Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పలు ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తున్న సంద‌ర్భంగా మ‌ణిపుర్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

పలు ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తున్న సంద‌ర్భంగా మ‌ణిపుర్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

పలు ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తున్న సంద‌ర్భంగా మ‌ణిపుర్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

పలు ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తున్న సంద‌ర్భంగా మ‌ణిపుర్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం


ఖురుమ్ జరీ

ఈక్ హోయిగి స‌ర్కార్ బూతాజా బిరిబా మ‌ణిపుర్ గీ ప్ర‌జా పుమ్ న‌మ‌కు తాగ‌త్ చరీ

(Khurumjari.

Eik-Hoigi Sarkar-Boothaja-Biriba Manipur-Gi Praja Pum-Namaku Thagat-Chari.)

మొట్ట‌మొద‌టగా మ‌ణిపుర్ ప్ర‌జ‌ల‌కు అనేకానేక అభినంద‌న‌లు.

ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ గారి ఆధ్వ‌ర్యంలో నిన్న‌నే మ‌ణిపుర్ ప్ర‌భుత్వం ఏడాది పాల‌న‌ ను పూర్తి చేసుకొంది. ప్ర‌భుత్వం ఎలాంటి పాల‌నను అందిస్తోంది ?, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయి ?, సుస్థిర‌మైన ప్ర‌భుత్వ‌ం అంటే అర్థం ఏమిటి ?, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ప‌ని చేస్తే ఆ ప్ర‌భావం ఎలా ఉంటుంది ?.. ఇలాంటి ప‌నుల‌న్నిటికీ మ‌ణిపుర్ సాధిస్తున్న మంచి పేరే సమాధానాలు చెబుతోంది.

మీ క‌ళ్ల‌లోని మెరుపు, మీలో క‌నిపిస్తున్న సంతోషం చూస్తే చాలు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా ప‌రిపాల‌న చేస్తుందో తెలుస్తుంది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి దూర ప్రాంతాల‌ నుండి సైతం ఇక్క‌డ‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకొంటున్నాను.

ఈ సంవ‌త్స‌రంలో చేసిన ప‌నుల‌కు, సాధించిన విజ‌యాల‌కుగాను మ‌ణిపుర్ ప్ర‌జ‌ల‌కు, పాల‌న వ్య‌వ‌స్థ‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

గత సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నెల‌ లో ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ నేను ఏమి చెప్పానో గుర్తు కు తెచ్చుకొంటాను. 15 సంవ‌త్సరాలలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేయ‌లేని ప‌నులను మా రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం 15 మాసాలలో చేసి చూపుతుంద‌ని అన్నాను. నేను చెప్పిన 15 నెలలు పూర్తి కావ‌డానికి ఇంకా మూడు నెల‌లు మిగిలే వున్నాయి. మ‌ణిపుర్ లో ఇప్ప‌టికే కొట్టొచ్చిన‌ట్టుగా మార్పు క‌నిపిస్తోంది. గ‌త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యాల, విధానాల కార‌ణంగా ఇక్క‌డి స‌మాజంలో నెల‌కొన్న అప‌స‌వ్య వాతావ‌ర‌ణాన్ని శ్రీ బీరేన్ గారి ప్ర‌భుత్వం మార్చివేసింది. శాంతి భ్ర‌ద‌త‌లు కావ‌చ్చు, అవినీతి కావ‌చ్చు, పార‌ద‌ర్శ‌క‌త కావ‌చ్చు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు సంబంధించిన ప‌నులు కావ‌చ్చు- మ‌ణిపుర్ ప్ర‌భుత్వం చాలా వేగంగా ప‌ని చేస్తూ అన్ని రంగాలలో మార్పులు తెస్తోంది.

