Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంత్రివర్గం దృష్టికి భార‌తదేశం, నెద‌ర్లాండ్స్ మ‌ధ్య అంత‌రిక్ష సాంకేతిక‌ విజ్ఞాన సంబంధ అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం


ఖ‌గోళ ప‌రిశోధ‌న‌, శాంతియుత ప్ర‌యోజ‌నాల కోసం అంత‌రిక్ష వినియోగంలో స‌హ‌కారం దిశ‌గా భార‌తదేశానికి, నెద‌ర్లాండ్స్ కు మధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు) గురించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ ఎమ్ఒయు పై 2017 మే 11, 22 తేదీల‌లో బెంగ‌ళూరు, ది హేగ్‌ ల‌లో సంత‌కాలయ్యాయి.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ఎమ్ఒయు వల్ల‌ అంత‌రిక్ష విజ్ఞానం, సాంకేతిక‌త‌, భూ సంకేత విధానం (రిమోట్ సెన్సింగ్‌) స‌హా అనువ‌ర్త‌నాలు; ఉప‌గ్ర‌హ స‌మాచార వ్య‌వ‌స్థ‌, ఉపగ్ర‌హ ఆధారిత చోద‌క వ్య‌వ‌స్థ‌, గ్ర‌హాన్వేష‌ణ‌, వ్యోమ‌ నౌక‌ల వినియోగం, భూత‌ల‌- అంత‌రిక్ష వ్య‌వ‌స్థ‌లు, ఖ‌గోళ సాంకేతిక‌త అనువ‌ర్త‌నం త‌దిత‌ర రంగాల్లో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం పెంపొందుతుంది.

విధి విధానాలు:

భార‌త అంతరిక్ష విజ్ఞాన విభాగం/ భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (డిఒఎస్/ఐఎస్ఆర్ఒ), నెద‌ర్లాండ్స్‌కు చెందిన నెద‌ర్లాండ్స్ అంత‌రిక్ష కార్యాల‌యం (ఎన్ఎస్ఒ)ల నుండి ఎంపిక చేసిన స‌భ్యుల‌తో సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం ఏర్పాటుకు ఈ అవ‌గాహ‌న ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది. అనంత‌రం ఒప్పందం అమ‌లుకు కాల వ్య‌వ‌ధిని, మార్గాల‌కు సంబంధించిన కార్యాచర‌ణ ప్ర‌ణాళిక‌ను ఈ బృందం రూపొందిస్తుంది. భూ సంకేత ప‌ద్ధ‌తికి సంబంధించి స‌రికొత్త ప‌రిశోధ‌న కార్య‌క‌లాపాలు, అనువ‌ర్త‌నాల‌కుగ‌ల అవ‌కాశాలను అన్వేషణ‌ను ఈ ప్రణాళిక వేగ‌వంతం చేస్తుంది. ఉప‌గ్ర‌హ స‌మాచార వ్య‌వ‌స్థ‌, ఉపగ్ర‌హ ఆధారిత చోద‌క వ్య‌వ‌స్థ‌, అంత‌రిక్ష విజ్ఞానం, ఖ‌గోళాన్వేష‌ణ త‌దిత‌ర రంగాల ముంద‌డుగుకూ ఊపునిస్తుంది. మాన‌వాళి ప్ర‌యోజ‌నాల దిశ‌గా అంత‌రిక్ష సాంకేతిక‌త అనువ‌ర్త‌న రంగంలో సంయుక్త కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డంలోనూ ఈ అవ‌గాహ‌న ఒప్పందం తోడ్ప‌డుతుంది. దీని వ‌ల్ల దేశంలోని అన్ని ప్రాంతాలు, వ‌ర్గాలకు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

పూర్వరంగం:

భూ ప‌రిశీల‌న సంబంధిత ప‌రిశోధ‌న‌ల ధ్రువీక‌ర‌ణ‌/ ఫ‌లితాల‌ను స‌రిచూడ‌డం వంటి అంశాల‌లో డిఒఎస్/ఐఎస్ఆర్ఒ కేంద్రాలు, నెద‌ర్లాండ్స్‌లోని భూ స‌మాచార శాస్త్ర-భూ ప‌రిశీల‌న అంత‌ర్జాతీయ సంస్థ, ట్వంటే విశ్వ‌విద్యాల‌యం (ఐటిసి), రాయ‌ల్ నెద‌ర్లాండ్స్ వాతావ‌ర‌ణ సంస్థ (కెఎన్ఎమ్ఐ)ల మ‌ధ్య చిర‌కాల సంబంధాలు ఉన్నాయి. ఇక భార‌త అంత‌రిక్ష విభాగానికి చెందిన వాణిజ్య విభాగం యాంట్రిక్స్ కార్పొరేష‌న్ 2008 ఏప్రిల్ లో నెద‌ర్లాండ్స్‌కు చెందిన ఉప‌గ్ర‌హం DELFI-C3 ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య అంత‌రిక్ష స‌హ‌కారం పెంపుదిశ‌గా విధి విధానాల‌పై ఇస్రో, ఎన్ఎస్‌ఒ ల అధికారులు చ‌ర్చించారు. త‌ద‌నుగుణంగా ఖ‌గోళ ప‌రిశోధ‌న‌, శాంతియుత ప్ర‌యోజ‌నాల కోసం అంత‌రిక్ష వినియోగంలో స‌హ‌కారం దిశ‌గా రెండు దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అంగీకారంతో అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం రూపుదిద్దుకొంది.

****