Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లండ‌న్ గిల్డ్ హాల్‌ లో ఇండో – యూకే బిజినెస్ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

లండ‌న్  గిల్డ్ హాల్‌ లో ఇండో – యూకే  బిజినెస్ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

లండ‌న్  గిల్డ్ హాల్‌ లో ఇండో – యూకే  బిజినెస్ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

లండ‌న్  గిల్డ్ హాల్‌ లో ఇండో – యూకే  బిజినెస్ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం


విశిష్టులు శ్రీ డేవిడ్ కామెరాన్‌,

గౌర‌వ‌నీయులు, లండ‌న్ లార్డ్ మేయ‌ర్‌ శ్రీ అల‌న్ యారో,

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా!

ఈ సాయంత్రం మీతో ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ గొప్ప దేశానికి రావ‌టంలో ఆల‌స్యం అయ్యింద‌నే సంగ‌తిని మొద‌ట నేనంగీక‌రిస్తున్నాను. అయితే సంతోష‌క‌ర‌మైన అంశ‌మేంటంటే ఇక్క‌డికి రాకున్నా- గౌరవ‌నీయులైన‌ కామెరాన్‌, నేనూ నిరంత‌రం సంప్ర‌దించుకుంటూనే ఉన్నాం. అనేక వేదిక‌ల‌పై మేమిద్ద‌రం క‌ల‌సుకుంటున్నాం. ప‌ర‌స్ప‌రం మా అభిప్రాయాల‌ను పంచుకుంటూనే ఉన్నాం. చివ‌రిసారిగా న్యూయార్క్‌లో క‌ల‌సుకున్న‌ప్పుడు ఆర్థిక రంగంలో భార‌త్‌, యూకే లు క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న చెప్పిన మాట‌లు నాకింకా గుర్తున్నాయి.

మిత్రులారా!

యూకే, భార‌త్‌ లు శ‌తాబ్దాలుగా ఒక‌రికొక‌రు తెలుసు. మ‌న పాల‌నా వ్య‌వ‌స్థ కూడా చాలామ‌టుకు వెస్ట్‌మినిస్ట‌ర్ న‌మూనాపై ఆధార‌ప‌డిందే.

– మ‌న వ్య‌వ‌స్థ‌ల‌కు ప‌ర‌స్ప‌రం సంప్ర‌దించుకోవ‌టం తెలుసు.

– మ‌న ప్ర‌జ‌ల‌కు క‌ల‌సి ప‌నిచేయ‌టం తెలుసు.

– మ‌న వాణిజ్యాల‌కు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ఎద‌గ‌టం తెలుసు.

యూకే అనేది భార‌త వాణిజ్య ప్ర‌ధాన భాగ‌స్వామి అవ‌టానికి అదే కార‌ణం. భార‌త్‌లో మూడో అతి పెద్ద విదేశీ పెట్టుబ‌డిదారు కూడా యూకేనే. అదే స‌మ‌యంలో మ‌రో విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నాను. ఇది ఏక‌ప‌క్షం కాదు. యూకేకు కూడా భార‌త్ మూడో అతి పెద్ద ఎఫ్‌డిఐగా ఎదిగింది. అయిన‌ప్ప‌టికీ భార‌త్‌, యూకే లు ఆర్థిక బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఇంకా అవ‌కాశాలున్నాయి. ప‌ర‌స్ప‌రం అర్థం చేసుకోగ‌ల శ‌క్తిని మ‌నం స‌మ‌ర్థంగా వినియోగించుకోవాలి. యూకే ఏ రంగాల్లోనైతే బ‌లంగా ఉందో, వాటిలో మేం అభివృద్ధి చెందాల‌ని భావిస్తున్నాం. ఇందుకు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌టానికి మేం క‌ష్ట‌ప‌డుతున్నాం. ఇక్క‌డున్న భార‌తీయ స‌మాజం కూడా యూకేతో మ‌రింత అర్థ‌వంత‌మైన బంధం ఏర్ప‌డ‌టానికి ప్రోత్స‌హిస్తోంది.

మిత్రులారా!

మా ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ‌ నాటి నుంచీ ఆర్థిక‌ రంగాన్ని గాడిలో పెట్ట‌డానికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నాం. వ్యాపారం, వాణిజ్యాల‌కు సులువైన నెల‌వుగా భార‌త్‌ను మార్చ‌టానికి తీవ్రంగా క‌ష్ట‌పడ్డాం. భార‌త్ లోని సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌ర్చాలంటే ఈ కృషి అవ‌స‌ర‌మ‌న్న‌ది మా నమ్మ‌కం.

