Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పులుల సంర‌క్ష‌ణ‌ అంశంపై థర్డ్ ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కాన్ సర్వేషన్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

పులుల సంర‌క్ష‌ణ‌ అంశంపై థర్డ్ ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కాన్ సర్వేషన్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు


రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ వ్య‌వ‌సాయ‌ం & అడవుల శాఖ మంత్రి మరియు గ్లోబ‌ల్ టైగ‌ర్ ఫోర‌మ్ ఛైర్మ‌న్‌,

పులుల ప్రాంతాలున్న వివిధ దేశాల విశిష్ట మంత్రులు,

మా ప‌ర్యావ‌ర‌ణ‌ం, అడవులు & వాతావ‌ర‌ణ మార్పు శాఖ మంత్రి శ్రీ ప్ర‌కాశ్ జావడేక‌ర్‌,

వేదిక‌పైన ఉన్న ఇతర ప్ర‌ముఖులు, సోద‌ర‌ సోద‌రీమ‌ణులకు..

మీ అందరినీ ఈ సభకు ఆహ్వానించడానికి నేనెంతగానో సంతోషిస్తున్నాను.

పులులు మనందరినీ నేడు ఇక్కడ సమావేశమయ్యేటట్లు చేశాయి. అంత‌రించిపోతున్న ముఖ్య వన్య ప్రాణి సంతతిని సంర‌క్షించ‌గం గురించి చర్చించటానికి ఇది ఒక ముఖ్యమైన స‌మావేశం. ఈ ల‌క్ష్య‌సాధ‌న‌కు మీమీ దేశాలు ఆ ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయ‌న‌టానికి మీరంతా ఇక్క‌డికి తరలిరావ‌ట‌మే సాక్ష్యం.

ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో వ్యాఘ్రాలకు, వాటి ఆహార వ‌ల‌యానికి ఉన్న ప్రాధాన్యం గురించి మ‌న‌కు అంద‌రికీ తెలుసు. వాటికి చక్కటి అడవులు, బోలెడంత ఆహారం అవసరమవుతుంది. కాబ‌ట్టి పులుల‌ను కాపాడుకోవటం ద్వారా మ‌నం యావత్తు ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తౌల్యాన్ని, పర్యావరణ సేవలను సంరక్షించిన వారం అవుతాం. పర్యావరణ సమతుల్యత, పర్యావరణ సేవలు అనేవి మానవునల శ్రేయానికి సైతం ఎంతో కీలకమైనవే సుమా.

నిజానికి పులుల సంర‌క్ష‌ణ తాలూకు ప్ర‌యోజ‌నాలు అపార‌మే కాకుండా

అమూర్తం కూడా! దీనిని మనం ఆర్థిక‌ గ‌ణాంకాలలో లెక్కగట్టలేము. ప్రకృతికి వెల‌ క‌ట్ట‌డమదేని దుస్సాధ్యం. ప్ర‌కృతి మాత త‌న ర‌క్ష‌ణ కోసం వాటిని సృష్టించినందువల్ల వాటిని ప‌రిర‌క్షించ‌టం మ‌న విధ్యుక్త ధర్మమయింది. భార‌త‌దేశంలో పులి అంటే కేవలం క్రూర‌ మృగం కాదు.. అంతకన్న ఎంతో ఎక్కువ. మా పురాణాల ప్ర‌కారం జగన్మాత ప్ర‌కృతికి ప్ర‌తీక; ఆమెకు వాహనంగా పులిని అభివర్ణించుకొన్నాం. నిజానికి మా దేవుళ్ళు, దేవ‌త‌లలో చాలా మందికి ఏదో ఓ వన్యప్రాణి తోనో, చెట్టు తోనో, న‌ది తోనో సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని సంద‌ర్భాలలో ఈ వన్య ప్రాణుల‌ను కూడా దేవుళ్ళు, దేవ‌త‌లకు మల్లేనే అదే పీఠంపైన ఉంచి ఆరాధిస్తాం. పులి మా జాతీయ జంతువు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇతర టైగర్ రేంజ్ కంట్రీస్ కూడా పులుల‌తో ఇటువంటి సాంస్కృతిక‌ అనుబంధమేదో తప్పక కలిగి ఉన్నట్లు నాకనిపిస్తోంది.

