Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటన్‌ – భారత్‌ సదస్సు 2015 సంయుక్త ప్రకటన (నవంబరు 12, 2015)

బ్రిటన్‌ – భారత్‌ సదస్సు 2015
సంయుక్త ప్రకటన (నవంబరు 12, 2015)

బ్రిటన్‌ – భారత్‌ సదస్సు 2015
సంయుక్త ప్రకటన (నవంబరు 12, 2015)

బ్రిటన్‌ – భారత్‌ సదస్సు 2015
సంయుక్త ప్రకటన (నవంబరు 12, 2015)


భార‌త దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరియు బ్రిట‌న్ ప్రధాన మంత్రి డేవిడ్‌ కేమరాన్‌ నవంబరు 12-13న లండన్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన, గాఢమైన, విస్తృతమైన సంబంధాల స్ఫూర్తి పట్ల ఇరువురు ప్రధానులు హర్షం వ్యక్తం చేశారు. యూకే, భారత్‌ల‌ మధ్య ఉన్న ఈ అనుబంధం ఉభ‌య దేశాల ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో, భద్రతకు భరోసా ఇవ్వడంలో, సుసంపన్నత సాధించడంలో ఎంతో కీలక‌మైన‌ పాత్రను పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థికాభివృద్ధి, ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను విస్తృతం చేస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపుతోంది.

యూకే- భారత్‌ భాగస్వామ్యం నిర్మితమైన మౌలిక సూత్రాల ప్రాతిపదికను ఇరువురు ప్రధానులు దార్శ‌నిక ప‌త్రం (‘విజన్‌ స్టేట్‌మెంట్‌’)లో ఆమోదించారు. పరస్పర సహకారం మరింత విస్తృతమయ్యేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించారు. ఈ భాగస్వామ్యం మరింత ముందుకు వెళుతుండేలా ప్రతి రెండేళ్లకు ఒక సారి ప్రధాన మంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని తీర్మానించారు. దీంతో పాటు… రక్షణ, భద్రత రంగంలో సహకారం బలోపేతమయ్యేలా కొత్తగా ‘డిఫెన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ పార్టనర్‌షిప్‌’ కుదుర్చుకోవాలని కూడా తీర్మానించారు. ఇందులో సైబర్‌ సెక్యూరిటీ, కౌంటర్‌ టెర్రరిజం, తీర ప్రాంత భద్రతలు సైతం భాగంగా ఉంటాయి.

వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారంతో పాటు… సుస్థిర‌మైన‌, భద్రమైన, అందుబాటు ధరలో ఉండే విద్యుత్తును విస్తారంగా అందుబాటులోకి తేవడాన్ని యూకే, బ్రిటన్‌ల ఉమ్మడి ప్రాధాన్యాల్లో ఒకటిగా గుర్తించారు. వాతావరణ మార్పు, ఎనర్జీ అంశాలను సంయుక్త ప్రకటనలో చేర్చేందుకు అంగీకరించారు. ‘మూడో ప్రపంచ దేశాల కోసం భాగస్వామ్య ప్రకటన’ ద్వారా ద్వైపాక్షిక సహకారాన్ని అంతర్జాతీయ భాగస్వామ్యంగా మార్చి… దీని ద్వారా మూడో ప్రపంచ దేశాల భాగస్వాముల అభివృద్ధికి సహకరించాలని, వారు కోరుకున్న మేరకు అంశాల్లో తోడ్పాటును అందించాలని ఇరువురు ప్రధాన మంత్రులు తీర్మానించుకున్నారు.

అంతర్జాతీయ భాగస్వామ్యం

అంతర్జాతీయంగా రోజురోజుకూ సంక్లిష్టమ‌వుతున్న పరిస్థితులు, ఒక దానితో మ‌రొకటిగా ముడిపడిన అంశాల నేపథ్యంలో… యూకే,బ్రిటన్‌ల‌ మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం అవసరమని.. ఇరు దేశాల సుసంపన్నతకు, భద్రతకు ఇది ఎంతో కీలకమని ఇరువురు ప్రధానులు గుర్తించారు.

ఈ సుసంపన్నత, భద్రత అంతర్జాతీయంగా ఆమోదం పొందిన, నెలకొల్పబడిన నియమావళికి అనుగుణంగా ఉండాలని అంగీకరించారు. ఈ అంతర్జాతీయ నియమావళికి ప్రాతిపదిక ఐక్య రాజ్య సమితి రూపంలో 70 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయితే, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అందువల్ల, అంతర్జాతీయ నియమావళికి అనుసరిస్తున్న ప్రాతిపదికను కూడా మార్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో… సంస్కరించబడే ఐక్య రాజ్య సమితి (ఐ.రా.స‌.) భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇస్తామని బ్రిట‌న్ ప్రధాని కేమరాన్‌ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో భారత వాణిని మరింత బలోపేతం చేసేందుకు సహకరిస్తామన్నారు. ఇరువురు ప్రధానులు జి20కి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జి20లోని ఇతర దేశాలతో సన్నిహితంగా మెలుగుతూ… ఈ కూటమిని అంతర్జాతీయ ఆర్థిక సహకార రంగంలో ప్రధాన వేదికగా మార్చాలని, రాబోయే జి20 సదస్సుల్లో విజయవంతమైన ఫలితాలు సాధించాలని తీర్మానించుకున్నారు.