మా క‌ష్టానికి ఫ‌లితాలిప్పుడు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌పంచ ఆర్థిక రంగంలో భార‌త్ ఆశావ‌హంగా క‌నిపిస్తోంద‌ని ఐఎమ్ఎఫ్ అధినేత ఇటీవ‌లే కితాబిచ్చారు. గ‌త సంవ‌త్స‌రంలో మా వృద్ధి రేటు 7.3 శాతం.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మా వృద్ధి రేటు 7.5 శాతం ఉంటుంద‌ని, రాబోయే కాలంలో మ‌రింత మెరుగుప‌డుతుంద‌ని ప్ర‌పంచ బ్యాంకు అంచ‌నా వేసింది. అదృష్ట‌వ‌శాత్తు మేం స‌రైన దిశ‌లో ప‌య‌నం చేస్తున్నాం. వాణిజ్యానికి అత్యంత అనువైన దేశాల ప్ర‌పంచ‌ బ్యాంకు 2016 జాబితాలో భార‌త్ 12 ర్యాంకులు పైకి ఎగ‌బాకింది. మ‌రే దేశమూ ఇంత ప్ర‌గ‌తి సాధించ‌లేదు.

ఈ మార్పులు, చేర్పులను రాష్ట్ర, జిల్లా, ప‌ట్ట‌ణ స్థాయిలో కూడా చేయ‌టానికి మే క‌ట్టుబ‌డి ఉన్నాం. స‌హ‌కార‌, పోటీ స‌మాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా మా కేంద్ర ప్ర‌భుత్వంతో క‌ల‌సి ప‌నిచేస్తున్నాయి. ప్ర‌పంచ బ్యాంకు బృందంతో క‌ల‌సి ఇటీవ‌లే వాణిజ్యానికి అనువైన రాష్ర్టాల ర్యాంకింగ్‌లు త‌యారు చేశాం. దీనివ‌ల్ల వాణిజ్యానుకూల వాతావ‌ర‌ణం ఏర్పాటు చేసేలా ఆయా రాష్ర్టాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెల‌కొంది. వాణిజ్య అనుకూల వాతావ‌ర‌ణం దిశ‌గా దేశంలో అంత‌ర్గ‌తంగా చేప‌ట్టిన ఇలాంటి కార్య‌క్ర‌మంలో ప్ర‌పంచ బ్యాంకు పాల్గొన‌టం ఇదే తొలిసారి.

మిత్రులారా!

యువ‌త‌రాన్ని ఉత్ప‌త్తిదాయ‌కంగా మ‌లుచుకోవ‌ట‌మే ప్రస్తుతం భార‌త్ ముందున్న అతి పెద్ద స‌వాలు. ఈ స‌వాల్‌ను ఎదుర్కోవాలంటే మా త‌యారీ రంగానికి భారీ ఊతం అందించాలి. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఈ రంగం జీడీపీలో 16 శాతం వ‌ద్ద స్త‌బ్దుగా నిలిచిపోయింది. స్వ‌ల్ప‌, మ‌ధ్య‌కాలంలో ఈ త‌యారీరంగం వాటా 25 శాతం దాకా పెర‌గాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మేం ‘ మేక్ ఇన్ ఇండియా ‘ కార్య‌క్ర‌మం ఆరంభించాం. ప్ర‌పంచ త‌యారీ రంగానికి భార‌త్ మూల‌ కేంద్రంగా మార‌టానికి వీలైన అన్ని అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాం.

ఈ ల‌క్ష్యాన్ని చేరుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా వాణిజ్య అనుకూల‌ వాతావ‌ర‌ణానికి క‌ష్ట‌ప‌డ‌ట‌మే కాకుండా, ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాల‌కు అనుమ‌తుల‌ను వేగ‌వంతం చేశాం. ప్ర‌ణాళికాధార పాల‌న మా వ్యూహమిప్పుడు. అత్యంత కీల‌క‌మైన బొగ్గు, వాయు త‌రంగాలు (స్పెక్ట్ర‌మ్‌), ముడి ఇనుము లాంటి స‌హ‌జ‌ వ‌న‌రుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వేలం వేసి, కేటాయిస్తుండ‌టంతో పెట్టుబ‌డిదారులకు స‌మాన‌ పోటీ అవ‌కాశాలు మెరుగుప‌డ్డాయి.

