పిఎంఇండియా
విజయవాడ విమానాశ్రయాన్ని ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 నిబంధనలను అనుసరించి అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజధానికి గగనతల అనుసంధానాన్ని మెరుగుపరచగలుగుతుంది. ఇది విమాన ప్రయాణికులకు విస్తృతమైన సేవలలో నుండి స్పర్ధాత్మక ధరలకు లభించే సేవలను ఎంపిక చేసుకొనే అవకాశాన్ని ప్రసాదిస్తుంది. దేశీయ/అంతర్జాతీయ పర్యటనలకు ఊతాన్నిస్తుంది. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికులను, పెద్ద ఎత్తున సరుకు రవాణాను ఆంధ్ర ప్రదేశ్ వైపునకు ఆకర్షించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడగలుగుతుంది.
పూర్వ రంగం:
ఒక విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడమనేది విమానాల రాకపోకల సామర్థ్యం పైన, అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణ కోసం విమాన సంస్థల నుండి వచ్చే డిమాండ్ పైన ఆధారపడుతుంది. ఇంకా, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం గ్రౌండ్ లైటింగ్ సౌకర్యాల లభ్యత, రాత్రి పూట విమాన సముదాయం కార్యకలాపాల నిర్వహణ కోసం ఇన్ స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, మధ్యరకం కెపాసిటీ కలిగిన లాంగ్-రేంజి ఏర్ క్రాఫ్ట్ లేదా సమానమైన తరహా ఏర్ క్రాఫ్ట్ అవసరాలను తీర్చడం కోసం సరిపడినంత పొడవాటి రన్ వే, కస్టమ్స్, ఇమిగ్రేషన్, హెల్త్ అండ్ ఏనిమల్ & ప్లాంట్ క్వోరంటీన్ సర్వీసుల అందుబాటు కూడా అవసరమవుతాయి.
ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 నిబంధనలను అనుసరించి మరియు ప్రయాణికుల రాకపోకల సంఖ్యలో వృద్ధిని, విమాన సంస్థల నుండి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే అంశాన్ని పరిశీలించడమైంది. అంతర్జాతీయ కార్యకలాపాలకు కావలసిన అవస్థాపనను, ఇతర సదుపాయాలను తదనుగుణంగా మెరుగుపరచే పనిని ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది.