పిఎంఇండియా
భారత్లో అధికారిక పర్యటన సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి సమావేశమయ్యారు.
జూలై 2026లో జరిగిన 16వ భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయి తకైచీతో తాను జరిపిన విస్తృత చర్చలను ప్రధాని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారం నిరంతరం బలోపేతం అవుతున్న తీరును ఆయన ప్రశంసించారు.
భారత్, జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన దార్శనికతను ప్రధానమంత్రి వివరించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, అంకుర సంస్థలతో సహ అభివృద్ధి, సహ ఉత్పత్తి కోసం జపాన్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు.
ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రికి రక్షణ మంత్రి కొయిజుమి వివరించారు. భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు జపాన్ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Pleased to receive Defence Minister of Japan Shinjiro Koizumi. Had an excellent conversation on deepening defence and security ties between India and Japan. Our Special Strategic and Global Partnership is an important anchor for peace, stability and prosperity in the Indo-Pacific… pic.twitter.com/jHbV6cd6fG
— Narendra Modi (@narendramodi) August 20, 2026