Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌గ‌తి మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

ప్ర‌గ‌తి మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు స‌మాచారం మ‌రియు క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (ఐ సి టి) ఆధారిత‌మైన మ‌ల్టి -మాడ‌ల్ ప్లాట్‌ఫామ్ ఫ‌ర్ ప్రో యాక్టివ్ గ‌వ‌ర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేష‌న్ (పి ఆర్ ఎ జి ఎ టి ఐ.. ‘ప్ర‌గ‌తి’) మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించిన 13వ స‌మీక్ష స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఆరంభంలో, ప్ర‌ధాన మంత్రి వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను ప‌రిశీల‌న మ‌రియు ప‌రిష్కారం దిశ‌గా సాగుతున్న పురోగ‌తిని స‌మీక్షించారు. ఇంకా ఇ-కామ‌ర్స్ రంగానికి సంబంధించిన ఫిర్యాదులు.. ఉదాహ‌ర‌ణ‌కు టికెట్ల న‌మోదు, హోట‌ల్ రిజ‌ర్వేష‌న్లు వంటి వాటికి సంబంధించినవి.. పెద్ద సంఖ్య‌లో పేరుకుపోతున్నాయేమిటని ప్ర‌ధాన మంత్రి సంబంధిత అధికారుల‌ను అడిగారు. ఇటువంటి అంశాల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన వాక‌బు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రికి అధికారులు వారు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. ఈ చ‌ర్య‌ల‌లో నేష‌న‌ల్ క‌న్స్యూమ‌ర్ హెల్ప్ లైన్ సామ‌ర్థ్యాన్ని విస్త‌రించ‌డం వంటివి ఉన్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి దృష్టికి వారు తీసుకువ‌చ్చారు. సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుకొని, వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను ఇంకా కాస్త‌ దీటుగా ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేయవలసిందంటూ అధికారులకు ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఈ క్ర‌మంలో ఏయే విధమైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌దీ స‌మ‌గ్రంగా స‌మీక్షించ‌వ‌ల‌సిందిగా, జ‌వాబుదారుత‌నాన్నిఖ‌రారు చేసే దిశ‌గా చొర‌వ చూప‌వ‌ల‌సిందిగా, ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను గుర్తించ‌వ‌ల‌సిందిగా ప్రధాన మంత్రి స‌ల‌హాలిచ్చారు.

పది రోజుల లోప‌ల త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను చేపట్టాలని కూడా ఆయ‌న వారితో చెప్పారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, బిహార్‌, ఒడిశా మ‌రియు ఉత్త‌రాఖండ్‌లు స‌హా ప‌లు రాష్ట్రాల‌లో కొన‌సాగుతున్న‌ ర‌హ‌దారి, రైల్వే, విద్యుత్‌, బొగ్గు ఇంకా గ‌నుల వంటి రంగాలలోని కీల‌కమైన మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ పురోగ‌తి ఎలా ఉన్న‌దీ ప్ర‌ధాన మంత్రి ఆరా తీశారు.

దేశ‌వ్యాప్తంగా సౌర శ‌క్తితో ప‌నిచేసే పంపులను అమ‌ర్చే ప‌ని ఎలా సాగుతున్న‌దీ ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. 208 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన సోలార్ పంపుల‌ను దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ఇప్ప‌టికే అమ‌ర్చిన విష‌యాన్నిఈ సమావేశంలో పరిగణనలోకి తీసుకున్నారు. ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ఝార్ ఖండ్‌, తెలంగాణ‌, పంజాబ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్ ఇంకా ఉత్త‌రప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో వివిధ అంశాల‌పై మాట్లాడారు. ఈ క్రమంలో దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఇంకా న‌క్స‌లైట్ బాధిత ప్రాంతాలు, మ‌రీ ముఖ్యంగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ లోని ద‌క్షిణ బ‌స్త‌ర్ ప్రాంతంలో ప‌రిశుభ్ర‌మైన త్రాగునీటిని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో సోలార్ పంపులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్న సమాచారాన్ని ఆయ‌న‌ అందుకున్నారు.

వ‌ర‌ద‌ల స‌మ‌యంలో తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల స‌మీక్ష సంద‌ర్భంగా ఏయే ప్రాంతాలు వ‌ర‌ద‌ల బారిన ప‌డే స్థితి ఉన్న‌దీ రాష్ట్రాలు గుర్తించాల‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద‌ల వేళ చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి న‌మూనా అభ్యాసాల‌ను నిర్వ‌హించ‌డంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఇసుక పూడిక తీత ప‌నుల‌ను శ్ర‌ద్ధ‌గా కొన‌సాగించాల‌ని, ఇంటువంటి ప‌నులు ఎంత స‌మ‌ర్ధంగా నెర‌వేరుస్తూ పోతే వ‌ర‌దల స‌మ‌యంలో రంగంలోకి దిగాల్సిన యంత్రాంగం అంత చ‌క్క‌గానూ ప‌నిచేయ‌గ‌లుగుతుంద‌ంటూ ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. అలాగే, నీటిని పొదుపుగా వాడుకొనే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు.

***