Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిజోరమ్ లోని ఐజ్వాల్‌ లో టుయిరియ‌ల్ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశానికి అంకితం చేసిన సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం పాఠం


మిత్రులారా,

చిబై వెక్ ఉలే
లిన్ దం ఎమ్‌

ప్ర‌ధాన మంత్రిగా మిజోరమ్ ను తొలిసారి సంద‌ర్శించే అవ‌కాశం నాకు వ‌చ్చింది. ఎనిమిది మంది సోద‌రీమ‌ణులుగా అంద‌రం వ్య‌వ‌హ‌రించే ఈశాన్య రాష్ట్రాలలో నేను ఇప్ప‌టి వ‌ర‌కు సంద‌ర్శించ‌ని రాష్ట్రం ఇది ఒక్క‌టే. అందుకు మొద‌ట‌గా మీ అంద‌రి నుండి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాను. కానీ ప్ర‌ధాన‌ మంత్రి కాక ముందు నేను మిజోరమ్ ను సంద‌ర్శించాను. ఈ ప్రాంతంలో నెల‌కొన్న నిర్మ‌ల‌మైన‌, అంద‌మైన వాతావ‌ర‌ణం నాకు బాగా ప‌రిచ‌య‌మే. ఈ ప్రాంతం లోని మిత్రుల‌తో నేను మంచి స‌మ‌యాన్నే గ‌డిపాను. మీ అంద‌రి మ‌ధ్య‌కు వ‌చ్చిన ఈ త‌రుణంలో పాత జ్ఞాప‌కాలు ఒక‌సారి గుర్తుకు రావ‌డం స‌హ‌జ‌మే. మీ అంద‌మైన రాష్ట్రాన్ని ఈ రోజు సంద‌ర్శించ‌డం నాకు అప్పటి తీయ‌ని జ్ఞాప‌కాల‌ను, స్నేహ‌భావం గ‌ల మిజోరమ్ ప్ర‌జ‌లతో ఎంతో ఇష్టంగా గ‌డిపిన ఆ రోజుల‌ను గుర్తు చేస్తోంది. మీ అంద‌రికీ- మిజోరమ్ ప్ర‌జ‌లంద‌రికీ- మెరి క్రిస్మస్‌, నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియజేయ‌డం ద్వారా నా ప్ర‌సంగాన్ని ప్రారంభించాల‌నుకొంటున్నాను. ఈ కొత్త ఏడాది మీ అంద‌రికీ ఆనందాన్ని, సంప‌ద‌ను ప్రసాదించాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.

కొద్ది క్ష‌ణాల క్రితం నేను ఐజ్వాల్ లో అడుగు పెట్టిన‌ప్పుడు ‘‘కొండ ప్ర‌జ‌ల రాజ్యం’’ అయిన మిజోరమ్ లోని ఆహ్లాద‌దాయ‌క‌ శోభను చూసి ఎంతో త‌న్మ‌యుడిన‌య్యాను.

ఇది శాంతి కి, ప్ర‌శాంత‌త‌కు ఆల‌వాల‌మైన భూమి.

స‌హృద‌యంతో చ‌క్క‌ని ఆతిథ్యం ఇచ్చే ప్ర‌జ‌లు.

దేశంలో అత్య‌ధిక అక్ష‌రాస్య‌త గ‌ల రాష్ట్రాలలో ఒక‌టి.

అట‌ల్ గారు అధికారంలో ఉన్న కాలంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ప్రాంతీయ అస‌మాన‌త‌లు పూర్తిగా తొల‌గించ‌డ‌మే ఆర్థికాభివృద్ధి యొక్క అతి పెద్ద ల‌క్ష్య‌మ‌ని అట‌ల్ జీ చెబుతూ ఉండే వారు. ఆ దిశ‌గా ఆయ‌న ఎన్నో చ‌ర్య‌లు తీసుకొన్నారు.

2014లో మేం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వ విధానాలలో, నిర్ణ‌యాలలో మేం మ‌రోసారి ఆ శ్రద్ధను వహించాం. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి క‌నీసం ఒక కేబినెట్ మంత్రి ఈశాన్య రాష్ట్రాలను సంద‌ర్శించాల‌నే నియ‌మాన్ని నేను విధించాను. సంద‌ర్శించ‌డం అంటే, ఏదో మొక్కుబ‌డిగా ఉద‌యం వ‌చ్చి తాను పాల్గొనాల్సిన కార్య‌క్ర‌మంలో పాల్గొని సాయంత్రం తిరిగి వెళ్ల‌డం కాదు. నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు మీ అంద‌రినీ క‌లిసి మీ స‌మ‌స్య‌లు ఏమిటన్నది తెలుసుకొని త‌మ మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన విధానాల‌ను అందుకు అనుగుణంగా త‌యారుచేయాల‌న్న‌ది నా ఆలోచ‌న‌.

