పిఎంఇండియా
నమస్కారం.
బెంగాల్‌లోని మాతృమూర్తులందరికీ నా గౌరవాభివందనాలు, శుభాకాంక్షలు.
ఈ శుభసందర్భంగా మీ అందరితో సంభాషించడం నాకెంతో సంతోషదాయకమైన విషయం. బెంగాల్ మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లు నాకెప్పుడూ ఆప్యాయతానురాగాలను అందించారు. మీ నమ్మకం, మీ ఆత్మీయతలే నాకు గొప్ప బలం.
విశ్వకర్మను పూజించే పవిత్ర దినం కూడా ఈ రోజే. విశ్వకర్మ పూజోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ శుభ తరుణంలో ఒక కొత్త సంప్రదాయం బెంగాల్లో బలపడుతోంది. నేడు అన్నపూర్ణ యోజన ద్వారా బెంగాల్‌లోని మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లకు సాధికారత లభిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి సోదరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఇళ్లల్లో మన తల్లులూ, అక్కాచెల్లెళ్లూ ఎన్నెన్నో బాధ్యతలను మోస్తూంటారు. అనేక చిన్నా పెద్దా నిర్ణయాల నడుమ.. ఒక మహిళ అన్నివిధాలా కుటుంబాన్ని చూసుకుంటుంది. అవసరమైన ఖర్చుల గురించిన ఆందోళన లేకపోతే.. ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆ దిశగా బెంగాల్ మహిళల ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్య అన్నపూర్ణ యోజన. ప్రతినెలా నిర్ణీత మొత్తం బెంగాల్ అక్కాచెల్లెళ్ల బ్యాంకు ఖాతాల్లో పడుతుంది. ఇక ఆ డబ్బుల గురించి వారు ఎవరినీ చేయిచాచి అడగాల్సిన పరిస్థితి ఉండదు. వారి జీవితాల్లో ఇదొక ముఖ్యమైన చేయూత.
మిత్రులారా,
ఈ రోజు దాదాపు 1.5 కోట్ల మంది అక్కాచెల్లెళ్ల బ్యాంకు ఖాతాల్లోకి అన్నపూర్ణ యోజన నాలుగో విడత నిధులు చేరుతున్నాయి. నెలనెలా రూ. 3,000. ఒక తల్లికి పిల్లల చదువుల కోసం ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఒక సోదరికి వైద్య ఖర్చులకో, నిత్యావసరాలకో ఉపయోగపడతాయి.
మిత్రులారా,
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి బెంగాల్ మహిళలకు రావాలి. వారు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇదే మా లక్ష్యం. ఈ దిశగా అన్నపూర్ణ యోజన అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. అన్నపూర్ణ యోజన ద్వారా లబ్ధి పొందుతున్న మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ ఏడాది మే 4న.. విప్లవాత్మక సంస్కరణలతో కూడిన నూతన మార్గాన్ని బెంగాల్ ఎంచుకుంది. బెంగాల్ మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లే ఈ మార్పులో కీలక పాత్ర పోషించారన్న విషయం నాకు తెలుసు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను మీరు చవిచూశారు. ఎన్నింటి కోసమో ఎంతగానో వేచిచూశారు. అందుకే.. బెంగాల్ మహిళలకు జీవన సౌలభ్యాన్ని కల్పించడమే మన కొత్త ప్రభుత్వం ఎదుట ఉన్న మొదటి పరీక్ష. కాబట్టే.. ‘తక్కువ మాటలు – ఎక్కువ కార్యాచరణ’ మంత్రప్రదంగా ముందుకు సాగుతున్నాం.
మిత్రులారా,
ప్రభుత్వం ఏర్పడ్డ అనతికాలంలోనే ఈ పథకానికి సంబంధించిన పనులను మొదలుపెట్టాం. నేడు ఇంత పెద్ద సంఖ్యలో మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు చేరుతోంది. అక్రమ వసూళ్లు లేవు.. మధ్యవర్తులు లేరు. సరిగ్గా ఈ ఆలోచనతోనే అన్నపూర్ణ యోజనను ప్రారంభించాం.
అర్హులైన మహిళల్లో ఒక్కరు కూడా అన్నపూర్ణ యోజన ప్రయోజనాలను కోల్పోకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. దీనిపైనా వేగంగా పనులు ముందుకు సాగుతున్నాయి.
