Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

 ‘బ్రిడ్జిటల్ నేషన్’ పుస్తకావిష్కరణ సందర్భం గా  ప్రధాన మంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం


దేశ సామాజిక, వ్యాపార నాయకత్వానికి స్పూర్తినిచ్చి, శక్తివంతం చేసిన రతన్ టాటా గారు, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎన్. చంద్రశేఖరన్ గారు, రూపా గారు మరియు ఆవిష్కరణ ఉత్సవానికి హాజరైన మహిళామణులు మరియు సుజనులారా …

 

రతన్ టాటా గారితో, చంద్రశేఖరన్ గారితో సమావేశమై మాట్లాడటం సర్వదా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది.  దేశంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒక దానికి నాయకత్వం అందించే బాధ్యత వారిపై ఉంది.

 

        అంత పెద్ద బాధ్యత తమపైన ఉన్నప్పటికినీ వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఎలా చిరునవ్వుతో ఉండగలుగుతారో అని నేను ఆశ్చర్యపోతుంటాను!  బహుశా భవిష్యత్తులో  చంద్రశేఖరన్ గారు ఈ అంశంపైన భవిష్యత్తులో పుస్తకం రాయగలరని భావిస్తాను.  అన్నట్టు ఆ ఐడియా ఇచ్చినందుకు నేను ఎలాంటి ప్రత్యేక హక్కులు కోరబోను. మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా పుస్తకం రాయవచ్చు!!

 

మిత్రులారా,

 

        ఆయన మరొక పుస్తకం రాస్తారో రాయరో నేను చెప్పలేను గాని,  చిరునవ్వుతో ఒత్తిడి లేని మనస్సుతో ఉంటే కలిగే ఫలితం ఎలాంటిదో ‘బ్రిడ్జిటల్ నేషన్’ రూపంలో మన ముందు ఉంది.

 

        సకారాత్మక ధోరణి , సృజనాత్మకత మరియు నిర్మాణాత్మక మైండ్ సెట్ ఉంటే దానివల్ల దేశ సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. 

 

        ఈ సకారాత్మక ధోరణి, ఆశావహ దృక్పథం మరియు మన ప్రతిభ, వనరులపైన విశ్వాసమే నవభారతం యోచనలకు ప్రతిరూపాలు.

 

        ఈ పుస్తకం అభిలషణీయ భారతావనికి మాత్రమే కాక సమాజంలోని కొందరు వృత్తిసంబంధ నిరాశావాదులకు కూడా స్పూర్తిదాయకంగా నిలువగలదని నేను నమ్ముతున్నాను.  ఈ దార్శనిక గ్రంథాన్ని వెలువరించినందుకు చంద్రశేఖరన్ గారిని, రూప గారిని అభినందిస్తున్నాను.

 

మిత్రులారా, 

 

        టెక్నాలజీని ఒక భూతంలా చూపేందుకు భారీ ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఈ పుస్తకం వచ్చింది.  ఓ భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది.

 

ముఖ్యంగా ఇండియాకు అన్వయించుకున్నప్పుడు మన దేశజనసంఖ్య ద్వారా కలిగిన లాభాంశానికి టెక్నాలజీని ఒక సవాలుగా చూపుతున్నారు.

ప్రభుత్వ దార్శనికతను ఈ పుస్తకం మరింత బలోపేతం చేసింది.  ఈ పుస్తకం ద్వారా టెక్నాలజీని అవాంతరాలు సృష్టించడానికి బదులు సంధానానికి, సంబంధాలు ఏర్పరిచేందుకు మాధ్యమంగా  చూపారు.

టెక్నాలజీ విభాగిని కాదు ఒక వారధి వంటిది.

టెక్నాలజీ మరియు ప్రతిభ శక్తియుక్తులను గుణిస్తాయి తప్ప ముప్పుగా మారవు.

ఆకాంక్షలకు, కార్య సిద్ధికి మధ్య టెక్నాలజీ వారధి వంటిది.

అడగడం, ఇవ్వడం మధ్య వారధి వంటిది టెక్నాలజీ. 

ప్రభుత్వానికి , పరిపాలనకు మధ్య వారధి వంటిది టెక్నాలజీ.

ప్రతి ఒక్కరినీ అభివృద్ధితో జతకలిపే వారధి టెక్నాలజీ.

