Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

PM's speech during release of former President Shri Ram Nath Kovind's autobiography


  మన పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా, శ్రీమతి సవితా కోవింద్‌ గారు, ఇక్కడ ఆసీనులైన ప్రముఖులందరి పేర్లనూ ప్రస్తావించలేనేమోగానీ,  మీకందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం నిస్సందేహంగా నాకెంతో ఆనందోత్సాహాలనిచ్చే కుటుంబ వేడుకలాంటిది!

సోదరీసోదరులారా!

శ్రీ రామ్‌‌నాథ్‌ కోవింద్ గారి ఆత్మకథను మనం ఇవాళ ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే భాగ్యం దక్కినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. శ్రీ కోవింద్‌తో నాది సుదీర్ఘ కాల అనుబంధం. ఆయనతో సాన్నిహిత్యం, రాష్ట్రపతిగా ఆయన మార్గనిర్దేశం సహా నాపై ఆయన చూపిన అవ్యాజానురాగం, ఆత్మీయత జీవితంలో అనిర్వచనీయ మధురానుభూతిగా, గొప్ప సంపదగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాబోదు. ఆయన జీవిత విశేషాలు, విషయాలు, సామర్థ్యం ఆధారంగా రూపొందిన ఈ ఆత్మకథ భారత ప్రజాస్వామ్యానికి, సమాజానికి గొప్ప వారసత్వ సంపద కాగలదని నేను ఘంటాపథంగా చెప్పగలను. శ్రీ రామ్‌నాథ్‌ జీవన ప్రస్థానం, సమాజం-దేశంపై అంకిత భావంతో ఆయన చేసిన కృషి గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం చాలదు. అయితే, ఈ పుస్తకావిష్కరణ వేళ ఓ పరిచయ ప్రస్తావన అనివార్యం. ఈ పుస్తకం ద్వారా పూర్తి ప్రయోజనం లభించాలంటే మీరు అక్షరం విడవకుండా దీన్ని ఆసాంతం చదవాలి!

మిత్రులారా!

శ్రీ కోవింద్ జీవనయానంలోని విశేషాలను ఈ ఆత్మకథలో తెలుసుకోవడం, ఆయన ఇతర రచనలతోపాటు అనుభవాలను ఆస్వాదించడం ద్వారా నవతరం ఎంతో నేర్చుకోగలదు. విస్తృత అనుభవ సారంతో ఈ ఆత్మకథను మనకు అందించిన శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌కు నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

ఈ పుస్తకానికి “ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్.. మై స్ట్రగుల్స్” (భారత గణతంత్ర విజయం: నా జీవితం-నా సంఘర్షణలు) పేరిట శ్రీ కోవింద్‌ ఎంతో సముచిత శీర్షికనిచ్చారు. తన జీవితం, తానెదుర్కొన్న సంఘర్షణలు ఆయన వ్యక్తిగతమే అయినా, ఆ పోరాటాలతో లభించిన విజయాలు మాత్రం భారత గణతంత్రానికి, ప్రజాస్వామ్యానికి సొంతం.

మిత్రులారా!

విజయం సిద్ధిస్తే… అది తన ప్రతిభేనని, అపజయం ఎదురైతే.. సమాజమే అందుకు కారణమని నిందించడం మానవుల సహజ స్వభావం. అయితే, హృదయ వైశాల్యం, భారతీయ విలువలపై గౌరవంగల వ్యక్తి సమాజం తప్పులు వెదుకుతూ ఎన్నడూ తన సమయం వృథా చేసుకోడు. తనకేది సానుకూలమో దానిపైనే నిశితంగా దృష్టి సారిస్తాడు. అంతేకాకుండా విజయం సాధిస్తే అందులో సగభాగం సమాజానికి పంచుతాడు. శ్రీ కోవింద్ ఆత్మకథ-దాని శీర్షిక ఇందుకు తిరుగులేని నిదర్శనాలు. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఓసారి అవలోకిద్దాం… కాన్పూర్ దేహత్‌లోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన , ఓ మండు వేసవి కాలంలో తమ నివాసం అగ్నిప్రమాదం బారినపడిన వైనాన్ని ఈ పుస్తకంలో వివరించారు. ఆనాడు ఆయన తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా బిడ్డలను, వారి కోసం ఇంట్లో ఉంచిన వస్తువులను బయటకు చేరవేసేందుకు ప్రయత్నించారు. ఒక సాధారణ గృహిణికి ఇంట్లోని ప్రతి చిన్న వస్తువూ తన పిల్లల పోషణకు ఉపయోగపడే ఉపకరణమే. ఆ తపనలో ఆమె తన శరీరం మంటలపాలు కావడం కూడా గమనించలేక ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ఊహించుకోండి- ఒక బాలుడు పసితనంలోనే ఇలా తల్లిని కోల్పోవడం ఎంతటి వేదనను కలిగించి ఉంటుందో! నా అదృష్టం కొద్దీ మా అమ్మ వంద ఏళ్లకు పైగా జీవించి నాకు ఆశీస్సులిస్తూ వచ్చినా, ఆమె లేని వెలితి నాకెన్నటికీ తీరేది కాదు.