స్నేహితులారా,

మ‌ణిపుర్ రాష్ట్ర అభివృద్ధి కోసం 750 కోట్ల రూపాయల విలువైన ప‌థ‌కాల‌ను ప్రారంభించి, వాటిని ప్ర‌జ‌ల‌కు అంకింతం చేసే ఒక మంచి అవ‌కాశం నాకు ఈ రోజు ల‌భించింది. ఈ ప‌థ‌కాల‌న్నీ మ‌ణిపుర్ ప్ర‌భుత్వానికి నేరుగా సంబంధం క‌లిగివున్నాయి. ఇవి నేరుగా వారి ప్ర‌తిభ‌కు, ఉపాధికి సంబంధించిన‌వి. ఈ పనులు ఇక్క‌డి మ‌హిళ‌ల సాధికారిత‌తో, ఈ ప్రాంత అనుసంధానంతో నేరుగా సంబంధం క‌లిగివున్నాయి. ఈ ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్ర అభివృద్ధి నూత‌న శిఖ‌రాల‌కు చేరుకొంటుంద‌ని నేను ధీమాగా ఉన్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ రోజుల్లో క్రీడ‌ల‌నేవి కేవ‌లం వినోదం క‌లిగించేవి మాత్ర‌మే కాదు. లేదా అవి కేవ‌లం ఆరోగ్యాన్ని కాపాడేవి మాత్ర‌మే కాదు. క్రీడ‌ల‌నేవి ప‌రిశ్ర‌మ‌ స్థాయికి చేరుకొన్నాయి. క్రీడ‌ల‌నేవి ఇప్పుడు పూర్తి స్థాయి కెరీర్‌. ఈ దేశం లోని యువ‌తీ యువ‌కుల‌కు కావల‌సిన ప్ర‌తి సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డానికి మా ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అంతే కాదు దీనికి తోడుగా క్రీడ‌ల్లో ముందుకు సాగ‌డానికి ఆధునిక శిక్ష‌ణ ఇప్పిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో గ‌ల ల‌క్ష‌లాది మంది యువ‌తీ యువ‌కుల ప్ర‌తిభ సామ‌ర్థ్యాల‌ను దృష్టిలో పెట్టుకొని 500 కోట్ల రూపాయలతో ఇక్క‌డ ప్ర‌త్యేకంగా జాతీయ క్రీడా విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుండి రెండు కోర్సులు మొద‌ల‌వ్వ‌డం నాకు ఎంతో సంతోషంగా వుంది. ఈ రోజు ఈ క్యాంప‌స్ కోసం పునాది రాయిని నేను వేశాను. దీనికి సంబంధించిన ప‌ని పూర్త‌యిన త‌రువాత ఈ విశ్వ‌విద్యాల‌యం ఇక్క‌డ యువ‌త‌ లోని క్రీడా ప్ర‌తిభ‌ను వెలికి తీసి వారికి త‌గిన శిక్ష‌ణ‌ను ఇస్తుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

దేశాన్ని క్రీడ‌ల్లో ఒక అత్యున్న‌త‌మైన శ‌క్తిగా తీర్చిదిద్ద‌డానికిగాను మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది. ఈ మ‌ధ్య‌నే ఖేలో ఇండియా పేరుతో క్రీడాభివృద్ధి కోసం జాతీయ స్థాయి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం. ఖేలో ఇండియా కార్య‌క్ర‌మం కింద ఎంపికైన వేయి మంది ప్రతిభావంతులైన క్రీడాకారులలో ప్రతి ఒక్క‌రి మీద ప్ర‌తి ఏడాది 5 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తారు. ఈ ప‌థ‌కం నుండి వీల‌యినంత‌ మేర లబ్ధి ని పొందాల‌ని మణిపుర్ క్రీడాకారుల‌ను అభ్య‌ర్థిస్తున్నాను. పాఠ‌శాల స్థాయిలో ప్ర‌తిభ‌ను గుర్తించి క్రీడాకారుల‌ను అభివృద్ధి చేయ‌డంపై మేం దృష్టి పెట్టాం. ఈ ప‌థ‌కం కింద ఈ మ‌ధ్య‌ ఢిల్లీ లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. వీటిలో మణిపుర్ త‌న స‌త్తా చాటి ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో నిల‌వ‌డం సంతోషదాయ‌కం. మణిపుర్ 34 ప‌త‌కాల‌ను గెలుచుకొంది. ఇందులో 13 బంగారు ప‌త‌కాలు ఉన్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల‌ను మణిపుర్ దాటుకొని వెళ్లి, ముందు నిలిచింది. ఈ విజ‌యాన్ని సాధించినందుకు మణిపుర్ యువ‌త‌కు నా అభినంద‌న‌లు. మణిపుర్ బాలలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పిల్ల‌లు ఈ క్రీడలలో పాల్గొని, అద్భుత‌మైన ప్రతిభ‌ను చాటారు.