ఆసియాతో పాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో సుస్థిరతపైనా, అభివృద్ధిపై నా బ్రిటన్‌, భారత్‌లు తమ ఆలోచనలను పంచుకున్నాయి. దక్షిణాసియాలో భారత్‌ భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఉన్న నేపథ్యంలో… మొత్తంగా ఈ ప్రాంతంలో ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాలను, సంప్రదింపులను, సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని… దీని కోసం దక్షిణాసియాలో సీనియర్‌ అధికారుల స్థాయిలో వార్షిక సమావేశాలు జరపాలని తీర్మానించారు. ఈ సమావేశాల్లో ఉగ్రవాదం, కనెక్టివిటీ, తీర ప్రాంత అంశాలపై చర్చించాలని నిర్ణయించుకున్నారు.

ఉగ్రవాదం ఏ రూపంలో, ఎలా ఉన్నప్పటికీ ఖండించాల్సిందేనని ఇరువురు ప్రధానులు స్పష్టీకరించారు. ఐరాస ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన సంస్థల విషయంలో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, సమాచారాన్ని పంచుకోవాలని తమ దేశాల అధికారులను ప్రధానులు ఉభ‌యులూ ఆదేశించారు. 2008 నవంబరులో ముంబైలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను శిక్షించాలని ఇరువురు ప్రధానులు పాకిస్థాన్‌కు మరోమారు సూచించారు.
నేపాల్‌లో చోటు చేసుకున్న స్థిరమైన, సమ్మిళిత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ప్రాధాన్యాన్ని ఇరువురు ప్రధానులు గుర్తించారు. దీనివల్ల నేపాల్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అక్కడ రాజకీయ సుస్థిరతకు, ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆకాంక్షించారు. భూకంపంతో విలవిల్లాడిన నేపాల్‌లో ‘నేషనల్‌ రీకన్‌స్ట్రక్ష‌న్‌ అథారిటీ’ సాధ్యమైనంత త్వరగా రంగంలోకి దిగి.. పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తుందనే ఆశాభావాన్నివ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి తీర్మానం నేపథ్యంలో… శ్రీలంక ఇకపై తన ప్రజలకు శాంతి, సుస్థిరతలను అందిస్తుందని ఆకాంక్షిస్తూ, ఈ దిశగా శ్రీలంకకు సహకరించాలన్న తమ నిబద్ధతను ఇరువురు ప్రధానులు ప్రస్తావించారు. మాల్దీవులలోనూ స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటు సుస్థిర, సమ్మిళిత ప్రజాస్వామ్యం అవసరాన్ని నొక్కి చెప్పారు.

సిరియాలో, ఇరాక్‌లో రాజకీయ సుస్థిరత నెలకొల్పాల్సిన అవసరాన్ని ఇరువురు ప్రధాన మంత్రులు గుర్తించారు. అక్కడ జరుగుతున్న భీకరమైన ఘర్షణలకు బాధితులుగా మిగులుతున్న వారిని ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో సీనియర్‌ అధికారుల స్థాయిలో ఏటా జరిగే సమావేశాలను కొనసాగించాలని, ఇది తమ ఇరు దేశాలకు ప్రాధాన్యమైన అంశమని అంగీకరించారు.

ఇరాన్‌ అణు కార్యక్రమంపై కుదిరిన చరిత్రాత్మక ఒప్పందాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారు. దీని సత్వర, సమగ్ర అమలుకు అంతర్జాతీయ సమాజం బలంగా కట్టుబడి ఉండాలన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు ఉపశమించడానికి సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ ‘మిన్స్క్‌’ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం ఒక్కటే మార్గమని ఇరువురు ప్రధానులు అభిప్రాయపడ్డారు.

ట్రాన్స్‌ఫార్మింగ్‌ అవర్‌ వరల్డ్‌:

2030 సుస్థిర అభివృద్ధి కోసం అజెండా (అజెండా ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌)లో భాగంగా 2015 తర్వాత చేపట్టాల్సిన అజెండా ఆమోదం పట్ల ఇరువురు ప్రధానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అజెండా అమలుకు పూర్తిగా సహకరిస్తామని ఉద్ఘాటించారు. 2030 అజెండాలోని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యమున్నట్లు గుర్తించారు.

2015 ఇండియా-యూకే సైబర్‌ డైలాగ్‌లో ప్రగతి పట్ల ఇరువురు ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-గవర్నెన్స్ సమ్మిళిత, పారదర్శక, బహుళ భాగస్వామ్య వ్యవస్థలకు మద్దతు పలికారు. ‘ఇన్‌ఫర్మేషన్‌ సొసైటీ’పై ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రస్తుతం నిర్వహిస్తున్న సమీక్షను స్వాగతించారు. సైబర్‌ సెక్యూరిటీపై కల‌సి పని చేయాలని, సైబర్‌ క్రైమ్‌ను నిరోధించాలని.. సైబర్‌ స్పేస్‌లో స్వచ్ఛందంగా పాటించాల్సిన అంతర్జాతీయ స్థాయి ప్రవర్తనా నియమావళిపై ఉమ్మడి ప్రణాళికను రచించాలని నిర్ణయించుకున్నారు.

