పిఎంఇండియా

గౌరవనీయులైన రాష్ట్రపతి గారు, మాన్యులు ఉప రాష్ట్రపతి గారు, లోక్‌సభ స్పీకర్ మేడమ్ గారు, మాజీ ప్రధాని శ్రీ దేవె గౌడ గారు, మంత్రివర్గ సభ్యులు, సభలోని అందరు ఇతర సభ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ రంగాల ప్రముఖుల సందోహానికి వందనం.
జాతి నిర్మాణ ప్రక్రియలో మనను వినూత్న పరిస్థితులవైపు నడిపించే క్షణం తరచూ మనకు చేరువై, సరికొత్త కలలుకనే దిశగా లెక్కకు మిక్కిలి అవకాశ ద్వారాలను తెరుస్తూంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ అర్ధరాత్రి వేళకు మనమంతా కలసి జాతి భవిష్యత్ పురోగమనానికి పథ నిర్దేశం చేయనున్నాం.
ఇప్పటి నుండి మరి కొద్ది క్షణాలలో మన దేశం సరికొత్త ఆర్థిక పాలన విధానంవైపు పయనం ప్రారంభిస్తుంది. దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలు సాక్షులుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అయితే, వస్తువులు, సేవల పన్ను ప్రక్రియ ఒక్క ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమని నేను భావించడం లేదు. ఈ విశేష సందర్భం ఇవాళ భారత ప్రజాస్వామ్యంలో సహకారాత్మక సమాఖ్య భావనకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ జీఎస్ టి నెట్‌వర్క్ రూపకల్పనలో పాల్గొన్న వివిధ బృందాలకు మార్గనిర్దేశం చేసిన అనేకమంది దిగ్గజాల నిరంతర కృషి వల్లనే ఇవాళ ఈ చారిత్రక సందర్భం సాధ్యమైంది.
ఈ శుభప్రదమైన సందర్భం కోసం మీరంతా మీ విలువైన సమయాన్ని కేటాయించడం మహదానందం కలిగిస్తోంది. ఇవాళ, ఇక్కడ, ఇలా హాజరైన మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేమెంచుకున్న దిశ, మేం నడచిన ఈ మార్గం, మేం రూపొందించిన ఈ వ్యవస్థ వెలుగు చూడటమన్నది కేవలం ఒక బృందం, ఏదో ఒక్క ప్రభుత్వ కృషి ఫలితం కాదు. ఇది అందరి భాగస్వామ్య వారసత్వంతో సమకూడిన ఫలితం. అందరి సమష్టి కృషి మమ్మల్ని ఈ విజయంవైపు నడిపించింది. తదనుగుణంగానే పార్లమెంటు సెంట్రల్ హాలులో ఇవాళ 12 గంటల వేళకు స్వర్ణాక్షర లిఖితం కానున్న క్షణానికి వైతాళికులుగా మనమంతా ఇక్కడ ఏకమయ్యాం.
అనేక మంది గొప్ప జాతీయ నాయకుల అడుగుజాడలతో పునీతమైన ప్రదేశం ఇదే. అదే సభాగృహంలో నేడు మనమంతా ఆసీనులు కావడం మనకెంతో గౌరవం. ఈ దేశ రాజ్యాంగంపై చర్చ కోసం ఇదే సెంట్రల్ హాలులో 1946 డిసెంబరు 9న తొలి సమావేశం జరిగిన సందర్భాన్ని ఓసారి మననం చేసుకుందాం. మనకెంతో గర్వకారణమైన అదే ప్రదేశాన్ని మనమిప్పుడు పంచుకుంటున్నాం. పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బాబాసాహెబ్ భీంరావు అంబేడ్కర్, ఆచార్య కృపలానీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు ల వంటి దిగ్గజాలైన జాతి నేతలు కూర్చున్న ఈ హాలులోని ముందు వరుస ఆసనాలు ఎంతో పవిత్రతను సంతరించుకున్నాయి.
ఇదే మందిరం 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి జాతికి స్వాతంత్ర్యం సిద్ధించిన పవిత్ర క్షణానికి సాక్షీభూతంగా నిలిచింది. తిరిగి 1949 నవంబరు 26న ఇదే సభా మందిరం రాజ్యాంగాన్ని జాతి ఆమోదించిన చారిత్రక సందర్భానికి వేదికైంది.
