పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తోపాటు మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) సంస్థకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 06.08.2039 తర్వాత కూడా పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని వాణిజ్య కార్యకలాపాల ఆరంభ తేదీ (సీఓడీ) నుంచి 30 ఏళ్ల పాటు ఒప్పంద సంస్థ ‘జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్’ (జీఎన్‌ఐఏఎల్)కు నిర్వహణ లైసెన్స్ కింద ‘ఎంఐఎల్’ అప్పగిస్తుంది.
“మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్ ఎట్ నాగ్‌పూర్ (మిహాన్) ప్రాజెక్ట్” కింద నాగ్‌పూర్ విమానాశ్రయం ఒక ప్రాంతీయ విమానయాన కూడలిగా రూపొందడంలో ఈ నిర్ణయం కీలక మలుపుగా నిలుస్తుంది.
ఏఏఐ, ‘మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్’ (ఎంఏడీసీ)లు 49:51 శాతం వాటా నిష్పత్తితో ‘ఎంఐఎల్’ పేరిట ఒక సంయుక్త వాణిజ్య సంస్థ (జేవీసీ)ని ఏర్పాటు చేశాయి. నాగ్‌పూర్‌లో విమానాశ్రయ నిర్వహణకు 2009లో ఏఏఐ ఆస్తులను ‘ఎంఐఎల్’కు బదిలీ చేసినప్పటికీ, భూ హద్దుల నిర్ధారణలో సమస్యల వల్ల లీజు దస్తావేజు సిద్ధం కావడంలో జాప్యం చోటుచేసుకుంది. అయితే, ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తికావడంతో ‘ఏఏఐ’ తన పరిధిలోని భూమిని 06.08.2039 వరకూ లీజు కింద ‘ఎంఐఎల్’కు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద విమానాశ్రయ నిర్వహణ కోసం 2016లో భాగస్వామ్య సంస్థ కోసం ‘ఎంఐఎల్’ అంతర్జాతీయ టెండర్ ద్వారా ఆహ్వానం పలికింది. ఈ టెండర్ల ప్రక్రియలో ‘జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్’ (జీఏఎల్) 5.76 శాతం ఆదాయ వాటా ప్రతిపాదనతో విజేతగా నిలిచింది. అనంతర కాలంలో ఈ వాటాను స్థూల ఆదాయంలో 14.49 శాతానికి సవరిస్తూ 2020 మార్చి నెలలో ‘ఎంఐఎల్’ బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ‘జీఏఎల్’ బాంబే హైకోర్టులో సవాలు చేయగా, అనుకూల తీర్పు రావడంతో ‘ఎంఐఎల్’ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పును సమర్థిస్తూ 2024 సెప్టెంబరు 27న ఉత్తర్వులిచ్చింది. దీనికి అనుగుణంగా అదే ఏడాది అక్టోబరు 8న మరో ‘జేవీసీ’ అయిన ‘జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్’తో ‘ఎంఐఎల్’ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
నాగ్‌పూర్ విమానాశ్రయానికి నవ శకారంభం
ఈ నేపథ్యంలో ‘ఎంఐఎల్’కు లీజుకిచ్చిన ‘ఏఏఐ’ భూమి లీజు వ్యవధిని 06.08.2039 తర్వాతి కాలానికీ పొడిగించడం ద్వారా ‘జీఎన్‌ఐఏఎల్’ 30 ఏళ్ల ఒప్పంద కాలంతో అది సమానమవుతుంది. తద్వారా రెండో ‘జేవీసీ’గా ‘జీఎన్‌ఐఏఎల్’కు విమానాశ్రయం అప్పగింత సౌలభ్యం కలుగుతుంది. ఈ పరిణామం నాగ్‌పూర్ విమానాశ్రయ వృద్ధితోపాటు మౌలిక సదుపాయాల ప్రగతిలో నవశకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ కింద ప్రైవేట్ రంగ సామర్థ్యంతో విమానాశ్రయ నిర్వహణ వల్ల ఆధునికీకరణ, ప్రయాణిక-సరకు రవాణా సేవలు విస్తృతం కావడంతోపాటు పెట్టుబడులు గణనీయంగా వస్తాయని అంచనా. విమానయాన రంగంలో పటిష్ట మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వ సానుకూల దృక్కోణాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయికి చేర్చేందుకు ‘జీఎన్ఐఏఎల్’ కృషి చేస్తుంది. దీంతో మధ్య భారతంలో ఇదొక కీలక విమానాశ్రయంగా నిలవడమే కాకుండా దశలవారీ అభివృద్ధి ద్వారా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల నిర్వహణ సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. ఈ రూపాంతరీకరణతో విదర్భ ప్రాంతంలో అనుసంధానం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక మౌలిక సదుపాయాలు బలోపేతమై, సరకు రవాణా నిర్వహణ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది.
***