పిఎంఇండియా
భారత పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డిజిసిఏ), ఫ్రాన్స్ కు చెందిన పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్షన్ జనరలే డి ల ఏవియేషన్ సివిలే (డిజిఏసి) మధ్య సహకారానికి కుదిరిన అవగాహనా ఒప్పందానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఏఓ) సిఫారసులు, ప్రమాణాల అమలుకు సాంకేతిక పరిజ్ఞానం అందించుకోవడం ఈ ఒప్పందం లక్ష్యం.
రెండు ప్రభుత్వాలు ఈ సహకారానికి ఆమోదముద్ర వేసిన అనంతరం సంతకాలు చేసే ఈ ఒప్పందం నాలుగు సంవత్సరాల కాలం అమలులో ఉంటుంది.
డిజిసిఏ అధికారుల నైపుణ్యాలు, అనుభవం మరింతగా పెంచుకోవడానికి ఈ సాంకేతిక సహకార ఒప్పందం దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఉభయ సంస్థలు ఇంజనీర్లు, టెక్నీషియన్లు, మేనేజర్లకు శిక్షణ ఇవ్వడంలో సహకరించుకుంటాయి.
ఇది కాకుండా డిజిఏసి, డిజిసిఏల ఉమ్మడి ప్రయోజనాల పరిధిలో ఏ విభాగంలో అయినా సహకరించుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ దిగువ విభాగంలో ఆ సహకారం ఉంటుంది…
ఎ) ఒప్పందంలోని లక్ష్యాల సాధన కోసం అవసరమైన వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఇచ్చి పుచ్చుకోవడం
బి) శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఫ్రెంచి నిపుణులను భారత్ కు పంపడం
సి) శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం భారత్ కు చెందిన నిపుణులను ఫ్రాన్స్ కు పంపడం
భారత్ లో డిజిసిఏ, ఫ్రాన్స్ లో డిసిఏసి నిర్వహించే విధులను పరస్పర అంగీకారంతో కొనసాగించుకోవడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.