టెక్నికల్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సైబర్‌ ఆర్‌ అండ్‌ డీ, సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలు – పరీక్ష, సామర్థ్య నిర్మాణ సంస్థలపై పరస్పర సహకారం పెంపొందించుకోవాలని ఇరువురు ప్రధానులు నిర్ణయించుకున్నారు. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రంగాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అంగీకరించారు. అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీపై ఐరాస ప్రభుత్వ నిపుణుల బృందం రూపొందించిన నివేదిక (2015)ను స్వాగతించారు. ఈ రంగంలో యూకే, బ్రిటన్‌లు ఇక‌పైనా మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తూ, పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు.

కామన్‌వెల్త్‌ కూటమికి ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని ఇరువురు ప్రధానులు మరోమారు బలంగా చెప్పారు. కామన్‌వెల్త్‌ విలువలను పట్టి నిలపాలని… తమ దేశాల పౌరులందరికీ అభివృద్ధి, సుసంపన్నతల‌ ఫలాలను అదించేందుకు తమ నిబద్ధతను ప్రకటించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడాలని… అంతర్జాతీయ స్థాయిలో జరిగే వన్యప్రాణుల అక్రమ వాణిజ్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరాన్ని ఇరువురు ప్రధానులు గుర్తించారు. ఏషియా ఏనుగులను కాపాడేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానించుకున్నారు. వన్యప్రాణుల అక్రమ వాణిజ్యం నియంత్రణల‌పై లండన్‌ డిక్లరేషన్‌ను, కసానె ప్రకటనను భారత్‌ ఆమోదించింది.

ఆర్థికాభివృద్ధి – ఆర్థికం

ఆర్థికాభివృద్ధిపై యూకే, భారత్‌ల దృక్పథం, కార్యాచరణ పట్ల ఇరువురు మోదీ, కేమ‌రాన్‌లు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి ఆశించినంత మేరకు జరగకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా… బలమైన, సుస్థిరమైన‌, సమతుల్య అభివృద్ధి సాధన దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని ఇరువురు ప్రధానులు తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో చేపట్టాల్సిన సంస్కరణలు, ఆర్థిక విధానాల ప్రాధాన్యాన్ని గుర్తించారు. భారత్‌, యూకే ల‌ మధ్య ఉన్న బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని కొనియాడారు. మొత్తం ఐరోపా దేశాల్లో పెట్టిన పెట్టుబడి క‌న్నాఎక్కువగా యూకేలోనే భారత్‌ పెట్టుబడులు ఎక్కువని, అలాగే… జి20 దేశాల్లో భారత్‌లో అత్యధిక పెట్టుబడులు యూకే నుంచే వస్తున్నాయని గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులతో సహా ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎకనమిక్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ డైలాగ్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, చాన్స్‌లర్‌ ఆఫ్‌ ది ఎక్స్‌చెకర్‌ జార్జ్‌ ఓస్‌బర్న్‌లు కృషి చేయాలని ప్రధానులు తీర్మానించుకున్నారు.

వాణిజ్య, పెట్టుబడుల అవకాశాల్లో స్థిరమైన అభివృద్ధికి కల‌సి కృషి చేయాలని యూకే, బ్రిటన్‌లు నిర్ణయించుకున్నాయి. మరీ ముఖ్యంగా, ఇరుదేశాలలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు డిజిటల్ ఇండ‌స్ట్రీస్ ప్రాధాన్యాన్ని గుర్తించాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డాయి. ఈ రంగంలో వస్తువులు మరియు సేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు నిపుణులైన కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ… అంతర్జాతీయ నియమావళికి లోబడి, అవవసరాల మేరకు ఒక దేశ నిపుణులను మరొకరు తాత్కాలికంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించుకోవాలని ఇరు దేశాలు తీర్మానించుకున్నాయి.

కల‌సి.. ముందుకు

రైల్వేలతో సహా భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులను ప్రవహింపజేయడంలో లండన్‌ కీలక భూమిక పోషించాలని ప్రధానులు మోదీ, కామెరాన్‌ అంగీకారానికి వచ్చారు. భారత్‌ వేగవంతమైన అభివృద్ధి పథంలో లండన్‌ పెట్టుబడులు పెట్టే దిశగా దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. బ్రిటన్‌ నుంచి పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి హెచ్‌.డి.ఎఫ్‌.సి., భారతీ ఎయిర్‌టెల్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యెస్‌ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రులు స్వాగతించారు. భారతీయ ప్రైవేటు రంగం అభివృద్ధి కోసం పెట్టుబడులకు ద్వారాలు తెరిచే దిశగా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు సంబంధించి భారత్‌ ప్రతిష్టాత్మ‌క స్థాయిలో ఏర్పాటు చేసిన జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి (ఎన్‌.ఐ.ఐ.ఎఫ్‌) ప్రాతిపదికగా భారత్‌, బ్రిటన్‌ల‌ మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్య నిధి ఏర్పాటుకు ఇరువురు ప్రధానులూ అంగీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు బ్రిటన్‌ ద్వారా భారత్ లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉభయ దేశాల నడుమ ఏర్ప‌డే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని, తద్వారా భారత్‌ సత్వర వృద్ధికి మరింతగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌- బ్రిటన్‌ ఆర్థిక భాగస్వామ్యం ఇప్పటికే ఎంతో విస్తృతమైందని ఉభయ దేశాల పారిశ్రామిక గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయని ఉభయ ప్రధానులూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సేవలను మరింత విస్తృతపరుచుకొనే దిశగా తమ ఆర్థిక భాగస్వామ్య ప్రతిపాదనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో వృత్తిపరమైన శిక్షణను పొందాలనుకునే వారి కోసం స్టాండర్డ్‌ చార్టర్డ్‌ సౌజన్యంతో ప్రారంభమైన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సు పట్ల ఇరువురూ హర్షం వ్యక్తంచేశారు. ఉభయ దేశాల ఆర్థిక విధానాలను బలోపేతం చేసే దిశగా ప్రారంభించిన ఆర్థిక సేవల పరస్పర మార్పిడి కార్యక్రమాన్ని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి పథంలో భారత్‌ సాధిస్తున్న భారీ విజయాలు కేవలం భారత్‌ లక్ష్యాల సాధనకే గాక ప్రపంచ లక్ష్యాల సాధనకు ఎంతో కీలకమని, అవి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఇరువురు ప్రధానులూ అంగీకరించారు. అభివృద్ధి పథంలో భారత్‌, బ్రిటన్‌లు మార్గదర్శకంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. అభివృద్ధిపై ఉభయ దేశాల నడుమ మంత్రుల స్థాయిలో జరుగుతున్న ద్వైవార్షిక చర్చల ప్రక్రియను అధికారుల స్థాయికీ విస్తరించాలని ఇరువురూ నిర్ణయించారు.

