పిఎంఇండియా
గౌరవ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 15న అధికారికంగా ఆ దేశంలో పర్యటించారు.
1993లో స్లొవేకియా స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య చిరకాల సంబంధాలను నెలకొల్పే దిశగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్న ఈ పర్యటనను ఒక చరిత్రాత్మక మైలురాయిగా పేర్కొనవచ్చు. 1993లో దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి.. విశ్వాసం, సమానత్వం, పరస్పర గౌరవం ప్రాతిపదికలుగా సాంప్రదాయక మైత్రినీ, బహుముఖీన సహకారాన్నీ భారత్, స్లొవేకియా పెంపొందించుకున్నాయి.
ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని... పరస్పర ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న ఉమ్మడి సంకల్పంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచుకునేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ప్రస్తుత సహకార యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, అలాగే అటు ద్వైపాక్షికంగానూ, బహుపాక్షికంగానూ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం కొత్త అవకాశాలను అన్వేషించడం ఈ సమగ్ర భాగస్వామ్య లక్ష్యం.
ఇండో-పసిఫిక్ ప్రాంతానికి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక, సాంకేతిక ప్రాధాన్యాన్ని అంగీకరించిన ఇరుదేశాల ప్రధానమంత్రులూ… పరస్పర ప్రయోజనకరమైన సహకారం, ప్రాంతీయ అనుసంధానం, సార్వత్రిక అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన స్వేచ్ఛ, వివాదాల శాంతియుత పరిష్కారం, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతుగా.. భారత్ – స్లోవేకియా మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడడం ఎంతో విలువైనదని అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి పర్యటనలు, నిరంతర రాజకీయ చర్చలు జరగడం ఎంతో కీలకమని ఇరుదేశాల నేతలు స్పష్టం చేశారు. అన్ని స్థాయుల్లోనూ ప్రతినిధి బృందాల పర్యటనలను మరింత పెంచేందుకు వారు అంగీకరించారు. పరస్పర అవగాహనను మరింత పెంపొందించుకోవడం, శాసనపరమైన అనుభవాలతోపాటు ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం లక్ష్యంగా.. చట్టసభల పనితీరులో అనుభవాలను, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేలా పార్లమెంటరీ స్థాయి సంబంధాలను, సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు కూడా ఇరుపక్షాలూ అంగీకరించాయి.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగా సాగే బహుపాక్షిక విధానానికి, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థకు కట్టుబడి ఉంటామని ఇరు దేశాల నేతలు పునరుద్ఘాటించారు. అదే సమయంలో.. ఐక్యరాజ్యసమితి (ముఖ్యంగా భద్రతా మండలి) సహా బహుపాక్షిక సంస్థల్లో సమగ్ర సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలకు అద్దం పట్టేలా… ఈ వ్యవస్థలను మరింత సమర్థంగా, సమ్మిళితంగా, ప్రాతినిధ్యం ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భద్రతా మండలిలోని శాశ్వత, తాత్కాలిక విభాగాలను విస్తరించడం అత్యావశ్యకమని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. సంస్కరణల అనంతరం విస్తరించే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేలా స్లొవేకియా నిరంతరం అందిస్తున్న మద్దతును భారత్ అభినందించింది. అంతర్జాతీయ సంస్థల్లో ఇరు దేశాల అభ్యర్థిత్వాలపై పరస్పర సంప్రదింపులను, సమన్వయాన్ని కొనసాగించాలనీ, అలాగే ఐక్యరాజ్యసమితి సహా వివిధ అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సన్నిహిత సహకారాన్ని అందించుకోవాలనీ అంగీకారానికి వచ్చారు. అంతర్జాతీయ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రాధాన్యాన్ని కూడా వారు చర్చించారు. అణు సరఫరా గ్రూపులో భారత్ సభ్యత్వంపై సానుకూలమైన వైఖరిని స్లొవేకియా పునరుద్ఘాటించింది.