అనేక సంవత్సరాల అనంతరం మరో సారి ఈ మందిరం చరిత్ర పుటలలోకి ఎక్కుతోంది. సమాఖ్య నిర్మాణానికి అత్యంత బలమైన అంగంగా రూపుదిద్దుకున్న జిఎస్ టి సంస్కరణ శ్రీకారం చుట్టుకునేందుకు ఇంతకన్నా పవిత్రమైన వేదిక మరేదీ ఉండదు.
అనేక విస్తృత చర్చలు, అంగీకార-అనంగీకారాల నడుమ కొత్త మార్గం రూపొందించుకున్నా అవన్నీ దారి తప్పే వేళ మధ్యేమార్గాన్ని అవలంబించడం ద్వారా భారత రాజ్యాంగం ఆవిర్భవించింది! దేశంలోని ప్రతి ప్రాంతం నుండీ ప్రజల భాగస్వామ్యంతో రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు సాగిన చర్చల ఫలితమది. అదే తరహాలో దూరాలోచనతో సుదీర్ఘంగా సాగిన మేధో మధనంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో జిఎస్ టి ఆవిర్భవించింది. మాజీ మంత్రులుసహా దేశంలోని అత్యుత్తమ మేధావులతో నిరంతర చర్చలు జిఎస్ టి సాకారం కావడానికి తోడ్పడ్డాయి. రాజ్యాంగం రూపుదిద్దుకున్న తర్వాత ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కుల చట్రాన్నిఅది ప్రవేశపెట్టింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణలు తేవడం కూడా జిఎస్ టిలో అంతర్భాగమన్నది అత్యంత ముఖ్యమైన అంశం. దేశ సార్వజనీన అభివృద్ధికి దోహదపడగల సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఇదో గొప్ప ఉదాహరణ.
జిఎస్ టి ప్రారంభంతో ఒక జట్టుగా భారతదేశం తన సామర్థ్యాన్ని, సావధానతను రుజువు చేసుకుంది. జిఎస్ టి మండలి ఎలాంటి వ్యవస్థలను రూపొందించిందంటే.. అవకాశాలు అందనివారికి వాగ్దానం చేసిన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచింది. జిఎస్ టి రూపకల్పనతో సంబంధం ఉన్నవారంతా రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకాభిప్రాయంతో పనిచేశారు. ఈ కృషిలో ఆద్యంతం ప్రభుత్వంతో కలసి సాగుతూ అన్నివిధాలా సహకరించిన వారందరికీ అరుణ్ జైట్లీగారు ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో నేతృత్వం వహించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికీ ఇప్పుడు సమాన అవకాశాలు దక్కుతాయిగనుక ఆ మేరకు అపారంగా లబ్ధి పొందుతాయి. జిఎస్ టి కూడా కేంద్ర, రాష్ట్రాలు సమాన పాత్ర పోషిస్తున్న రైల్వే వ్యవస్థ వంటిదే. రాష్ట్రాల స్థాయిలో దానికి మద్దతు లభిస్తున్నా అది ‘‘భారతీయ రైల్వేలు’’గా పరిగణనలో ఉంది. అలాగే కేంద్ర సర్వీసుల అధికారులు దేశంలోని అన్ని రాష్ట్రాలలో నియమితులవుతూ కేంద్ర, రాష్ట్రాల దృక్కోణాలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడిక కేంద్ర, రాష్ట్రాలు రెండూ ఒకే దిశగా సమీకృతంగా కృషిచేసే తొలి వ్యవస్థ జిఎస్ టి మాత్రమే. దేశాన్ని విశేష ప్రగతివైపు నడిపించగల అద్భుత వ్యవస్థ అయిన జిఎస్ టి ని ఒక వినూత్న, అద్భుత విజయంగా రాబోయే తరాలు గర్విస్తాయి. ఇవాళ జిఎస్ టి మండలి 18వ సారి సమావేశమైన నేపథ్యంలో మరికొద్దిసేపటి తర్వాత దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను అమలులోకి వస్తుంది. పవిత్ర భగవద్గీతలోనూ 18 పర్వాలు ఉండటం యాదృచ్ఛికం కాగా, ప్రస్తుతం మనం విజయవంతంగా ముందడుగు వేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ.. దీనివెనుక కఠోర శ్రమతో పాటు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. రాష్ట్రాల మదిలో కొన్నిసందేహాలున్నాయి. కానీ… జాగరూకత, కఠోర శ్రమతో ఏ కార్యాన్నయినా మనం సాధించగలం.