విదేశీ పెట్టుబ‌డుల ప్ర‌వాహాన్ని పెంచ‌టానికిగాను, ఎఫ్‌డీఐల వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళ‌త‌రం చేశాం. రైల్వేల్లో 100 శాతం ఎఫ్‌డీఐల‌ను అనుమ‌తిస్తున్నాం. ర‌క్ష‌ణ‌, బీమా రంగాల్లో కూడా ఎఫ్‌డీఐ వాటా ప‌రిమితిని 49 శాతానికి పెంచాం. ఇలాంటి ప‌థ‌కాల్లో ఉండే ఆచ‌ర‌ణాత్మ‌క స‌మ‌స్య‌లపై కూడా మేం స్పృహ‌తోనే ఉన్నాం. అందుకే గ‌త‌ వార‌మే మ‌రో 15 రంగాల్లోనూ ఎఫ్‌డీఐల ప‌రిమితిని గ‌ణ‌నీయంగా మార్చాం. ఉదాహ‌ర‌ణ‌కు నిర్మాణ‌ రంగంలో ప్ర‌స్తుతం ఎఫ్‌డీఐల‌కు ఎలాంటి ప‌రిమితుల్లేవు. అలాగే ప్లాంటేష‌న్‌, ఇ-కామ‌ర్స్‌, సింగిల్ బ్రాండ్ రిటైల్‌ రంగాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన స‌ర‌ళీక‌ర‌ణ జ‌రిగింది. అంతే కాకుండా ఎఫ్‌డీఐ ప్ర‌తిపాద‌న‌ల‌ను అటోమెటిక్ మార్గానికి మ‌ళ్ళిస్తున్నాం కూడా.

ఈ ద‌శ‌లో చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌తో విదేశీ పెట్టుబ‌డుల‌కు భార‌త్ అత్యంత అనువైన దేశంగా మారింద‌ని భావిస్తున్నాను.

భార‌త్ ముందున్న మ‌రో పెద్ద స‌వాలు – మౌలిక‌ స‌దుపాయాలు. భ‌విష్య‌త్ సామాజిక‌, భౌతిక మౌలిక స‌దుపాయాల‌ను నిర్మించాల‌ని యోచిస్తున్నాం. ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ ద్వారా మౌలిక‌ స‌దుపాయాల రంగానికి ఎక్కువ వ‌న‌రుల‌ను కేటాయించుకోగ‌లిగాం. వీటికి అద‌నంగా భార‌త పెట్టుబ‌డి, మౌలిక స‌దుపాయ‌ల నిధిని ఏర్పాటు చేయ‌బోతున్నాం. మా సొంత వ‌న‌రుల నుంచే ఏటా 3.5 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల మొత్తాన్ని ఈ నిధిలోకి చేర్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. ఆస్తుల నిర్వ‌హ‌ణ‌కు ఓ ప్రొఫెష‌న‌ల్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయ‌బోతున్నాం.

రైల్వేలు, రహదారులు, ఇత‌ర రంగాల్లో ప్రాజెక్టుల కోసం ప‌న్నుర‌హిత మౌలిక స‌దుపాయాల బాండ్ల‌ లాంటి యంత్రాంగం కూడా ఏర్పాటు చేశాం. భార‌త మౌలిక‌ స‌దుపాయాల రంగంలో బంధాన్ని మ‌రింత బలోపేతం చేసుకోవ‌టానికి బ్రిటిష్ ప్ర‌భుత్వం, పారిశ్రామిక రంగం, ఆర్థిక సంస్థ‌ల‌తో క‌ల‌సి ప‌నిచేస్తాం. త్వ‌ర‌లోనే మ‌న ఆర్థిక మార్కెట్ల అనుబంధానికి ఈ బాండ్లు బ‌ల‌మైన కార‌ణం కాబోతాయి.

మిత్రులారా!

విదేశీ పెట్టుబ‌డిదారుల‌ను నీరుగార్చే అనేక నియంత్ర‌ణ‌లు, ప‌న్ను సంబంధిత అంశాలు ఉండేవి. దీర్ఘకాలిక‌మైన ఈ అడ్డంకుల‌ను తొల‌గించ‌టానికి దృఢ నిర్ణ‌యాలు తీసుకున్నాం. ఉదాహ‌ర‌ణ‌కు మీకు చెప్పాలంటే…..

– భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల్లాంటి నియంత్ర‌ణ అనుమ‌తుల‌ను వేగ‌వంతం చేశాం.