స్నేహితులారా,

ఈ రోజు క్రీడ‌ల‌కు సంబంధించి మ‌రొక భారీ ప్రాజెక్టును ప్ర‌జ‌ల‌కు అంకిత‌మివ్వ‌డం జ‌రిగింది. మొట్ట‌మొద‌టి మణిపుర్‌ బ‌హుళ క్రీడ‌ల స‌ముదాయాన్ని ఈ రాష్ట్ర యువ‌త‌కు అంద‌జేయ‌డం జ‌రిగింది.

ఈ బ‌హుళ క్రీడ‌ల స‌ముదాయంలో ఈ రాష్ట్ర యువ‌త శిక్ష‌ణ పొంద‌డ‌మే కాకుండా ఇక్క‌డ వారు చ‌క్క‌టి ఆటల పోటీలను నిర్వ‌హించుకోవ‌చ్చు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

క్రీడ‌ల ద్వారా మ‌హిళా సాధికారిత‌ ను సాధించ‌వ‌చ్చని నిరూపించిన రాష్ట్రాలలో మణిపుర్ ఒక‌టి. ఈ రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌లు ఒలంపిక్స్‌, కామ‌న్ వెల్త్ క్రీడ‌లలో దేశానికి మంచి పేరు సంపాదించిపెట్టారు. ఈ రాష్ట్రానికి చెందిన‌ మేరీ కామ్‌, మీరాబాయ్ చానూ, బోంబాయలా దేవీ, లైశ్ రామ్, స‌రితా దేవి లాంటి వారు ఫుట్ బాల్‌, కుస్తీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌ మరియు విలువిద్య‌ లాంటి క్రీడ‌లలో విజేతలుగా నిలచారు.

ఈ రాష్ట్రంలోని మ‌హిళా శ‌క్తి దేశానికే స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తూ వ‌స్తోంది. ఈ రోజు ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ముఖ విప్ల‌వ‌ వాది, జాతి గ‌ర్వించ‌ద‌గ్గ బిడ్డ రాణి గైడిన్ లియు కు వంద‌నాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఆమె పేరు మీద నెల‌కొల్పిన పార్కు ను ప్రారంభించ‌డం ఈ రోజున నాకు ద‌క్కిన అదృష్టంగా భావిస్తున్నాను.

స్నేహితులారా,

మ‌హిళా సాధికారిత ను సాధించాలంటే బాలికల విద్య అనేది పునాదిగా నిలుస్తుంది. కొంత కాలం క్రితం కేంద్ర ప్ర‌భుత్వం బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మం జాతీయ స్థాయిలో మంచి ఫ‌లితాల‌ను అందిస్తోంది. కొండ ప్రాంతాలలో, ఆదివాసీ ప్రాంతాలలో నివ‌సించే బాలిక‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడానికిగాను రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేయ‌డం సంతోష‌దాయ‌కం. ఆదివాసీ ప్రాంతాల లోని బాలిక‌ల‌ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న వసతి గృహాలను నిర్మిస్తోంది. అలాంటి ఒక వసతి గృహాన్ని ప్రారంభించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. వ్య‌వ‌సాయం నుండి, చేతివృత్తుల వ‌ర‌కూ గ‌ల ప‌లు రంగాల్లో మణిపుర్ మ‌హిళ‌లు భాగ‌స్వాములుగా ఉన్నారు. అంద‌రూ మ‌హిళ‌లే భాగ‌స్వాములుగా ఒక మార్కెట్ కు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రుగుతోంది. త‌ద్వారా ఇక్క‌డి మ‌హిళ‌లు వారి ఉత్ప‌త్తుల‌ను విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కోబోరు. శ్రీ బీరేన్ గారి నేతృత్వం లోని మణిపుర్ ప్ర‌భుత్వం ఇలాంటి మ‌హిళా మార్కెట్ లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోంది. అలాంటి ఒక మార్కెట్ ను నేను ఇప్పుడే ప్రారంభించాను. రాష్ట్రంలో ఇ- మార్కెట్ ను విస్త‌రించ‌డానికి వీలుగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ బీరేన్ గారి ని అభ్య‌ర్థిస్తున్నాను. ఇది మ‌రేంటో కాదు, దీని ద్వారా మీరు ప్ర‌భుత్వానికి మీ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చు. దీని ద్వారా మణిపుర్ మ‌హిళ‌లు భారీ ల‌బ్ధి ని పొంద‌వ‌చ్చు. ఈ రోజు రాష్ట్రంలో 1,000 ఆంగ‌న్ వాడీ కేంద్రాల‌ను కూడా నేను ప్రారంభించాను. ఈ కేంద్రాలు రాష్ట్రం లోని వేలాది మాతృమూర్తుల‌, వారి పిల్ల‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌రచ‌డానికి ప‌ని చేస్తాయి.

