Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశానికి, లావో కు మధ్య విమాన సేవల ఒప్పందంపై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం


భారతదేశానికి, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావో పిడిఆర్) కు మధ్య ఒక కొత్త విమాన సేవల ఒప్పందం (ఎ ఎస్ ఎ) పై సంతకాల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకం మరియు సాంస్కృతిక ఆదాన ప్రదానాలను వర్ధిల్ల జేయగలదని ఆశిస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే నిరంతరాయమైన అనుసంధానాన్ని అధికం చేసేందుకు తగిన వాతావరణాన్ని ఈ ఒప్పందం ఏర్పరచగలదు. దీనితో పాటే ఇరు పక్షాలకు చెందిన విమానయాన సంస్థలకు వాణిజ్యావకాశాలను సమకూర్చగలదు. అంతే కాకుండా పౌర విమానయానంలో మరింత సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తూ, భద్రతకు పెద్ద పీట వేయగలదు.

ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలకు చెందిన నిర్దేశితమైన విమాన సంస్థలు నిర్దిష్ట మార్గాలలో అంగీకారం కుదిరిన విధంగా విమానాలను నడపడంలో న్యాయమైన, సమాన అవకాశాలను పొందుతాయి. మార్గాలను, రాకపోకల సంఖ్యను తరువాత నిర్ణయిస్తారు. ఏవైనా రెండు దేశాల మధ్య ఏదైనా విమాన కంపెనీ విమానాలను నడిపేటందుకు అనుసరించవలసిన ప్రాథమిక శాసనసంబంధ స్వరూపమే ఎ ఎస్ ఎ గా వ్యవహారంలో ఉన్నది.