 

మిత్రులారా, 

        మా గత అయిదేళ్ళ పదవీకాలంలో ఇదే మనో ప్రవృత్తి ఉంది. భవిష్యత్తులో కూడా మేము అదే దారిలో పయనిస్తాము. 

 

        కృత్రిమ మేధ, యంత్ర అధ్యయనం మరియు రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి సాధనాలుగా ఏవిధంగా ఉపయోగపడుతాయో ఈ పుస్తకం వివరిస్తుంది.

        నాకున్న అనుభవంతో నేను అదే విషయం చెప్తాను.  గత అయిదేళ్ళలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల, దాని ప్రమేయంవల్ల ఇండియాలో పాలనలో సంస్కరణలు మరియు పరివర్తన ఎలా వచ్చిందో మీరు గుర్తించగలిగారు.  ఇది ఎలా జరుగుతుందో ఇందుకు సంబంధించిన ఉదాహరణలు తెలియజేస్తాను. 

మిత్రులారా, 

        మన దేశంలో దశాబ్దాలుగా వంట గ్యాసు కనెక్షన్లు, సబ్సిడీలు ఇచ్చే పథకం కొనసాగుతోంది.

        మేము ఉజ్వల పథకం ప్రవేశపెట్టినప్పుడు అది కూడా పాత పద్ధతిలోనే ఉంటుందని చాలా మంది అనుకున్నారు.  మేము ఆ పథకం అమలు విధానంలో  మార్పులు తెచ్చాము. దానిలో టెక్నాలజీని ప్రవేశపెట్టాము. 

మిత్రులారా,   

        మేము కూడా పాత పద్ధతినే అవలంభించినట్లయితే ఒక కమిటీని ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఉండేది. ఆ విధంగా మేము గడువు తేదీలోపల పని పూర్తి చేసేవాళ్ళం కాదు. కమిటీకి బదులు మేము టెక్నాలజీపై ఆధారపడ్డాము. 

        అందుబాటులో ఉన్న సమాచారం, డేటా పరిజ్ఞానం సహాయంతో మేము మొదట దేశంలో ఇదివరకే ఉన్న 17 వేల వంట గ్యాస్ పంపిణీ కేంద్రాలను గుర్తించాము. వాటికి తోడుగా కొత్తగా కొద్ది రోజుల్లోనే మరో 10 వేల వంట గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇందుకోసం దేశంలో ప్రతి గ్రామాన్ని డిజిటల్ పద్ధతిలో చిత్రీకరించాము.

        గ్యాస్ అమ్మకం నివేదిక, వంటగ్యాస్ వినియోగం ఎంతవరకు చోచ్చుకుపోయిందో, జనాభా మరియు వారి ఆర్ధిక – సామాజిక పరిస్థితులు వంటి  ఇతర అంశాల కోసం ఈ డేటాను విశ్లేషించడం జరిగింది.

        లక్షలాది గ్రామాలకు చెందిన వివిధరకాల 64 లక్షల దత్తాంశాల విశ్లేషణ తరువాత గ్యాస్ పంపిణీ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించాము. మా పని అక్కడితో అయిపోలేదు. అప్పుడు తలెత్తిన ఒక భారీసమస్యను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించ గలిగాము.  

        దరఖాస్తులు, పంపిణీ పర్యవేక్షణ సమయంలో చాలా మంది మహిళల దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం చూశాం.  వారికి బ్యాంకు ఖాతా లేనందువల్ల అలా జరుగుతోందని కనిపెట్టాము.

        ఈ సమస్యను ఎదుర్కోవడానికి జన్ ధన్ శిబిరాలు నిర్వహించి ఆ మహిళల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించాము.  దాని ఫలితంగా మూడేళ్ళలో 8 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యం నిర్ణీత గడువుకు చాలా ముందే పూర్తిచేశాం.

మిత్రులారా,

అది టెక్నాలజీ వినియోగ సౌలభ్యం పెరగడానికి సంబంధించిన అంశం.  టెక్నాలజీని ఎక్కువగా అందుబాటులోకి తేవడం వల్ల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తాయో నేను ఉదహరిస్తాను.  దేశంలో ఆరోగ్య సేవల తీరు ఎలా ఉందో మీ పుస్తకంలో పేర్కొన్నారు.  ముఖ్యంగా మన దేశంలో పేదరికం మరియు ధనం లేమి వల్ల చికిత్సను పొందలేకపోతున్నారు.