మిత్రులారా,

గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ఈశాన్య రాష్ట్రాలకు 150 సార్లకు పైగా సంద‌ర్శ‌ించినట్లు నాకు తెలిసింది. మీరు ఢిల్లీ కి వ‌చ్చి మీ స‌మ‌స్య‌లను చెప్పుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌ని, మీ స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ మీరు ప‌దే ప‌దే అభ్య‌ర్థ‌న‌లు పంపాల్సిన అవ‌స‌రం లేని, ఢిల్లీయే మీ ముంగిటికి వ‌చ్చే వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌న్న ఆలోచ‌న దిశ‌గా మేం ప‌ని చేస్తున్నాం.

ఈ విధానాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మీ ముంగిటికి రావ‌డం (డోనెర్ ministry of Development of North East Region.. DoNER At Your Door-step) అని మేం వ్యవహరిస్తున్నాం. మంత్రులే కాదు.. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి త‌న అధికారుల‌తో క‌లిసి ఇక్క‌డ‌కి వ‌చ్చి కొంత స‌మ‌యం ఇక్క‌డ గ‌డ‌పాల‌ని నేను సూచించాను. ఈ చ‌ర్య‌ల‌న్నింటి ఫ‌లితం ఈశాన్య రాష్ట్రాల కోసం రూపొందించే ప‌థ‌కాలలో ప్ర‌తిబింబించింది. ఈశాన్య రాష్ట్రాల విధానాల అమ‌లులో వేగం పెరిగింది. ఈ ప్రాజెక్టుల‌న్నీ ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయి. అవి ఇప్పుడు అద్భుత‌మైన వేగాన్ని అందుకొన్నాయి.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యులు త‌యారు చేసిన వ‌స్తువుల‌తో ఏర్పాటైన అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న నేను ఇప్పుడే తిల‌కించాను. వారి లోని అద్భుత‌మైన ప్ర‌తిభ‌కు, సామర్థ్యాల‌కు ఆ స‌భ్యులంద‌రినీ నేను అభినందిస్తున్నాను. ఈ సామ‌ర్థ్యాల‌ను వెలికి తీసుకురావ‌డ‌మే కేంద్ర‌ ప్ర‌భుత్వం ల‌క్ష్యం. దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న ప్ర‌ధాన ల‌క్ష్యాలలో ఇది ఒక‌టి.

కేంద్ర‌ప్ర‌భుత్వం అందిస్తున్నవ‌డ్డీ స‌బ్సిడీ తో ఈశాన్య ప్రాంత అభివృద్ధి ఆర్థిక స‌హాయ సంస్థ క‌ల్పించిన క్రెడిట్ లింకేజ్ ద్వారా స్వ‌యం స‌హాయ‌క బృందాలు లాభం పొందుతున్నాయి.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈశాన్య రాష్ట్రాల హ‌స్త‌క‌ళ‌లు, చేనేత అభివృద్ధి సంస్థ, ఈశాన్య ప్రాంత వ్య‌వ‌సాయ మార్కెటింగ్ కార్పొరేష‌న్‌ కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని నా దృష్టికి వ‌చ్చింది. ప్ర‌భుత్వ రంగం లోని ఈ సంస్థ‌లు క‌ళాకారులు, చేనేతకారులు, రైత‌న్న‌ల‌ను చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తూ మార్కెటింగ్, ఫూడ్ ప్రాసెసింగ్ ల వంటి విభాగాలలో శిక్ష‌ణ ఇస్తున్నాయి. సిఎస్ఐఆర్‌, ఐసిఎఆర్‌, ఐఐటి లు అభివృద్ధి చేసే సాంకేతిక విజ్ఞానాలు, ఉత్ప‌త్తులు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో సైతం ఉప‌యోగ‌క‌రంగా ఉండేటట్టు, స్థానిక ఉత్ప‌త్తుల‌కు విలువ జోడించేందుకు స‌హాయ‌ప‌డేటట్టు త‌యారు చేయాలి.