సమగ్ర అభివృద్ధి పథంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యంపై ఇరువురు ప్రధానులూ ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. బ్రిటన్‌ అంతర్జాతీయ అభివృద్ధి విభాగం, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సంయుక్త పెట్టుబడితో నెలకొల్పుతున్న తొలి ‘లో ఇన్‌కమ్‌ స్టేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈక్విటీ పార్ట్న‌ర్‌షిప్‌’ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్లీన్‌ ఎనర్జీ, పట్టణ మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో చిన్నపాటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన ఆర్థిక భాగస్వామ్య సహకారం అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

భారత్‌, బ్రిటన్‌ల‌ మధ్య వ్యాపారాన్ని సరళతరం చేసే దిశగా ఉభయ దేశాల నడుమ భాగస్వామ్యం విస్తృతం కావాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఆయన మాటలతో బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ సంపూర్ణంగా ఏకీభవించారు. పెట్టుబడుల విస్తృతే లక్ష్యంగా ‘న్యూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పార్టనర్‌షిప్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఇరువురూ ప్రకటించారు.

పునర్వ్యవస్థీకరించిన భారత్‌-బ్రిటన్‌ సీఈవోల ఫోరం తొలి సమావేశం జరగడంపై ఇరువురు ప్రధానులూ హర్షం వ్యక్తంచేశారు. వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలు-సవాళ్లపై ఉభయ ప్రధానమంత్రులకూ తగిన సలహాలు, సూచనలు అందించడం ఈ ఫోరం ప్రధాన బాధ్యత. భారత్‌తో వాణిజ్యం, బ్రిటన్‌ పెట్టుబడుల విస్తృతికి తోడ్పడే రీతిలో డి.ఐ.పి.పి. నెలకొల్పిన ఫాస్ట్‌ ట్రాక్‌ యంత్రాంగం ఎంతో బాగుందని బ్రిటన్ ప్ర‌ధాని కామెరాన్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు. పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు, డిజైన్లకు సంబంధించి ఇరు దేశాల కార్యాలయాల మధ్య సాంకేతిక సహకారం పెంపొందాల్సిన అవసరం ఉందని ఇరువురు ప్రధానులూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

రైల్వే ప్రాజెక్టుల నిర్వహణ-కార్యకలాపాల రంగంలో బ్రిటన్‌ సాధించిన పురోగతిని భార‌త దేశ ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. రైల్వే రంగంలో సాంకేతిక సహకారానికి కుదిరిన ఎంవోయూ పట్ల ఉభయ ప్రధానులూ హర్షం వ్యక్తంచేశారు. రైల్వే పరిశ్రమలో విస్తృత వ్యాపారానికి మెండుగా అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల రంగంలో మరిన్ని పెట్టుబడి అవకాశాల అన్వేషణ దిశగా ఉభయ దేశాల్లోని సంస్థలు మరింతగా కల‌సి పనిచేయాలని, పరిశోధనను విస్తృతపరచాలని, నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. లండన్‌లో భారత ప్రభుత్వ ‘రూపీ బాండ్‌’లు విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించారు.

భారత్‌లో ఆటోమోటివ్‌ రంగంలో ఆవిష్కరణల ప్రాతిపదికన వృద్ధి దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఉభయ ప్రధానులూ అంగీకరించారు. పరిశోధన-అభివృద్ధి, వాహనాల పరీక్షా వ్యవస్థల విషయంలో సాంకేతిక సహకార మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగాల్లో పరిజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకునే దిశగా కల‌సి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరువురు నేతలూ ప్రకటించారు. ఇందుకోసం ఉభయ ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాలు, ఏజెన్సీల మధ్య ఒక ఎంవోయూను కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చారు.

నిర్దిష్ట నిబంధనలతో కూడిన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ ఆవశ్యకతపై బ్రిట‌న్ ప్రధాని కామెరాన్‌, భార‌త దేశ ప్రధాని మోదీ ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. దోహా అభివృద్ధి ఎజెండాకు అనుగుణంగా డిసెంబరులో నైరోబీలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సదస్సులో ఫలవంతమైన నిర్ణయాలు వెలువడేలా కల‌సి పనిచేయాలని ఇరువురూ అంగీకరించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పురోభివృద్ధికి అవినీతి అనేది ప్రధాన శత్రువుగా మారిందని భారత్‌, బ్రిటన్‌ నేతలు అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా ద్వైపాక్షికంగా కల‌సి పనిచేయడంతో పాటు, ప్రపంచాన్ని ఒక్క తాటి పైకి తెచ్చేందుకు యు.ఎన్‌.సి.ఎ.సి., జీ20 వంటి బహుపాక్షిక వేదికలపైనా కల‌సి కృషి చేయాలని అంగీకారానికి వచ్చారు. చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం, మోసం ద్వారా బదిలీ అయిన ఆస్తుల గుర్తింపు, తిరిగి అప్పగింత, కంపెనీల నిజమైన యాజమాన్యం, నియంత్రణలు ఎవరి చేతిలో ఉన్నాయ‌నే అంశాల‌లో పారదర్శకతను పాటించడం వంటి చర్యల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని అభిప్రాయపడ్డారు.

ఇ.యు.-భారత్‌ బి.టి.ఐ.ఎ.ను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఉభయ ప్రధానులూ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత్‌, బ్రిటన్‌లు కల‌సి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు ప్రకటించారు.

మేక్‌ ఇన్‌ ఇండియా

భార‌త దేశ ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రధాని కామెరాన్‌ పేర్కొన్నారు. భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యం, పెట్టుబడుల పరంగా బ్రిటన్‌ ఇప్పటికే ఎంతో సుదృఢమైన బంధాన్ని ఏర్పరచుకుందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. రక్షణ పరిజ్ఞానం, పారిశ్రామిక సహకారం విషయంలో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ఉభయ పక్షాలూ చేపట్టిన చర్యల పట్ల ఇరువురు నేతలూ సంతృప్తి వ్యక్తంచేశారు.

వ్యాపార బంధం

భారత్‌, బ్రిటన్‌ల‌ మధ్య లోతైన, ఫలవంతమైన వ్యాపార బంధం కొనసాగుతుండటాన్ని ప్రధానులు కామెరాన్‌, మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భార‌త దేశ ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య 9.2 బిలియన్‌ పౌండ్ల వాణిజ్య ఒప్పందాలు కుదరడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. గత 15 ఏళ్లలో భారత్‌కు వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో బ్రిటన్‌ వాటా 8.56 శాతంగా ఉండటాన్ని, బ్రిటన్‌లో భారతీయ కంపెనీలు 1,10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఇరువురు నేతలూ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

భారతీయ బీమా రంగంలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌.డి.ఐ.) ద్వారాలు తెరవడాన్ని బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ రంగంలో ఉన్న అవకాశాలను గురించి వివరించారు. భారతీయ జనాభా విస్తృతి దృష్ట్యా వారందరికీ బీమా రక్షణ అందాలన్న లక్ష్యంతో బీమా, పింఛన్ రంగాల‌లో ఎఫ్‌.డి.ఐ. పరిమితిని 49 శాతానికి పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నిర్ణయం నేపథ్యంలో బ్రిటన్‌లోని బీమా సంస్థలు భారతీయ సంస్థలతో పలు జాయింట్‌ వెంచర్లు ప్రకటించాయి. భారత్‌లో ఎఫ్‌డీఐల‌ కోసం పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి విలువ దాదాపు 238 మిలియన్‌ పౌండ్లు. సమగ్ర ఆర్థికాభివృద్ధి పథంలో ఎంతో కీలకమైన భారతీయ బీమా, పునర్‌బీమా రంగాల అభివృద్ధికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దోహదం చేస్తాయి. భారత్‌లో హెచ్‌.ఎస్‌.బి.సి. చేపట్టిన ‘స్కిల్స్‌ ఫర్‌ లైఫ్‌’ కార్యక్రమాన్ని ఇరువురు ప్రధానులూ స్వాగతించారు. అవకాశాలకు నోచుకోని 75 వేల మంది యువజనులు, ఐదేళ్లకు పైబడిన చిన్నారుల్లో నైపుణ్యాలను పెంపొందించడమనేది 10 మిలియన్‌ పౌండ్లతో చేపడుతున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

స్మార్ట్‌ సిటీలు – పట్టణ నవీకరణ

భారత్‌ ప్రతిష్టాత్మ‌కంగా చేపట్టిన పట్టణాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఇండోర్‌, పుణె, అమరావతి నగరాల అభివృద్ధికి భారత్‌, బ్రిటన్‌ల‌ భాగస్వామ్య కార్యక్రమాన్ని ఇరువురు ప్రధానులూ ఈ సంద‌ర్భంగా ప్రకటించారు. వీటి నిర్మాణ, అభివృద్ధి కోసం సాంకేతిక సహకారం, నైపుణ్య, వ్యాపార భాగస్వామ్యానికి నిర్ణయించుకొన్న‌ట్లు తెలిపారు. అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంతో స్మార్ట్‌, సమీకృత నగరాల అభివృద్ధి కోసం బ్రిటన్‌ అంతర్జాతీయ అభివృద్ధి విభాగం, భారత్‌ పట్టణాభివృద్ధి శాఖ మధ్య కుదిరిన సాంకేతిక సహకార భాగస్వామ్య ఒప్పందంపై వారు హర్షం వ్య‌క్తం చేశారు.

