోవడానికి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదు. నిధులు అందజేయకూడదు. వారికి ఆయుధాలు చేజిక్కకుండా చూడాలి. అంతే కాదు మనం మన మన సమాజాల్లో కూడా దీనిపైన కృషి చేయాలి. మన యువతతో మాట్లాడి వారు ఉగ్రవాదంవైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టని నిబద్దత ఎక్కడ ఉన్నా దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. అంతే కాదు ప్రతి నమ్మకానికి ఆలంబనగా నిలిచే మానవీయ విలువల్ని ప్రోత్సహించే చర్యలకు ఇదే నా స్వాగతం.

వాతావరణ మార్పులపై పారిస్ లో మరి కొద్ది రోజుల్లో అంతర్జాతీయ సమావేశం జరగబోతున్నది. అక్కడ మనమందరం ఐకమత్యంగా నిలిచి వాతావరణ మార్పులపైన సమన్వయంతో కూడిన, పటిష్టమైన ఫలితాన్ని సాధించాలి. ఉగ్రవాద నేపథ్యంలో దానికి భయపడే ప్రసక్తే లేదనే సందేశాన్ని చాటడానికి మనందరం ఐకమత్యంగా నిలవాలి.
ఎక్స్ లెన్సీస్,

మా ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 18 నెలలవుతోంది. ఈ 18 నెలల్లో ఆసియా ఫసిఫిక్, ఇండియన్ ఓషియన్ రీజన్ లతో నే భారతదేశం ఎక్కువగా సంప్రదింపులు చేస్తోంది. భారతదేశానికి, ప్రపంచానికి ఈ ప్రాంతం ఎంతో ముఖ్యమనే విషయాన్ని ఇది చాటుతోంది. భారతదేశంలో ఎంతో కాలంగా ఉన్నజాతీయ ఏకాభిప్రాయానికి ఇది దర్పణం.

మనం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లను, ఆందోళనల్ని పరిష్కరించడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది. స్థిరమైన, శాంతియుతమైన, సౌభాగ్యపూరితమైన భవిష్యత్ కోసం మన ప్రాంతం పలు విధాలుగా కృషి చేస్తోంది.
ఈ ప్రాంతం భవిష్యత్ ను రూపొందించడానికి తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం కీలకమైనది.

భద్రత, సహకారాలకు సంబంధించి పటిష్టమైన, సమన్వయంతో కూడిన, పారదర్శకమైన ప్రాంతీయ వ్యవస్థను రూపొందించే క్రమానికి తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం తన మద్దతును కొనసాగించాలి. అంతర్జాతీయ నియమాలు, నిబంధనల్ని బలోపేతం చేసుకొని వాటికి కట్టుబడి ఉన్నామనే నిబద్ధతను మనం మరింత పటిష్టం చేసుకోవాలి.

మన సౌభాగ్యానికి, భ ద్ర త కు కీలకంగా ఉన్న అంశం నౌకాయానం. అంతర్జాతీయ చట్టాల నియమ నిబంధనల ప్రకారం, సముద్ర చట్టాలపై 1982నాటి ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానాల ప్రకారం సముద్ర జలాల్లో స్వేచ్ఛగా సంచరించాలని, ఎలాంటి అడ్డంకులు లేని వాణిజ్యం చేయాలనే ఆసియాన్ దేశాల నిబద్ధతను భారతదేశం గౌరవిస్తోంది. సరిహద్దులకు సంబంధించిన తగాదాలను శాంతియుతమార్గాలద్వారా పరిష్కరించుకోవాలి.

బంగ్లాదేశ్ తో నౌకాయాన సరిహద్దులకు సంబంధించిన సమస్యను యుఎన్ సి ఎల్ ఓ ఎస్ వ్యవస్థను ఉపయోగించుకొని భారతదేశం పరిష్కరించుకుంది. అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించి దక్షిణ చైనా సముద్రంలో తలెత్తిన తగాదాల నుంచి బైటపడాలి. ఈ వివాదాలకు సంబంధించిన వారందరూ దక్షిణ చైనా సముద్ర కార్యకలాపాల ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అలాగే మార్గదర్శకాలను అమలు చేయాలి. ఈ వివాదాలతో సంబంధమున్నవారందరూ ఏకాభిప్రాయం ఆధారంగా ఒక నియమావళిని తొందరగా ఏర్పరుచుకోవడానికిగాను తమ కృషిని బలోపేతం చేయాలి.

సైబర్ సెక్యూరిటీ (అంతర్జాల భద్రత)కి సంబంధించి బలమైన నిబద్ధత, ఉన్నతస్థాయి సహకారంతో మనం పని చేయాలి. ఈ ప్రాంతంలో మన వ్యవహారశైలికి సంబంధించి కొన్ని నిబంధనల్ని విధించుకోవాలి. భద్రత విషయం తీసుకున్నప్పుడు అంతరిక్ష భద్రత కూడా ఈ మధ్యకాలంలో ఒక కీలకమైన అంశంగా అవతరించింది. అణ్యాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందం ప్రకారం కొనసాగుతున్న సహకారాన్ని బలోపేతం చేయడాన్ని కొనసాగించాలి.

ఆసియాన్ దేశాలతో అటు భూమిపైనా, ఇటు సముద్ర జలాల్లోనూ భారతదేశానికి సరిహద్దులున్నాయి. ఆసియాన్ దేశాలతోనూ, ఇంకా ఇతర తూర్పు ఆసియా దేశాలతోనూ తనకుగల ద్వైపాక్షిక భద్రతా బాగస్వామ్యాలను మరింత పటిష్టంగా భారగదేశం కొనసాగిస్తుంది. భద్రతపైన, సహకారంపైనా ఆసియాన్ దేశాలు ఎప్పుడు చర్చా వేదికలు నిర్వహించినా వాటిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఎల్లప్పుడూ ఇండియా సిద్ధంగా ఉంటుంది.

విస్తృత లక్ష్యాలే పరమావధిగా, సమన్వయంతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం కోసం ఎంత వీలైతే అంత తొందరగా మనం కృషి చేయాలి. పసిఫిక్ ప్రాంత భాగస్వామ్యం కూడా ఒక కీలకమైన మార్పు. ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పోటీ పడే వ్యవస్థలుగా కాకుండా ఒక సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకోసం ఏర్పడే పునాదులుగా నిలుస్తాయని నేను ఆశిస్తున్నాను.

చివరగా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి గుండెకాయలాంటిది అభివృద్ధి సహకారం. భాగస్వామ్య దేశాల కృషికి భారతదేశం తన మద్దతును కొనసాగిస్తుంది. విపత్తు నిర్వహణపైన ఇఏఎస్ వర్చువల్ నాలెడ్జ్ పోర్టల్స్ స్థాపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఆరోగ్యరంగంలో ట్రామా కేర్ (అత్యవసర చికిత్స) అండ్ నర్సింగ్ విభాగాల పోర్టల్స్ నెలకొల్పడంలో కూడా ఇండియా ముందుంది. అంతర్జాతీయ ప్రమాణాల కేంద్రంగా నలందా విశ్వవిద్యాలయం రూపొందుతోంది.

ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక రాజకీయ, ఆర్థిక, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిపైన దృష్టి పెట్టిన దక్షిణా ఆసియా శిఖరాగ్ర సమావేశం దూరదృష్టి ఎంతైనా ప్రశంసనీయం. దానికి భారతదేశం మద్దతు ఎల్లప్పుడూ కొనసాగుతుంది.

అందరికీ కృతజ్ఞతాభివందనాలు