ఈ పరిస్థితిని మార్చడంలో ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధాన పాత్రను పోషిస్తోంది. గతంలో పేదలు వైద్య చికిత్స పొందాలంటే ఉన్నదంతా అమ్ముకోవలసిన పరిస్థితి ఉండటం వల్ల వారు ఆసుపత్రులకు వెళ్ళేవారు కాదు.  ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు పేదలు  కూడా ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందగలుగుతున్నారు.

ఇప్పుడు పేదల ప్రవర్తనలో మార్పు వచ్చింది.  వైద్య సేవల ఆవశ్యకత పెరిగింది. పేదలకు కూడా ఆసుపత్రులలో చికిత్స లభిస్తోంది.  చికిత్స అందించే ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సొమ్ము అందుతోంది.  ఇదంతా కేవలం టెక్నాలజీ వల్లనే సాధ్యమైంది.

మిత్రులారా, 

        టెక్నాలజీ సహాయంతో మేము ఆయుష్మాన్ భారత్ యోజనను ఆరోగ్య సేవల సంపూర్ణ ప్యాకేజీగా అభివృద్ధి చేస్తున్నాము.

        గతంలో రోగ నివారణ సేవలపై దృష్టిపెట్టే వారు కాదు.  ప్రాధమిక ఆరోగ్య సేవలు కూడా తలనొప్పి, కడుపు నొప్పికి పరిమితమయ్యేవి. రోగ నిర్ధారణ తరువాత చేర్చుకొని ఆరోగ్య సేవలు అందించడం ఇంకో విధంగా ఉండేది.

        ఇప్పుడు దేశంలో ఆరోగ్య సేవలు అందించి స్వస్థత చేకూర్చే లక్షన్నర కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది.  అవి రోగ నిర్ధారణ జరిపి చికిత్స అందించడానికి మూలాధార కేంద్రాలుగా ఉంటాయి.

        అతి స్వల్ప వ్యవధిలో ఇప్పటివరకు అటువంటి 21 వేల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాలలో అతి కొద్ది కాలంలో కోట్లాది మంది రోగాలను నిర్ధారణ చేయడం జరిగింది.  ఆ కేంద్రాలలో రోగ నిర్ధారణ జరిగిన  వారిలో 1.5 కోట్ల కన్నా ఎక్కువమందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు, 1.25 కోట్ల మంది మధుమేహం ఉన్నట్లు, 1.5 కోట్ల మందికి  క్యాన్సర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.

        గతంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అది సాధ్యమయ్యేది కాదు.  ఇప్పుడు ఈ కేసులను ఆరోగ్యసేవ అందించి స్వస్థత కేంద్రాలకు పంపడం జరుగుతోంది. అక్కడ జరిగే రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారంగా ఇప్పుడు వాటికి చేరువలో, అనుసంధానించిన పెద్ద ఆసుపత్రులలో చికిత్స అందించడం సాధ్యమవుతోంది.

మిత్రులారా, 

        టెక్నాలజీ వారధిగా మారినప్పుడు పారదర్శకతకు, లక్ష్యిత పంపిణీకి కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది. ఇండియాలో మధ్య దళారులు, బ్రోకర్ల పాత్ర ఎటువంటిదో మీకందరికీ తెలుసు.

        ‘ ప్రభుత్వం దేశాన్ని నడుపుతుంది;  మధ్య దళారులు పాలన నడిపిస్తారు’  అనే పదబంధం ఒక నియమంగా ఆమోదం పొందేడిది. దానికి కారణం ప్రజలకు మరియు ప్రక్రియకు మధ్య అంతరం ఉండేది.  పుట్టుక నుంచి చావు దాకా ఉండే సుధీర్ఘ ధృవీకరణ (సర్టిఫికేషన్) వ్యవస్థ కింద పడి సామాన్యులు నలిగిపోయేవారు.

        ఇప్పుడు జన ధృవీకరణ, జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ల వంటి వందలాది ప్రభుత్వ సేవలు ఆన్ లైన్లో లభిస్తున్నాయి.  ఈనాడు దేశంలో స్వయం ధృవీకరణ ఒక నియమంగా మారింది. ఇప్పుడు మనం స్వయం మదింపు, స్వయం ధృవీకరణ,  గుర్తింపులేని (పేస్ లెస్) పన్ను మదింపు దిశగా పయనిస్తున్నాం.

