పిఎంఇండియా
బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిప్టింగ్ (బిఇపిఎస్)ను అరికట్టడానికి వీలుగా సంబంధించిన పన్ను ఒప్పంద సంబంధిత చర్యలను అమలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న బహుళ పాక్షిక మహా ఒప్పందపైన సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒఇసిడి / జి 20 బిఇపిఎస్ ప్రాజెక్టు కృషి ఫలితంగా మహా ఒప్పందం ఏర్పడింది. పన్ను నియమాల్లోని లోపాలను, అపసవ్యతలను అడ్డం పెట్టుకొని కొన్ని కంపెనీలు పన్ను ఎగ్గొట్టడానికి వ్యూహాలను తయారు చేసుకొని తమ ఆదాయాలను అతి తక్కువ పన్ను ఉన్న దేశాలకో, అసలు పన్ను లేని దేశాలకో తరలిస్తుంటాయి. ఆ దేశాలలో ఆర్ధిక కార్యక్రమాలు అంతంతమాత్రమే ఉంటాయి; లేదా అసలు ఉండవు. తద్వారా కార్పొరేట్ ట్యాక్స్ ఏ కొంచెం మొత్తమో ఉంటుంది, లేదా అసలు ఉండదు కాబట్టి సదరు కంపెనీలు లబ్ధి పొందుతాయి.
బిఇపిఎస్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికిగాను అంతిమ బిఇపిఎస్ ప్రాజెక్ట్ , 15 చర్యలను గుర్తించింది. అంతిమంగా తయారైన బిఇపిఎస్ ప్యాకేజిని అమలు చేయాలంటే 3 వేల ద్వైపాక్షిక ఒప్పందాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని, చాలా సమయం కూడా పడుతుంది. ఇందుకోసం బహుళ పాక్షిక మహా ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తద్వారా అన్ని ద్వైపాక్షిక పన్ను ఒప్పందాల్లో మార్పులు జరుగుతాయి. అంతేకాదు బిఇపిఎస్ నిరోధక చర్యలను అమలు చేయడం వీలవుతుంది. ఈ ఉద్దేశంతో బహుళ పాక్షిక మహా ఒప్పందాన్ని రూపొందించడానికిగాను తాత్కాలిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా జి 20 దేశాల ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు 2015 ఫిబ్రవరి లో సమావేశమై ఆమోదం తెలిపారు.
పూర్వ రంగం
తాత్కాలిక సంఘం (అడ్ హక్ గ్రూపు) లో భారతదేశం కూడా సభ్యత్వం కలిగివుంది. ఇందులో వంద కు పైగా దేశాలు ఉన్నాయి. జి20, ఒఇసిడి, బిఇపిఎస్ లతో సంబంధమున్న దేశాలు, దీని పట్ల సానుకూలత ఉన్న దేశాలు ఈ సంఘంలో ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా పని చేసి బహుళపాక్షిక మహా ఒప్పంద పత్రాన్ని 2015 మే నాటికి తయారు చేశాయి. మహా ఒప్పంద పత్రంలోని అంశాలు దానితో పాటు వివరాణత్మక ప్రకటనను 2016 నవంబర్ 24న తాత్కాలిక సంఘం ఆమోదించింది.
పన్నుల ఒప్పందాన్నిదుర్వినియోగం చేయడం, తగాదాలను పరిష్కరించుకోవడానికి పరస్పర అంగీకార విధానంలోకి రావడాన్ని నిరోధించడానికిగాను రెండు సాధారణ ప్రమాణాలను ఈ మహా ఒప్పందం అమలు చేస్తుంది. అస్తిత్వంలో ఉన్న ఒక ఒప్పందానికి చెందిన అమెండింగ్ ప్రోటోకాల్ లాగా ఈ మహా ఒప్పందం పని చేయదు. అమెండింగ్ ప్రోటోకాల్ తన పరిధిలో పన్నుల ఒప్పందాల అంశాలను నేరుగా సవరిస్తుంది. అలా కాకుండా ఈ మహా ఒప్పందాన్ని ఇప్పటికే ఉనికిలో వున్న పన్నుల ఒప్పందాలతో పాటు పని చేయించవచ్చు. తద్వారా వాటి అమలులో మార్పులు చేసి బిఇపిఎస్ నిరోధక చర్యలను అమలులోకి తీసుకురావచ్చు. ఈ మహా ఒప్పందం కారణంగా బిఇపిఎస్ ప్రాజెక్టు ను బహుళ పాక్షిక విధానంలో అమలు చేయడంలో నిలకడ, ఖచ్చితత్వం ఉండేటట్లు చూసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన పన్నుల ఒప్పందాన్ని తొలగించే సరళత ఈ మహా ఒప్పందంలో ఉంది. మినహాయింపులు ఇవ్వడం ద్వారా చేకూరే ప్రొవిజన్స్, లేదా వాటిలో కొన్నిటి నుండి వైదొలగడానికి కూడా వీలు ఉంటుంది.
ఆయా దేశాలు సంతకాలు చేయడానికి వీలుగా ఈ మహా ఒప్పందం 2016 డిసెంబర్ 31నుండి అందుబాటు లోకి వచ్చింది. 2017 జూన్ 7న పారిస్ లో మొట్టమొదటి ఉమ్మడి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహా ఒప్పందం పట్ల అంగీకారం తెలపడానికి సంతకాలు చేయడం మొదటి దశ. ఆ తరువాత ఆయా దేశాలు అధికారికంగా ఆమోదం తెలిపిన తరువాత అమలులోకి వస్తుంది. ఈ మహా ఒప్పందం పైన సంతకం చేసే సమయంలో ఆయా దేశాలు అమలులో ఉన్న పన్నుల ఒప్పందాల జాబితాతో పాటు, తమ ప్రాధాన్యాలను అందివ్వాల్సి ఉంటుంది. లేదా రాటిఫికేషన్ ఇన్ స్ట్రుమెంట్ డిపాజిట్ చేసే సమయంలో ఈ పని చేయాల్సి ఉంటుంది.
ఈ మహా ఒప్పదం పైన భారతదేశం సంతకం చేయడానికి వీలుగా మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న పన్ను ఒప్పందాల తాత్కాలిక జాబితాను, తాత్కాలిక సందేహాలు, అనుమానాల జాబితాను తయారు చేసుకోవాలని ప్రతిపాదించడం జరిగింది. వీటిని ఈ ఏడాది జూన్‌లో సంతకాలు చేసే సమయంలో సమర్పించాల్సిఉంటుంది. అయితే వీటి అంతిమ జాబితాలను రాటిఫికేషన్ ఇన్‌స్ట్రుమెంట్ సమర్పించే సమయంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
బహుళ పాక్షిక మహా ఒప్పందం పైన సంతకం చేయడం వల్ల ఇప్పటికే అమలులో ఉన్న పన్నుల ఒప్పందాల్లో మార్పులు చేయడం ద్వారా బిఇపిఎస్ ను నిరోధించే చర్యలను చేపట్టవచ్చు. అది కూడా అతి వేగంగా చేయవచ్చు. బిఇపిఎస్ నిరోధించడానికిగాను పన్నుల విషయంతో భారతదేశంతో ఒప్పందంలో ఉన్న దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగమయ్యేలా భారతదేశం చూడాలి. ఈ మహా ఒప్పందం పైన సంతకం చేయడం వల్ల దేశానికి వచ్చే ఆదాయంలో కోత పడడమనేది తగ్గుతుంది. పన్నుల ఒప్పందాలను ఎగతాళి చేస్తూ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిప్ట్ంగ్‌కు పాల్పడేలా తయారయ్యే వ్యూహాలు కనుమరుగవుతాయి. గణనీయమైన ఆర్ధిక కార్యకలాపాలు ఉన్న చోట ఆయా కంపెనీల లాభాల పైన పన్ను విధించడం ద్వారా ఆయా దేశాలు లబ్ధిని పొందుతాయి. తద్వారా విలువ ఆధారిత ఆర్ధిక కార్యకలాపాలు రూపొందుతాయి.