మిత్రులారా!

అలాంటి బాధాకర సంఘటనతో ఎవరైనా కుంగిపోతారు… కానీ, శ్రీ కోవింద్ తననుతానే సముదాయించుకున్నారు. ఆయన భవిష్యత్‌ జీవితం పొరుగింటి మహిళ సాయంతో కొనసాగింది. తద్వారా సామాజిక ఐక్యత, సామరస్యం ఎంత శక్తిమంతమైనవో చిన్ననాడే ఆయన అవగతం చేసుకున్నారు. శ్రీ రామ్‌నాథ్‌ తండ్రి కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు. భార్య లేని లోటును భరిస్తూనే కుటుంబాన్ని నడిపించిన తీరు, పిల్లలకు నేర్పిన విలువలు చాలా గొప్పవి- కనుకనే శ్రీ కోవింద్ తన తండ్రే తన హీరో అని చెబుతారు.

మిత్రులారా!

బాల్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, విద్యాభ్యాసమే తనను దృఢంగా నిలుపుతుందని శ్రీ కోవింద్ గ్రహించారు. ఆ మేరకు కఠోరంగా శ్రమించారు.. వనరుల కొరత ఆయన పురోగమనాన్ని అడ్డుకోలేకపోయింది. అప్పట్లోనే ఎవరూ ఊహించనంతటి ఉన్నత స్థాయికి ఎదిగి… భారత్‌ వంటి సువిశాల దేశానికి రాష్ట్రపతి అయ్యారు.

మిత్రులారా!

దేశంలో అత్యున్నత పదవిని అధిష్టించినా, శ్రీ కోవింద్‌ వినమ్ర స్వభావం, నిరాడంబర జీవన శైలి చెక్కుచెదరలేదు. నాకింకా గుర్తుంది.. ప్రధానమంత్రిగా ఆయనను రాష్ట్రపతి భవన్‌లో కలవడానికి వెళ్లినపుడు అధికారిక విధివిధానాలకు అతీతంగా ఆదరించేవారు. నేను తిరిగి వెళ్లే సమయంలో కారుదాకా వచ్చి మరీ, వీడ్కోలు పలికేవారు. అలా చేయవద్దని ఎన్నోసార్లు నేను కోరినా, తన పదవీకాలం పూర్తయ్యేదాకా ఈ అలవాటును ఆయన మానుకోలేదు. రాష్ట్రపతి హోదాలో తన స్వగ్రామం ‘పరోంఖ్’ వెళ్లినపుడు తన చిన్ననాటి  ఉపాధ్యాయుల పాదాలంటి మరీ, గురువులపై తనకుగల గౌరవాన్ని చాటుకున్నారు. గ్రామంలో భూమాతకు ప్రణమిల్లి, అక్కడి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ భావోద్వేగ దృశ్యాన్ని యావద్దేశం చూసింది. ప్రతి భారతీయుడూ గర్వపడే భారతీయ విలువలను ఆయన నడవడికే ప్రపంచానికి చాటిచెప్పింది.

మిత్రులారా!

శతాబ్దాల తరబడి సాగిన పరాయి పాలనలో మన దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయింది. స్వాతంత్ర్యం కోసం మన పూర్వికులు నిరంతరం పోరాడుతూ వచ్చారు. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి ఎందరో మహనీయులు నవ భారతం కోసం ఎన్నో కలలు కన్నారు. నిరుపేదలు, అణగారిన వర్గాల వారందరూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. వారి బాటలోనే శ్రీ కోవింద్ వంటి ఎందరో వ్యక్తులు కఠోర శ్రమ, దీక్షతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి మహనీయుల స్వప్న సాకారంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే బాటలో మేం కూడా కృషి చేస్తున్నాం. మనకిప్పుడు శ్రీ కోవింద్ తరహా భావితరం- సమస్యలకు వెరవని, కష్టాలకు తలవంచని, కఠోర శ్రమతో ప్రతి లక్ష్యాన్ని సాధించగల సాహస యువత ఎంతో అవసరం. బలమైన భారత్‌ రూపకల్పన సంకల్పాన్ని ఈ మార్పు సుసాధ్యం చేస్తుంది. తద్వారానే స్వయంసమృద్ధ, వికసిత భారత్‌ ప్రస్థానానికి మార్గం సుగమమవుతుంది.

మిత్రులారా!

