Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మయన్మార్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా విలేఖరుల సమావేశం సందర్భంగా ప్రసార మాధ్యమాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఆగష్టు 29, 2016)

మయన్మార్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా విలేఖరుల సమావేశం సందర్భంగా ప్రసార మాధ్యమాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఆగష్టు 29, 2016)


శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ యు హతిన్ క్యావ్, ఇంకా ప్రసార మాధ్యమాల సభ్యులారా,

మయన్మార్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ యు హతిన్ క్యావ్ తో పాటు ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రముఖ ప్రతినిధివర్గానికి స్వాగతం పలకడం నన్నెంతో ఆనందపెడుతోంది.

గౌరవనీయులైన అధ్యక్షుల వారూ, మీ ప్రథమ ప్రభుత్వ సంబంధి ద్వైపాక్షిక పర్యటన కోసం మీరు భారతదేశాన్ని ఎంచుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉంది.

స్నేహితులారా,

మయన్మార్ మాకు ప్రత్యేకమైంది.

భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలలో మయన్మార్ ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.

ఆగ్నేయ ఆసియాతో భారతదేశాన్ని కలుపుతున్న భూభాగపు సేతువు మయన్మార్.

మన సమాజాల మధ్య సుదీర్ఘ కాలంగా నెలకొన్న సాంస్కృతిక, చరిత్రాత్మక బంధాలు మన సంబంధాలకు ఒక పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేశాయి.

మెత్తా కు చెందిన బౌద్ధ సూత్రాలు లేదా – దయను ప్రేమించే మరియు “సర్వ పంథ సమభావం” (అన్ని మతాలు సమానమే).. ఇవి మన జీవన విధానాలను నిర్వచిస్తున్నాయి.

గౌరవనీయులైన అధ్యక్షుల వారూ,

మీ గొప్ప దేశం ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టింది.

మీ నాయకత్వంలోని పరిపక్వత, ప్రజాస్వామ్యం పట్ల మీ ప్రజలకు ఉన్న నిబద్దత ఈ కొత్త శకాన్ని నిర్వచిస్తున్నాయి.

ఇంకా, మయన్మార్ ను ఈ ప్రాంతంలో స్థిరమైన, ఆర్ధిక సమృద్ధి తో కూడిన దేశంగా తీర్చిదిద్దాలన్న మీ నాయకత్వం యొక్క స్పష్టమైన విధానం, పటిష్టమైన అభిలాషలు ఈ శకానికి అండగా ఉన్నాయి.

మయన్మార్ నూతన ప్రభుత్వం తన ప్రయాణాన్ని ప్రారంభించి

* వ్యవసాయాన్ని పెంపొందించుకోవాలని ;

* పరిశ్రమలను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని ;

* విద్యారంగాన్ని పటిష్ఠపరచుకోవాలని ;

* యువతకు నైపుణ్యం రంగరించాలని ;

* ఉన్న సంస్థలను పటిష్ఠపరచుకోవడం తో పాటు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలని ;

* తన సమాజానికి భద్రతను కల్పించాలని ;

* ఆర్థిక సమృద్ధికి – ఒక స్థిరమైన మార్గాన్ని అన్వేషించాలని ; ఇంకా.. వీటన్నింటికి మించి –

* ఒక ఆధునిక దేశాన్ని నిర్మించాలన్న ఆశయాన్ని అనుసరిస్తుంటే;

మీ ఆశయ సాధనలోని ప్రతి అడుగులోనూ మీకు భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజలు భాగస్వాములుగా, స్నేహితులుగా తోడుగా ఉంటారన్న హామీని మీకు నన్ను ఇవ్వనీయండి.

స్నేహితులారా,

మన ద్వైపాక్షిక విషయాలన్నింటిపైనా అధ్యక్షుల వారూ, నేనూ ఎంతో ఉపయోగకరమైన చర్చలను ఇప్పుడే ముగించాము.

మన భద్రతాపరమైన ప్రయోజనాలు చాలా సన్నిహితంగా ఉన్నట్లు మేము గుర్తించాము.

అలాగే, ఒక దేశం వ్యూహాత్మక ప్రయోజనాలపైన, ఆందోళనలపైన మరొకరు సంస్పందించవలసిన అవసరం ఉందని మేము అంగీకరించాము.

ఈ దిశగా, మన ప్రజల భద్రత, రక్షణ ల కోసం కలసి పని చేయాలని అధ్యక్షుల వారూ, నేనూ ఏకాభిప్రాయానికి వచ్చాము.

అంతే కాదు, మన ప్రాంతంలో తీవ్రవాదం, చొరబాటు కార్యకలాపాల వంటి ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడానికి చురుకుగా సహకరించుకోవాలని కూడా అంగీకరించాము.