మిత్రులారా, ఈ రోజు మ‌నమంద‌రం మిజోరమ్ చ‌రిత్ర‌ లోనే ఒక మైలురాయిగా నిలిచే ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాం.
60 మెగావాట్ల సామ‌ర్థ్యం గ‌ల టుయిరియ‌ల్ జ‌ల‌విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్త‌యి దేశానికి అంకితం చేస్తున్న శుభ‌ త‌రుణం ఇది. 13 సంవ‌త్స‌రాల క్రితం ఈశాన్య రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తి చేసుకొన్న‌ ప్ర‌భుత్వ రంగం లోని కోపిలి స్టేజ్ 2 జ‌ల విద్యుత్తు పథకం అనంతరం ప్రారంభిస్తున్న మ‌రో ప్రాజెక్టు ఇదే.

మిజోరమ్ లో విజ‌య‌వంతంగా ప్రారంభించిన కేంద్ర‌ ప్ర‌భుత్వ రంగంలోని మ‌రో భారీ జ‌ల‌ విద్యుత్తు పథకం ఇది. రాష్ర్టంలో ఏర్పాటైన తొలి భారీ జ‌ల‌ విద్యుత్తు కేంద్రం కూడా ఇదే. ఏడాదికి 251 మిలియ‌న్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం గ‌ల ఈ ప్రాజెక్టు రాష్ర్ట సామాజిక‌ అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది.

ఈ ప్రాజెక్టు ప్రారంభం కావ‌డంతో మిజోరం ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, త్రిపుర ల త‌రువాత మిగులు విద్యుత్తు ఉన్న మూడో రాష్ర్టంగా మార‌నుంది.
అప్ప‌ట్లో వాజ్ పేయి గారు ప్ర‌ధాని గా ఉన్న స‌మ‌యంలో 1998 లోనే ఈ ప్రాజెక్టుకు అనుమతి తెలిపారు. కానీ ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ప్ర‌స్తుతం న‌డుస్తున్న ప్రాజెక్టుల‌న్నింటినీ పూర్తి చేయాల‌న్న మా చిత్త‌శుద్ధికి ద‌ర్ప‌ణం ఇది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఒక కొత్త శ‌కాన్ని ఆవిష్క‌రిస్తుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్తు ఉత్ప‌త్తి కావ‌డంతో పాటు జలాశయం లోని నీరు నౌకాయానానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఇది మారుమూల ప్రాంతాల‌కు అనుసంధాన‌ం క‌ల్పిస్తుంది. నలభై అయిదు చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం గ‌ల అతి పెద్ద రిజ‌ర్వాయ‌ర్ మ‌త్స్య‌ సంప‌ద అభివృద్ధికి కూడా స‌హాయ‌కారిగా ఉంటుంది.

ఈ ప్రాజెక్టు ఎకో టూరిజంను పెంచుతుంది. మంచినీటి స‌ర‌ఫ‌రాకు ఉత్తేజం ఇస్తుంది. మిజోరమ్ రాష్ట్రానికి 2100 మెగావాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం ఉన్న‌ట్టు నాకు తెలిసింది. కానీ మ‌నం ఇప్ప‌టికి అందులో స్వ‌ల్ప భాగాన్ని మాత్ర‌మే వినియోగంలోకి తెచ్చాం.

మిజోరమ్ విద్యుత్తు ను నిక‌రంగా ఎగుమ‌తి చేసే రాష్ర్టంగా అవ‌త‌రించ‌క‌పోవ‌డానికి ఎటువంటి కార‌ణాలు నాకు క‌నిపించ‌డం లేదు. అందుకే మిగులు విద్యుత్తు ను విద్యుత్తు కొర‌త‌తో అల్లాడుతున్న రాష్ట్రాలకు ఎగుమ‌తి చేయ‌డానికి వీలు క‌ల్పించే అత్యాధునిక ట్రాన్స్ మిష‌న్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేయాల‌ని మేం భావిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాలలో విద్యుత్ ట్రాన్స్ మిష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మ‌గ్ర స్థాయిలో మెరుగు ప‌రిచేందుకు నా ప్ర‌భుత్వం 10 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తోంది.

మిత్రులారా,

స్వాతంత్ర్యం సిద్ధించిన ఏడు ద‌శాబ్దాల త‌రువాత కూడా దేశంలో 4 కోట్ల‌కు పైగా ఇళ్లు విద్యుత్తు క‌నెక్ష‌న్‌కు నోచుకోలేదు. 18వ శ‌తాబ్దిలో ప్ర‌జ‌లు ఎలాంటి జీవ‌నం గ‌డిపి ఉంటారో మీరు ఊహించుకోవ‌చ్చు. మిజోరమ్ లోనే వేలాది కుటుంబాలు విద్యుత్తు స‌దుపాయానికి నోచుకోకుండా జీవ‌నం గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఉంది. అటువంటి కుటుంబాల‌న్నింటికీ విద్యుత్తు వెలుగులను అందించే ల‌క్ష్యంతో ‘ప్ర‌ధాన‌ మంత్రి స‌హ‌జ్ బిజ్లి – హ‌ర్ ఘ‌ర్ యోజ‌న – లేదా సౌభాగ్య’ SAUBHAGYA ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్రారంభించింది. వీలైనంత త్వ‌ర‌గా దేశంలోని ప్ర‌తి ఒక్క కుటుంబానికి విద్యుత్తు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాల‌న్న‌దే మా ల‌క్ష్యం.