మిత్రులారా,

        టెక్నాలజీని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవచ్చునని చెప్పేందుకు మరో ఉదాహరణ దేశంలోనే అతి పెద్ద యంత్రాంగం ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల మన పోస్టాఫీసు సేవలు మూసివేత ముప్పు ఏర్పడింది. లక్షలాది మందికి ఉద్యోగ భయం పట్టుకుంది. 

కానీ ఈనాడు టెక్నాలజీ వల్ల పోస్టాఫీసులు ఇళ్ళకు బ్యాంకింగ్ సేవలు మరియు డిజిటల్ లావాదేవీల పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయి.

అదేవిధంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన సాధారణ సేవా కేంద్రాల యంత్రాంగం ద్వారా ఆన్ లైన్ సేవల పంపిణీ జరుగుతోంది. వాటివల్ల 12 లక్షల కన్నా ఎక్కువ మంది యువతకు ఉపాధి లభిస్తోంది.

మిత్రులారా,

        తెగువతో వ్యాపారం చేసే స్పూర్తిని పెంపొందించడానికి, ఉపాధి కల్పనకు ముఖ్యమైన కేంద్రాలుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎం ఎస్ ఎం ఇ)ను బలోపేతం చేయడానికి పుస్తకంలో చేసిన సూచనలతో నేను స్థూలంగా ఏకీభవిస్తున్నాను.  అంతేకాక వాటిలో అంతర్లీనంగా ఉన్న లొసుగులను, అవరోధాలను  తొలగించడానికి మేము టెక్నాలజీని కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నాము.

        ప్రభుత్వ సంస్థలకు అవసరమైన  వస్తు సేకరణ కోసం ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ అంటే జి ఈ ఎం ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలిసిందే. అది ప్రభుత్వ అవసరాలు మరియు ఎం ఎస్ ఎం ఇ సరఫరా వ్యవస్థకు మధ్య వారధి వంటిది. 

ఈ ఏడాది జి ఈ ఎం ద్వారా కొనుగోళ్ళ లక్ష్యం రూ. 50, 000 కోట్లకు చేరడమే ఈ వ్యవస్థ విజయానికి తార్కాణం.

మిత్రులారా, 

అదేవిధంగా అంకుర భారతం (స్టార్టప్ ఇండియా) స్థానిక డిమాండ్ మరియు సరఫరా మధ్య వారధిగా మారి ఖాళీని భర్తీ చేస్తోంది.  మరొకవైపు మేక్ ఇం ఇండియా స్థానిక సరఫరా మరియు గ్లోబల్ డిమాండ్ మధ్య వారధిగా మారింది.

డిమాండ్ మరియు సరఫరాలో ఉన్న సమస్యలను గురించి ఈ పుస్తకంలో మీరు సునిశితంగా వివరించారు. స్టార్టప్ ఇండియా కూడా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది.  

ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్ళను మదిలో ఉంచుకొని కొత్త భావనలు, యోచనలు ప్రోది చేయడం ద్వారా పరిశ్రమలో పరివర్తన తెచ్చే ప్రయత్నం ఇది. ఇందుకే ఈనాడు రెండవ, మూడవ శ్రేణి నగరాలలో అధిక సంఖ్యలో అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి.

మిత్రులారా, 

        వీటన్నింటి మధ్య,  టెక్నాలజీ మాత్రమే పరిష్కారం కాదన్నది వాస్తవం.  మానవ సంకల్పం మరియు సత్సంకల్పం చాలా ముఖ్యమైనవి.  కృత్రిమ మేధకు కూడా అదే వర్తిస్తుంది. చర్చ‘కృత్రిమ మేధ వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి’ లేక  ‘రోబోలకు మనుష్యులంత తెలివితేటలు ఎప్పటికి వస్తాయి’ అని కాక  ‘కృత్రిమ మేధకు మానవ సంకల్పానికి మధ్య వారధిని ఎలా సృష్టించగలం? మరియు కొత్త డిమాండుకు అనుగుణంగా మన నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోగలం? అనే దానిపై చర్చ జరగాలి.

        కృత్రిమ మేధ మరికొంత అధునాతన సహాయకారి అయిన ఇంకొక సాధనం కావాలి.

        చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది.  అయితే ఇతరులు పుస్తకం చదివేందుకు నేను అవకాశం ఇవ్వాలి కదా.   ఇంతటి మహత్తరమైన పుస్తకం రాసే కృషి చేసినందుకు మరొకసారి ఎన్నో శుభాబినందనలు మరియు శుభాకాంక్షలు.

అనేకానేక ధన్యవాదములు!