అటువంటి యువశక్తికి రూపుదిద్దడంలో శ్రీ కోవింద్ ఆత్మకథ ఓ కీలక స్ఫూర్తిదాయక ఉపకరణంగా ఉపయోగపడుతుంది.

మిత్రులారా!

పూర్వ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్‌తో తన అనుభవాలను కూడా శ్రీ కోవింద్ తన ఆత్మకథలో విశదీకరించారు. మొరార్జీతో కలిసి పనిచేసినప్పటి అనుభవాలు, ఆయనలోని దేశ సేవానిరతి, తాను నేర్చుకున్న విషయాలు- వీటన్నింటి ద్వారా శ్రీ కోవింద్ రాజకీయాలను, సామాజిక సేవను తన జీవన మార్గంగా మలచుకున్నారు. ఈ క్రమంలో తన విధులకు అంకితభావంతో కట్టుబడి, ప్రజాసేవనే లక్ష్యంగా ఎంచుకున్నారు. పార్లమెంటులో ఆయన పదవీకాలం ఇందుకొక ఉదాహరణ. అలాగే, గవర్నర్‌గానూ ఆయన అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారు. రాష్ట్రపతి పదవిలోనూ అదే అంకితభావాన్ని మనమంతా ప్రత్యక్షంగా గమనించాం. అలాంటి అత్యున్నత పదవీ కాలం పూర్తయ్యాక కూడా వారు విశ్రాంతి తీసుకోవాలని భావించలేదు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వంటి కీలకాంశాలపై ఇప్పటికీ వారు అధ్యయనం కొనసాగిస్తూ దేశాన్ని చైతన్యవంతం చేస్తున్నారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే- అది భారతీయ ప్రజాస్వామ్యంలో అదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. శ్రీ కోవింద్ అంకితభావం, సేవానిరతి నుంచి దేశ ప్రజలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

సామాజిక జీవనంలో ఇంత చురుగ్గా ఉంటూనే, ఆత్మకథ రాసేందుకు సమయం కేటాయించడం అంత సులభమేమీ కాదు. అయితే, మనందరి కోసం శ్రీ కోవింద్ అందుకు కృషి చేశారు. తన జీవితంలో పేద, వెనుకబడిన వర్గాల ప్రజల జీవన స్థితిగతులను ప్రతిబింబించే విషయాలు ఎన్నో ఉండటమే ఇందుకు కారణం. ఒక సామాన్య కుటుంబం ఎన్నో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ఎన్నడూ రాజీ పడకుండా స్వచ్ఛమైన జీవనం, నిండు నిజాయితీని కొనసాగించడం ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. ఇలాంటి ఆదర్శాలే మన భవిష్యత్‌ జీవన పునాదిగా మారుతాయి. కష్టకాలంలో మనం పాటించిన విలువలు జీవితాంతం మనకు వెలుగుబాట చూపుతాయి. ఈ మానసిక స్వచ్ఛత జాతి సేవకు ఎంతో బలాన్నిస్తుంది. కాబట్టే, వివిధ పదవీ బాధ్యతలలో తలమునకలైనప్పటికీ సమాజానికి శ్రీ కోవింద్ నిరంతరం స్ఫూర్తినిచ్చారు.

మిత్రులారా!

స్వీయ జీవిత జ్ఞాపకాలను మాత్రమే కాకుండా, మన ప్రజాస్వామ్య సంబంధిత ముఖ్యమైన స్మృతులను కూడా శ్రీ కోవింద్ ఆత్మకథ మనకు అందిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఆత్మకథ రచనకుగాను మరోసారి ఆయనకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా యువతరాన్ని నేను కోరేదొకటే- ఇది రీల్స్ యుగం.. సామాజిక మాధ్యమాల్లోని ప్రభావశీలురు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తారు. అయితే, దగ్గరి దారుల శకంలో ఒక వాస్తవాన్ని మీరు సదా గుర్తుంచుకోవాలి. రైల్వే స్టేషన్లలో వంతెన మీదుగా పట్టాలు దాటాలని స్పష్టంగా హెచ్చరిక కనిపిస్తుంది. కానీ, కొందరు అలా కాకుండా పట్టాల మీదకు దూకి దాటే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడుతుంటారు. ఈ సందర్భంగా యువతకు నా మాటగా చెబుతున్నా- మీరు దగ్గరి దారులు వెదకాలనుకున్నా- మొదట మీరు ఆరాధించే వారి ఆత్మకథలను చదవండి. అవి చరిత్రకు చాలా దగ్గరగా ఉంటాయి. భిన్న చారిత్రక సంఘటనలను విభిన్నంగా అర్థం చేసుకునే అవకాశాన్నిస్తాయి. అందుకే శ్రీ కోవింద్ కృషి భవిష్యత్తరాలకు… ముఖ్యంగా యువతరానికి ప్రయోజనం చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను.

అనేకానేక అభినందనలు.. ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

****