పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టుకు చెందిన 14.86 హెక్టార్ల భూమిని నౌకాయాన శాఖ పరిధిలోని జలరవాణా ప్రాధికార సంస్థకు.. ప్రస్తుతమున్న జలరవాణా వ్యవస్థకు సమాంతరంగా కొత్త వ్యవస్థ నిర్మాణం కోసం అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు కింది విధంగా ఉన్నాయి:-
i. కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి, గంగానది శుద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్టు (ఎఫ్‌బీపీ)కి చెందిన 14.86 హెక్టార్ల భూమిని.. ఫరక్కా బ్యారేజీ వద్ద జలరవాణామార్గ నిర్మాణానికి కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు అప్పగించటం.
ii. ఈ స్థలం విలువ రూ. 2,35,80,160/- (రెండు కోట్ల 35 లక్షల 80 వేల, ఒకవంద అరవై రూపాయలు). కేంద్ర జలరవాణా ప్రాధికార సంస్థ ఈ ఖర్చును భరిస్తుంది.
iii. జలమార్గ వికాస్ ప్రాజెక్టులో భాగంగా దీని నిర్మాణం జరుగుతుంది. ఎన్‌డబ్ల్యూ-1 (నేషనల్ వాటర్ వే-1) మార్గంలో పెద్ద పడవలకు అవాంతరాల్లేని ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది.
కొత్త జలరావాణా మార్గం నిర్మాణం వల్ల ఒనగూరే ప్రయోజనాలు:-
a) ప్రస్తుతం ఉన్న మార్గం ద్వారా వస్తున్న నౌకలను సమర్థవంతంగా అదుపుచేయటం కష్టమవుతోంది. నౌకలు ప్రాంతానికి వచ్చి వేళ్లేందుకు క్లియరెన్సు వచ్చేంతవరకు చాలా సమయం వేచిచూడాల్సి వస్తోంది. అందువల్ల అదనపు సమాంతర మార్గాన్ని నిర్మించటం తక్షణ అవసరంగా కేంద్రం గుర్తించింది. జలమార్గ్ వికాస్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద కార్గోలు కూడా రవాణా కావటంతోపాటు.. ఎక్కువ సంఖ్యలో నౌకలు వచ్చిపోయేందుకు వీలుంటుంది.
b) ప్రస్తుతం ఉన్న రవాణా మార్గాన్ని నవీకరించటం/ అభివృద్ధి పరచటం/రిపేరు చేయటం ఎక్కువ సమయంతో కూడుకున్నది కావటంతో.. దీని పనికి భంగం కలగకుండా సమాంతరంగా కొత్త మార్గాన్ని నిర్మించటం వల్ల జలరవాణాకు ఆటంకం ఉండదు.
c) కేంద్ర జలరవాణా ప్రాధికార సంస్థ, నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఓ చట్టబద్ధమైన సంస్థ . దేశంలో అంతర్గత జలరవాణాకు సంబంధించిన అన్ని విషయాలను ఈ సంస్థే పర్యవేక్షిస్తుంది. తన పరిధిలోనే కొత్త జల మార్గాల నిర్మాణం, పర్యవేక్షించటం, నిర్వహించటం దీని విధి.
గంగానది జలాల వినియోగంలో ఉండే ఒప్పందాలకు (1996 భారత్-బంగ్లాదేశ్ ఒప్పందం వంటివి) భంగం కలగకుండానే అన్నికార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించటం, పనులను నిర్వహించటం ఈ ప్రాధికార సంస్థ విధుల్లో భాగం.
ఫరక్కాలో జరిగే కొత్త మార్గం నిర్మాణంతోపాటు.. పాత మార్గాన్ని ఆధునికీకరించే పనులను కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. దశలవారిగా నేషనల్ వాటర్ వే -1 కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి, గంగానది శుద్ధి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటుంది.
పూర్వరంగం:
i. నేషనల్ వాటర్ వే -1 ప్రాజెక్టులో భాగంగా కేంద్ర జలరవాణా ప్రాధికార సంస్థ గంగా-భాగీరథి-హూగ్లీ పరిధిలో ‘అలహాబాద్-హల్దియా’ నదీ వ్యవస్థను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో సాంకేతికంగా అభివృద్ధి పరుస్తున్నారు.
ii. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు ఆధీనంలో ఫరక్కా వద్ద 1987 నుంచి జలరవాణా జరుగుతోంది. ఈ మార్గాన్ని నవీకరించాల్సిన అవసరం ఉంది.
iii. ఆగస్టు 2014లో ప్రపంచ బ్యాంకు కూడా.. కొత్త మార్గాన్ని ఏర్పాటుచేసుకోవటంతోపాటు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను నవీకరించుకోవాల్సిన అవసరాన్ని సూచించింది. ఫరక్కా పైనీటి ప్రవాహాన్ని.. కిందినీటి ప్రవాహంతో కలపాలనేదే.. జలమార్గ్ వికాస్ ప్రాజెక్టు లక్ష్యం. అయితే.. ఫరక్కాలో రెండో మార్గం అందుబాటులోకి వచ్చినపుడే ఇది సాధ్యమవుతుంది.