21వ శతాబ్దపు ప్యాంగ్ లాంగ్ సమావేశంలో భాగంగా చేపట్టిన శాంతి ప్రక్రియకు భారతదేశం పూర్తి అండదండలను అందిస్తుందని కూడా నేను తెలియజేశాను.

స్నేహితులారా,

భారతదేశం- మయన్మార్ భాగస్వామ్యాన్ని మంచి మాటలతో మాత్రమే కాక స్వచ్ఛమైన సంకల్పంతో సైతం నిర్వచించడం జరిగింది.

“ప్రజలకే మొదటి ప్రాధాన్యం” అనే దృఢ సిద్ధాంతం మీద సర్వతోముఖ అభివృద్ధి కోసం సహకరించుకొనే భాగస్వామ్యంగా దీని విస్తృతి, లోతు లు రూపుదిద్దుకొన్నాయి.

సుమారు 2 బిలియన్ డాలర్ల మేర భారతదేశం అందిస్తున్న అభివృద్ధి సహాయం మయన్మార్ లోని సామాన్యుల జీవితాలను స్పర్శిస్తోంది.

అనుసంధానం, కీలకమైన మౌలిక సదుపాయాలు, సామర్ధ్యాలను సంతరించే విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల ప్రాజెక్టులకు తోడ్పడుతున్నాము.

మన భాగస్వామ్యానికి చెందిన కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు ఏవంటే.. :

* నౌకాశ్రయం, జలమార్గంతో సహా కలాదన్ ప్రాజెక్టు ఈ ఏడాది చివరలో పూర్తి కానున్నది ;

* భారతదేశం- మయన్మార్- థాయ్ ల్యాండ్ త్రైపాక్షిక రహదారి పథకం ;

* మయన్మార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ;

* వ్యవసాయ పరిశోధనకు, విద్యకు సంబంధించిన ఆధునిక సంస్థ తో పాటు

* ఆరోగ్యం, విద్య, పారిశ్రామిక శిక్షణ రంగాలలోని చిన్న చిన్న ప్రాజెక్టులు.

69 వంతెనలు, త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టులో – కాలేవా – యార్గీ రహదారి భాగం నిర్మాణం, నవీకరణ లకు సంబంధించి రెండు కార్యాచరణ ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు జరిగాయి.

వ్యవసాయం, బ్యాంకింగ్, విద్యుత్తు, శక్తి రంగాలలో మన సహకారాన్ని మరింత పటిష్ఠపరచుకోవాలని కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాము.

నవీకరణ యోగ్య శక్తి, వైద్యం లో సంప్రదాయ విధానాల అనుసరణ సంబంధిత సహకారంపై కుదుర్చుకున్న అవగాహనపూర్వక ఒప్పందాలు ఈ రంగాలలో మన సహకారాన్ని ఆచరణలోకి తీసుకువస్తాయి.

పప్పు ధాన్యాల వాణిజ్యంలో దీర్ఘకాలిక, ద్వైపాక్షిక ప్రయోజనాల దిశగా పని చేయాలని కూడా అంగీకరించుకున్నాము.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మయన్మార్ లోని తమూ కు విద్యుత్తును సరఫరా చేసే ఒక చిన్న ముందండుగును వేశాము.

మా వైపు నుండి విద్యుత్తు సరఫరాను గణనీయంగా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుల వారికి నేను చెప్పాను.

గౌరవనీయులైన అధ్యక్షుల వారూ,

మయన్మార్ ప్రభుత్వం ప్రాధాన్యాలకు అనుగుణంగా మయన్మార్ తో మా అభివృద్ధి భాగస్వామ్యన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.

స్నేహితులారా,

మన బంధాలను పటిష్ఠపరచుకోడానికి సంస్కృతే కేంద్ర బిందువుగా ఉంది.

మయన్మార్ లోని బగాన్ లో ఉన్న ఆనంద దేవాలయాన్ని మన భాగస్వామ్యం పునరుద్ధరిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.

గత వారం లోనే మయన్మార్ ను తాకిన భూకంపం వల్ల దెబ్బతిన్న ఇతర చారిత్రక కట్టడాలను, పగోడాలను కూడా పునరుద్ధరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

గౌరవనీయులైన అధ్యక్షుల వారూ,

మీ పర్యటన చాలా మంచి సమయంలో చోటుచేసుకొంది.

ఇంకా చెప్పాలంటే మనం జరిపిన చర్చలు సహకారానికి ఒక మార్గసూచీని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి తోడ్పడ్డాయి.

మన సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడానికి, మీతో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.

మయన్మార్ ఉజ్జ్వల భవిష్యత్తు కేవలం మీ లక్ష్యమే కాదు, మా కోరిక కూడా.

మరోసారి గౌరవనీయులైన అధ్యక్షుల వారికి భారత దేశం తరపున స్వాగతం.

మీకు కృతజ్ఞతలు.

మీకు మళ్లీ మళ్లీ ధన్యవాదములు.