మిత్రులారా! అడ‌వుల్లోని జంతుజాలం సాధార‌ణంగా తాము కూర్చున్న కొమ్మ‌ను తామే న‌రుక్కోదు. అయితే, ఈ విషయంలో మనుషులు ఒక మినహాయింపు అని చెప్పాలి. మ‌న ఆవ‌శ్య‌క‌త‌లు, అశ‌క్త‌త‌లు, అవ‌స‌రాలు, దురాశ.. అన్నీ క‌ల‌సి ప్ర‌కృతిని, పర్యావరణాన్ని కుంగుదలకు లోను చేశాయి. ఈ సంద‌ర్భంగా నేను గౌత‌మ‌ బుద్ధుని ప్ర‌సిద్ధ ప్రవచనాన్ని గుర్తుచేస్తాను.. ఆయన చెప్పింది ఇదీ: “అప‌రిమిత‌మైన ద‌య యొక్క వింత వ్యవస్థే వనం. అది అన్ని రకాల జీవాలకు ర‌క్ష‌ణ‌నిస్తుంది. ఆఖరుకు గొడ్డ‌లి పట్టుకుని చెట్లను న‌రికే వ్యక్తికి కూడా వనం నీడను ఇస్తుంది” అని.

పులుల ప్రాంత దేశాల‌న్నీ క‌ల‌సి పులుల సంర‌క్ష‌ణ‌ కోసం న‌డుం బిగించి చేస్తున్న మంచి ప్ర‌య‌త్నాల‌ను నేను అభినందిస్తున్నాను. కొనసాగుతున్న ఈ మీ కృషికి మీకందరికీ నా ప్రశంసలు. “గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్” ద్వారా, ఇంకా కౌన్సిల్ చేస్తున్న ప్రయాసలకు ఇవే నా కితాబులు.

2010లో ద టైగర్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి శ్రీ వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక గొప్ప కృషిని గురించి నేను ప్రస్తావించి తీరాలి. ఈ ప్ర‌యత్నాల ఫ‌లితంగానే ద గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం రూపొందింది.

గ్లోబ‌ల్ టైగ‌ర్ ఫోర‌మ్ చైర్మ‌న్ దోర్జి తీసుకున్న చొర‌వ‌లను కూడా నేను అభినందిస్తున్నాను.

అయినప్పటికీ, నాకు చెప్పిన దానిని బట్టి టైగర్ రేంజ్ కంట్రీస్ లో పులుల ఆవాస ప్రాంతాల పరిధి గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయినట్లు తోస్తున్నది. పులుల శ‌రీర‌ భాగాల అక్రమ రవాణా కొనసాగుతుండటం పరిస్థితిని మరింత అధ్వానంగా మార్చివేసింది. భారతదేశంలోనూ మేం వేటదొంగతనం, పులుల ఆవాస ప్రాంతాల విధ్వంస కార్యకలాపాల స‌వాళ్లను ఎదుర్కొంటున్నాము.

భారతదేశంలో జనాభాలో అధిక శాతం చెట్లను, వన్య ప్రాణులను, వనాలను, నదులను.. ఇంకా సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి లోని ఇత‌ర శక్తులను గౌరవిస్తారు. ఇది ఒక సానుకూలాంశం. మేం భూమిని మా మాతగా భావిస్తాము. మా ధర్మ గ్రంథాలు ఈ
యావత్తు విశ్వాన్ని ఒకటిగా చూడమని మమ్మల్ని ప్రేరేపిస్తాయి.

వ‌సుధైవ కుటుంబకమ్, ఇంకా లోక: స‌మ‌స్తా: సుఖినో భ‌వంతు అనేది మా తత్వం. మేం పర్యావరణ వ్యవస్థ సహా ప్రతి ఒక్కరు శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేస్తాం:

‘ఓం ద్యౌ: శాంతి.. రంతరిక్ష శాంతి.. పృథ్వీ శాంతి.. రాప: శాంతి, రౌషధయ: శాంతి.. వనస్పత్య: శాంతి’ అంటూ

మిత్రులారా! వనాలు, క్రూర మృగాలు ఒక దాని నుంచి మరొకటి విడ‌దీయ‌లేనటువంటివి. అవి రెండూ పరస్పర పూరకాలు. ఒక‌దానిని నాశ‌నం చేస్తే అది మ‌రొకదాని నాశనానికి దారితీస్తుంది. వాతావరణ మార్పునకు ఇది ఒక ముఖ్యమైన కారణం. వాతావరణ మార్పు మనపై అనేక రకాలుగా ప్రతికూల ప్రభావాన్ని ప్రసరింపచేస్తోంది. ఇది ప్ర‌పంచ‌మంతా ఎదుర్కొంటున్న ప‌రిణామ‌ం కూడా. దీనితో మనం అందరం తంటాలు పడుతున్నాం. దీనికి ఒక పరిష్కార మార్గంగా.. మనం ప్ర‌తి దేశానికి ఒక ప్ర‌త్యేక‌మైన ఉప‌శ‌మ‌న వ్యూహాలను రచించుకొని, వాటిని అమలు చేసేందుకు క‌ట్టుబ‌డ్డాం.

వాతావరణ మార్పును కొంతవరకు తగ్గించడానికి అనుసరించదగిన వ్యూహంలో- టైగర్ రేంజ్ కంట్రీస్ విషయంలో- పులుల సంతతిని పరిరక్షించుకోవడమనేది ప్రతీకాత్మకంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదని నేను భావిస్తున్నాను. ఈ దిశగా కృషి సాగిన‌ప్పుడు పులులకు నిలయాలుగా ఉండే అరణ్యాల రూపంలో ఒక పెద్ద కార్బన్ సింక్ ఏర్పాటవుతుంది. అదే జరిగితే, పులుల సంరక్షణ మనతో పాటు మన ముందు తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తును సమకూర్చుకోవడంలో ఎంతగానో తోడ్పడగలుగుతుంది.

పులుల సంర‌క్ష‌ణ‌లో భార‌త్‌కు విజ‌యవంత‌మైన రికార్డు ఉంది. 1973లోనే మేం ”ప్రాజెక్టు టైగ‌ర్” కార్య‌క్ర‌మాన్ని ఆరంభించాం. 9 పులుల అభ‌యారణ్యాల‌తో మొద‌లుపెడితే వాటి సంఖ్య ఇప్పుడు 49కి చేరింది. పులుల సంర‌క్ష‌ణ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సంయుక్త కార్య‌క్ర‌మం. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వాల కార్య‌క్ర‌మాల‌ను కూడా అభినందిస్తున్నా. అయితే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేనిదే ప్ర‌భుత్వాల ప్ర‌య‌త్నాలు ఫ‌లితాన్ని ఇవ్వ‌వు. క‌ల‌సి ఉండే మా సాంస్కృతిక‌ నైజం ”ప్రాజెక్టు టైగ‌ర్” విజ‌య‌వంతం అవ‌టానికి దోహ‌ద‌ప‌డింది. ఈ స‌మ‌ష్టి కృషి ఫ‌లితంగా పులుల జ‌నాభా 30 శాతం పెరిగింది. 2010లో 1,706 నుంచి వీటి సంఖ్య 2014లో 2,226కు పెరిగింది.

మా జాతీయ పులుల సంర‌క్ష‌ణ ప్రాధికార మండ‌లి చాలా ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. పులుల అభ‌యార‌ణ్యాల‌లో వేట‌ను నిరోధించ‌టానికి ఆధునిక సాంకేతిక‌త‌ను, ఇన్ ఫ్రారెడ్‌, థ‌ర్మ‌ల్ కెమెరాల‌ను సైతం రోజుకు 24 గంటల సేపూ వినియోగిస్తున్నారు. స్మార్ట్ పెట్రోలింగ్‌, పులుల ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు. పులుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రేడియో టెలిమెట్రీ ని ప్ర‌వేశ‌పెట్టాం. పులుల సంర‌క్ష‌ణ‌కు నిధుల‌ను కూడా రెట్టింపు జేశాం. రూ.185 కోట్ల‌ను రూ.380 కోట్ల‌కు పెంచాం.

అభివృద్ధి, పులుల సంర‌క్ష‌ణ ఒక‌దానికొక‌టి పూర‌కాలుగా సాగుతాయి. పులుల సంర‌క్ష‌ణ అభివృద్ధిని ఆప‌దు. మౌలిక స‌దుపాయాల నిర్మాణంలో జంతుజాలం ప‌రిర‌క్ష‌ణ‌కు స‌రైన ప‌ద్ధ‌తును అవ‌లంబించాలి. స్మార్ట్ గ్రీన్ మౌలిక‌ స‌దుపాయాల‌ను, పులుల సంర‌క్ష‌ణ‌ను అనుసంధానించ‌వ‌చ్చు. ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ విలువ‌ల‌ను దృష్టిలో ఉంచుకొని పులుల‌ను స‌హ‌జ పెట్టుబ‌డిగా భావించాలి. పులుల అభ‌యార‌ణ్యాల‌ను ఆర్థికంగా బేరీజు వేసిన‌ప్పుడు పులుల సంర‌క్ష‌ణ‌తో పాటు ఈ అభ‌యార‌ణ్యాలు ఆర్థిక‌, సామాజిక‌, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక ప్ర‌యోజ‌నాల‌కు కూడా కేంద్ర‌ బిందువుల‌ని తేలింది. వాటినే ప‌ర్యావ‌ర‌ణ సేవ‌లంటాం. కాబట్టి పులుల సంర‌క్ష‌ణ‌ను అభివృద్ధికి ఆటంకంగా కాకుండా మ‌న స‌మ‌గ్రాభివృద్ధికి మార్గంగా నిర్వ‌చించుకోవాలి. ఆర్థిక పెట్టుబ‌డుల‌ను ఎలా కాపాడుకుంటామో, ఈ స‌హ‌జ పెట్టుబ‌డుల‌ను కూడా అలాగే కాపాడుకోవాలి. స‌హ‌జ వ‌న‌రుల ద్వారానే ఆర్థిక వ‌న‌రులు కూడా నిల‌దొక్కుకోగ‌ల‌వ‌ని గుర్తించాలి.