చాణక్యుడు ఏం చెప్పాడో చూడండి..
यद दुरं यद दुराद्यम, यद च दुरै, व्यवस्थितम्,
तत् सर्वम् तपसा साध्यम तपोहिदुर्तिक्रमम।
దీని అర్థం.. ‘‘లక్ష్యం ఎంతో దూరమైనా, సాధించడం కష్టసాధ్యమైనా
ఏకాగ్రత, కఠోర శ్రమతో ఎంతటి కార్యాన్నయినా సాధించగలం’’ అని.
చాణక్యుడి మాటలు మొత్తం జిఎస్ టి ప్రక్రియను వివరిస్తాయి. ఆ మేరకు ఏదైనా సాధించడం అత్యంత కష్టసాధ్యమైనా అకుంఠిత దీక్ష, కఠిన శ్రమతో దాన్ని పొందడం సాధ్యమే. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో 500కు పైగా సంస్థానాలున్నాయి. వాటన్నిటి విలీనానికి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ కృషి చేసి ఉండకపోతే భారతదేశ రాజకీయ పటం ఇవాళ ఎలా ఉండేదో మనం ఊహించగలమా ? అనేకానేక సంస్థానాల విలీనంతో సర్దార్ పటేల్ సమైక్య భారతదేశానికి రూపమిచ్చిన తరహాలోనే ఇప్పుడిక జిఎస్ టి ఆర్థిక సమైక్యతను తెస్తుంది. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 7 రకాల కేంద్ర పన్నులు, 8 రకాల రాష్ట్ర పన్నులు, భిన్న వస్తుజాలంపై భిన్న రకాల పన్నులన్నీ కలిపితే మొత్తం పన్నుల సంఖ్య 500 దాటిపోతుంది! నేటి నుండి ఈ పన్నుల భారాన్నంతా వదిలించుకుని, గంగానగర్ నుండి ఇటానగర్ దాకా, లేహ్ నుండి లక్షదీవుల దాకా ‘‘ఒకే దేశం, ఒకే పన్ను’’ అమలులోకి వస్తుంది.
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఆదాయపు పన్నును అర్థం చేసుకోవడమేనని ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఆయిన్‌స్టీన్ ఓసారి అన్నారు. ఇప్పుడాయన మన మధ్య ఉండి ఉంటే ఈ లెక్కకు మించిన పన్నులు చూసి ఏ విధంగా స్పందించేవారోనని నాకు అనిపిస్తూంది. ఉత్పత్తి పరిమాణం విషయంలో చూస్తూ సాధారణంగా పెద్ద మార్పేమీ కనిపించదు. కానీ, సదరు ఉత్పత్తి విపణలో ప్రవేశించాక వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పన్నుల ఫలితంగా దాని విలువలో అసమానత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ల మధ్య ఉన్నది 25-30 కిలోమీటర్ల దూరమే అయినా ఒకే ఉత్పత్తి వేర్వేరు ధరల్లో ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలు గల ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన పన్ను వ్యవస్థలు కలిగి ఉండటమే ఇందుకు కారణం. కాబట్టే ఒకే వస్తువును ఢిల్లీ వెళ్లినప్పుడు ఒక ధరతో, గురుగ్రామ్ వెళ్లినప్పుడు మరో ధరతో, నోయిడా వెళ్లినప్పుడు ఇంకొక ధరతో కొనాల్సి రావడం చూసి పౌరులు ఆశ్చర్యపోవడం సహజం.