ఈ మ‌ధ్య‌ే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా జాతీయ పౌష్టికాహార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం. దీని నుండి కూడా ఈ ఆంగ‌న్ వాడీ కేంద్రాలు ల‌బ్ధి ని పొందుతాయి. ల‌క్ష్యాన్ని చేరుకొనే విధంగా పౌష్టిక ఆహారాన్ని, శుభ్ర‌త‌ను, టీకాల‌ను అంద‌జేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం.

సుదూర ప్రాంతాల్లోని కొండ ప్రాంత జిల్లాల్లో ఉద్యోగాలు చేసే వైద్యులు, ఉపాధ్యాయులు, న‌ర్సులు అనేక క‌ష్టాలు ప‌డుతుంటారు. వారు ఉద్యోగం చేస్తున్న చోట ఆశించిన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంవ‌ల్ల‌నే ఈ క‌ష్టాలు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కించ‌డానికిగాను రాష్ట్రంలోని 19 గుర్తించిన సుదూర కొండ ప్రాంతాలలో ఉపాధ్యాయులు, వైద్యులు, న‌ర్సులు జీవించ‌డానికి వీలుగా వారి కోసం నివాస గృహ స‌ముదాయ‌ నిర్మాణ ప‌నులకు ఈ రోజు నేను పునాది రాయి వేశాను. ఈ ప‌ని కార‌ణంగా, ఈ ప్రాంతాల లోని ప్ర‌జ‌ల‌కు స‌రైన సేవ‌ల‌ను అందించ‌డానికి వీలుగా, వైద్య సిబ్బంది త‌గిన స్ఫూర్తి పొంద‌గ‌ల‌ద‌ని నేను న‌మ్ముతున్నాను.

స్నేహితులారా,

ర‌వాణా ద్వారా పరివర్తన (‘Transformation by Transportation’) అనేది ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించిన మా ప్రభుత్వ దార్శనిక‌త‌. మా దృష్టి అంతా అనుసంధానం మీద‌నే ఉంది. హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను అందించ‌డం ద్వారా మణిపుర్ లోని సుదూర ప్రాంతాల‌ను క‌ల‌ప‌డానికి కృషి చేస్తున్నాం. అలాగే ప‌లు ర‌హ‌దారుల నిర్మాణ ప‌నుల‌ను మొద‌లుపెట్టాం. ఒక ప్ర‌ధాన‌మైన రహదారి పథకం నిర్మాణం కోసం ఈ రోజు నేను పునాదిరాయి వేశాను.

ప‌ర్యట‌క‌ రంగం ప‌రంగా చూసిన‌ప్పుడు మణిపుర్ లో అనేక విశేషాలు ఉన్నాయి. అడ‌వులు, వ‌న్య‌ మృగాలు, నీలి కొండ‌లు, ప‌చ్చ‌ద‌నంతో విస్త‌రించిన లోయ‌లు, అంద‌మైన తోట‌లు, వైవిధ్య‌మైన సంస్కృతి ఈ రాష్ట్రం విశిష్ట‌త‌లు. ఈ రాష్ట్రంలో ఇంగ్లీషు లో మాట్లాడే ఉన్న‌త చ‌దువులు చ‌దివిన యువ‌త కార‌ణంగా మణిపుర్ ను ఆద‌ర్శ‌నీయ‌మైన ప‌ర్యట‌క కేంద్రంగా అభివృద్ధి చేయ‌వ‌చ్చు. ఈ రంగాన్ని స‌రిగా వినియోగించుకోగ‌లిగితే ఈ ప్రాంతంలో ఇది మంచి ఉపాధికల్పన మార్గంగా అవ‌త‌రిస్తుంది.