ఈ పథకం కింద 16 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తాం. ఈ ప‌థ‌కం కింద విద్యుత్ క‌నెక్ష‌న్ ను అందజేసే కుటుంబాల నుండి ప్ర‌భుత్వం ఎటువంటి చార్జిని తీసుకోదు. ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు తేవ‌డం, వారి జీవితాల‌ను కాంతివంతంగా చూడాల‌న్న‌దే మా ఆకాంక్ష‌.

మిత్రులారా,

మ‌నం ఇత‌ర ప్రాంతాల‌తో స‌రిపోల్చుకుని చూసుకొంటే ఈశాన్య ప్రాంతాల‌కు చెందిన ప‌లువురు పారిశ్రామికులు వారు ఎద‌గాల్సినంత ఎత్తుకు ఎద‌గ‌లేక‌పోయారు. స్వంత వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రులు యువ‌ పారిశ్రామిక‌వేత్త‌లు స‌మీక‌రించుకోలేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. యువ‌కుల అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే మేం ‘ప్ర‌ధాన‌ మంత్రి ముద్రా యోజ‌న‌’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ మరియు స్టాండ్- అప్ ఇండియా’ ల వంటి ప‌థ‌కాలను ప్రారంభించాం. డోన‌ర్ మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంతాల అవ‌స‌రాల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యమిస్తూ 100 కోట్ల రూపాయ‌ల‌తో ఒక వెంచ‌ర్ కేపిట‌ల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. కేంద్ర‌ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోని ఈ ప‌థ‌కాల నుండి గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని మిజోరం యువ‌త‌కు నేను పిలుపు ఇస్తున్నాను. స్టార్ట్- అప్ లోకంలో అద్భుతాలను ఆవిష్క‌రించ‌గ‌ల సామ‌ర్థ్యాలు, సాహ‌సం ఈశాన్య ప్రాంతాల యువ‌త‌కు ఉన్నాయి. వారిని చేయి ప‌ట్టుకొని ముందుకు న‌డిపించాల‌న్న‌ది ప్ర‌భుత్వ క‌ట్టుబాటు.

భార‌తదేశ యువ‌త నైపుణ్యాలపైన, బ‌లాల‌పైన మాకు అచంచ‌లమైనటువంటి విశ్వాసం ఉంది. “పారిశ్రామిక ధోర‌ణుల‌తో సాధికార‌త” సూత్రాన్ని మేం గ‌ట్టిగా న‌మ్ముతున్నాం. అప్పుడే న‌వ‌క‌ల్ప‌న‌ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డి ప‌రిశ్ర‌మ‌లు అవ‌త‌రిస్తాయి. మాన‌వాళి జీవితంలో పెను మార్పులను తీసుకురాగ‌ల పెద్ద ఆలోచ‌న‌ల‌కు భార‌తదేశం నిల‌యం అవుతుంది.

2022 వ సంవ‌త్స‌రంలో భార‌తదేశం 75 సంవ‌త్స‌రాల స్వాతంత్ర్య జీవ‌న‌యానాన్ని పూర్తి చేసుకోనుంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం సాధించిన విజ‌యాలను ఆస‌రాగా చేసుకొని స‌రికొత్త ప‌థాన్ని నిర్మించుకొనేందుకు, ప్ర‌ణాళికను రూపొందించుకొనేందుకు వ‌చ్చే ఐదేళ్ల కాలం మంచి అవ‌కాశాల‌ను ముందుకు తెస్తుంది. 2022 కల్లా స‌రికొత్త భార‌తావ‌నిని ఆవిష్క‌రించాలంటే ఆర్థికాభివృద్ధిని ఉద్దీపింప‌చేయ‌డం, ఆ అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ అందేలా చూడ‌డం అనే రెండు భారీ ల‌క్ష్యాలు స్వీక‌రించవలసివుంటుంది. ‘స‌బ్‌కా సాథ్- స‌బ్ కా వికాస్’ (అందరితో కలిసి – అందరి అభివృద్ధి) స్ఫూర్తితో కొత్త సుసంప‌న్న‌త బాట‌లో భాగ‌స్వాముల‌య్యే అవ‌కాశం కుల‌ వివక్ష, లింగ‌ వివక్ష, మ‌త‌ వివక్ష, వ‌ర్గ వివ‌క్షలు లేకుండా ప్ర‌తి ఒక్క భార‌తీయునికి అందించాలి.