ప్రాంతీయ అనుసంధానం, సుస్థిర ఆర్థిక వృద్ధి – ప్రాంతీయ సమగ్రతను పెంపొందించేలా పరస్పర ప్రయోజనకరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సహా.. స్లావ్‌కోవ్ 3, విసెగ్రాడ్ 4, త్రీ సీస్ ఇనిషియేటివ్ వంటి ప్రాంతీయ కూటములతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు. అలాగే అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతలను గౌరవిస్తూ… ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం సహా స్వేచ్ఛాయుతమైన, సార్వత్రిక, శాంతియుత, సంపన్న ప్రాంతంగా ఇండో-పసిఫిక్‌ను నిలపడంలో తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
ద్వైపాక్షిక భాగస్వామ్యంలో రక్షణ, భద్రతా రంగాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమైన పునాదిగా ఇరు దేశాల నేతలూ స్పష్టం చేశారు. రక్షణ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన-అభివృద్ధి, రక్షణ పరిశ్రమల్లో సహకారానికి సంబంధించి అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా.. ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరగాలని అంగీకారానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి బాటలు వేసేలా ఇరు పక్షాల మధ్య రక్షణ సహకార ఉద్దేశ ప్రకటనను ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు.
విపత్తు తీవ్రతల తగ్గింపు, పటిష్టమైన ఉపశమన వ్యవస్థల నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ప్రాధాన్యం పెరుగుతోందని వారు గుర్తించారు. పటిష్టమైన మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను పెంచుకోవడం, వైజ్ఞానిక చర్చలు, సంస్థాగత సహకారం రంగాల్లో సమన్వయాన్ని పెంపొందించుకోవడంపై అంగీకరించారు.
కీలకమైన సమాచార మౌలిక సదుపాయాల రక్షణలోనూ, సైబర్ నేరాల నివారణతోపాటు వాటిని సమర్థంగా ఎదుర్కోవడంలోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. అదే సమయంలో సార్వత్రిక, సురక్షిత, స్థిరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించాలని నిర్ణయించారు. క్రిప్టోగ్రఫీకి ఎదురవుతున్న క్వాంటం ముప్పుల నుంచి సమాచార సాంకేతిక వ్యవస్థలను కాపాడుకోవడానికీ.. అలాగే పోస్ట్-క్వాంటం సెక్యూరిటీ పరివర్తనకు సిద్ధం కావడానికీ పరస్పర సహకారంలో నిబద్ధతను స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. కీలక మౌలిక సదుపాయాల రక్షణ, పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ రంగంలో ఇరు దేశాల మధ్య కుదిరిన సహకార అవగాహనా ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని వారు పేర్కొన్నారు.
సరిహద్దు ఉగ్రవాదం సహా.. ఉగ్రవాదం ఏ రూపంలో ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా వ్యక్తమయినా సహించేది లేదని ఇరుదేశాల నేతలూ తేల్చిచెప్పారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హేయమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద నిరోధక ఉమ్మడి కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేయడంపై అంగీకారానికి వచ్చారు. ఉగ్రవాదాన్ని సమగ్రంగా, నిరంతరాయంగా ఎదుర్కొనేలా సమష్టి అంతర్జాతీయ కృషి అవసరమని వారు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి పరిధిలో సహా ఉగ్రవాద నిరోధక చర్యల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంలో తమ నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీచే నియమించబడిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో పాటు, వారి అనుబంధ సంస్థలు, ప్రాక్సీలు, స్పాన్సర్లు, ఫైనాన్షియర్లు, మద్దతుదారులపై బలమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతోపాటు.. వాటి అనుబంధ సంస్థలు, పరోక్షంగా మద్దతిచ్చేవారు, వారికి సహాయకులుగా వ్యవహరిస్తున్నవారు, ఆర్థిక సాయం అందిస్తున్నవారు, మద్దతుదారులందరిపైనా కఠినమైన, నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, నిర్వాహకులను, వారికి సహకరిస్తున్న వారిని చట్టం ముందు నిలబెట్టి, జవాబుదారులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి పరిధిలో అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక సమగ్ర ఒడంబడిక (సీసీఐటీ)కు వీలైనంత త్వరగా తుది రూపునిచ్చి, అది ఆమోదం పొందేలా ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా అంగీకరించారు.
2026 జనవరిలో భారత్ – ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతంగా ముగియడంపైనా, సరికొత్త సంయుక్త భారత్ – ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఎజెండాపైనా ప్రధానమంత్రులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల్లో సరికొత్త అవకాశాలు వస్తాయని వారు పేర్కొన్నారు. కీలకమైన సరఫరా వ్యవస్థలను వైవిధ్యభరితంగా మార్చడం, కొత్త మార్కెట్లకు అవకాశాలను కల్పించడం ద్వారా.. వాణిజ్య, పెట్టుబడి సహకారానికి ఉన్న పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందిపుచ్చుకునేలా ఈ ఒప్పందంపై వీలైనంత త్వరగా సంతకాలు జరగాలని, అలాగే నిర్ణీత కాలవ్యవధిలో దీనిని అమలు చేయాలని పిలుపునిచ్చారు.
రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి ఉన్న అనుకూలమైన రంగాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించడంలో ‘భారత్-స్లోవేకియా సంయుక్త ఆర్థిక కమిటీ’ పాత్రను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. స్లోవేకియాకు ఉన్న అద్భుతమైన పారిశ్రామిక వ్యవస్థను, అలాగే భారత్‌కు ఉన్న భారీ మార్కెట్, ఆవిష్కరణల వ్యవస్థ, సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ.. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఇతర అధునాతన తయారీ రంగాలంలొ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను భారీగా పెంచుకోవడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రకటించారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన పరస్పర సహకారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
హరిత ఇంధనం వైపు మారడానికి అవసరమైన సాంకేతికతల పరస్పరం మార్పిడిపై దృష్టి సారిస్తూ స్వచ్ఛమైన, నమ్మకమైన, స్థితిస్థాపక ఇంధన వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా.. నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
అణుశక్తి, భూగర్భ ఉష్ణ శక్తితో సహా వివిధ రకాల ఇంధన వనరులను విస్తరించడం ద్వారా ఇంధన భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. పరస్పర ఆసక్తి ఉన్న పరిశోధనలు, నైపుణ్యాల మార్పిడి, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల ద్వారా ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
వాతావరణ శాస్త్రం, జలశాస్త్ర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా జల వనరుల సమర్థవంతమైన నిర్వహణ, ఆనకట్టల భద్రతలో తమ అనుభవాలను, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోనున్నాయి. నీటి వనరుల స్థిరత్వం, గ్రామీణ తాగునీటి నాణ్యత పర్యవేక్షణ, నీటి శుద్ధి సాంకేతికతలు, సామర్థ్య నిర్మాణం, సమాజ భాగస్వామ్యం వంటి రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. నీటి భద్రతను పెంచడానికి, సురక్షితమైన తాగునీటిని నిరంతరం అందించడానికి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా గ్రామీణ తాగునీటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను ఇరు దేశాల నాయకులు ఈ సందర్భంగా వివరించారు.
రెండు దేశాల భాగస్వామ్యంలో రవాణా, సహకారం అత్యంత కీలకమైన వ్యూహాత్మక అంశాలుగా ఇరుపక్షాలు గుర్తించాయి. పోటీతత్వాన్ని పెంచడం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఆటోమోటివ్, రైల్వే రంగాల్లో జాయింట్ వెంచర్స్, సాంకేతిక బదిలీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను ఇరు దేశాలు ప్రస్తావించాయి. మధ్య ఐరోపా రవాణా కేంద్రంగా స్లోవేకియాకు ఉన్న భౌగోళిక అనుకూలతను, అలాగే భారత్‌కు ఉన్న భారీ తయారీ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానాన్ని పెంచుకోవచ్చని ఇరు నేతలు తెలిపారు. దీంతోపాటు పెరుగుతున్న ఆర్థిక, వ్యాపార, ప్రజల సంబంధాలను మరింత సులభతరం చేసేందుకు భారత్-స్లోవేకియా మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని ఇరు దేశాల నాయకులు పిలుపునిచ్చారు.
స్లోవేకియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ పీటర్ పెల్లెగ్రిని హాజరైన ‘ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ విజయవంతం కావడం పట్ల ఇరు దేశాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక నిర్మాణాత్మకమైన వేదికను అందించే డిజిటల్ సాంకేతికతలపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంకుర సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక కంపెనీల వంటి సరికొత్త రంగాలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి అంగీకరించాయి. అలాగే 5జీ వినియోగం, 6జీ ప్రమాణాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్-టు-మెషిన్ అప్లికేషన్లతో సహా కొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతల్లో కలిసి పనిచేసే అవకాశాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
శాటిలైట్ సాంకేతికత, దాని అప్లికేషన్ల రంగంలో ఇరు దేశాల అంతరిక్ష వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలను పరిశీలించడానికి ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. ఆవిష్కరణలను, అధునాతన అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం శాస్త్రీయ, పరిశోధనా సంస్థలతో పాటు అంతరిక్ష పరిశ్రమకు చెందిన నిపుణుల మధ్య పరస్పర చర్చలు పెంచడం ఎంతో ముఖ్యమని వారు తెలిపారు.