ప్ర‌పంచ వ్యాప్త పులుల జ‌నాభాలో 70 శాతం ఉన్న భార‌తదేశం మిగిలిన దేశాల సంర‌క్ష‌ణ ప్ర‌య‌త్నాల‌కు మేం అండ‌గా నిలుస్తాం. మా వంతు సాయం చేస్తాం. చైనా, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ల‌త మాకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. పులుల సంర‌క్ష‌ణ‌కు ఉమ్మ‌డి కృషిని కొన‌సాగిస్తామ‌ని న‌మ్ముతున్నాను.

పులుల శ‌రీర‌భాగాలు, ఇత‌రాలకున్న డిమాండ్ మనంద‌రి ముందున్న భారీ స‌వాలు. వాటికోసం పులుల‌ను చంప‌టం దారుణం. అడ‌వులు, అందులోని జంతుజాలాన్ని మ‌నం బంధించి ఉంచ‌లేం. అవి స్వేచ్ఛాజీవులు. కాబ‌ట్టి ఈ తీవ్ర‌మైన అంశాల‌పై ప్ర‌భుత్వాల ఉన్న‌త‌స్థాయిలో సంప్ర‌దింపులు అవ‌స‌రం.

అనేక దేశాల‌తో పాటు భార‌త్ కూడా గ్లోబ‌ల్ టైగ‌ర్ ఫోర‌మ్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్య‌దేశం. దీని కేంద్ర కార్యాల‌యం న్యూఢిల్లీలో ఉంది. ప్ర‌భుత్వాల స్థాయిలో ప‌నిచేస్తున్న ఈ ఏకైక సంస్థ గ్లోబ‌ల్ టైగ‌ర్ కౌన్సిల్‌తో ప‌నిచేస్తోంది. ఆతిథ్య దేశంగా మా మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని హామీ ఇస్తున్నాను. అట‌వీ శాఖ సిబ్బంది సామ‌ర్థ్యాన్ని పెంచే క్ర‌మంలో కూడా మేం సాయం చేస్తాం.

అంత‌రించిపోతున్న జీవ‌జాల వాణిజ్యంపై ఇత‌ర‌త్రా అంత‌ర్జాతీయ ఒప్పందాల‌పై మ‌న‌దేశాలు సంత‌కాలు చేశాయి. ఈ సంద‌ర్భంగా మీకు మ‌రో శుభ‌ వార్త చెబుతున్నాను. త్వ‌ర‌లోనే ద‌క్షిణాసియా అభ‌యార‌ణ్య వ్య‌వ‌స్థ ఒప్పందంపై సంత‌కాలు చేయ‌బోతున్నాం.

ఆఖరులో, పులుల సంర‌క్ష‌ణ మ‌న‌కు ఒక అవ‌కాశం కాదు.. అది తప్పనిసరిగా చేపట్టాల్సిన పని అని నేను స్పష్టం చేయదలుస్తున్నాను. అట‌వీ ప్రాంతాలలో నేరాల‌ను క‌ట్ట‌డి చేయ‌టానికి ప్రాంతీయంగా మ‌నం స‌హ‌క‌రించుకోవాలి. ఈ స‌ద‌స్సు ద్వారా పులుల సంర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డ‌తామ‌ని, క‌ల‌సికట్టుగా ప‌నిచేస్తామ‌ని తీర్మానిద్దాం. మీ దేశాల‌న్నింటితోనూ పులుల సంర‌క్ష‌ణ‌లో భార‌త్ భాగస్వామిగా ఉంటుంది.

మీ అంద‌రి రాక‌ను అభినందిస్తూ, ఈ స‌ద‌స్సు విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.