Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“మ‌ధ్య‌వ‌ర్తిత్వం- భార‌తదేశంలో అమలు బ‌లోపేతం దిశ‌గా చొర‌వ‌” స‌ద‌స్సులో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్ర‌సంగం

“మ‌ధ్య‌వ‌ర్తిత్వం- భార‌తదేశంలో అమలు బ‌లోపేతం దిశ‌గా చొర‌వ‌” స‌ద‌స్సులో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్ర‌సంగం


భార‌తదేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ టి.ఎస్‌. ఠాకూర్‌,

గౌర‌వ‌నీయులైన సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాల న్యాయ‌మూర్తులు,

విశిష్ట అతిథులు మరియు మిత్రులు,

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా:

ఈ ప్ర‌పంచ‌ స్థాయి స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నందుకు నీతి ఆయోగ్‌ను అభినందించడం ద్వారా నా ప్ర‌సంగాన్ని ఆరంభిస్తున్నాను.

మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి (ఆర్బిట్రేషన్ కు) మ‌హాత్మ గాంధీ గారు ఇచ్చిందే బహుశా అత్యంత స‌ర‌ళ‌మైన నిర్వ‌చ‌నం కావచ్చు; ఆయ‌న

“నేను వాస్త‌వ న్యాయాచ‌ర‌ణను గురించి తెలుసుకున్నాను. మాన‌వ స్వ‌భావంలో మెరుగైన‌ వైపును క‌నుగొన‌డం ఎలాగో తెలుసుకున్నాను. మ‌నిషి హృద‌యంలోకి ప్ర‌వేశించ‌డం ఎలాగో నేర్చుకున్నాను. వివాదంలో భాగ‌స్వాములైన క‌క్షిదారుల‌ను ఏకం చేయ‌డ‌మే ఒక న్యాయ‌వాది సిసలైన క‌ర్త‌వ్య‌మ‌ని నేను గ్ర‌హించాను. ఈ పాఠం నా హృద‌యాంత‌రాల్లో చెరిగిపోని రీతిలో ముద్రిత‌మైపోయింది. ఎంత‌గా అంటే.. ఒక న్యాయ‌వాదిగా నా ఇర‌వై సంవ‌త్స‌రాల కార్యాచ‌ర‌ణ‌లో అధిక‌ శాతం స‌మ‌యం వంద‌లాది కేసుల‌లో న్యాయ‌స్థానం వెలుప‌ల రాజీ కుదర్చ‌డంలోనే గ‌డ‌చిపోయింది. దానివ‌ల్ల నేను కోల్పోయిందేమీ లేదు.. సొమ్ము గానీ, క‌చ్చితంగా నా ఆత్మ‌ను గానీ నేను కోల్పోలేదు” అన్నారు.

మిత్రులారా,

భార‌త‌దేశం నేడు అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ మాత్ర‌మేగాక విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల(ఎఫ్ డి ఐ)కు ఆక‌ర్ష‌ణీయ గ‌మ్యం కూడా. ప్ర‌పంచ ఆర్థిక వేదిక‌పై మ‌నది ఉజ్జ్వల ప్ర‌కాశ స్థాన‌మ‌న్న‌ది స‌త్యం. ఇదంతా భార‌తదేశానికి మూలాధార‌మైన ప్ర‌జాస్వామ్యం, జ‌న‌సంఖ్యాధిక్యం, గిరాకీ ల వంటి మ‌న ప్రాథ‌మిక బ‌లాల ఫ‌లిత‌మే. ఈ బ‌లాల‌ను మ‌నం పూర్తి స్థాయిలో స‌మీకృతం చేసుకోవ‌డం అవ‌స‌రం. ఉద్యోగాల సృష్టికి, సుస్థిర ఆర్థిక వృద్ధికి తోడ్ప‌డే దిశ‌గా వ్యాపార రంగంలో దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మాత్ర‌మే ఇది సాధ్యపడుతుంది.

మ‌న దేశీయ విప‌ణి భిన్న శ‌క‌లాలుగా విడిపోయి ఉంది. వేర్వేరు రాష్ట్రాలలో వేరువేరు ప‌న్నుల వ‌ల్ల వ‌స్తువులు, సేవ‌లు మ‌రింత ప్రియ‌ం అవుతున్నాయి. ఇది రాష్ట్రాల మ‌ధ్య వాణిజ్యంలో వృద్ధిని కుంగ‌దీస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మ‌గ్ర జాతీయ విప‌ణిని సృష్టించేందుకు వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) చ‌ట్టాన్ని తెస్తున్నాము. ఇది మ‌న దేశీయ గిరాకీకి మ‌రింత ఉత్తేజాన్ని ఇస్తుంది. దేశీయంగా వ్యాపారానికి మ‌రిన్ని అవ‌కాశాలతో పాటు ఉద్యోగాల‌నూ సృష్టిస్తుంది.