ఇంఫాల్ ద‌గ్గ‌ర‌ గ‌ల ప్ర‌ముఖ ప‌ర్వ‌త ప్రాంతం చీరావ్ చింగ్ ద‌గ్గ‌ర ప‌ర్యావ‌ర‌ణ హితకర ప‌ర్యటన రంగం అభివృద్ధి చెంద‌డానికిగాను పునాది రాయి ని వేశాను. అంతే కాదు, గుహ‌ల సంబంధి ప‌ర్యాట‌కం కోసం కూడా శంకుస్థాపన చేయ‌డం జ‌రిగింది.

స్నేహితులారా,

దేశంలోని ప‌శ్చిమ ప్రాంత స్థాయిలో తూర్పు ప్రాంతం కూడా ప్ర‌గ‌తి సాధిస్తేనే భార‌త‌దేశం వృద్ధి సాధించిన‌ట్టుగా భావించాల‌ని నేను ప‌లు సంద‌ర్భాల్లో చెబుతూ వ‌చ్చాను. భార‌తదేశం వృద్ధి లో ఈశాన్య ప్రాంతం నూతన చోదక శక్తి కాగలదు. మిగ‌తా భార‌తదేశానికి, ఈశాన్య ప్రాంతాలకు మధ్య వృద్ధి లో సమానత్వం ఉండడానికి వీలుగా ఈ ప్రాంతపు ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను మేం తీర్చుతున్నాం.

ప‌లు మంత్రిత్వ శాఖ‌లు త‌మ ప‌రిధిలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల కింద ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేస్తున్నాయి. అన్ని కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ‌ శాఖ‌లు వాటి బ‌డ్జెట్ లో ప‌ది శాతాన్ని ఈశాన్య రాష్ట్రాలలో వినియోగించాల‌ని వాటికి అధికారం ఇవ్వ‌డం జ‌రిగింది. అలా కేటాయించిన నిధుల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించేలా చూడ‌డ‌మ‌నేది మా ప్ర‌భుత్వం సాధించిన విజ‌యం. ఈశాన్య రాష్ట్రాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల‌ని నా మంత్రివర్గ స‌హ‌చ‌రుల‌కు ఆదేశాలు ఇచ్చాను. వారి శాఖ‌ల ప‌రిధి లోని ప‌థ‌కాల అమ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ఉండేటట్టు చూడాలని కోరాను. ఇంత‌వ‌ర‌కు కేంద్ర‌ మంత్రులు అలాంటి 200 ప‌ర్య‌ట‌న‌లను పూర్తి చేశారు. నేను ఇంత‌వ‌ర‌కూ ఈ నాలుగు సంవ‌త్స‌రాలలో ఈశాన్య‌ భార‌తం లో 25 సార్లకు పైగా ప‌ర్య‌టించాను.

ఈశాన్య ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం భారీ స్థాయిలో చ‌ర్య‌లు చేప‌డుతోంది. గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో ఈశాన్య భార‌త‌దేశంలో రైలు నెట్ వ‌ర్క్ ను అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌తి ఏటా స‌రాస‌రి 5,300 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేస్తున్నాం. అంత‌కు ముందు 5 సంవ‌త్స‌రాలలో ప్ర‌తి ఏడాదీ స‌రాస‌రి చేసిన ఖ‌ర్చుకు ఇది రెండున్న రెట్లు అధికం. ఈశాన్య ప్రాంతంలోని జిరిబామ్ స్టేశన్ ను 2016 లో బ్రాడ్ గేజ్ రైలు నెట్ వ‌ర్క్ తో క‌ల‌ప‌డం జ‌రిగింది. ఈ రోజు ఈశాన్య ప్రాంతం లోని ఎనిమిది రాష్ట్రాలలో 7 రాష్ట్రాల‌ను రైలు నెట్ వ‌ర్క్ ద్వారా క‌ల‌ప‌డం జ‌రిగింది. ఇంఫాల్‌తో స‌హా మిగ‌తా రాష్ట్ర రాజ‌ధానుల‌ను బ్రాడ్ గేజ్ నెట్ వ‌ర్క్ తో క‌ల‌ప‌డానికి ప్రాజెక్టుల‌ను అమ‌లు చేస్తున్నాం.