ఇది ప్రతి ఒక్కరినీ గందరగోళంలో పడేసేది. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పన్నులు చూసి విదేశీ పెట్టుబడిదారులు అయోమయంలో పడే వారు. ఈ పరిస్థితి నుండి బయటపడే దిశగా ఇవాళ మనం ముందడుగు వేస్తున్నాం. జిఎస్ టి అమలులోకి వస్తే అమ్మకం పన్ను, విఎటి వగైరా అన్ని రకాల పన్నులు అంతర్ధానమవుతాయని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా వివరించారు. టోల్‌ప్లాజాల దగ్గర ఇకపై వాహనాలు బారులు కనిపించవు. ఇప్పటిదాకా ఈ పరిస్థితి ఉన్నందువల్ల కోట్ల రూపాయల విలువైన ఇంధనం వృథా అవుతోంది. దాంతోపాటు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతోంది. అలాగే పన్ను ప్రక్రియలో ఆలస్యం ఫలితంగా కొన్ని సమయాల్లో కొన్ని వస్తువులు… ప్రత్యేకించి సకాలంలో గమ్యం చేరాల్సిన త్వరగా పాడయిపోయే (కూరగాయలు, పళ్లు వంటి) వస్తువుల రవాణా ఆలస్యమై అవి చెడిపోవడంతో రెండు వైపులా నష్టం వాటిల్లేది. ఇప్పుడిక దేశమంతా ఒకే పన్ను పద్ధతి అమలులో ఉంటుందిగనుక ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
ఈ రోజు నుండి ఈ బెడదనంతా మనం వదిలించుకుంటున్నాం. ఆధునిక పన్ను వ్యవస్థ వైపు దేశం ఒక అడుగు ముందుకేస్తోంది. ఇది చాలా సరళమైన, పారదర్శక పన్ను వ్యవస్థ. ఇది నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి తోడ్పడటమేగాక నిజాయితీని సత్కరించడంలోనూ తోడ్పడతుంది. నిజాయతీగా వ్యాపారం చేసుకునేలా ఉత్సాహ ప్రోత్సాహాలిస్తుంది. ఇదొక కొత్త పాలన సంస్కృతిని తీసుకువస్తుంది. ఇప్పటిదాకా మనమంతా పన్ను ఉగ్రవాదం, తనిఖీల పాలనను చూశాం. ఇవాళ సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగంద్వారా పారదర్శక జిఎస్ టి విధానం అమలులోకి వస్తున్నందువల్ల చీకటి కోణాలన్నీ అంతర్ధానమవుతాయి. జిఎస్ టి అంతర్గతంగా చాలా బలమైంది కావడం వల్ల ఓ సాధారణ వ్యాపారిని అధికారులు వేధించే అవకాశం ఇవ్వదు. ఇక 20 లక్షల రూపాయల వార్షిక వ్యాపార పరిమాణంగల వ్యాపారులందరికీ దీని నుండి మినహాయింపు ఇవ్వబడింది. అంతేగాక 75 లక్షల దాకా వార్షిక వ్యాపార పరిమాణం గల వారికీ చాలా మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ కొత్త వ్యవస్థలో కొన్ని ఏర్పాట్లున్నా అవి ప్రాథమిక స్థాయిలోనివి
మిత్రులారా,
జిఎస్ టి అన్నది ఈ పదంలోని సాంకేతికాంశాలకు పరిమితం కాదు, ఈ వ్యవస్థ పేదల సంక్షేమానికి ఉద్దేశించింది. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా పేదలకు చేసిన మేలు చాలా తక్కువ. అంటే అందుకోసం కృషి చేయలేదని కాదు.. ప్రతి ప్రభుత్వం ఈ దిశగా ఎంతో శ్రమించినా దేశంలోని పేదల అవసరాలు తీర్చగల వనరులు పరిమితంగా ఉండటమే ఆ కృషి ఫలించకపోవడానికి కారణం. మనం విస్తరించే కొద్దీ ఎదుగుదలకూ భరోసా కల్పించుకోవాలి. ఆ దిశగా మన కృషి సులభమవుతుంది. తదనుగుణంగా పేదలకు లబ్ధి చేకూరేలా ప్రయోజనాలను వారికి బదిలీ చేయడంలో చిన్న వ్యాపారులంతా సహకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. కొత్తగా ఏదైనా చేద్దామన్నా ఆ ప్రయత్నం ఫలిస్తుందో లేదోనని కొన్నిసార్లు మనం ఆందోళన చెందుతాం. ఉదాహరణకు తొలిసారి 10వ, 12వ తరగతుల పరీక్ష ఫలితాలను ఆన్‌లైన్ చేసినప్పుడు, వ్యవస్థలు స్తంభించాయి. మరునాటి నుండీ మనం దృష్టి సారించిన అంశమిదే. అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి సమస్య గురించి వింటూనే ఉన్నాం.
