పిఎంఇండియా
చట్టాలను అమలుచేయడం లో శిక్షణకు సంబంధించి అమెరికా లోని ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ శిక్షణ కేంద్రాలు (ఎఫ్ఎల్ఇటిసి), భారతదేశం లోని బ్యూరో ఆఫ్ పోలీస్ రిసర్చ్, డివెలప్‌మెంట్ (బిపిఆర్ &డి)ల మధ్య సహకారపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒసి ) పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇది భారతదేశం, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ చర్చల పరిధిలో భద్రతపరమైన అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య పరస్పర విస్తృత సహకారానికి మార్గాన్ని సుగమం చేసింది.
శిక్షణ సామగ్రి, శిక్షణ ప్రమాణాల పెంపు, నాణ్యత కలిగిన శిక్షకులను అందించడానికి ఈ ఎంఒసి తోడ్పడుతుంది. ఇది దేశంలో పోలీసు బలగాల పనితీరును మెరుగుపరచడానికి, స్మార్ట్ పోలీస్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో, వివిధ రూపాల లోని సీమాంతర నేరాలను అదుపు చేయడంలో, ఉగ్రవాద సంస్థలు ఎదగకుండా చూడడంలో భారతదేశం, అమెరికా లకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. దేశీయ రక్షణ, కీలక మౌలిక సదుపాయాల రక్షణ, ఉగ్రదాడుల నుండి అంతర్జాతీయ సరఫరాలు నిలిచిపోకుండా చూడడం వంటి వాటి విషయంలో భారతదేశం మరియు అమెరికా లకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి.
పూర్వ రంగం:
2010 వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన సమయంలో ఇరు దేశాలూ హోంలాండ్ సెక్యూరిటీ డైలాగ్ (హెచ్ ఎస్ డి) యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇండియా- యుఎస్ఎ కౌంటర్ టెర్రరిజమ్ ఇనిశియేటివ్ పై సంతకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
హోంలాండ్ సెక్యూరిటీ డైలాగ్ లో భాగంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, రవాణా, పోర్టులు, సరిహద్దు , సముద్రయాన రక్షణ , మెగాసిటీ పోలిసింగ్, ఫెడరల్ స్టేట్,స్థానిక భాగస్వామ్య సంస్థల మధ్య సమాచార మార్పిడి, అక్రమార్థిక లావాదేవీలు, నగదు స్మగ్లింగ్, ఆర్థిక మోసాలు, నకిలీలు, సైబర్ సమాచారం, సామర్ధ్యాల నిర్మాణం, సాంకేతికాభివృద్ధికి సంబంధించి ఆరు సబ్- గ్రూపులను ఏర్పాటు చేశారు.
భారతదేశం, అమెరికా ల మధ్య కుదిరిన హోంలాండ్ సెక్యూరిటీ డైలాగ్ లో భాగంగా ఏర్పడిన సబ్- గ్రూపు లలో ఒక సబ్- గ్రూపు సామర్ధ్యాల నిర్మాణానికి సంబంధించింది. ఇది హొంలాండ్ సర్వీస్ డైలాగ్ కింద ఆరు సబ్- గ్రూపుల పరిధి కిందకు వచ్చే అంశాల విషయంలో చట్టాన్ని అమలు చేసే సంస్ధల సామర్ధ్యాల నిర్మాణాన్ని పెంచే విషయంలో అమెరికా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొనే లక్ష్యంతో ఏర్పడింది.
భారతదేశంలో, అమెరికాలో సామర్ధ్యాల నిర్మాణాన్నిచూసే కీలక వ్యవస్థల మధ్య పరస్పర వ్యవస్థీకృత సహకారం ఎంతో ముఖ్యం. అమెరికా వైపు నుండి అమెరికా లోని ఎఫ్‌ఎల్‌ఇటిసి, భారతదేశం లోని బిపిఆర్ &డి ల మధ్య సహకారపూర్వక ఒప్పందానికి అమెరికా ప్రతిపాదించింది.