Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల ప్రగతిపై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్ష


వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల్లో ప్రగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమీక్షించారు. ఈ మేరకు తన నివాసమైన నం.7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి స్వయంగా అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం సహా అనుబంధ రంగాల పురోగమనంపై ఆయా శాఖల కార్యదర్శులతో కూలంకషంగా చర్చించారు.

 

ప్రభుత్వం చేపట్టే సంస్కరణలన్నిటికీ పౌర సంక్షేమమే కేంద్రకంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణల అమలు వాస్తవికంగా వేగం పుంజుకుని, అర్థవంతమైన మార్పులు తేవాలని ఆయన ఆకాక్షించారు. సంస్కరణల లక్ష్యం ప్రభుత్వ పనితీరు మెరుగుదల మాత్రమే కాదని, దేశం వికసిత భారత్‌గా రూపొందే ప్రక్రియను వేగిరపరచడమేని వివరించారు.

 

దేశంలో మార్పు వేగాన్ని పరిపాలన వ్యవస్థలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కాలానుగుణ పరిణామాల మేరకు అవసరాలను తీర్చడానికి సమర్థంగా కృషి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో పరిపాలన ప్రక్రియల అనుసరణ, బలోపేతం ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో కొత్త అవసరాను సమగ్రంగా గుర్తించి, నమోదు చేయాలని సూచించారు.

జాతీయ ప్రగతి లక్ష్యాల సాధనలో ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా కృషి ప్రజా ఉద్యమంగా మారాలని, దానికి యువత సారథ్యం వహించాలని ఆయన కరాఖండీగా చెప్పారు.

 

యువతలో మాదక ద్రవ్య వినియోగం బెడదను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిశగా వివిధ శాఖల మధ్య గల అవరోధాలను తొలగించి, యువత కేంద్రక కార్యక్రమాలలో సమన్వయం, ఏకీకరణను పెంచేందుకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని రూపొందించే ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.

 

క్రీడా రంగం పురోగమనానికి సమగ్ర విధానం అవసరమని ప్రధానమంత్రి స్పష్టీకరించారు. ముఖ్యంగా క్రీడా పర్యాటకం ఓ కీలక ప్రాధాన్య రంగంగా ఆవిర్భవిస్తున్నదని ఆయన అన్నారు. అందువల్ల, ప్రపంచ క్రీడా కూడలిగా భారత్‌ నిలదొక్కుకునే దిశగా ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వాలన్నది మన ఆకాంక్షగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. క్రీడా రంగంలో సాంకేతికతకు ప్రోత్సాహం, అంకుర ఆవిష్కరణలకు ప్రోత్సాహం ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు.

పీఎం-కుసుమ్ పథకం వంటి కార్యక్రమాలను రైతులు విస్తృతంగా అనుసరిస్తే, వ్యవసాయ రంగంలో పరిణామాత్మక మార్పులు వస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అంతర్జాతీయ అవకాశాలు, భవిష్యత్ అవసరాలతో మెరుగైన అనుసంధానం కోసం నైపుణ్య అవసరాల ప్రపంచవ్యాప్త గుర్తింపు, నమోదు అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ సమావేశం సందర్భంగా కార్యదర్శులు తమతమ రంగాల్లో వివిధ కార్యక్రమాలు, సవాళ్లపై తమ అనుభవాలను, దృక్పథాన్ని పంచుకున్నారు. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ దిశగా ప్రధానమంత్రి కూడా తన సూచనలను, దృక్కోణాన్ని వారికి వివరించారు. వికసిత భారత్ లక్ష్యం దిశగా కార్యక్రమాల సమర్థ అమలు, అధిక సమన్వయం, పురోగమన వేగంపై దృష్టి సారించాలని సూచించారు. మొత్తంమీద ఈ సమావేశం అన్ని రంగాలపై సమగ్ర సమీక్ష ద్వారా కూలంకషంగా సాగింది.

 

ఈ సమావేశానికి మంత్రిమండలి కార్యదర్శితోపాటు కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సహా ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

 

***