ప్రతి ఒక్కరూ సాంకేతిక నిపుణులు కారన్నది నిజమే గానీ, ఏదైనా కుటుంబంలో ఇప్పుడు 10వ లేదా 12వ తరగతి విద్యార్థి ఉంటే వారికి తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. జిఎస్ టి ఎంత సరళమైందంటే, వ్యాపారులు తమ రిటర్నులు దాఖలు చేయడంలో అలాంటి 12వ తరగతి విద్యార్థి కూడా సహాయపడగలడు.
అందువల్ల మీకేవైనా భయాలుంటే వాటిని పక్కన పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మీ వైద్యుడివద్ద కళ్లు పరీక్ష చేయించారనుకుందాం! ఆయన మీ చూపు స్థాయి గురించి తెలియజేస్తే, తదనుగుణ ప్రమాణాల ప్రకారం మీ కళ్లజోడు తయారవుతుంది. అయినా, ఈ కళ్లద్దాలకు అలవాటు పడాలంటే రెండు మూడు రోజులు పడుతుంది. అదే సమయంలో కళ్లు కూడా అద్దాలకు అనుగుణంగా సర్దుబాటు కావాలన్నది ఈ ఉదాహరణలోని ముఖ్యాంశం. అదేవిధంగా కొత్త వ్యవస్థతో సర్దుబాటుకు ప్రయత్నిస్తే మనం దానితో మమేకం కాగలం. కాబట్టి వదంతుల పరంపరకు స్వస్తి చెప్పడానికి ఇదే సమయం. ఈ దేశం బాగు, అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన సమయమిదే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా జిఎస్ టిని ముందుకు తీసుకెళ్దాం రండి.
జిఎస్ టి వ్యవస్థ మన దేశీయ వాణిజ్యంలో అసమతౌల్యానికి ముగింపు పలకడంతోపాటు ఎగుమతులను కూడా పెంచుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత ఊపునివ్వడమేగాక వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిస్తుంది. బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లేదా ఈశాన్య భారత రాష్ట్రాలు, ఒడిశాల వంటి మన రాష్ట్రాలను పరిశీలించండి.. అవన్నీ సహజ వనరుల సంపదతో అలరారుతున్నవే. వాటికి ఏకైక పన్ను వ్యవస్థ అందుబాటులోకి వస్తే అక్కడి లోటును పూరించుకోవడమేగాక దేశానికి చెందిన వ్యాపార కళ ముందుకు వెళ్తుంది. అభివృద్ధి అవకాశాలు భారత్‌లోని అన్ని రాష్ట్రాలకూ సమానస్థాయిలో లభిస్తాయి. జిఎస్ టి అంటే రైల్వేల వంటిది. రైల్వే వ్యవస్థను కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా నడుపుతున్నాయి. అయినప్పటికీ దీన్ని మనం భారతీయ రైల్వే వ్యవస్థగానే వ్యవహరిస్తున్నాం. అధికారులంతా కేంద్ర, రాష్ట్ర పాలన వ్యవస్థలలో నియమితులవుతున్నా వారంతా భారతదేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. అదే దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా జిఎస్ టి కింద సంయుక్తంగా పనిచేస్తాయి. ‘‘ఒకే భారతం – శ్రేష్ట భారతం’’ సాకారానికి ఇదో ఉదాహరణ. రాబోయే తరాలు దీని ప్రభావాన్ని సగర్వంగా హర్షిస్తాయి.
మన దేశం 2022లో స్వాతంత్ర్య వజ్రోత్సవా (75వ వార్షికోత్సవా)లను నిర్వహించుకోబోతోంది. అప్పటికల్లా నవ భారత సృష్టివైపు మన పయనం ప్రారంభించాం. అది 125 కోట్ల మంది భారతీయులు కలలుగంటున్న నవ భారతం!
