Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూమి స్వ‌స్థ‌త కార్డులు మ‌రియు పిఎమ్ఎఫ్‌బివై ల పురోగ‌తిని స‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి


వ్య‌వసాయ‌ రంగానికి సంబంధించిన రెండు కీల‌క ప‌థ‌కాలు.. భూమి స్వ‌స్థ‌త కార్డులు మ‌రియు ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (పిఎమ్ఎఫ్‌బివై) ల అమలులో పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు స‌మీక్షించారు.

16 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు భూమి స్వ‌స్థ‌త కార్డుల తొలి విడ‌త పంపిణీని పూర్తి చేసిన‌ట్లు, మిగిలిన రాష్ట్రాలు ఈ ప‌నిని రానున్న వారాల‌లో పూర్తి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు ఈ స‌ంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఇటు శాంప్లింగ్ గ్రిడ్ లోను, అటు వివిధ భూ ప‌రీక్ష ప్ర‌యోగ‌శాల‌ల్లోను భిన్న‌త కోసం త‌గిన ప‌రీక్ష‌లు చేప‌ట్టవలసిందని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఇది నివేదిక‌ల‌లో నాణ్య‌తకు దోహదపడుతుందని ఆయ‌న అన్నారు.

భూమి స్వ‌స్థ‌త కార్డుల‌ను ఆయా స్థానిక మాండ‌లికాల‌లో ముద్రించాల‌ని, అలా చేస్తే వాటిని రైతులు చ‌దివి సుల‌భంగా అర్థం చేసుకొంటార‌ని కూడా ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని శీఘ్రంగా అందిపుచ్చుకోవడాన్ని ప్రధాన మంత్రి ప్రోత్సహిస్తూ, కాల‌ క్ర‌మంలో భూసార ప‌రీక్ష‌ను చేతిలో ఇమిడే ఉప‌క‌ర‌ణాల ద్వారా సైతం నిర్వ‌హించ‌డం సాధ్య‌ప‌డేటట్టు చూడాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ క‌స‌ర‌త్తులో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు స్టార్ట్‌-అప్ ల‌ను కూడా క‌లుపుకొని వెళ్ళేందుకు అవ‌కాశం ఉందేమో ప‌రిశీలించ‌వ‌ల‌సిందిగా అధికారుల‌కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న విష‌యానికి వ‌స్తే, 2016 ఖ‌రీఫ్ సీజ‌న్ మ‌రియు 2016-17 ర‌బీ సీజ‌న్ లకు గాను ఇప్ప‌టికే 7700 కోట్ల రూపాయల‌కు పైగా క్లెయిముల‌ను చెల్లించ‌డం జ‌రిగింద‌ని, 90 ల‌క్ష‌ల‌కు పైగా రైతులు ల‌బ్ధిని పొందార‌ని అధికారులు ప్ర‌ధాన మంత్రికి వివ‌రించారు.

పంట బీమా క్లెయిముల తాలూకు స‌మాచారాన్ని వేగంగా సేక‌రించేందుకు స్మార్ట్ ఫోన్‌లు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ లు మ‌రియు ఉప‌గ్రాహం పంపే డేటాల వంటి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్న‌ట్లు కూడా అధికారులు వివరించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌ లతో పాటు పిఎమ్ఒ కు చెందిన సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.