Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన మహిళా-శిశు అభివృద్ధిపై శాఖాపరమైన జాతీయ సదస్సు సమాపన సమావేశం

ప్రధానమంత్రి అధ్యక్షతన మహిళా-శిశు అభివృద్ధిపై శాఖాపరమైన జాతీయ సదస్సు సమాపన సమావేశం


మహిళా-శిశు అభివృద్ధిపై న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో నిర్వహించిన శాఖాపరమైన జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

 

ప్రధానమంత్రి నిర్దేశం మేరకు సాగుతున్న శాఖాపరమైన సమీక్షలలో భాగంగా ఈ రెండు రోజుల సదస్సును నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాలుపంచుకున్నారు. బాలల పోషణ-రక్షణ, బాల్యదశ సంరక్షణ సహా మహిళల భద్రత-సాధికారతపై ఈ సదస్సు కూలంకషంగా చర్చించింది. అలాగే, మరింత సమన్వయంతో సేవాప్రదాన బలోపేతంపై నిర్దిష్ట చర్యలపైనా దృష్టి సారించింది.

 

అనేక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాత్మకత ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్ఫుటం చేశారు. జిల్లాలు, నగర-మహానగర పాలికల స్థాయిలో ఇలాంటి పునఃసమీక్ష కార్యక్రమాల నిర్వహణ ద్వారా రాష్ట్రాలు ఈ నమూనాను మరింత విస్తరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాల ఆదానప్రదానానికి వీలుగా అంగన్‌వాడీ కార్యకర్తల కోసం ప్రత్యేక అధ్యయన శిబిరాలను కూడా నిర్వహించాలని కోరారు.

 

జన భాగస్వామ్య ప్రాధాన్యంతో అంగన్‌వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా రూపుదిద్దాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అంగన్‌వాడీల పరిసరాల్లో నివసించే కుటుంబాలు కూడా ప్రత్యేక సందర్భాలలో ఈ కేంద్రాల్లోని పిల్లలకు తమ వంతు సహాయం అందించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇందులో భాంగా పౌష్టికాహారం, బొమ్మలు, స్థానికంగా ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేసేలా చూడాలన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలతో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మరింత మమేకం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు సమీప అంగన్‌వాడీలను దత్తత తీసుకుని, సామాజిక ప్రభావ అధ్యయనాలు చేపట్టవచ్చున్నారు. తద్వారా అక్కడి బాలలకు విద్యార్థులు తమ వంతు సహకారం అందించగలరని చెప్పారు. దీంతోపాటు సేవా ప్రదాన విధానాల మెరుగు దిశగా అభిప్రాయాలు, ఆలోచనలను సమీకరించవచ్చుని ఆయన అన్నారు. అంతేకాకుండా వైద్య విద్యార్థులు సహా ‘ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ’ కార్యకర్తలను కూడా అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక కార్యక్రమాలతో అనుసంధానించవచ్చని తెలిపారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర వికాసంపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు.

 

మహిళల భద్రత సంబంధిత అంశాలపైనా ప్రధానమంత్రి ఈ సమావేశంలో చర్చించారు. మహిళలకు భద్రత-గౌరవం, సాధికారతలపై బాలల్లో అవగాహన పెంచేందుకు వారి వయోవర్గానికి తగిన పాఠ్యాంశాలను రూపొందించాలని ఆయన సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యంతో వివిధ శాఖలు సమన్వయ సహిత కృషితో నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

 

పరిశుభ్రత, ఆరోగ్యం, పోషణల మధ్య సన్నిహిత సంబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశవ్యాప్తంగా గల మహిళా-శిశు అభివృద్ధి శాఖలు స్వచ్ఛత భారత్‌ అభియాన్‌ను తమ బాధ్యతగా పరిగణించి అమలు చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రత ద్వారానే మంచి ఆరోగ్యం, పోషణ సాధ్యమని, అందువల్ల ఈ ప్రవర్తనాత్మక మార్పు దిశగా ప్రోత్సాహంలో అంగన్‌వాడీ కేంద్రాలు, పరిసర ప్రజానీకం కీలక వేదికలు కాగలవన్నారు.

 

మహిళా సాధికారత లక్ష్యంగా ‘స్థానికం కోసం నినాదం, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ వంటి జాతీయ కార్యక్రమాల అమలును ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. స్థానిక ఉత్పత్తులు, జీవనోపాధి, ఆర్థిక సాధికారత బలోపేతంలో మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ప్రధాన భాగస్వాములు కాగలవని ఆయన అన్నారు.

 

సమాజంలోని అత్యంత భారీ, కీలక వర్గాల సంక్షేమం బాధ్యతను కేంద్ర, రాష్ట్రాల్లోని మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు అప్పగించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. నేటి అంగన్‌వాడీలలో ఎదిగే బాలలే రేపటి యువతరంగా, బాధ్యతగల పౌరులుగా వికసిత భారత్‌ స్వప్న సాకారానికి సారథ్యం వహిస్తారని ఆయన ప్రస్ఫుటం చేశారు.

****