పిఎంఇండియా
రానున్న నాలుగు సంవత్సరాలలో అంటే 2016 నుండి 2020 మధ్య కాలంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పి ఎమ్ కె వి వై)లో భాగంగా రూ.12,000 కోట్ల ఖర్చుతో ఒక కోటి మంది ప్రజలకు నైపుణ్యాలలో శిక్షణను ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. పి ఎమ్ కె వి వై లో భాగంగా 60 లక్షల మంది యువతీయువకులకు తాజాగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే గుర్తింపు పొందిన ముందస్తు బోధన (ఆర్ పి ఎల్) ద్వారా అనియత రంగాలలో శిక్షణ తీసుకున్న 40 లక్షల మందికి సర్టిఫికెట్లు కూడా అందించనున్నారు. తాజా శిక్షణకు, ఆర్ పి ఎల్ కు మధ్య లక్ష్యాల కేటాయింపు అనేది ఆయా విధులను బట్టి, కార్యకలాపాలను కొనసాగించవలసిన అవసరాలను బట్టి సవరించుకోవడానికి, ఒకదానితో మరొకటి సర్దుబాటు చేసుకోవడానికి అనువుగా ఉండబోతోంది.
ఈ స్కీమ్ గతంలో నోటిఫై చేసిన ఉమ్మడి నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంది. అలాగే స్కీమ్ గ్రాంట్ ఆధారిత నమూనాగా మారుతుంది. శిక్షణ, అసెస్ మెంట్ వ్యయాలను ఆయా శిక్షణ సంస్థలు, అసెస్ మెంట్ సంస్థల ఖాతాలో నేరుగా జమ చేస్తారు.
శిక్షణ పొందుతున్న యువతకు ప్రయాణ భత్యం, భోజనం, బసకు అవసరం అయిన వ్యయాల కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. పోస్ట్ ప్లేస్ మెంట్ మద్దతును లబ్ధిదారులకు ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ (డి బి టి) విధానంలో అందిస్తారు. మరింత పారదర్శకత్వం కోసం, ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం కోసం శిక్షణ వ్యయాల చెల్లింపును ఆధార్ కార్డు, ఇంకా బయోమెట్రిక్స్ తో జోడించడం జరుగుతుంది. జాతీయ నైపుణ్యాల అర్హత విధానాలతో (ఎన్ ఎస్ క్యుఎఫ్) అనుసంధానిత పరిశ్రమల రంగం నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా నైపుణ్యాలలో శిక్షణ ఇస్తారు.
నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేసిన ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫారసులకు అనుగుణంగా భిన్న రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా నిపుణులను తయారుచేసేందుకు ఈ కార్యక్రమంలో రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేస్తారు. ప్రాజెక్ట్ ఆధారిత విధానం కింద దీనిని అమలు చేస్తారు. ఇందుకు అనుగుణంగా 25 శాతం ఆర్థిక, భౌతిక లక్ష్యాలను రాష్ట్రాలకు కేటాయిస్తారు. పి ఎమ్ కె వి వై రెండో దశ కింద అమలుపరిచే ఈ స్కీమ్ లో రాష్ట్రాలకు పంచే 25 శాతం లక్ష్యాల సాధనకు అవసరం అయిన నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తారు.
రోజ్ గార్ మేళాలు, కౌశల్ శిబిరాల ద్వారా నిపుణుల సమీకరణ, పర్యవేక్షణ, శిక్షణ అనంతర నియామకాలను నిర్వహిస్తారు. ఉమ్మడి నిబంధనలతో అనుసంధానం చేసిన ప్రోత్సాహకాలు/ డిస్ ఇన్ సెంటివ్స్ ప్రాతిపదికన శిక్షణార్థుల నియామకం జరుగుతుంది. సంప్రదాయిక ఉద్యోగాలలో కూడా అనియత శిక్షణ విధానాన్ని అమలుపరచాలని ప్రతిపాదించారు. దేశీయ నైపుణ్యాల అవసరాలతో పాటుగా గల్ఫ్, యూరప్ లతో సహా భిన్న దేశాలలో ఉద్యోగాలకు వెళ్ళే వారి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం గల విభాగాలలో శిక్షణ పొందే వారికి ఉపకార వేతన ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.