అన్ని రాష్ట్రాలు స‌మానంగా పోటీ ప‌డ‌గ‌ల అవ‌కాశాలున్న స్పర్ధాత్మకమైన, స‌హ‌కారపూర్వక సమాఖ్య విధానాన్ని నా ప్ర‌భుత్వం విశ్వ‌సిస్తుంది. ప‌రివ‌ర్త‌న‌కు రాష్ట్రాలే చోద‌క‌ శ‌క్తులు అని నేను గ‌ట్టిగా విశ్వ‌సిస్తాను. రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య‌వంత‌మైన స్పర్ధను నెల‌కొల్ప‌డానికి మేం ఎన్నో చర్యలు తీసుకొన్నాం. కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌ లోని ప‌థ‌కాల హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌కు మేం ముఖ్య‌మంత్రుల స్థాయి సంఘాన్ని వేశాం. వారి సిఫారసులను ఆమోదించాం. ఎన్నో ఆర్థిక ప్ర‌తిబంధ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ పథకాలలో ఈశాన్య రాష్ట్రాల వాటాను 90:10 శాతంగా కొన‌సాగించాం, ఇత‌ర స్కీముల‌కు ఇది 80:20 నిష్ప‌త్తిలో ఉంటుంది.

మిత్రులారా,

అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ స‌మానంగా అందిన‌ప్పుడే స‌రికొత్త భార‌తావ‌ని క‌ల సాకారం అవుతుంది. వివిధ సామాజిక సూచిక‌ల ద్వారా మ‌దింపు చేయ‌గా సాపేక్షంగా వెనుక‌బ‌డిన‌విగా గుర్తించిన 115 జిల్లాల కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లను కేంద్రం సిద్ధం చేసింది. మిజోరమ్ తో స‌హా ఈశాన్య రాష్ట్రాల్లోని వెనుక‌బ‌డిన జిల్లాలు కూడా ఇందులో ల‌బ్ధిని పొందుతాయి.

నిన్న‌నే మేం కొత్త‌గా కేంద్రం నిర్వహ‌ణ‌లోని ఒక ప‌థ‌కాన్ని ఆమోదించాం. ఈశాన్య ప్రాంత ప్ర‌త్యేక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప‌థ‌కంగా వ్య‌వ‌హ‌రించే ఆ ప‌థ‌కం వ‌ల్ల రెండు విభాగాల్లో మౌలిక‌ వ‌స‌తుల ప‌ర‌మైన లోటుపాట్ల‌ను స‌రిదిద్ద‌డం జ‌రుగుతుంది. వాటిలో ఒక‌టి నీటిస‌ర‌ఫ‌రా, విద్యుత్‌, అనుసంధాన‌త ప్ర‌త్యేకించి పర్యాటక వ‌స‌తుల అభివృద్ధికి భాగ‌స్వామ్యం గ‌ల భౌతిక మౌలిక వ‌స‌తుల విభాగం. రాష్ర్ట ప్ర‌భుత్వాల‌తో చ‌ర్చించిన త‌రువాత‌నే ఈ కొత్త పథకాన్ని రూపొందించాం. ప్ర‌స్తుతం అమ‌లు జ‌రుగుతున్న ప్రాజెక్టుల‌న్నింటినీ 2022 మార్చి నెల కల్లా పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ఎన్ఎల్ సిపిఆర్ కు నిధులను స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది.

ఈ కొత్త పథకానికి నూరు శాతం కేంద్ర‌ ప్ర‌భుత్వ‌మే నిధులు క‌ల్పిస్తుంది. గ‌తంలోని ఎన్ఎల్ సిపిఆర్ ప‌థ‌కంలో 10 శాతం నిధులు రాష్ట్రాలు భ‌రించాల్సి వ‌చ్చేది. కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం కింద వ‌చ్చే మూడేళ్ల కాలంలో 5300 కోట్ల రూపాయ‌ల నిధులు ఈశాన్య రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు కేంద్రం అందిస్తుంది.

స‌రైన అనుసంధాన‌త లేక‌పోవ‌డం ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద అవ‌రోధం. ఈ ప్రాంతంలో ర‌వాణా మౌలిక వ‌స‌తులలో పెట్టుబడుల ద్వారా ర‌వాణాతో ప‌రివ‌ర్త‌న తీసుకురావాల‌న్న‌ది మా ధ్యేయం. గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో కేంద్ర‌ ప్ర‌భుత్వం 3800 కిలోమీట‌ర్ల రహదారుల నిర్మాణం కోసం 32 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌ను మంజూరు చేసింది. అందులో 1200 కిలోమీట‌ర్ల నిడివి గ‌ల రోడ్ల నిర్మాణం ఇప్ప‌టికే పూర్త‌యింది.

ఈశాన్య‌ప్రాంతాల‌కు స్పెష‌ల్ యాక్సిల‌రేటెడ్ రోడ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర‌ ప్ర‌భుత్వం మ‌రో 60 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించింది. భార‌త్ మాల ప్రాజెక్టు కింద ఈశాన్య ప్రాంతంలో రోడ్లు, హైవేల నిర్మాణానికి మ‌రో 30 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది.

47 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో 15 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం ప్రాజెక్టుల‌ను కూడా కేంద్ర‌ ప్ర‌భుత్వం అమ‌లుప‌రుస్తోంది. మిజోరంలోని భైర‌బి నుండి అస్సాం లోని సిల్చార్ మ‌ధ్య‌ రైలు మార్గాన్ని ప్రారంభించ‌డం ద్వారా గ‌త ఏడాదే మిజోరమ్ రైల్వే అనుసంధానం సాధించింది. ఐజ్వాల్ కు రైల్ అనుసంధాన‌ం క‌ల్పించే కొత్త లైను నిర్మాణానికి నేను శంకుస్థాప‌న చేశాను. రాష్ర్ట ప్ర‌భుత్వ స‌హ‌కారంతో రాజ‌ధాని ఐజ్వాల్ కు బ్రాడ్ గేజ్ మార్గాన్ని కూడా మేం నిర్మిస్తాం.

కేంద్ర‌ప్ర‌భుత్వం “యాక్ట్ ఈస్ట్” విధానాన్ని క్రియాశీలంగా అనుస‌రిస్తోంది. ఈ విధానం నుండి ఆగ్నేయాసియాకు గేట్ వే గా నిలిచే మిజోరమ్ ఎంతో లాభం పొందుతుంది. మ‌య‌న్మార్‌, బంగ్లాదేశ్ ల‌తో వాణిజ్యానికి ప్ర‌ధాన ట్రాన్సిట్ పాయింట్ గా మిజోరమ్ నిలుస్తుంది.
వివిధ ద్వైపాక్షిక ప్రాజెక్టులు కూడా పూర్తి కావ‌డానికి భిన్న ద‌శ‌లలో ఉన్నాయి. వాటిలో క‌లందం మ‌ల్టి- మోడ‌ల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టు, రిహ్-టెడిమ్ రోడ్డు ప్రాజెక్టు, బోర్డ‌ర్ హాట్స్ ప్రాజెక్టు ప్ర‌ధాన‌మైన‌వి. ఈ ప్రాజ‌క్టుల‌న్నీ ఆర్థిక అనుసంధాన‌ం ప‌రిధిని విస్త‌రిస్తాయి. ఈశాన్య ప్రాంతం ఆర్థికాభివృద్ధికి, స‌ర్వ‌స‌మ‌గ్ర అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌తాయి.

మిత్రులారా,

గ‌రిష్ఠ అక్ష‌రాస్య‌త‌, అంద‌మైన ప‌రిస‌రాలు, ఆంగ్లం మాట్లాడ‌గ‌ల ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో ఉండ‌డం మిజోరమ్ ఒక న‌మూనా ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు దోహ‌ద‌ప‌డే అంశాలు. అడ్వెంచ‌ర్ టూరిజమ్, సాంస్కృతిక, ఎకో టూరిజమ్, వ‌న్య‌ప్రాణి టూరిజం, క‌మ్యూనిటీ ఆధారిత గ్రామీణ టూరిజమ్ ల వంటివి విస్త‌రించేందుకు మిజోరమ్ కు మంచి అవ‌కాశాలు ఉన్నాయి. ఇవ‌న్నీ చ‌క్క‌గా అభివృద్ధి చేసిన‌ట్లయితే రాష్ర్టంలో భారీ సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించిన రంగంగా టూరిజం రంగం నిలుస్తుంది. గ‌త రెండు సంవత్సరాల కాలంలో ఎకో టూరిజమ్ ను, అడ్వెంచ‌ర్ టూరిజమ్ ను ప్రోత్స‌హించేందుకు మిజోరమ్ కు 194 కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల రెండు టూరిజం ప్రాజెక్టుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల అమ‌లు కోసం 115 కోట్ల రూపాయ‌లు ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.

మిజోరమ్ లోని వ‌న్య‌ ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రాలు, జాతీయ పార్కుల‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు వీలుగా మెరుగుప‌రచేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయం అందించ‌డానికి కూడా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. మిజోరమ్ ను భార‌తదేశం లో ఆక‌ర్ష‌ణీయ‌మైన వినోద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మ‌నంద‌రం క‌లిసి ప‌ని చేద్దాం.

మిత్రులారా,

దేశంలోని ఈ ప్రాంతం ఎటువంటి క‌ర్బ‌న వ్య‌ర్థాలు లేనిదిగా ప్ర‌క‌టించుకోగ‌ల అర్హ‌తను క‌లిగి వుంది. మ‌న మిత్ర దేశం భూటాన్ ఇప్ప‌టికే త‌న‌ను తాను కర్బ‌న ర‌హిత ప్ర‌దేశంగా ప్ర‌క‌టించుకొంది. ఈశాన్యం లోని ఎనిమిది రాష్ట్రాలు క‌లిసిక‌ట్టుగా వాటి ప్ర‌య‌త్నాల‌ను వేగ‌వంతం చేసిన‌ట్ట‌యితే యావత్తు ఈశాన్య ప్రాంతం క‌ర్బ‌న వ్య‌ర్థాలు లేని మండ‌లంగా ప్ర‌క‌టించుకోవ‌చ్చు. దాని వ‌ల్ల వాటికి ప్ర‌పంచ చిత్ర‌ ప‌టంలో ప్ర‌త్యేక స్థానం కూడా ల‌భిస్తుంది. సిక్కిమ్ త‌ర‌హాలో క‌ర్బ‌న వ్య‌ర్థ‌ ర‌హిత ప్రాంతంగా ప్ర‌క‌టించుకొనేందుకు ఈశాన్య రాష్ర్ట ప్ర‌భుత్వాల‌న్నీ త‌మ కృషిని మ‌రింత‌గా ముమ్మరం చేయాలి.

సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం సాంప్ర‌దాయిక వ్య‌వ‌సాయ అభివృద్ధి పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద దేశంలోని భిన్న ప్రాంతాలలో 10 వేల ఆర్గానిక్ క్ల‌స్ట‌ర్ల‌ను అభివృద్ధి చేయ‌త‌ల‌పెట్టింది. ఈశాన్యంలో కూడా వంద‌లాది మంది రైతులు ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్ లను స్థాపించారు. 50 వేల మందికి పైగా రైతులు వారితో అనుసంధాన‌మై ఉన్నారు. ఈ ప్రాంతంలోని రైతులంద‌రూ త‌మ ఆర్గానిక్ ఉత్ప‌త్తుల‌ను ఢిల్లీలో విక్ర‌యించేందుకు కూడా ఏర్పాట్లు జ‌రిగాయి.

మిత్రులారా,

2022వ సంవ‌త్స‌రంలో మ‌న దేశం 75వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించుకుంటుంది. అప్ప‌టికి నూరు శాతం సేంద్రియ, క‌ర్బ‌న వ్య‌ర్థ ర‌హిత ప్రాంతంగా రూపాంత‌రం చెందాల‌ని మిజోరమ్ ప్రతిన పూనాలి. ఆ ప్రతినను నెరవేర్చుకోవడంలో మీకు కేంద్ర‌ ప్ర‌భుత్వం పూర్తిగా అండ‌గా ఉంటుంద‌ని నేను హామీ ఇస్తున్నాను. చిన్న‌వైనా స‌రే, మీ స‌మ‌స్య‌ల‌ను మేం అర్ధం చేసుకొని వాటిని ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నాం. మీకు వెదురుకు సంబంధించిన ఒక ఉదాహ‌ర‌ణను చెప్పాల‌నుకుంటున్నాను.

ఈశాన్యంలోని ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి వెదురు ఒక వ‌న‌రుగా నిలుస్తోంది. కానీ దీనిపై ఎంతో క‌ట్టుదిట్ట‌మైన నియంత్ర‌ణ ఉంది. ప‌ర్మిట్ లేకుండా మీ సొంత క్షేత్రంలో మీరు పండించిన వెదురును విక్ర‌యించ‌కూడ‌దు లేదా ర‌వాణా చేయ‌కూడ‌దు. ఆ ఇబ్బందిని త‌ప్పించేందుకు మా ప్ర‌భుత్వం ఆ నియంత్ర‌ణ వాతావ‌ర‌ణాన్నే మార్చివేసింది. ఇప్పుడు వెదురు ఉత్ప‌త్తి, ర‌వాణా, విక్ర‌యంలపై ఎటువంటి ఆంక్ష‌లు లేవు. ఇది ల‌క్ష‌లాది వ్య‌వ‌సాయ‌దారుల‌కు ఎంతో లాభం చేకూరుస్తుంది. 2022 నాటికి రైత‌న్న‌ల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌న్న ప్ర‌య‌త్నాల‌కు ఊతం ఇస్తుంది.

