పిఎంఇండియా
ఫరీదాబాద్‌లో ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసే చట్టబద్ధమైన హోదాతో పాటు, జాతీయ విద్యాప్రాధాన్య సంస్థగా బయోటెక్నాలజీ ప్రాంతీయ కేంద్రానికి గుర్తింపు ఈ బిల్లు ద్వారా లభిస్తుంది. 2008 నవంబరులోనే కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో జారీ అయిన ఆదేశాల మేరకు ఈ కేంద్రం ఏర్పాటైంది. ఫరీదాబాద్‌లోని ఎన్ సీఆర్ బయోటెక్ సైన్స్ క్లస్టర్‌లో ఈ కేంద్రం ప్రస్తుతం తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా బిల్లు ద్వారా ఆర్థికంగా ఎలాంటి భారం ఉండబోదు.
బయోటెక్నాలజీ రంగంలోని వివిధ రంగాల మధ్య విద్య, శిక్షణ, పరిశోధన కేంద్రంగా ఈ ప్రాంతీయ కేంద్రం పనిచేస్తుంది. పరిశ్రమలకు ఉపయోగపడే సరికొత్త విద్యా కార్యక్రమాలు, బయోడ్రగ్ ఆవిష్కరణలు, నానోసైన్స్, వైద్యం, ఇమేజింగ్ సాంకేతికతలు, బయో ఇంజినీరింగ్, బయో మెటీరియల్స్, మేధో హక్కులు, సాంకేతికత బదిలీ, భారత్ లో నైపుణ్య మానవ వనరుల కొరతను అధిగమించటం, నియంత్రించటం లాంటి వాటిపై ఈ కేంద్రంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. సార్క్ దేశాలకు, ఆసియా ప్రాంతంలో బయోటెక్నాలజీ రంగంలో నైపుణ్య కేంద్రంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతంలోని మావనవనరుల సమస్యలను ఇది పరిష్కరించటానికి కృషి చేస్తుంది. జీవశాస్త్రం, బయోటెక్నాలజీ రంగాల్లోని వివిధ రంగాలను విద్య, పరిశోధన, శిక్షణల్లో అనుసంధానం చేసే సంస్థగా ఇది పనిచేస్తుంది. బయోటెక్నాలజీ రంగంలో సరికొత్త విద్య, శిక్షణ కార్యక్రమాలను కూడా ఇది రూపొందిస్తుంది. తర్వాత వీటిని భారత్, ఈ ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలు వినియోగించుకోవచ్చు.