మిత్రులారా,
మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లూ, ఆడబిడ్డల జీవితాలతో ముడిపడి ఉన్న ప్రతి సమస్యనూ పరిష్కరించడమే బీజేపీకి అత్యంత ప్రధానమైన అంశం. గర్భధారణ సమయంలో బిడ్డకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘మాతృ వందన యోజన’ను ప్రారంభించి మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదును పంపిస్తున్నాం. తల్లి గర్భంలోనే ఆడబిడ్డల ఉనికిని అంతం చేయడాన్ని అరికట్టేలా.. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి విస్తృతమైన కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా ప్రారంభించాం. టాయిలెట్ల లేవన్న కారణంతో ఆడబిడ్డలు బడి మానేయొద్దన్న సంకల్పంతో లక్షలాది టాయిలెట్లను నిర్మించాం. వారు చదువులను కొనసాగించేలా.. సుకన్య సమృద్ధి యోజనలో అధిక వడ్డీరేటును అందించాం. ఆడబిడ్డలు కూడా సైనిక పాఠశాలల్లోకి ప్రవేశించేలా వారికీ తలుపులు తెరిచాం. ఆడబిడ్డలు సొంతంగా పనిచేసుకునేలా.. వారి కోసం ముద్ర యోజనను ప్రారంభించి పూచీకత్తు లేకుండా రుణాలను అందించాం. పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లులు తమ ఉద్యోగాలను కొనసాగించేలా చూసేందుకు.. ప్రసూతి సెలవులను పెంచాం. గ్రామాల్లో నూతన ఆదాయ అవకాశాలను అందించడం లక్ష్యంగా.. స్వయంసహాయక బృందాలకు రికార్డు స్థాయిలో చేయూతనిచ్చాం. వంట గదుల్లో పొగ నుంచి మన ఆడబిడ్డలకు విముక్తి కల్పించడం కోసం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. నీళ్లు తెచ్చుకోవడానికి వారి ఇబ్బందులను తొలగించడం కోసం.. ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకాన్ని ప్రారంభించాం. చిమ్మచీకట్ల నుంచి వారు బయటపడేలా చేసేందుకు.. సౌభాగ్య పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్లను అందించాం. డబ్బుల్లేవన్న కారణంతో మన ఆడబిడ్డలు తమ అనారోగ్య సమస్యలను దాచిపెట్టి ఉంచొద్దన్న లక్ష్యంతో.. ఆయుష్మాన్ కార్డులతో వారిని సశక్తులను చేశాం. మన ఆడబిడ్డలకు బ్యాంకులను మరింతగా అందుబాటులోకి తేవడం లక్ష్యంగా.. జన్‌ధన్ యోజన కింద లక్షలాది ఖాతాలను తెరిచాం. ఆస్తిపై ఆడబిడ్డలకు కూడా హక్కులు కల్పించడం లక్ష్యంగా.. పీఎం ఆవాస్ గృహాల్లో ఉమ్మడి యాజమాన్యం ఉండేలా చర్యలు తీసుకున్నాం.
మిత్రులారా,
గత 12 ఏళ్లుగా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో ఇక్కడికి చేరకపోవడం బెంగాల్ ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో ఒకటి. దీనివల్ల పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. నిలిచిపోయిన ఆ పథకాలను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజననే చూడండి. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పీఎం ఆవాస్ పథకం కింద శాశ్వత గృహాలను పొందేందుకు 50 లక్షలకు పైగా పేద కుటుంబాలను కొత్తగా గుర్తించాం. పీఎం విశ్వకర్మ యోజనను కూడా ఇక్కడ అమలు చేశాం. పెండింగులో ఉన్న ప్రతి పథకమూ, నిలిచిపోయిన ప్రతి ప్రాజెక్టూ నేడు బెంగాల్లో వేగం పుంజుకుంటున్నాయి. ఇందులో బెంగాల్ మహిళలు, బెంగాల్ ప్రజల ఆశిస్సులూ, అండదండలూ బీజేపీకి ఉన్నాయి. అందుకే నేనెంతో నమ్మకంగా చెబుతున్నాను… మనమంతా కలిసి ఓ కొత్త బెంగాల్‌ను నిర్మిద్దాం.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్ కోసం దేశం ప్రతినబూనింది. బెంగాల్ మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లూ ఈ అభివృద్ధి ప్రయాణానికి నవోత్తేజాన్నిస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటారన్న దృఢమైన నమ్మకం నాకుంది. వికసిత బెంగాల్ బలంతో.. వికసిత భారత్ సంకల్పం మరింత బలోపేతమవుతుంది.
మిత్రులారా,
మీ ఆత్మీయత, మీ ఆశిస్సులు… ప్రజాసేవ దిశగా మాకెన్నటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అన్నపూర్ణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి అనేకానేక శుభాకాంక్షలు. విశ్వకర్మ పూజ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
***
Annapurna Yojana is a big boost for Nari Shakti in West Bengal. https://t.co/EAuiEpAH6D
— Narendra Modi (@narendramodi) September 17, 2026