నేను మిజోరమ్ కు రావ‌డం, ఫుట్ బాల్ ను గురించి మాట్లాడ‌కుండా ఉండడం సాధ్యమయ్యే పని కాదు. మిజో క్రీడాకారుడు జెజె లాల్‌పెక్లువా యావ‌త్ ప్ర‌పంచాన్ని త‌న వైపునకు ఆక‌ర్షించాడు. ఒక‌ ర‌కంగా చెప్పాలంటే, ఫుట్ బాల్ మిజోరమ్ లోని ప్ర‌తి ఇంటి జీవ‌నంలో ఒక భాగం. ఈ రంగంలో స్థానిక ప్ర‌తిభ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఫిఫా, ఐజ్వాల్ ఫుట్ బాల్ క్ల‌బ్ లు కలిసి ఒక పైల‌ట్ ప్రాజెక్టు చేప‌ట్టాయ‌ని నాకు తెలియ‌ చేశారు.

2014 సంవ‌త్స‌రంలో మిజోరమ్ తొలిసారిగా సంతోష్ ట్రాఫీని కైవ‌సం చేసుకున్న‌ప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులంతా హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తించారు. క్రీడారంగంలో సాధిస్తున్న విజ‌యాల ప‌ట్ల మిజో ప్ర‌జ‌ల‌కు నేను అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. మిజోకు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిని తీసుకురాగ‌ల క్రీడ ఫుట్ బాల్‌. రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు ప్ర‌తిష్ఠ‌లు తీసుకు వ‌చ్చిన ప్ర‌ముఖ క్రీడాకారులెంద‌రో మిజోరమ్ లో ఉన్నారు. ఒలింపియ‌న్ ఆర్చ‌ర్ సి ల‌ల్‌రెంసంగం, బాక్స‌ర్ జెన్నీ లాల్ రెంలియానీ, వెయిట్ లిఫ్ట‌ర్ లాల్‌చ‌హిమి, హాకీ క్రీడాకారిణి ల‌ల్ రువ‌ఫేలి లు ప్ర‌పంచ రంగస్థలం మీద ప్ర‌తిభాపాట‌వాలను ప్ర‌ద‌ర్శించిన వారిలో కొంద‌రు.

మిత్రులారా,

ప్ర‌పంచం లోని కొన్ని ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కేవ‌లం క్రీడ‌ల పైనే ఆధార‌ప‌డ‌తాయి. క్రీడ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం ద్వారా అవి ప్ర‌పంచం మొత్తం నుండి క్రీడాభిమానుల‌ను ఆక‌ర్షిస్తాయి. ఈశాన్య భారతంలో గ‌ల క్రీడా సామ‌ర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర‌ ప్ర‌భుత్వం ఇంఫాల్ లో క్రీడా విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటైన అనంత‌రం అన్ని ర‌కాల శిక్ష‌ణ వ‌స‌తుల‌తో ప‌రిపూర్ణంగా సుశిక్షితుల‌య్యే అవ‌కాశం ఈశాన్య ప్రాంత యువ‌త‌కు ఏర్ప‌డుతుంది. ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని దేశీయుల‌కే కాకుండా విదేశీ సంద‌ర్శ‌కుల‌కు కూడా ప్ర‌వేశం క‌ల్పించేదిగా త‌యారు చేయాల‌న్న‌ది మా ధ్యేయం. దీని వ‌ల్ల ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు విదేశాల‌ను కూడా సంద‌ర్శించి అక్క‌డ అందుబాటులో ఉన్న క్రీడా శిక్ష‌ణా సదుపాయాలను ఉప‌యోగించుకోగ‌లుగుతారు.

ఐజ్వాల్ లో క్రిస్మస్ పండుగ‌ను వ‌ర్ణ‌శోభితంగా చేసుకోవ‌డానికి కావ‌ల‌సిన రంగులతో కూడిన పండుగ క‌ళను నేను గ‌మ‌నిస్తున్నాను. మ‌రోసారి మిజోరమ్ ప్ర‌జ‌లంద‌రికీ మెరి క్రిస్మస్‌.

ధ‌న్యవాదాలు.

యైన్ వ‌య చూంగా క- లోం యై మంగాచా

*****