Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్ మాంట్ కూట‌మి స‌చివాల‌యానికి మ‌ద్ద‌తునిచ్చే స‌హ‌కార ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం


బెల్ మాంట్ కూట‌మి స‌చివాల‌యానికి 2015 జ‌న‌వ‌రి నుంచి 2017 డిసెంబ‌రు వ‌ర‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు 40,000 యూరోల అంచ‌నా వ్య‌యంతో ఫ్రెంచ్ నేషనల్ రిసర్చ్ ఏజెన్సీ (ఎఎన్ఆర్)తో స‌హ‌కార ఒప్పందానికి అంగీకారం తెలిపింది. అంతేకాకుండా 2017 త‌రువాత కూడా బెల్ మాంట్ కూట‌మి స‌చివాల‌యానికి ఆర్థిక మ‌ద్ద‌తును కొన‌సాగించేందుకు ఆమోదించింది.

బెల్ మాంట్ కూట‌మి 2009లో ఏర్పాటైంది.. భౌగోళిక ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌పై ప‌రిశోధ‌న‌తో పాటు అంతర్జాతీయ వైజ్ఞానిక మండ‌ళ్ల‌కు నిధులందించే ప్ర‌పంచ అగ్ర, వ‌ర్ధ‌మాన దేశాలతో కూడిన ఉన్న‌త‌ స్థాయి బృందంగా ఇది రూపుదిద్దుకుంది. అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశోధ‌న ప్రాథ‌మ్యాలను గుర్తించి, అధ్య‌య‌నం చేసి, స‌మాజానికి అందించే అవ‌కాశాల‌ను ఈ కూట‌మి క‌ల్పిస్తుంది. ఈ దిశ‌గా అంత‌ర్జాతీయ వ‌న‌రుల స‌మ‌న్వ‌యంతో పాటు స‌హ‌జ‌ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్త‌ల మ‌ధ్య వేగ‌వంత‌మైన బ‌హుళ జాతీయ స‌హ‌కార ప‌రిశోధ‌నల‌ ద్వారా దోహ‌ద‌ప‌డుతుంది.

ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెన‌డా, యూరోపియన్ క‌మిష‌న్, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, నెద‌ర్లాండ్స్‌, ద‌క్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా త‌దిత‌ర దేశాల‌తో పాటు భార‌తదేశం కూడా బెల్ మాంట్ కూట‌మిలో స‌భ్య‌త్వదేశంగా ఉంది. కేంద్ర భూ విజ్ఞాన‌ శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఇఎస్) 2012 నుండి బెల్ మాంట్ కూట‌మిలో భార‌తదేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఈ కూట‌మి కార్య‌కలాపాల‌ను స‌మ‌న్వ‌యం చేసేందుకు ఇందులో స‌భ్య‌త్వదేశాలు వంతుల‌వారీగా దీని స‌చివాల‌యానికి ఆతిధ్య‌మిస్తుంటాయి. ఇందులో భాగంగా 2015 జ‌న‌వ‌రిలో ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఫ్రాన్స్‌లోని ANR సంస్థ 2017 డిసెంబరువ‌ర‌కూ ఆతిథ్య‌మిస్తోంది. ఇందుకయ్యే వ్య‌యాన్ని బెల్ మాంట్ కూట‌మిలోని స‌భ్య‌త్వదేశాలు న‌గ‌దు, ఇత‌ర‌త్రా రూపాలలో భరించాల్సి ఉంటుంది.

ప్ర‌భావం:

కూట‌మి కార్య‌క‌లాపాలు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు, కార్యాచ‌ర‌ణ‌ను స‌జావుగా స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు ఈ ఒప్పందం దోహ‌ద‌ప‌డుతుంది. ఇందులో భాగంగా భార‌తదేశం ఇప్ప‌టికే 4 స‌హ‌కార ప‌రిశోధ‌న కార్యాచ‌ర‌ణ‌ల (సిఆర్ఎ ల)లో భాగ‌స్వామిగా ఉండ‌టంతో పాటు కార్య‌క‌లాపాల‌ను స‌చివాల‌యం స‌మ‌న్వ‌యం చేస్తున్నందున భార‌తదేశ శాస్త్ర ప‌రిశోధ‌న‌ల‌ స‌మాజం ఈ ఒప్పందం వ‌ల్ల ల‌బ్ధి పొందుతుంది.

పూర్వరంగం:

బెల్ మాంట్ కూట‌మి 2009లో ఏర్పాటైన‌ప్ప‌టి నుండి దీనికి అధ్య‌క్ష‌త వ‌హించే దేశ‌పు తాత్కాలిక స‌చివాల‌యం ఆ కార్య‌క‌లాపాల‌ను స‌మ‌న్వ‌యం చేస్తోంది. స‌హాధ్య‌క్ష‌త బాధ్య‌త‌లు వంతుల‌వారీగా చేప‌ట్టే ప‌రిస్థితి ఉన్నందువ‌ల్ల స‌చివాల‌యం కూడా వంతుల‌వారీగా.. కొన్ని సంద‌ర్భాలలో ఇత‌ర ఖండాలకు, కాల మండ‌లాల‌కూ మారుతూంటుంది. కూట‌మి కార్య‌క‌లాపాలు నిరంత‌రాయంగా కొన‌సాగేలా పూర్తి కాల‌పు స‌చివాల‌యాన్ని వంతుల‌వారీగా నిర్వ‌హించేందుకు స‌భ్య‌త్వదేశాలు అంగీక‌రించాయి. ఆ మేర‌కు ఫ్రాన్స్‌కు చెందిన ఎఎన్ఆర్ 2015 జ‌న‌వ‌రి నుండి 2017 డిసెంబ‌రు దాకా బాధ్య‌త‌లు స్వీక‌రించింది.

***