– గ‌తంలో ఉన్న మూడేళ్ళ ర‌క్ష‌ణ పారిశ్రామిక లైసెన్సుల గ‌డువును 18 సంవ‌త్స‌రాల‌కు పొడిగించాం.

– దాదాపు 60 శాతం ర‌క్ష‌ణ‌ రంగ ఉత్ప‌త్తుల‌ను లైసెన్స్ ప‌ద్ధ‌తి నుంచి మిన‌హాయించాం. ఎగుమ‌తుల‌ప్పుడు అంతిమ ఉప‌యోగ ధ్రువీక‌ర‌ణ లాంటి నియంత్ర‌ణ‌ల‌ను స‌ర‌ళీక‌రించాం.

– పాత గ‌డువు నుంచి ప‌న్ను విధించే ప‌ద్ధతుల‌ను అనుస‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశాం. అనేక సంద‌ర్భాల్లో ఆచ‌రించి చూపాం కూడా.

– ఎఫ్‌పీఐల‌పై క‌నీస ప్ర‌త్యామ్నాయ ప‌న్ను విధించ‌కుండా ఉండ‌టం కూడా ఇందులో భాగ‌మే.

– ఎఫ్‌పీఐలు, ఇత‌ర విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు కాంపోజిట్ సెక్టార్ క్యాప్ ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ‌పెట్టాం.

– ప్రత్యామ్నాయ పెట్టుబ‌డి నిధుల‌కు నియంత్ర‌ణ‌ల‌ను నోటిఫై చేశాం.

– రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డి ట్ర‌స్ట్‌ల‌కు క్యాపిట‌ల్ గెయిన్స్ ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను హేతుబ‌ద్ధీక‌రించాం.

– ప‌ర్మినెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను మార్చాం.

– జ‌న‌ర‌ల్ యాంటీ అవాయ్‌డెన్స్ నిబంధ‌న‌ల అమ‌లును రెండేళ్ళ‌పాటు వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించాం.

– జీఎస్‌టీ బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టాం. 2016 లో దీన్ని ఆమోదించ‌గ‌ల‌మ‌ని ఆశిస్తున్నాం.

– కొత్త దివాలా నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నాం. కంపెనీ లా ట్రైబ్యున‌ల్ త్వ‌ర‌లోనే ఏర్పాట‌వుతుంది.

మిత్రులారా!

మా ప‌న్ను వ్య‌వ‌స్థ పార‌ద‌ర్శ‌కంగా, అంచ‌నా వేసేలా ఉండబోతోంది. నిజ‌మైన పెట్టుబ‌డిదారులు, నిజాయతీగా ప‌న్ను చెల్లించే వారు ప‌న్ను విష‌యాల్లో వేగంగా, న్యాయ‌బ‌ద్ధ‌మైన నిర్ణ‌యాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగా….

– ప్రైవేటు పెట్టుబ‌డులపై ఆస‌క్తి, విదేశీ పెట్టుబ‌డుల ప్ర‌వాహం స‌కారాత్మ‌కంగా మారింది.

– నిరుడు ఈ స‌మ‌యంతో పోల్చుకుంటే ఎఫ్‌డీఐల ప్ర‌వాహ ఈసారి 40 శాతం పెరిగింది.

– ప్ర‌పంచంలో పెట్టుబ‌డుల‌కు అత్యంత అనువైన దేశం భార‌త్ అని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవ‌లే త‌న ర్యాంకింగ్‌లలో ప్ర‌క‌టించింది. 2015 ప్ర‌థ‌మార్థంలో అగ్ర శ్రేణి గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబ‌డుల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంది.

– అమెరికా విదేశీ విధాన మేగ‌జైన్ కూడా ఎఫ్‌డీఐల‌కు అనువైన దేశాల జాబితాలో భార‌త్‌కు అగ్ర‌స్థానం ఇచ్చింది.

– వృద్ధి, సృజ‌నాత్మ‌క‌త‌, నాయ‌క‌త్వం అంశాలుగా 100 దేశాల‌పై ఫ్రాస్ట్ అండ్ సులివాన్ సంస్థ స‌ర్వే జ‌రిపి విడుద‌ల చేసిన ర్యాంకింగ్‌ల్లోనూ భార‌త్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

– పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌ల‌కు ఉద్దేశించిన యుఎన్‌సీటీఏడీ ర్యాంకుల్లో కూడా భార‌త్ త‌న స్థానాన్ని (15 నుంచి 9కి) మెరుగుప‌ర్చుకుంది.

– ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు విశ్వ‌ పోటీ సూచిక‌లోనూ భార‌త్ 16 స్థానాలు మెరుగుప‌డింది.

– మూడీ రేటింగ్ కూడా స‌కారాత్మ‌క దిశ‌లో మెరుగుప‌డింది.

ఇలా… కేవ‌లం 18 నెల‌ల‌కాలంలోనే అంత‌ర్జాతీయ పోటీరంగంలో భార‌త విశ్వ‌స‌నీయ‌త‌ను మేం విజ‌య‌వంతంగా పున‌రుద్ధ‌రించ‌గ‌లిగాం. గ‌తంలో ప్ర‌భుత్వం మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్టే రంగాల్లో మేం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్య (పీపీపీ) ప‌ద్ధ‌తి ద్వారా ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హిస్తున్నాం. మార్కెట్ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అల‌వ‌ర్చ‌టానికిగాను ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లోనూ వాటాల‌ను అమ్ముతున్నాం. పీపీపీ ప్రాజెక్టుల నిర్మాణం, అమ‌లులో మీ అనుభ‌వాల నుంచి నేర్చుకోవ‌టానికి సిద్ధంగా ఉన్నాం.

పారిశ్రామిక వేత్త‌లు, సృజ‌న‌శీలులంద‌రి మేధోసంప‌త్తి హ‌క్కుల (ఐపీఆర్‌) ర‌క్ష‌ణ‌కు నేను వ్య‌క్తిగ‌తంగా అనుకూలం. భార‌త్ కూడా వీటిని ర‌క్షించ‌టానికి క‌ట్టుబ‌డి ఉంటుంది. ఐపీ నిర్వ‌హ‌ణ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, ఆన్‌లైన్ ప్రాసెసింగ్‌ల‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నాం. ఓ స‌మ‌గ్ర జాతీయ ఐపీఆర్ ప్ర‌ణాళిక‌కు తుదిరూపునిచ్చాం.

మిత్రులారా!

మా క‌ల‌ల్ని సాకారం చేసుకునే ప్ర‌య‌త్నంలో మీ క్రియాశీల భాగ‌స్వామ్యాన్ని కోరుకుంటున్నాం. అత్యంత వేగంగా, స‌మ‌ర్థంగా ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌న్న మా ప‌ట్టుద‌ల‌, త‌ప‌న‌లో బ్రిటిష్ కంపెనీల‌కు అపార‌మైన అవ‌కాశాలు దాగున్నాయి. 100 స్మార్ట్ సిటీలలో భాగంగా 50 మిలియ‌న్ల ఇళ్ళ నిర్మాణం నుంచి రైల్వే వ్య‌వ‌స్థ ఆధునికీక‌ర‌ణ‌, రైల్వే కారిడార్లుగా స్టేష‌న్ల పున‌ర్‌నిర్మాణం, 175 జీబీల సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న ఉత్ప‌త్తి, పంపిణీ, స‌ర‌ఫ‌రా, జాతీయ ర‌హ‌దార్లు, బ్రిడ్జీలు, మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌లు… ఇలా ఎన్నో అవ‌కాశాలున్నాయి. మరే దేశంలోనూ ఇంత భారీగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఉత్ప‌త్తుల త‌యారీకి అవ‌కాశం లేదు. ఇంత భారీ స్థాయిలో అవ‌కాశాల‌ను ఈ భూమ్మీద మ‌రే చోటా క‌ల్పించ‌లేరు.

మా ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల ద్వారా ఈ సామ‌ర్థ్యానికి మెరుగులు దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. డిజిట‌ల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్య‌క్ర‌మాల రూపంలో ప్ర‌జ‌ల‌నూ ఇందులో భాగ‌స్వాముల‌ను చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. వారిలోని శ‌క్తిని వినియోగించుకోవ‌టానికి వీలుగా స్టార్ట‌ప్ ఇండియా కార్య‌క్ర‌మం మొద‌లెట్టాం. ఇటీవ‌లి కాలంలో స్టార్ట‌ప్‌ల వృద్ధి విప‌రీతంగా పెరిగింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ మార్కెట్లో పేరున్న సంస్థ‌ల‌కూ ఈ స్టార్ట‌ప్‌ల్లో కొన్ని స‌వాల్ విసురుతున్నాయి.

మిత్రులారా!