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన వంతెన‌లలో ఒక‌టిగా నిలిచే, 141 మీట‌ర్ల పియర్ ఎత్తు క‌లిగిన జిరిబామ్- ఇంఫాల్ న్యూ లైన్‌ ప్రాజెక్టు ను నిర్మించ‌డం జ‌రుగుతోంది. అదే మార్గం లో 11.55 కి.మీ. పొడ‌వైన సొరంగ మార్గం ఈ ప్రాజెక్టు కు సంబంధించి ముఖ్య‌మైన నిర్మాణం.

2014 ప్రారంభంలో మణిపుర్ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జాతీయ ర‌హ‌దారుల పొడ‌వు కేవ‌లం 1200 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలలో మా ప్ర‌భుత్వం మ‌రో 460 కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ ర‌హ‌దారుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 38 శాతం పెరుగుద‌ల‌. రాబోయే 3 నుండి 4 సంవ‌త్స‌రాలలో కేంద్ర ప్ర‌భుత్వం 30,000 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్టి మణిపుర్ రాష్ట్రం లోని జాతీయ ర‌హ‌దారుల‌ను, ఇంకా ఇత‌ర ముఖ్య‌మైన రహ‌దారుల‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంది.

జాతీయ ర‌హ‌దారుల నిర్మాణ‌మే కాకుండా ప్ర‌ధాన మంత్రి గ్రామీణ్ స‌డ‌క్ యోజ‌న లో భాగంగా గ్రామీణ నివాస ప్రాంతాల‌ను ముఖ్య‌మైన రహదారులతో క‌ల‌ప‌డం జ‌రుగుతోంది. ఈ ప‌థ‌కం కింద మణిపుర్ రాష్ట్రానికి గ‌త 4 సంవ‌త్స‌రాలలో 1,000 కోట్ల‌ రూపాయలకు పైగా నిధులను కేంద్రం విడుద‌ల చేసింది. ఈ నాలుగు సంవత్సరాలలో మేం 150 ఆవాసాల‌ను క‌ల‌ప‌డం జ‌రిగింది. రాష్ట్రంలో ర‌హ‌దారుల అభివృద్ధికి సంబంధించి మా ప్ర‌భుత్వానికి వున్న నిబ‌ద్ద‌త కార‌ణంగానే ఈ చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది.

ఈశాన్య ప్రాంత ప్ర‌త్యేక మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ప‌థ‌కానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం. ప్ర‌త్యేక రంగాలలో మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయడంలో ఏర్ప‌డే ఖాళీ ల‌ను ఇది భర్తీ చేస్తుంది.

స్నేహితులారా,

2014లో పోలీస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ వార్షిక స‌మావేశం గువాహాటీ లో జ‌రిగింది. పోలీసు సిబ్బంది నియ‌మాకాన్ని విస్త‌రింప‌చేయాల‌ని ఆ సంద‌ర్భంగా నేను వారిని కోరాను. దీని ఫ‌లితంగా ఢిల్లీ పోలీసు వ్య‌వ‌స్థ‌ కు కోజ్మపోలిట‌న్ స్వ‌భావాన్ని తీసుకు రావ‌డానికిగాను ఢిల్లీ పోలీసు సిబ్బంది లో ఈశాన్య ప్రాంతాల పోలీసు సిబ్బంది సంఖ్య‌ ను పెంచ‌డం జ‌రిగింది. 2016 లో చేరిన పోలీసు సిబ్బంది లో 438 మంది ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన‌ వారే. వీరిలో 136 మంది మ‌హిళా సిబ్బంది ఉండ‌డం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీరిలో 49 మంది అభ్యర్థులు మణిపుర్ రాష్ట్రానికి చెందిన‌ వారు.

