Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వేత‌నాలు, పెన్షన్ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి 7వ కేంద్ర వేత‌న సంఘం సిఫారసుల‌లో స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


వేతనం మరియు పెన్షన్ ప్రయోజనాలపై 7వ కేంద్ర వేత‌న సంఘం (సిపిసి) చేసిన సిఫారసు అమలు క్రమంలో సవరణలకు సంబంధించిన ముఖ్య ప్రతిపాదనలకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016-17 సంవ‌త్స‌రానికి అద‌నంగా 84,933 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు కాగల సిఫారసుల (వీటిలో 2015-16 సంవ‌త్స‌రానికి సంబంధించిన రెండు నెల‌ల బ‌కాయిలు కూడా కలిసి ఉన్నాయి) అమ‌లుకు మంత్రివర్గం ఇంతకు ముందు 2016 జూన్‌లో ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత సవ‌రణలకు అనుగుణంగా ల‌భించే ప్ర‌యోజ‌నాలు 2016 జ‌న‌వ‌రి 1వ తేదీ నుండి, అంటే 7వ వేత‌న సంఘం సిఫారసులు అమ‌లయ్యే తేదీ నాటి నుండి, ల‌భించ‌నున్నాయి. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం, కేంద్ర ప్ర‌భుత్వ పెన్షన్ వార్షిక‌ బిల్లు ఒక్క‌టే 1,76,071 కోట్ల రూపాయ‌లుగా ఉండే సూచనలున్నాయి. మంత్రివర్గం తీసుకున్న‌కొన్నిప్ర‌ధాన నిర్ణ‌యాలు కిందివిధంగా ఉన్నాయి:

1. 2016కు ముందు గ‌ల పింఛ‌నుదారులు మరియు కుటుంబ పింఛ‌నుదారుల పింఛ‌న్ స‌వ‌ర‌ణ‌

మంత్రివర్గం ఆమోదంతో నియ‌మింప‌బ‌డిన క‌మిటీ, సెక్ర‌ట‌రీ (పెన్ష‌న్స్‌) అధ్య‌క్ష‌త‌న చేసిన సిఫారసుల‌కు అనుగుణంగా 2016కు ముందు గ‌ల పింఛనుదారులు, కుటుంబ పింఛ‌న్‌దారుల పింఛ‌న్ కు సంబంధించి 7వ‌ వేత‌న సంఘం చేసిన సిఫారసుల‌లో స‌వ‌ర‌ణ‌ల‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదించిన ఈ స‌వ‌ర‌ణ‌ల వ‌ల్ల పింఛ‌నుదారుల‌కు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఇందుకు సంబంధించి 2016-17 సంవ‌త్స‌రానికి సుమారు 5031 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు ఖ‌ర్చు అవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్ ప్రాతిప‌దిక‌గా రెండో ఫార్ములేష‌న్ ప్ర‌కారం పెన్ష‌న్ స‌వ‌ర‌ణ‌కు ఖ‌ర్చు చేసిన మొత్తానికి ఇది అద‌నం. ఇది 2016కు ముందు గ‌ల సివిల్‌, డిఫెన్స్ పింఛ‌నుదారులు, కుటుంబ పింఛ‌నుదారులైన 55 ల‌క్ష‌ల మందికి ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది.

2016 జూన్ 29న 7వ వేత‌న సంఘం సిఫారసుల అమ‌లును ఆమోదిస్తూ మంత్రివర్గం, 2016కు ముంద‌టి పింఛ‌న్‌దారుల‌కు 7వ వేత‌న సంఘం సిఫారసు చేసిన పెన్ష‌న్ స‌వ‌ర‌ణ ప‌ద్ధ‌తిని ఆమోదించింది. ఇందుకు రెండు ప్ర‌త్యామ్నాయాల‌ను సూచించింది. మొద‌టి సూత్రం అమ‌లు సాధ్యాసాధ్యాల‌కు లోబ‌డి క‌మిటీ ప‌రిశీలించాలి.