దేశం ఇప్పుడు డిజిట‌ల్ విప్ల‌వాన్ని చ‌విచూస్తోంది. ఇది భార‌త స‌మాజంలో.. ప్ర‌త్యేకించి గ్రామీణ స‌మాజంలో డిజిట‌ల్‌ మరియు ఆర్థిక విభ‌జ‌న ఫ‌లిత‌మైన అంత‌రాన్ని పూడుస్తున్న‌ది. ఈ విప్ల‌వంతో గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఉత్తేజం ల‌భించ‌డంవ‌ల్ల భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రింత ఊపు వ‌స్తుంది.

వినూత్న వ్యాపార న‌మూనాలు, యాప్ ఆధారిత స్టార్ట్- అప్ సంస్థ‌లు భార‌తీయుల‌లో పారిశ్రామిక స్ఫూర్తిని నింపాయి. నిన్న‌టి ఉద్యోగార్థులే నేటి ఉద్యోగాల సృష్టిక‌ర్త‌ల‌ు అవుతున్నారు. అలాగే డిజిట‌ల్ ప్ర‌పంచ హామీల ఫ‌లితంగా న్యాయ‌వాద వృత్తిలోనూ వికాస ద‌శ మొద‌లైంది. నేడు కేసు జాబితాల నుండి కేసు చ‌ట్టాల దాకా లాయ‌ర్ల అవ‌స‌రాలు తీర్చే గ్రంథాల‌యం ఒక్క క్లిక్‌తో మీ మొబైల్ ఫోన్‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది.

మిత్రులారా,

భార‌తీయ విప‌ణిలోని వ్యాపారాలు చ‌ట్ట నియ‌మనిబంధ‌న‌ల ప్రాబ‌ల్యం నుండి భ‌రోసాను కోరుకుంటాయి. మ‌ధ్య‌వ‌ర్తిత్వ త‌ర‌హాలో రాత్రికి రాత్రి నిబంధ‌న‌లు మారిపోరాద‌ని భ‌రోసా క‌ల్పించ‌డం అవ‌స‌రం. అంతేగాక వాణిజ్య వివాదాలు స‌మ‌ర్థంగా ప‌రిష్కారం కావాల‌ని అభిల‌షిస్తాయి. అందువ‌ల్ల ఉత్తేజ‌క‌ర మ‌ధ్య‌వ‌ర్తిత్వ సంస్కృతి ద‌న్నుగా గ‌ల‌ వేగ‌వంత‌మైన న్యాయ చ‌ట్రం అవ‌శ్యం.

ఈ ల‌క్ష్యం దిశ‌గా మేము వినూత్న న్యాయ సంస్క‌ర‌ణ‌ల‌ను మొదలుపెట్టాము. వెయ్యికి పైగా పురాత‌న చ‌ట్టాల‌ను ర‌ద్దుచేశాము. స‌మ‌గ్రమైన ఆర్థిక అశ‌క్త‌త‌- దివాలా నిబంధ‌న‌లు, 2016 కు చ‌ట్టరూపం కల్పించాము. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్స్ ను ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చాము. చ‌ట్ట‌బ‌ద్ధ ద్ర‌వ్య విధాన క‌మిటీని ఏర్పాటు చేశాము. కమోడిటీస్ మార్కెట్ ను, సెక్యూరిటీస్ మార్కెట్ ను విలీనం చేశాము.

దీనికి మించి, దివాలా స్మృతితో సౌమ‌న‌స్యం చేస్తూ వ్యాపార సౌల‌భ్య ప‌రిధి విస్త‌ర‌ణ‌, వేగ‌వంతం దిశ‌గా సెక్యూరిటైజేష‌న్ అండ్ రిక‌న్ స్ట్ర క్ష‌న్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట‌రెస్ట్ (ఎస్ ఎ ఆర్ ఎఫ్ ఎ ఇ ఎస్ ఐ), డెట్ రిక‌వ‌రీ ట్రైబ్యూన‌ల్ చ‌ట్టాల‌ను ఈ సంవత్సరం స‌వ‌రించాము.