ఆరోగ్యకరమైన నదీ వ్యవస్థల కోసం థేమ్స్‌/గంగ భాగస్వామ్యానికి ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులూ శ్రీకారం చుట్టారు. గంగా బేసిన్‌లో జల వనరుల సమర్థ నిర్వహణ కోసం పరిశోధన, వినూత్న కార్యక్రమాల అమలును ఈ భాగస్వామ్య కార్యక్రమం కింద చేపడతారు. బ్రిటన్‌ జల భాగస్వామ్య కార్యక్రమం కింద 2016లో విధానపరమైన నైపుణ్య మార్పిడి చర్యలు తీసుకుంటారు.

విద్య, నైపుణ్యం, సైన్స్‌, పరిశోధన

యువ భారతీయులను 21 వ శతాబ్దానికి సన్నద్ధులను చేసే లక్ష్యంతో భారత ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి బ్రిటన్‌ ప్రధాని కేమరాన్‌ సుముఖత వ్యక్తం చేశారు. బ్రిటన్‌- భారత్‌ నూతన నైపుణ్య ప్రతిన కింద భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి సహకరించేందుకు 11 బ్రిటన్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. బ్రిటన్‌ ప్రభుత్వం, బ్రిటన్‌ వ్యాపార సంస్థలు కలసికట్టుగా భారత్‌లోని కీలక రంగాల్లో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. పుణెలో ఆటోమోటివ్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ కేంద్రంతో ఇవి ప్రారంభం అ వుతాయి. నైపుణ్య శిక్షణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో సరికొత్త నమూనాల ఆ విష్కరణ కోసం భారత్‌ నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌ మంత్రిత్వ శాఖకు బ్రిటన్‌ కావాల్సిన సహకారం అందజేస్తుంది. మహిళల భాగస్వామ్యం, డిజిటల్‌ డెలివరీ, వికలాంగుల పాత్రపై వీటిలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

విద్య, పరిశోధన, ఆవిష్కరణలో 2016 బ్రిటన్‌- భారత్‌ సంవత్సరంగా నిలవబోతోందని ఇద్దరు ప్రధానమంత్రులు ప్రకటించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసుకోవడం, డిజిటల్‌ టెక్నాలజీతో కూడిన విద్య, శిక్షణ కార్యక్రమాల్లో మరింత సమన్వయం మొదలైన వాటిపై ఇందులో దృష్టిపెడతారు. తద్వారా విద్య, పరిశోధన, ఆ విష్కరణల్లో రెండు దేశాలూ కలసి ప్రాపంచిక దృక్పథంతో 21వ శతాబ్దపు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించగలుగుతాయి.

పాఠశాల స్థాయిలో వర్చువల్‌ పాట్నర్‌షిప్‌లు కుదుర్చుకోవాలని కూడా రెండు దేశాల ప్రధాన మంత్రులు అంగీకరించారు. దీనివల్ల రెండు దేశాల్లో యువ జనం ఒ క దేశంలోని వారు మరొక దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పాలుపంచుకోగలుగుతారు. తద్వారా వారి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక, కుటుంబ వ్యవస్థల గురించి అ ర్థం చేసుకోగలుగుతారు.

2016లో ఢిల్లీలో జరిగే టెక్నాలజీ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్‌ భాగస్వామ్య దేశంగా ఉంటుందని ప్రధాన మంత్రులు ప్రకటించారు. సంయుక్త పరిశోధన భాగస్వామ్యాన్ని మరింత పెం చడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ప్రణాళిక బద్ధమైన విద్యా వినిమయ వినియోగం తీరు పట్ల వారు సంతృప్తిని వ్యక్తంచేశారు. దీనిద్వారా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయంలోని రూథర్‌ ఫర్డ్‌ యాపిల్టన్‌ లేబరేటరీ, న్యూట్రాన్‌ విభాగంలోకి భారత్‌ శాస్త్రవేత్తలకు ప్రవేశం లభిస్తుంది. సంయుక్త పరిశోధన, సామర్థ్య నిర్మాణం కోసం న్యూటన్‌- బాబా నిధి ఏర్పాటు పట్ల ప్రధాన మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటన్‌- భారత్‌ పరిశోధనలో ఉ మ్మడి పెట్టుబడులు 2008లో ఒ క మిలియన్‌ పౌండ్ల క‌న్నా తక్కువ ఉండగా, ఇప్పుడవి 200 మిలియన్‌ పౌండ్లకు పెరిగాయని వారు గుర్తుచేశారు. క్లీన్‌ ఎనర్జీలో వర్చువల్ సెంటర్లలో, జల భద్రత, నత్రజని సహిత వ్యవసాయ రంగాల్లో లక్షలాది పౌండ్ల నిధులతో పెట్టుబడులు భారీగా పెరిగాయి. బాలల సంరక్షణ, మాతా శిశు రక్షణ, పౌష్టికాహారం, మానసిక ఆ రోగ్యం, పట్టణీకరణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, ఆహార భద్రత కోసం నిరంతర నీటి వనరుల పరిరక్షణ, ఇంధన, పర్యావరణ రంగ సేవలు, వాతావరణ కాలుష్యం, భారతీయ నగరాల్లో ఆరోగ్య పరిరక్షణ, ఆక్వాకల్చర్‌, దక్షిణాసియా రుతు పవన గమనంపై ఉమ్మడి పర్యవేక్షణ తదితర రంగాల్లో సరికొత్త సంయుక్త పరిశోధన, ఆవిష్కరణ కార్యక్రమాల పట్ల రెండు దేశాల ప్రధాన మంత్రులు హర్షం వ్యక్తంచేశారు.