ఈ మ‌ధ్య‌ కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది భార‌త రిజ‌ర్వ్ బటాల్యన్ లను ఈశాన్య రాష్ట్రాల‌కు కేటాయించింది. వీటిలో రెండు బటాల్యన్ లను మణిపుర్‌కు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ రెండు బటాల్యన్ ల కార‌ణంగా రాష్ట్రంలోని సుమారు 2,000 మంది యువ‌కుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

పౌరులే కేంద్రంగా ఉండేలా మేం ప‌రిపాల‌న‌ను రూపొందించాం. క్ర‌మం త‌ప్ప‌కుండా, నిర్మాణాత్మ‌క రీతిలో ప్ర‌జ‌ల‌తో మాట్లాడే విధానాన్ని ప్రారంభించాం. ప్ర‌జ‌ల‌తో సంప్ర‌దింపులు చేసే ప‌ద్ధ‌తి గ‌తంలో మణిపుర్ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేదు. ‘మీయామ్ గీ నుమిత్’, ఇంకా “హిల్ లీడ‌ర్స్ డే” (“Meeyamgi Numit” and “Hill Leaders’ Day”) కార్య‌క్ర‌మాలు ఈ దిశ‌గా చేప‌ట్టిన చ‌ర్య‌లే. ప్ర‌జ‌ల‌తో ప్ర‌భుత్వ ముఖాముఖి లాంటి కార్య‌క్ర‌మాలు 24 దాకా జ‌రిగాయ‌ని నాకు తెలిసింది. వీటి ద్వారా 19 వేల మంది ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి ని క‌లుసుకొన్నారు.

ప్ర‌జ‌ల ఫిర్యాదుల‌ను ప్ర‌భుత్వం చాలా గంభీరంగా తీసుకొంటోంద‌ని నాకు తెలిసింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత ఫోన్ కాల్ ద్వారా ఈ విభాగంతో ప్ర‌జ‌లు మాట్లాడ‌వ‌చ్చు.

‘ప‌ర్వ‌త ప్రాంతాల‌కు వెళ్లండి’ (Go to Hills) కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వం చేప‌ట్టిన ముఖ్య‌మైన కార్య‌క్రమం. ముఖ్య‌మంత్రి త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి రాష్ట్రంలో ప‌ర్వ‌త ప్రాంత‌ జిల్లాలన్నింటిలో ప్ర‌యాణం చేశారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌ చెంతకు చేర్చడానికి ప్ర‌య‌త్నించారు.

ఒక‌సారి మణిపుర్ నిర్ణ‌యం తీసుకుందంటే ఆ ప‌ని జ‌ర‌గ‌కుండా ఏ శ‌క్తీ ఆప‌జాలదు. 1944 ఏప్రిల్ నెల‌ లో మణిపుర్ గ‌డ్డ మీద‌నే నేతాజీ బోస్ నెలకొల్పిన ఐఎన్ ఎ దేశ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చింది. ఈ పిలుపు దేశానికి నూత‌న ఉత్తేజాన్ని ఇచ్చింది. స్వాతంత్ర్య పోరాటానికి అవసరమైన బ‌లాన్ని అందించింది.

ఈ రోజు, న్యూ ఇండియా నిర్మాణంలో ఒక ముఖ్య‌ పాత్ర‌ను పోషించాల‌ని మ‌ణిపుర్ నిర్ణ‌యించింది. గ‌త సంవ‌త్స‌ర కాలంలో అభివృద్ధి రాజ‌కీయాలంటే ఏమిటో, సుప‌రిపాల‌న అంటే ఏమిటో మ‌ణిపుర్ దర్శింపచేసింది.

స్నేహితులారా,

సంవ‌త్స‌రం క్రితం మీరు చూపించిన ప్రేమ కార‌ణంగానే ఈ రోజున మేం ఈ ప‌నుల‌న్నీ చేయ‌గ‌లిగాం.

మ‌ఖ్య‌మంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ గారి బృందానికి కావల‌సిన అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు నా వైపు నుండి ల‌భిస్తాయ‌ని మీ అంద‌రికీ హామీ ఇస్తున్నాను.

పాలన చేప‌ట్టి ఒక సంవ‌త్స‌రం పూర్తి అయిన సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు నా అభినంద‌న‌లు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్ర‌మాలలో పాలుపంచుకొంటున్న యువ‌త‌కు నా అభినంద‌న‌లు.

మీ అంద‌రికీ మ‌రో సారి అనేకానేక ధన్యవాదాలు.

మయామబూ,

తాగ‌త్ చరీ.

(Mayamaboo,

Thagat-Chari.)