అయితే స‌మ‌ర్థ‌మైన, ప్ర‌భావ‌వంత‌మైన వివాద ప‌రిష్కారం యంత్రాంగం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే న్యాయ సంస్క‌ర‌ణ‌లు ఆశించిన‌ ఫ‌లితాలను ఇవ్వ‌గ‌ల‌ుగుతాయి. న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం భారత రాజ్యాంగంలోని ఓ ప్రాథమిక లక్షణం. న్యాయ‌ ప్ర‌క్రియ స‌మ‌గ్ర‌త‌పై సామాన్య పౌరుల‌కే గాక వ్యాపార సంస్థ‌లకు కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. న్యాయ వ్య‌వ‌స్థ మౌలిక స‌దుపాయాలు, పాల‌న వ్య‌వ‌హారాల మెరుగుదలకు మా ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంది.

వాణిజ్య వివాదాల స‌త్వ‌ర ప‌రిష్కారం కోసం మేము కమర్షియల్ కోర్ట్ స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అప్పిలేట్ డివిజన్ ఆఫ్ హై కోర్ట్ స్ యాక్ట్, 2015ను తీసుకువచ్చాము.
దేశ‌వ్యాప్తంగా జిల్లా కోర్టుల‌లో పేరుకుపోయిన కేసుల స‌మాచారాన్ని అందించేందుకు నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ను ఏర్పాటు చేయడమైంది. న్యాయ‌వ్య‌వ‌స్థ అంతటినీ కంప్యూట‌రీక‌రించే ఇ-కోర్ట్ కార్య‌క్ర‌మం అమలుకు చ‌ర్య‌లు చేప‌ట్టాము.

ట్రైబ్యూన‌ల్స్ కేంద్రీక‌ర‌ణ వ్యూహంపై మా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌స్తుత సంక్లిష్ట ట్రైబ్యూన‌ల్స్ వ్య‌వ‌స్థ స‌ర‌ళీకృత నిర్మాణంగా ప‌రివ‌ర్త‌న చెంద‌డానికి ఇది దోహ‌దం చేస్తుంది. అదే స‌మ‌యంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం, సౌమ‌న‌స్యం, స‌ఖ్య‌త స‌హా ఉత్తేజ‌క‌ర ప్ర‌త్యామ్నాయ వివాదాల ప‌రిష్కార ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు మ‌నం మార్గాన్ని సుగమ‌ం చేయవలసి ఉంది. ఇది వ్యాపారాల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు అద‌న‌పు స‌దుపాయాల‌ను అందుబాటులోకి తెస్తుంది. మ‌రీ ముఖ్యంగా దేశ న్యాయ‌స్థానాల‌పై కేసుల భారాన్ని త‌గ్గిస్తుంది.

మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా వివాద ప‌రిష్కారం మ‌న‌కు కొత్త ఏమీ కాదు. ప్రాచీన భార‌తంలో క‌క్షిదారుల మ‌ధ్య వివాదాల ప‌రిష్కారానికి అనేక యంత్రాంగాలు ఉండేవి. కుల‌ని లేదా గ్రామ సమితి; శ్రేణి లేదా కార్పొరేషన్ ; పూగా లేదా విధాన‌స‌భ వంటివి అందులో భాగంగా ఉండేవి. అదే విధంగా వాణిజ్య వ్య‌వ‌హారాలపై మ‌హాజ‌నులు, మండ‌ళ్లలో నిర్ణ‌యాలు తీసుకునే వారు.

ఈ రోజుల్లో ఎలాంటి వివాదాలు, చిక్కుల‌కు తావు లేని రీతిలో వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు పూర్తి చేసుకోవ‌డానికి తోడ్ప‌డ‌గ‌ల న్యాయ నిపుణులు కావాల‌ని కార్పొరేట్ లు, ఆర్థిక సంస్థ‌లు కోరుకొంటున్నాయి. ఏదైనా వివాదం త‌లెత్తితే న్యాయ‌స్థానాల గ‌డ‌ప తొక్క‌కుండా మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా త్వ‌ర‌గా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాయి. ఇందుకోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో నిపుణులైన న్యాయ‌వాదులు ఆయా సంస్థ‌ల‌కు అవ‌స‌రం. ప్ర‌తిస్ప‌ర్ధాత్మ‌క‌ ప్ర‌క్రియ‌ల వ‌ల్ల వ్య‌క్తిగ‌త, వ్యాపార సంబంధాలు దెబ్బ‌తినే ప్రమాదం ఉన్న నేప‌థ్యంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప‌రిష్కార ప్ర‌క్రియ‌ల వ‌ల్ల ఆ పరిస్థితి త‌ప్పుతుంది.