అందువల్ల సోదరీ సోదరులారా! మన కలల భారత నిర్మాణంలో జిఎస్ టి కీలక పాత్ర పోషించాలి. ఈ దిశగా జిఎస్ టి బృందం చేయాల్సిన కృషిని లోకమాన్య తిలక్ రచించిన “గీతా రహస్యం”లోని చివరి పద్యం వివరిస్తుంది. రుగ్వేదంలో నేటికీ మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నఓ పద్యం ఇలా చెబుతోంది..:
सवाणिवाह: आकृति: समाना रुदयनिवाह:
समान वस्तुf वो मनो यथावा सुसहासिति
దీనికి అర్థం.. “మనమంతా ఒకేవిధమైన దీక్ష, పట్టుదల, భావోద్వేగాలతో ఉండాలి. మన హృదయ స్పందన సమాన స్థాయిలో ఉండాలి. ఒకే లక్ష్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ అందరికీ మద్దతిస్తూ, సంయుక్తంగా ముందుకు సాగేలా మన హృదయాలు ప్రతిస్పందించాలి” అని.
జిఎస్ టి నవ భారతం (New India) దిశగా ఒక వినూత్న చట్టం.. అలాగే, డిజిటల్ ఇండియా దిశగా ఓ విప్లవాత్మక వ్యవస్థ.
నవ భారతం, డిజిటల్ ఇండియా పన్ను వ్యవస్థ జిఎస్ టి. ఇది కేవలం వాణిజ్య సౌలభ్యాన్నేగాక వాణిజ్య నిర్వహణ ఎలాగో కూడా చూపుతుంది. జిఎస్ టి ఒక పన్ను సంస్కరణ మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణల వైపు చరిత్రాత్మక ముందడుగు. పన్నుల వ్యవస్థ సంస్కరణకు మించి సామాజిక సంస్కరణల దిశగానూ బాటలు పరుస్తుంది. అవినీతిరహిత పన్ను వ్యవస్థకు ఇదొక హామీ. చట్ట పరిభాషలో ఇది వస్తువులు-సేవల పన్ను. కానీ, జిఎస్ టి వల్ల ఒనగూడే ప్రయోజనాల రీత్యా ఇది భారతదేశ పౌరులకు “ఉత్తమ-సరళ పన్ను” అనడంలో సందేహం లేదు. ‘ఉత్తమం’ ఎందుకంటే… పన్ను దొంతరల నుంచి మనను విముక్తం చేస్తుంది. ‘సరళం’ ఎందుకంటే… దేశమంతటా ఒకేవిధంగా అమలువుతుంది. అన్ని రాష్ట్రాలలో ప్రామాణిక రీతిలో పన్ను వ్యవస్థ అమలవుతూ ‘‘ఒకే దేశం – ఒకే పన్ను’’గా ఉంటుంది. మనమంతా దీన్ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలమనడంలో నాకెలాంటి సందేహాలూ లేవు.
ఈ చిరస్మరణీయ సందర్భంలో.. జిఎస్ టి ప్రాజెక్టుకు సంబంధించి గౌరవనీయులైన రాష్ట్రపతి పోషించిన పాత్రను గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఈ పన్ను సంస్కరణకు రూపమిచ్చే ప్రతి దశలో సంబంధిత బృందాన్ని తన అమూల్యమైన సూచనలతో ప్రస్తుత చరిత్రాత్మక క్షణాల దిశగా ఆయన నడిపించారు. ఈ పయనంలో ఆయన స్ఫూర్తే ఆద్యంతం ప్రతి ఒక్కరినీ ఉత్సాహంగా ముందుకు నడిపింది. ఆయన మార్గదర్శకత్వంతోపాటు జిఎస్ టి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నందుకు నేనెంతో రుణపడి ఉన్నాను. ఈ నేపథ్యంలో సరికొత్త ఉత్సాహప్రోత్సాహాలతో దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా మేం నడిపిస్తాం. ఈ వినూత్న కార్యారంభంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక మీదట కూడా మాకు మార్గదర్శకత్వం వహించాల్సిందిగా గౌరవనీయులైన రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నాను.
***
At a historic Midnight Session of Parliament, India welcomed the GST. https://t.co/Su2aAwJN9c pic.twitter.com/570bIH5cNr
— PMO India (@PMOIndia) June 30, 2017
Today marks a decisive turning point, in determining the future course of the country: PM @narendramodi in Parliament
— PMO India (@PMOIndia) June 30, 2017
Just as Sardar Patel had ensured political integration of the country, GST would ensure economic integration: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2017
GST would lead to a modern tax administration which is simpler, more transparent, and helps curb corruption: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2017