వైద్య రంగంలో నిరంతరం చర్చలు జరపాల్సిన అవసరాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడాన్ని ఇరు దేశాల నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఔషధ, పరిశోధన-అభివృద్ధి, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, వైద్య రంగంలో మానవ వనరులను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ప్రజా ఆరోగ్య నిర్వహణలో ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం, ఇరు దేశాల జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన, రోగుల అవసరాలకు తగ్గట్టుగా ఉండే ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడానికి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి.
విద్యా, శాస్త్రీయ రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల రాకపోకలనుపెంచేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. ముఖ్యంగా స్టెమ్ (శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణితం),
మానవీయ శాస్త్రాల విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇరు దేశాల ఉన్నత విద్యా సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సహకారాలను పరిశీలించిన నాయకులు, వాటిని మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక సంస్థాగత భాగస్వామ్యాలను పెంపొందించడానికి ఇరు దేశాల విద్యా మంత్రిత్వ శాఖల మధ్య ‘ఉన్నత విద్య, పరిశోధన రంగంలో అవగాహన ఒప్పందం’ కుదరడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
భారత్-స్లోవేకియా ప్రజల మధ్య పరస్పర అవగాహనను, స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంస్కృతిక మార్పిడి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. కళాకారులు, సాంస్కృతిక బృందాల పరస్పర పర్యటనలు, ప్రదర్శనల ఏర్పాటు, ఉత్సవాల్లో భాగస్వామ్యం, ఇరు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలను పెంచడం ద్వారా సాంస్కృతిక సహకారాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. చలనచిత్ర, మీడియా నిర్మాణ రంగంలో సహకారానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందించేందుకు, సాంస్కృతిక అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా ‘ఆడియో-విజువల్ క్రియేషన్’పై అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులు స్వాగతించారు.
నైపుణ్యం కలిగిన నిపుణుల క్రమబద్ధమైన, సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలకు ఇరు దేశాల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఇందులో భాగంగా జనవరి 2026లో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన సమగ్ర వలసల సహకార వ్యవస్థను వారు ప్రస్తావించారు. నిపుణుల రాకపోకలను సులభతరం చేయడానికి, ఇరు దేశాల సంబంధిత అధికారుల మధ్య సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి ‘కార్మిక వలసల సహకార రంగంలో అవగాహన ఒప్పందం’పై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. రెండు దేశాల మధ్య పనిచేసే నిపుణుల సంక్షేమం, సామాజిక భద్రతను రక్షించడానికి వీలుగా త్వరలోనే సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలు, సంబంధాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కాన్సులర్ విషయాలపై సహకారం ఇరు దేశాలకు ఎంతో ఆసక్తికరమైన అంశంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కాన్సులర్ వ్యవహారాలలో సహకారాన్ని మరింత సులభతరం చేయడానికి ఇరు దేశాల కాన్సులర్ అధికారుల మధ్య క్రమం తప్పకుండా చర్చలు జరిపేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.
ఈ సమగ్ర భాగస్వామ్య అమలును సంబంధిత కార్యాచరణ స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షించేందుకు నాయకులు అంగీకరించారు.
ఈ పర్యటన భారత్-స్లోవేకియా సంబంధాల్లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని ఇరు దేశాల నాయకులు తెలిపారు.ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని సరికొత్త దశలోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
భారత్-స్లోవేకియా ప్రధానులు ఈ పర్యటన సందర్భంగా జరిగిన ప్రకటనలను, కుదిరిన ఒప్పందాలను స్వాగతించారు.వీటి పూర్తి వివరాలు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
తనకు, తన ప్రతినిధి బృందానికి అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి గాను స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు, స్లోవేకియా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఈ ఉన్నత స్థాయి చర్చల వేగాన్ని మున్ముందు కూడా ఇలాగే కొనసాగించాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు.
***
We view technology as a key pillar of the India-Slovakia partnership. The MoU on digital technology will open many new areas of cooperation. We will also work closely in AI and space. pic.twitter.com/DiSARinHrw
— Narendra Modi (@narendramodi) June 15, 2026
Held an excellent meeting with Prime Minister Fico. This is indeed a very special moment for the India-Slovakia friendship.
— Narendra Modi (@narendramodi) June 15, 2026
Considering the strong potential of our ties, we have elevated our relations to a Comprehensive Partnership.
Our talks covered cooperation in sectors… pic.twitter.com/MEBIcKhyps