ఆసియా కేంద్రాలైన హాంకాంగ్‌, సింగ‌పూర్ ఇటీవల మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్రాధాన్య‌ గ‌మ్యాలుగా ఆవిర్భ‌విస్తున్న ధోర‌ణులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌సిద్ధ వ్యాపార కూడ‌ళ్లుగా వ్యాపార సౌల‌భ్యంలోనూ అవి ఉన్న‌త శ్రేణిలో ఉన్నాయి. దీనిని బట్టి వ్యాపార సౌల‌భ్యానికి నాణ్య‌మైన మ‌ధ్య‌వ‌ర్తిత్వ యంత్రాంగం ల‌భ్య‌త కూడా ఒక స‌మ‌గ్ర భాగ‌మ‌ని తేలుతున్నందున మా ప్ర‌భుత్వం కూడా అందుకు క‌ట్టుబ‌డి ఉంది.

మిత్రులారా,

ఉత్తేజ‌క‌ర సంస్థాగ‌త మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ సృష్టి కూడా మా ప్ర‌భుత్వ అగ్ర ప్రాథ‌మ్యాల‌లో ఒక‌టి. మ‌ధ్య‌వ‌ర్తిత్వ‌- స‌ఖ్య‌త చ‌ట్టానికి ఇటీవ‌లే కీల‌క స‌వ‌ర‌ణలు చేశాము. దీంతో ఈ ప్ర‌క్రియ స‌మ‌యానుకూలం, సుల‌భ‌త‌రం, ఆటంక‌ర‌హితంగా మారింది. ఐక్య‌రాజ్య స‌మితిలోని అంత‌ర్జాతీయ వాణిజ్య చ‌ట్టాల క‌మిష‌న్ నిర్దేశిత న‌మూనా చ‌ట్టం ఆధారంగా మ‌న చ‌ట్టం రూపొందింది.

సాధార‌ణ ప‌రిస్థితుల‌లో మధ్య‌వ‌ర్తిత్వ ప్రత్యేక న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్) 12 నెల‌ల్లోగా త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించేలా భ‌రోసా క‌ల్పించ‌డ‌మే దీని ల‌క్ష్యం. ఇక వేగ‌వంత‌మైన విధానం విష‌యంలో 6 నెల‌ల్లోనే తీర్పు ప్ర‌క‌టిత‌మ‌వుతుంది. అంతే కాదు.. ఆర్బిట్రేటర్ నియామ‌కంపై 60 రోజుల్లోనే న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకోవలసి ఉంటుంది. అనుమ‌తి, తీర్పు ప్ర‌క్రియ‌లో మునుపు ఎదుర‌వుతూ వ‌చ్చిన ప్ర‌తిబంధ‌కాల‌న్నిటినీ ఇప్పుడు తొల‌గించాము.

అంతేగాక కొత్త చ‌ట్టం ప్ర‌కారం… మ‌ధ్య‌వ‌ర్తిత్వ తీర్పును స‌వాలు చేస్తూ అభ్య‌ర్థ‌న దాఖ‌లైన ప‌క్షంలో ఏడాదిలోగా న్యాయ‌స్థానాలు దాన్ని ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. ధ‌ర్మాస‌నం తీర్పు అమ‌లును న్యాయ‌స్థానాలు తిర‌స్క‌రించే అవ‌కాశం ఉన్నా అది అంత‌ర్జాతీయ ఆచ‌ర‌ణ విధానాలకు లోబ‌డి ఉండాల్సిందే. ఈ స‌వ‌ర‌ణ‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్త ఆచ‌ర‌ణ‌కు అనుగుణంగా మ‌న మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్ర‌క్రియ‌ను తీర్చిదిద్దాం. దీంతో మ‌న మ‌ధ్య‌వ‌ర్తిత్వ అధికార ప‌రిధికి అగ్రాస‌నం ద‌క్కే అవ‌కాశం వ‌చ్చింది. కానీ, గొప్ప అవ‌కాశాలను వెన్నంటి గొప్ప స‌వాళ్లు కూడా ఉంటాయి… అద్భుత నాణ్య‌త‌, ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపుగ‌ల మ‌ధ్య‌వ‌ర్తులు; వృత్తి ప్ర‌వ‌ర్త‌నా సూత్రానుస‌ర‌ణ‌, త‌ట‌స్థ‌త‌కు భ‌రోసా, స‌కాలంలో విచార‌ణ ప్ర‌క్రియ ముగింపుతోపాటు త‌క్కువ ఖ‌ర్చుతో స‌మ‌ర్థ మ‌ధ్య‌వ‌ర్తిత్వ విచార‌ణ వంటివి ఈ స‌వాళ్ల‌లో కొన్ని.