భార‌త్ ప్ర‌స్తుతం స‌మాచార సాంకేతిక విప్ల‌వం శిఖ‌రంపై ఉంది. మా 125 కోట్ల మంది ప్ర‌జానీకానికి సేవ‌లందించేలా ఆ రంగాన్ని ప్రోత్స‌హిస్తున్నాం. కొత్త సాంకేతిక‌త‌, సంప్ర‌దాయేత‌ర ఇంధ‌నం ప్ర‌స్తుతం మేం ప‌ఠిస్తున్న మంత్రం. మేం ఏది చేసినా స్వ‌చ్ఛ‌మైన‌, ప‌చ్చ‌దైన రీతిలోనే చేస్తాం. ఇంధ‌న సామ‌ర్థ్యం, నీటి రీసైక్లింగ్, చెత్త నుంచి ఇంధ‌నం, స్వ‌చ్ఛ భార‌త్‌, న‌దుల శుద్ధీక‌ర‌ణ‌.. లాంటివ‌న్నీ ఈ క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన‌వే. ఆధునిక సాంకేతిక‌త‌, మాన‌వ వ‌న‌రుల్లో పెట్టుబ‌డుల‌కు ఇవి అద‌న‌పు అవ‌కాశం క‌ల్పిస్తాయి.

విల‌క్ష‌ణ యువ‌త‌, ఎదుగుతున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉన్న దేశం మాది. భార‌త్‌లో భారీ దేశీయ మార్కెట్ కూడా ఉంది. ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జ‌లు, డిమాండ్‌ మా మౌలిక బ‌లమ‌ని ప‌దేప‌దే చెబుతున్నాను. అంతే కాకుండా భార‌త్‌లోని ప్ర‌తిభావంతులు ఇప్పుడు రిస్క్ తీసుకోవ‌టానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. పారిశ్రామిక‌వేత్త‌లుగా మార‌టానికి ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈ ల‌క్ష‌ణం ఇంత‌కుముందు చెప్పిన మూడింటికి ( ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జ‌లు, డిమాండ్‌) అద‌నంగా చేరుతోంది.

మిత్రులారా!

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ పైకి ఎద‌గ‌టానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకున్నాం. బ‌య‌టి నుంచి వ‌చ్చే ప్ర‌తిభ‌, నైపుణ్యం, పెట్టుబ‌డుల‌ను స్వీక‌రించ‌టంలో ఎన్న‌డూలేనంత‌గా భార‌త్ ఇప్పుడు సిద్ధ‌మైంది. రాబోయే రోజుల్లో మ‌రింత మెరుగైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని మీ అంద‌రికీ హామీ ఇస్తున్నాను. మీ ఆలోచ‌న‌ల‌కు, సృజ‌నాత్మ‌క‌త‌కు, పెట్టుబ‌డుల‌కు మేం ద్వారాలు తెరిచాం. మా ప‌థ‌కాలు, ప్ర‌ణాళిక‌లు, ప‌ద్ధ‌తుల్లో మార్పుల‌కు కూడా సిద్ధంగా ఉన్నాం. ప్ర‌గ‌తిశీల‌, మార్గ‌ద‌ర్శ‌క సార‌థి ప్ర‌ధాన‌మంత్రి కామెరాన్ భార‌త్ ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో బ్రిటిష్ ప్ర‌భుత్వం, కంపెనీల‌తో క‌ల‌సి ప‌ని చేసేందుకు నేను వ్య‌క్తిగ‌తంగా ఎంతో ఆస‌క్తిగా ఉన్నాను.

మీ అంద‌రినీ భార‌త్‌కు సాద‌రంగా ఆహ్వానిస్తున్నాను. మీ క‌ల‌లు నిజం కావ‌టానికి నా వ్య‌క్తిగ‌త స‌హ‌కారం ఉంటుంది. మీలో చాలా మంది భార‌త్‌కు చెందిన‌ వారే. చాలా మంది ఇప్ప‌టికే భార‌త్‌లో ఉన్న‌వారే. ఇప్ప‌టిదాకా లేని వారికి ఓ మాట….

– భార‌త్‌లో ఉండ‌టం ఇప్పుడు తెలివైన ప‌ని.

– భార‌త్‌లో పెట్టుబ‌డులు సుల‌భ‌త‌రం చేస్తున్నాం.

– పైగా ‘ మేక్ ఇన్ ఇండియా ‘ కన్నా కూడా ఇంకా మెరుగ్గా చేయ‌బోతున్నాం. న‌న్ను న‌మ్మండి.

ధ‌న్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు.