పిఎంఇండియా
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన ‘హ్యాట్రిక్‘లా అనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. “వికసిత భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని కూడా అంతటి కీలకమైనదని ఈ హ్యాట్రిక్ చాటిచెబుతోంది” అని శ్రీ మోదీ అన్నారు.
ఫిన్‌టెక్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ రంగంలో పెరుగుతున్న ఉత్సాహం, యువత భాగస్వామ్యం, ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సరికొత్త అవకాశాలకు బాటలు వేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో కనిపిస్తున్న ఈ సజీవ ప్రగతి దేశ భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని మరింత పెంచుతోందని ఆయన అన్నారు. “అందుకే వికసిత్ భారత్ భవిష్యత్తుపై నా విశ్వాసం రోజురోజుకూ మరింత బలోపేతమవుతోంది” అని అన్నారు.
సాంకేతిక ఆవిష్కరణలకు, సాంస్కృతిక వేడుకలకు అందమైన అనుబంధాన్ని వివరిస్తూ, మహారాష్ట్రతో పాటు దేశమంతటా ఎంతో ఉత్సాహంతో జరుపుకొనే గణేష్ ఉత్సవాల పండుగ వాతావరణాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. శుభకార్యాలు ప్రారంభించే ముందు దైవానుగ్రహం పొందే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన విఘ్నేశ్వరునికి నమస్కరించారు. “గణపతి బప్పాకు నమస్కరిస్తూ, మీ అందరికీ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 శుభాకాంక్షలు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఇంధనంతో పాటు సరుకుల సరఫరా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి వంటి క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ నమోదు చేసిన 7.8 శాతం బలమైన వృద్ధి రేటును ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ సమాజానికి కొత్త నమ్మకాన్ని ఇస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ఆయన ప్రశంసించారు. “ఆ నమ్మకం ఇక్కడ ఉన్న మీ అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత ఆర్థిక పురోగతికి లభించిన ఒక ప్రధాన గుర్తింపును ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, మూడు దశాబ్దాల తర్వాత జపాన్‌కు చెందిన ఒక క్రెడిట్ రేటింగ్ సంస్థ దేశ సార్వభౌమ రేటింగ్‌ను ‘ ఏ-‘ కేటగిరీకి పెంచడాన్ని అభినందించారు. ఈ చారిత్రాత్మక మైలురాయికి వ్యవస్థాగత సంస్కరణలు, స్థూల ఆర్థిక స్థిరత్వమే కారణమని పేర్కొంటూ, దేశ వృద్ధి వేగం ఏమాత్రం ఆగదని స్పష్టం చేశారు. “భారత్ చేపట్టిన ఈ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మరింత వేగంగా ముందుకు సాగుతుందని నేను మళ్లీ చెబుతున్నాను” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సాంకేతిక రంగంలో భారత్ సాధించిన అద్భుత పురోగతిని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ, ఈ మార్పులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) నిస్సందేహంగా అత్యంత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. దేశంలో విప్లవాత్మకంగా మారిన ఫిన్‌టెక్ ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు ఈ వేదిక సాధించిన ప్రభావాన్ని ప్రస్తావించకపోతే ఆ చర్చ అసంపూర్ణంగానే ఉంటుందని, గతేడాది వేడుకల్లో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని ఆయన ఉద్ఘాటించారు. “ఇది ఎంతటి విప్లవాత్మక మార్పంటే, ఫిన్‌టెక్ గురించి ఎప్పుడు చర్చించినా యుపిఐ ప్రసక్తి లేకుండా అది పూర్తవదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఆగస్టు 25న జరుపుకున్న యుపిఐ పదవ వార్షికోత్సవాన్ని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ, ప్రారంభంలో ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాలతో నేటి వాస్తవ పరిస్థితులను పోల్చారు. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న కోట్లాది మంది పౌరులే నేడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలను ప్రజల చేతుల్లోకి తీసుకురావాలనే తన తొలి ఆలోచనను మేధావులు ఒకప్పుడు అసాధ్యమని భావించారని ఆయన గుర్తుచేశారు. “తరతరాలుగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న అదే కోట్లాది మంది ప్రజలు నేడు భారతదేశంలో ఫిన్‌టెక్ వృద్ధికి ప్రధాన శక్తిగా మారారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అతిపెద్ద నిర్వహణ గణాంకాలను ప్రధానమంత్రి వెల్లడిస్తూ, ఒక్క ఆగస్టు నెలలోనే 24 బిలియన్లకు పైగా యుపిఐ లావాదేవీలు జరిగాయని, అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి పది నిమిషాల్లోనే దాదాపు 50 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ అసాధారణమైన వినియోగ వేగం కేవలం సాంకేతికతకు మాత్రమే పరిమితం కాలేదని స్పష్టం చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. “ఈ ప్రభావం వల్లే యుపిఐ కేవలం ఒక సాంకేతిక ప్రయాణం మాత్రమే కాదని, ఇదొక నాగరికతా ప్రయాణమని అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారతదేశ ప్రధాన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్త విస్తరణను ప్రధానమంత్రి సగర్వంగా ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 11 దేశాల్లో యుపిఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఒకప్పుడు అసాధ్యమనుకున్న అంతర్జాతీయ చెల్లింపులను ఇది దైనందిన వాస్తవంగా మార్చిందని ప్రకటించారు. ఈ అద్భుత గణాంకాలు దేశం సాధించిన సుదీర్ఘ ప్రగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. “మనం ఎంత సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేశామో ఈ అద్భుత గణాంకాలే చెబుతున్నాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భావి లక్ష్యాలకు బాటలు వేస్తూ ప్రస్తుత విజయాలను గమ్యస్థానంగా కాకుండా ఒక ప్రారంభ బిందువుగా మాత్రమే చూడాలని పరిశ్రమాధిపతులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. విధాన రూపకల్పన, అమలులో తనకున్న 25 ఏళ్ల అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ నిరంతర పురోగతి సాధించడమే తన సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. “ఒక లక్ష్యం పూర్తవ్వగానే, అంతకంటే పెద్ద లక్ష్యం సాధించేందుకు నేను సమాయత్తమవుతాను” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల తదుపరి వ్యూహాత్మక దిశను ప్రధానమంత్రి ప్రముఖంగా చెబుతూ, సింగపూర్‌తో ఇప్పటికే ఏర్పడిన సునాయాస సరిహద్దు లావాదేవీల అనుసంధానం లాగే ఇతర భాగస్వామ్య దేశాల స్వదేశీ చెల్లింపు వ్యవస్థలతో యుపిఐని అనుసంధానించాల్సిన అత్యవసర ప్రాధాన్యతను స్పష్టం చేశారు. భారతీయులు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాలలో, వాణిజ్యం భారీగా జరిగే దేశాలలో ఆర్థిక నెట్‌వర్క్‌లను క్రియాశీలంగా జతచేయాలని ఆయన సంబంధిత భాగస్వాములను ఆదేశించారు. “భారతీయులు ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో, భారత్ ఎక్కడైతే విస్తృత స్థాయిలో వాణిజ్యం సాగిస్తుందో, ప్రపంచంలో ఏ దేశమైతే మనతో కలసి నడవడానికి సిద్ధంగా ఉందో వారందరినీ అనుసంధానించే దిశగా మనం పనిచేయాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రవాస భారతీయులకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలను ప్రధానమంత్రి వివరిస్తూ, ప్రపంచంలోనే అత్యధికంగా స్వదేశానికి నిధులు పంపే భారతీయ వర్గానికి లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా స్వదేశంలోని కుటుంబాలకు నిధులు వేగంగా చేరుతాయని ఆయన వివరించారు. “దీనివల్ల కూడా భారతీయులకు యుపిఐ ఆదా కలిగిస్తుంది, అలాగే స్వదేశంలోని భారతీయ కుటుంబాలకు డబ్బు మరింత వేగంగా చేరుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఆర్థిక మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. విదేశీ నమూనాలతో రూపొందించిన కార్డ్ చెల్లింపుల ప్రమాణాలపై ఆధారపడే పాత పద్ధతిని విమర్శిస్తూ, స్వదేశీ నిబంధనలు, ప్రోటోకాల్‌లను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేసే సామర్థ్యం భారతీయ పరిశ్రమకు పూర్తిస్థాయిలో ఉందని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. “ఇప్పుడు మన స్వంత నిబంధనలు, ప్రమాణాలను రూపొందించుకుని ప్రపంచంతో అనుసంధానం చేయగలం” అని శ్రీ మోదీ అన్నారు.
సాంకేతిక సాధికారతపై తన మూల దృక్కోణాన్ని పునరుద్ఘాటిస్తూ- సంప్రదాయ బ్యాంకింగ్ విధానాలు విస్మరించిన రంగాల్లోకి విజయవంతంగా చొచ్చుకుపోతున్న యూపీఐని, ఆర్థిక సార్వజనీనత సాధనలో అంతిమ ఉపకరణంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. వ్యక్తికి నేరుగా సేవా ప్రదానమే ఆవిష్కరణల వాస్తవ లక్షణమని ఆయన స్పష్టం చేశారు. “సంప్రదాయ బ్యాంకులు, బ్యాంకు శాఖలు చేరుకోలేని ప్రాంతాలకు, వ్యక్తుల చెంతకు ఆ వ్యవస్థను యూపీఐ తీసుకువెళ్లింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దేశీయ ఫిన్‌టెక్ మార్కెట్ భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తూ- చెల్లింపుల పరిష్కారానికి మించి, వేగంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రస్ఫుటం చేశారు. రుణం, బీమా, పొదుపు, పెట్టుబడులు, పింఛను ఉత్పత్తుల పరిధిని చురుగ్గా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రంగం తన సేవలను వేగంగా తదుపరి స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు. “ఇప్పుడు ఫిన్‌టెక్ మార్కెట్లో చెల్లింపులు సహా రుణ లావాదేవీల వాటా కూడా పెరగాలి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
అట్టడుగు వర్గాల నిబిడీకృత సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ- సంప్రదాయ ఆర్థిక నమూనాలు ప్రస్తుతం విస్మరిస్తున్న జనాభా ఉన్నతీకరణలో వినూత్న ఆర్థిక సాంకేతికత ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ ప్రగతి దిశగా ఈ నిగూఢ శక్తిని ఏకీకృతం చేయడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. “వికసిత భారత్ కోసం, ఈ సామర్థ్యం ఎదుగుదల అత్యంత అవసరం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ విస్పష్ట ప్రభావానికి ప్రతీకగా ‘పీఎం స్వానిధి’ పథకాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. నగరాలకు వెన్నెముక వంటి ఈ పథకం లక్షలాది వీధి వ్యాపారులను సంఘటిత రుణ వ్యవస్థతో విజయవంతంగా అనుసంధానించిందన్నారు. అంతేకాకుండా వారి సగటు వార్షికాదాయాన్ని 20 శాతానికి పైగా పెంచిందని చెప్పారు. ఈ ఆర్థిక సాధికారత ఫలితంగా వారికి గృహవసతి, పోషణ, ఆరోగ్య సంరక్షణ, పిల్లల విద్యా లభ్యతను గణనీయంగా మెరుగుపడిందన్నారు. అందుకే, ప్రభుత్వం ఈ పథకాన్ని 2030 దాకా పొడిగించిందని ఆయన పేర్కొన్నారు. “అంటే- వారికి సంఘటిత రుణ సదుపాయం పొందగల ఒక ఉపకరణం లభించింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ సామాజిక కార్యక్రమాలకు సాంకేతికత వెన్నుదన్నుగా నిలవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి గుర్తుచేశారు. ‘పీఎం స్వానిధి’ పథకం భారీ విజయంలో యూపీఐ ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. క్షేత్రస్థాయి ఆర్థిక కార్యకలాపాలకు మరింతగా ఉత్తేజమిచ్చేందుకు ఈ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పరిశ్రమలను కోరారు. “ఈ అనుభవం నుంచి నేర్చే పాఠాల ద్వారా ఫిన్‌టెక్ సామర్థ్యంతో మన ఆర్థిక కార్యకలాపాలను మరింతగా పెంచాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సూక్ష్మ వ్యాపారాల స్థాయి రుణ లభ్యత అంతరాన్ని ప్రస్తావిస్తూ- ఓ చిన్న దుకాణ యజమానురాలి కార్యకలాపాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. విస్పష్ట డిజిటల్ లావాదేవీల చరిత్ర ఆమె వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నప్పటికీ సంప్రదాయ బ్యాంకుల దృష్టిలో ఆ వ్యాపారం చాలా చిన్నదిగానే మిగిలిందని చెప్పారు. విజయవంతంగా నడుస్తున్న తన వ్యాపార విస్తరణకు కావాల్సిన వస్తువులు, పరికరాల కోసం ఆమెకు మరింత మూలధనం అవసరమని ఆయన వివరించారు. “ఇలాంటి వ్యాపార అవసరాలను ఫిన్‌టెక్ చక్కగా విశ్లేషించి, అంచనా వేయడం ద్వారా తీర్చగలదు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ నిర్మాణాత్మక రుణ వితరణ అంతరాన్ని పరిష్కరించాలని పరిశ్రమకు స్పష్టంగా సూచించారు. ఈ మేరకు సూక్ష్మ ఆర్థిక కార్యకలాపాల అధ్యయనానికి, భారీ సంఖ్యలోగల చిన్న