మిత్రులారా,

భార‌త‌దేశంలో మేధావులైన న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తుల‌కు కొద‌వ లేదు. దేశంలో విశ్రాంత న్యాయ‌మూర్తులు, ఇంజ‌నీర్లు, శాస్త్రవేత్త‌లు పెద్ద‌ సంఖ్య‌లో ఉన్నారు. వీరంతా వివిధ రంగాల‌లో స‌మ‌ర్థులైన ఆర్బిట్రేటర్ (మ‌ధ్య‌వ‌ర్తు)లుగా క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తించ‌గ‌ల‌రు. పెద్ద‌ సంఖ్య‌లో మ‌ధ్య‌వ‌ర్తిత్వ నిపుణులు, న్యాయ‌వాదులు ఉండ‌డం భార‌తదేశ ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు మేలు చేకూరుస్తుంది. ఈ ప‌రిణామంతో దేశంలో న్యాయ‌ విద్య ప‌రిధి విస్తృతం కావాల్సి ఉంటుంది. అలాగే ప్ర‌త్యేక మ‌ధ్య‌వ‌ర్తిత్వ బార్ అసోసియేష‌న్ లను అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతోపాటు దేశంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా వ్యాపార సంస్థ‌ల‌కు స‌హేతుక‌ వ్య‌యంతో వృత్తిప‌రంగా సేవ‌లందించ‌గ‌ల మ‌ధ్య‌వ‌ర్తిత్వ సంస్థ‌ల అవ‌స‌రం కూడా ఉంది. ఈ కృషిలో భాగంగా అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తాము. న్యాయ‌, మ‌ధ్య‌వ‌ర్తిత్వ యంత్రాంగాల కృషికి మ‌ద్ద‌తునిచ్చే మార్గాలపై, ఉపాయాల‌పై మ‌నం జాగ్ర‌త్త‌గా యోచించ‌క త‌ప్ప‌దు. రాజీ కుదిర్చే యంత్రాంగం అటువంటి వాటిలో ఒక‌టి కాగా, దేశంలో దీని సామర్థ్యాన్ని ఇప్ప‌టి దాకా ఎక్కువ‌గా ఉప‌యోగించుకోనే లేదు.

మిత్రులారా,

ఓ స‌మ‌ర్థ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పర్యావరణ వ్యవస్థ మ‌న దేశానికో జాతీయ ప్రాధాన్యాంశం. మ‌ధ్య‌వ‌ర్తిత్వ కేంద్ర బిందువు (ఆర్బిట్రేషన్ హబ్) గా భార‌తదేశం సామర్థ్యాన్ని మ‌నం ప్ర‌పంచవ్యాప్తం చేయాలి. అమెరికా న్యాయ‌కోవిదుడు, శిక్ష‌కుడైన శ్రీ రాస్కో పౌండ్ వ్యాఖ్యానించిన‌ట్లు.. “చ‌ట్టం త‌ప్ప‌నిస‌రిగా అచంచ‌లమైన‌ది కావాలి గానీ నిశ్చ‌లమైన‌దిగా మిగిలిపోరాదు.” మ‌న తీరాల‌కు ఆవ‌లి నుండి కూడా మ‌నం స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. అత్యంత ప్ర‌ధాన‌మైన నియంత్ర‌ణ‌, విధాన‌, మేధో సంస్క‌ర‌ణ‌ల గురించి చ‌ర్చించుకొనేందుకు ఈ సద‌స్సు మ‌న‌కు ఆద‌ర్శ వేదిక‌ను స‌మ‌కూర్చింది.

ఈ వేదిక‌పై చ‌ర్చ‌లు దేశంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని దృఢంగా విశ్వ‌సిస్తున్నాను. అంత‌ర్జాతీయ వృత్తి నిపుణులు, న్యాయ స‌మాజం, పారిశ్రామిక సంస్థ‌ల స్థాయిలో భార‌త‌దేశాన్ని మ‌ధ్య‌వ‌ర్తిత్వ కేంద్రబిందువుగా నిలప‌డం ద్వారా ఓ మైలురాయిని అందుకొనేందుకు ఈ చ‌ర్చ‌లు ఆలంబ‌న‌గా నిలుస్తాయ‌ని నమ్ముతున్నాను. మీ సిఫార‌సుల కట్టుదిట్టమైన అమ‌లు కోసం మేము ఎదురుచూస్తూంటాము.

మీకు ధన్యవాదాలు.