మంత్రివర్గం నిర్ణ‌యం ప్ర‌కారం, 2016 కు ముంద‌రి పెన్ష‌న‌ర్ల పెన్ష‌న్లను రెండో ఫార్ములేష‌న్ ప్ర‌కారం స‌వ‌రించారు. నిజానికి 7వ వేత‌న సంఘం సిఫారసుల ప్ర‌కారం రెండు ఫార్ములేష‌న్ల‌లో ఏది ఎక్కు వ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుందో దానిని ఎంచుకునే అవ‌కాశం పెన్ష‌న‌ర్ల‌కు ఇవ్వాల్సి ఉన్న‌ప్ప‌టికీ రెండో ఫార్ములేష‌న్ ప్ర‌కారం ప్ర‌స్తుత పెన్ష‌న్‌ను 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్‌తో గుణించి స‌వ‌రించారు.

పెన్ష‌న‌ర్ల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం క‌ల్పించే అవ‌కాశం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో క‌మిటీ సిఫారసుల‌ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ క‌మిటీ ప్ర‌తి పెన్ష‌న‌ర్‌కు జారీ చేసిన పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ (పిపిఒ)లోని స‌మాచారానికి అనుగుణంగా పెన్ష‌న్‌ను స‌వ‌రించాలంటూ చేసిన సూచ‌న‌ను మంత్రివర్గం ఆమోదించింది. స‌వ‌రించిన విధానం ప్ర‌కారం నోష‌న‌ల్ పే ఖ‌రారు ప్ర‌క్రియ మ‌రింత శాస్త్రీయంగా,హేతుబ‌ద్దంగా , అన్ని కేసుల‌లోనూ అమ‌లుకు వీలుగా ఉంద‌ది. వంద‌లాది పెన్ష‌న‌ర్ల కేసుల‌ను ప‌రిశీలించిన మీద‌ట స‌వ‌రించిన పెన్ష‌న్ ప్ర‌తిపాద‌న‌లను క‌మిటీ చేసింది. స‌వ‌రించిన కొత్త ఫార్ములా మ‌రింత మంది పెన్ష‌న‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తుంది. ఇది 7వ వేత‌న సంఘం సిఫారసు చేసిన మొద‌టి ఫార్ములేష‌న్ కంటే ఎక్కువ‌ మందికి ప్ర‌యోజ‌న‌క‌రం. 7వ వేత‌న సంఘం సిఫారసులు చాలా మంది పెన్ష‌న్ దారుల కేసుల‌లో రికార్డులు అందుబాటులో లేక అమ‌లు సాధ్యం కాని ప‌రిస్థితి క‌నిపించ‌డ‌మే కాకుండా, ప‌లు కేసుల‌లో ప‌లు వ్యత్యాసాలకు కూడా ఆస్కారం ఉన్నట్లు కనిపించింది.

2. రక్షణ శాఖ పెన్షనర్లకు వైక‌ల్య‌ పింఛన్‌

6వ వేత‌న సంఘం సిఫారసుల అనంత‌రం అమ‌లు చేసిన ప‌ర్సంటేజ్ ఆధారిత వైకల్య పింఛన్ విధానాన్ని అలాగే ఉంచాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 7వ వేత‌న సంఘం మాత్రం దీని స్థానంలో స్లాబ్ ఆధారిత వ్య‌వ‌స్థను తీసుకురావాల‌ని సూచించింది. డిసబిలిటీ పెన్ష‌న్ అంశానికి సంబంధించి స్లాబ్ ఆధారిత వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాలంటూ ర‌క్ష‌ణ రంగ ఉద్యోగుల నుండి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌, జాతీయ అనామ‌లీ క‌మిటీకి పంపింది. ఎందుకంటే, స్లాబ్ ఆధారిత విధానాన్ని, ప‌ర్సంటేజ్ ఆధారిత డిసబిలిటీ పెన్ష‌న్‌తో పోలిస్తే ప్ర‌స్తుత పింఛ‌నుదారుల‌కు, భ‌విష్య‌త్తులో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వారికి డిసబిలిటీ పెన్షన్‌లో కోత ప‌డే అవ‌కాశం ఉంది.

తాజా నిర్ణ‌యం ప్ర‌స్తుత పింఛ‌నుదారుల‌కు, భ‌విష్య‌త్తులో పింఛ‌ను అందుకోబోయే వారికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌నుంది. ఈ నిర్ణయం ఏటా 130 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు వ్యయానికి దారితీయగలదు.

****