వ్యాపారాల కోసం అత్యంత జాగ్రత్తగా రూపొందించే ఆర్థిక నమూనాల కోసం సాంకేతికత వినియోగం తప్పనిసరని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అంతరాన్ని పూడ్చటమే ఈ రంగం భవిష్యత్ పురోగమనాన్ని నిర్దేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “ఫిన్‌టెక్ తదుపరి అధ్యాయం ఈ క్రమంలో రూపుదిద్దుకుంటుందని నా నమ్మకం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సమగ్ర ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలని పిలుపునిస్తూ, సేవా ప్రదాతలైన భాగస్వాములు చిన్నచిన్న పనులు చేసుకునే కార్మికుల వంటి స్వయం ఉపాధిదారులకు పొదుపు, పెన్షన్లు, బీమా ఉత్పత్తులను నిరాటంకంగా అందించాలని ప్రధానమంత్రి పరిశ్రమను కోరారు. ఈ చెల్లింపు రహిత లావాదేవీలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినంత సులభంగా మారాలని ఆయన స్పష్టం చేశారు. “ఇవాళ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు ఎంత సరళంగా, సులభంగా, అందుబాటులోకి వచ్చిందో.. ఇవన్నీ కూడా అంతే సులభంగా, సరళంగా లభ్యం కావాలి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుత 21వ శతాబ్దపు రెండో త్రైమాసికంలో సాంకేతిక ప్రగతిని ప్రధానమంత్రి స్వాగతించారు. ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటం కంప్యూటింగ్‌లను ఆర్థిక రంగంలో కొత్త బాటలు పరుస్తున్న విప్లవాత్మక శక్తులుగా ఆయన అభివర్ణించారు. ఈ అత్యాధునిక సాంకేతికతలను విస్పష్ట సామాజిక ప్రయోజనాలుగా మార్చడాన్ని సవాలుగా స్వీకరించాలని ఈ రంగానికి సూచించారు. “ఈ అవకాశాలన్నిటినీ వాస్తవ ప్రభావిత స్థితికి ఎలా మార్చగలమన్నదే ఇప్పుడు మన ముందున్న సవాలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఇందుకోసం ఫిన్‌టెక్ కంపెనీలకు నాలుగు వ్యూహాత్మక సూత్రాల మార్గసూచీని ప్రధానమంత్రి నిర్దేశించారు. ఈ మేరకు “అత్యున్నత స్థాయి సైబర్ భద్రత, నైతిక డేటా పరిరక్షణ ప్రమాణాలు, పటిష్ట నియంత్రణ ఆవిష్కరణల వ్యవస్థ, పారదర్శకమైన ఫిన్‌టెక్ వినియోగదారు పరిరక్షణ సూచిక”ల ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తే అపార అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. “ఈ ప్రమాణాల కొలబద్దతో మనను మనం పరీక్షించుకుంటే, భారత ఫిన్‌టెక్ రంగం అనేకానేక అవకాశాలకు రాచబాటగా మారగలదు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
చివరగా- భవిష్యత్ దృక్కోణాన్ని నిర్దేశిస్తూ- డిజిటల్ ఇండియా విజయగాథకు దోహదం చేసిన విస్తృతి, పరిధి, సురక్షిత వ్యవస్థలు, ప్రజాస్వామ్యీకరణ, ప్రజా విశ్వాసం తదితర మూల విలువలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. వీటన్నిటినీ పరిరక్షించుకుంటూ ఈ రంగంలో భావితరం ఆవిష్కరణల వైపు మళ్లాలని కోరారు. ఈ పరిశ్రమ నిరంతరం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ మూల విలువలను దృష్టిలో ఉంచుకుని, ఫిన్‌టెక్ రంగం భవిష్యత్తరం ఆవిష్కరణలపై దృష్టి సారించాలి” అని ప్రస్ఫుటం చేస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
India is taking its fintech journey to new heights, with innovation and inclusion at its core. Addressing the Global Fintech Fest 2026 in Mumbai. https://t.co/pMhokoCBjG
— Narendra Modi (@narendramodi) September 8, 2026
India's growth gives the world renewed confidence. pic.twitter.com/lPYEwHMPzW
— PMO India (@PMOIndia) September 8, 2026
UPI is a major champion of India's FinTech story. pic.twitter.com/2ppzcyb7ZF
— PMO India (@PMOIndia) September 8, 2026
Technologies like Agentic AI, tokenisation and quantum are opening new possibilities in the financial sector. pic.twitter.com/BDIKrCivZK
— PMO India (@PMOIndia) September 8, 2026
FinTech companies should work together on a few key goals... pic.twitter.com/0iifCfffdS
— PMO India (@PMOIndia) September 8, 2026