బ్రిటన్‌కు చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ అలయన్స్‌లు మూడో దశ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యాన్ని ప్రారంభించడం పట్ల ప్రధాన మంత్రులు హర్షం వెలిబుచ్చారు. దీని ద్వారా క్లీన్‌ టెక్‌ ఎనర్జీ, ఆరోగ్య రంగాల్లోని సమస్యలకు ఆధునిక వాణిజ్య పరమైన పరిష్కారాలు కనుగొనేందుకు 3.5 మిలియన్‌ పౌండ్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నవాటిలో వాతావరణ మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం అతి పెద్ద సవాలని ఇద్దరు ప్రధాన మంత్రులు గుర్తించారు. వ్యవసాయ శాస్త్ర రంగాల్లో బ్రిటన్‌- భారత్‌ మధ్య సమన్వయానికి ఉమ్మడి వ్యవస్థ ఏర్పాటును వారు స్వాగతించారు. దీని ద్వారా బ్రిటన్‌లోని అత్యుత్తమ వి శ్వవిద్యాలయాలైన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆగ్రికల్చర్‌ బాటనీ, జాన్‌ ఇన్స్‌ సెంటర్‌, రోథమ్‌స్టెడ్‌ రీసెర్చ్‌ అండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా తదితర సంస్థలు భారత్‌తో కలసి పనిచేస్తాయి. దిగుబడుల పెంపు, సాగు వ్యాధుల నివారణ, కరువును తట్టుకొనే వంగడాల అభివృద్ధి, పరి శోధన ఫలితాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంపై ఉ మ్మడిగా పరిశోధనలు చేస్తాయి. భారత్‌లో బ్రిటన్‌- ఇండియా జాయింట్‌ ప్లాంట్‌ సెంటర్‌ ఏర్పాటు పట్ల కూడా ఇద్దరు ప్రధాన మంత్రులు హర్షం వ్యక్తంచేశారు.

గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ అకడమిక్స్‌ నెట్‌వర్క్‌లో భాగంగా వచ్చే రెండు విద్యా సంవత్సరాల్లో బ్రిటన్‌ 100 మంది విద్యా వేత్తల్ని భారత్‌కు పంపనుందని ఇద్దరు ప్రధాన మంత్రులు సంతోష పూర్వకంగా ప్రకటించారు. జనరేషన్‌ యూకే- ఇండియా కార్యక్రమం కింద 2020 నాటికి 25000 మంది బ్రిటన్‌ విద్యార్థులు భారత్‌ రావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో 1000 మంది బ్రిటన్‌ విద్యార్థులు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కింద ఇన్‌ట‌ర్న్‌లుగా వస్తారు. యూకే- ఇండియా మూడో దశ విద్యా పరిశోధన కార్యక్రమం పట్ల కూడా ఇద్దరు ప్రధాన మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. యూకే, ఇండియా విద్యార్హతలను ఇరు దేశాలూ పరస్పరం గుర్తించుకోవాలని చేపట్టిన కార్యక్రమాన్ని కూడా వారు స్వాగతించారు.

ఆరోగ్యం:

భారత్‌-యూకే సంయుక్త వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సంతోష పూర్వకంగా ప్రారంభిస్తున్నట్టు రెండు దేశాల ప్రధాన మంత్రులు ప్రకటించారు. భారత బయో టెక్నాలజీ విభాగం, యూకే పరిశోధన మండలిల స‌మ‌న్వ‌యంతో దీన్ని నిర్వహిస్తారు. యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో కూడా బయోటెక్నాలజీ విభాగం యూకే పరిశోధన మండలితో కలసి పనిచేస్తుంది. సరి కొత్త చికిత్సా విధానాలను, సరి కొత్త ఔషధాలను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.

రెండు దేశాల్లోని ప్రజల ఆ రోగ్య, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించిన యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్ (ఏఎమ్‌ఆర్‌)ను పరిష్కరించేందుకు ఉ మ్మడిగా పనిచేస్తామని ఇద్దరు ప్రధానులు ప్రకటించారు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయి మద్దతు అ వసరమని వారు అభిప్రాయపడ్డారు. 2016లో ఐ క్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌పై జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి వారు మద్దతు ప్రకటించారు. ఏఎమ్ఆర్‌పై 2016లో లండన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో కూడా భారత్‌, బ్రిటన్‌లు తమ శాస్త్రీయ‌ నైపుణ్యాన్ని అందజేయనున్నాయి. భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ విభాగం, బ్రిటిష్‌ ప్రభుత్వ పరిశోధన మండలిల‌ సంయుక్త చొరవతో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

ఆరోగ్య రంగంలో రెండు దేశాల మధ్య సహకారం పెంపొంద‌డం పట్ల రెండు దేశాల ప్రధాన మంత్రులు హర్షం వ్యక్తంచేశారు. వైద్య విద్య, శిక్షణ, సార్వత్రిక ఆ రోగ్య కవరేజీ, యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ నియంత్రణ, నాణ్యమైన చికిత్స ద్వారా రోగుల రక్షణను మెరుగు పరచడం, సురక్షితమైన ప్రభావ శీలమైన మందుల తయారీ, బ్రిటన్‌కు చెందిన ఎన్‌ఐసీఈ ఇంటర్నేషనల్‌, భారత ప్రభుత్వానికి చెందిన ఆ రోగ్య పరిశోధన విభాగం మధ్య మెడికల్‌ టెక్నాలజీ కొలాబరేషన్‌ తదితర అంశాలపై కుదిరిన అవగాహన ఒప్పందాన్ని రెండు దేశాల ప్రధాన మంత్రులు స్వాగతించారు.

ఆరోగ్యం, అనుబంధ రంగాల్లో సహకారం, పెట్టుబడులు పెరగాల్సిన అ వసరం ఎంతో ఉందని ప్రధాన మంత్రులు నొక్కి చెప్పారు. ఇలాంటి పెట్టుబడుల పెంపునకు భారత కుటుంబ ఆ రోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ స్వాగతించారు. చండీగఢ్‌లో కింగ్స్‌ కాలేజీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టుకు, భారత్‌- యూకే హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ప్రధాన మంత్రులు సంతోషం వెలిబుచ్చారు. సమీకృత ఔషధాల తయారీ, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో సహకారం పెంపునకు భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, బ్రిటన్‌లోని ప్రఖ్యాత సంస్థకు మధ్య అ వగాహన ఒప్పందం ఖరారైన సంగతిని ప్రధాన మంత్రులు గుర్తుచేశారు.

సంస్కృతి:

రెండు దేశాల మధ్య ఉన్న గాఢమైన సాంస్కృతిక సంబంధాలను, భారత దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను వేడుకగా నిర్వహించుకునేందుకు 2017ను యూకే- భారత్‌ సాంస్కృతిక సంవత్సరంగా నిర్వహించనున్నట్టు రెండు దేశాల ప్రధాన మంత్రులు ప్రకటించారు. బ్రిటిష్‌ లైబ్రరీలో, భారత్‌లోని నేషనల్‌ ఆ ర్కైవ్స్‌లో ఉన్న పురావస్తు వి శేషాల డిజిటైజేషన్ చేప‌ట్ట‌నున్నట్టు వెల్లడించారు.

స్వర్గీయ శ్యామ్‌జీ కృష్ణ వర్మకు బ్రిటిష్‌ బారిస్టర్‌ కౌన్సిల్‌లో మరణానంతర సభ్యత్వం కల్పించడం పట్ల ప్రధాన మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలోను, ఆ తర్వాతి తరాలకు స్ఫూర్తి నివ్వడంలోనూ శ్యామ్‌జీ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.

పర్యాటక రంగంపై అ వగాహన ఒప్పందం కుదుర్చుకోవాలన్న భారత పర్యాటక మంత్రిత్వ శాఖ, యూకే సాంస్కృతిక, మీడియా, క్రీడా విభాగం నిర్ణయం పట్ల ప్రధాన మంత్రులు సంతోషం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య సురక్షితమైన, సుస్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

నేరాలు:

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక సంబంధాలు పెరుగుతూ, సంక్లిష్టంగా మారుతున్న ఈ తరుణంలో, సరిహద్దులకు అతీతంగా నేరగాళ్లపై గురిపెట్టేందుకు పరస్పరం మరింత సహకారం అ వసరమని రెండు దేశాల ప్రధాన మంత్రులు అభిప్రాయపడ్డారు. ఉభ‌య‌ దేశాల భద్రతకు ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు. నేరగాళ్ల రికార్డుల పరస్పర మార్పిడి, తదితర రంగాల్లో మరింతగా కలసి పనిచేయాలని నిర్ణయించారు. ఇది భారత్‌, బ్రిటన్‌ ఇరు దేశాల్లో శాంతి భద్రతల విభాగాలను పరిపుష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
నేర సంబంధ అంశాల్లో, మరీ ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధిచిన విషయాల్లో పరస్పర న్యాయ సహాయాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అ వసరం ఉందని ప్రధాన మంత్రి కామెరాన్‌, ప్రధాన మంత్రి మోదీ పునరుద్ఘాటించారు.

దొంగిలించిన పురాతన వస్తువులు, కళాఖండాల అక్రమ రవాణాను అరికట్టే విషయంలోనూ రెండు దేశాలూ పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

ముక్తాయింపు:

బ్రిటన్‌ పర్యటనలో తనకు, తన బృందానికి అద్భుత ఆతిథ్యాన్ని అందించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటిష్‌ ప్రధాన మంత్రి కామెరాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2016లో భారత పర్యటనకు రావాల్సిందిగా కామెరాన్‌ను ఆహ్వానించారు. భారత్‌- బ్రిటన్‌ మధ్య దూరదృష్టి పూర్వక భాగస్వామ్యం ఉండే దృక్పథాన్ని అనుసరిస్తామని ఉద్ఘాటించారు. తద్వారా రెండు దేశాల ఆర్థిక ప్రగతికి, ఉద్యోగాల కల్పనకు, ప్రజల భద్రతకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటు భారత్‌, బ్రిటన్‌ రెండు దేశాలకు, అటు ప్రపంచానికి ఉపయోగపడే మెరుగైన, పరివర్తన పూర్వకమైన భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కలసికట్టుగా పనిచేస్తామని ప్రధాన మంత్రులు ఇద్దరూ ఉద్ఘాటించారు.