Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ-వినియోగాలకు సహకారం దిశగా


శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ-వినియోగాలకు సహకారం దిశగా భారత్-సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ ద్వీపదేశాల మధ్య ముసాయిదా ఒప్పందంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలికి అధికారవర్గాలు వివరించాయి. ఈ ఒప్పందంపై 2018 సెప్టెంబరు 7వ తేదీన సంతకాలు పూర్తయ్యాయి.
ముఖ్యాంశాలు:

i. భూ దూరగ్రాహకత (రిమోట్ సెన్సింగ్), ఉపగ్రహ సమాచార-ప్రసారం; ఉపగ్రహ మార్గదర్శక వ్యవస్థ, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో సరికొత్త పరిశోధన కార్యకలాపాలతోపాటు అనువర్తన అవకాశాల అన్వేషణను ఈ ముసాయిదా ఒప్పందం ప్రోత్సహిస్తుంది.

ii. మానవాళి ప్రయోజనాల కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన అనువర్తన రంగంలో అనేక సంయుక్త కార్యకలాపాల రూపకల్పనకు ఈ ముసాయిదా ఒప్పందం తోడ్పడుతుంది. తద్వారా రెండు దేశాల్లోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాలవారు లబ్ధిపొందే వీలుంది.

ప్రధాన ప్రభావం:

భూ దూరగ్రాహకత(రిమోట్ సెన్సింగ్), ఉపగ్రహ సమాచార-ప్రసారం; ఉపగ్రహ మార్గదర్శక వ్యవస్థ, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో సరికొత్త పరిశోధన కార్యకలాపాలతోపాటు అనువర్తన అవకాశాల అన్వేషణను ఈ ముసాయిదా ఒప్పందం ప్రోత్సహిస్తుంది.

నేపథ్యం:

i. భారతదేశంతో అంతరిక్ష సహకారంలో సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ ప్రజాస్వామ్య గణతంత్ర ప్రభుత్వం ప్రయోజనాలకు సంబంధించి అభిప్రాయం తెలపాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (2017 నవంబరు), జాతీయ భద్రత మండలి సచివాలయం (2018 జనవరి) నుంచి అంతరిక్ష శాఖకు సమాచారం అందింది. సావో టోమ్ అండ్ ప్రిన్సిపీలో ఉపగ్రహ అనుసరణ కేంద్రం ఏర్పాటు… అందుకయ్యే వ్యయం అంచనాలను కూడా పరిశీలించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. తదనుగుణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిపుణులు సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ భౌగోళిక ప్రాదేశికతపై ప్రాథమిక అధ్యయనం నిర్వహించారు. ఆ మేరకు సావో టోమ్ అండ్ ప్రిన్సిపీలో భారత ఉపగ్రహ భూతల అనుసరణ కేంద్రం ఏర్పాటుకుగల అవకాశాలు, దీనికి సంబంధించిన ఆర్థిక భారం తదితరాలపై జాతీయ భద్రత మండలి సచివాలయానికి ఇస్రో నివేదించింది.

ii. అనంతరం 2018 మార్చి ఆఖరువారంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సావో టోమ్ అండ్ ప్రిన్సిపీల మధ్య ‘ఆసక్తి వ్యక్తీకరణ పత్రం’ (LoI)పై సంతకాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇస్రోకు ఆ సంస్థ చైర్మన్, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ తరఫున విదేశీ వ్యవహారాలు-సామాజిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించారు. దీని ప్రకారం భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం ఆ దేశంలో భూతల అనుసరణ కేంద్రం ఏర్పాటు, నిర్వహణకు అంగీకారం కుదిరింది.

iii. సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ అధికారవర్గాల ఆహ్వానం మేరకు ఇస్రో నుంచి నిపుణుల బృందం ఆ దేశానికి వెళ్లి, భూతల అనుసరణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించింది. భూతల అనుసరణ కేంద్రం ఏర్పాటు ఒక నిర్దిష్ట కార్యాచరణ కావడంతోపాటు దీనిద్వారా తగిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సముచిత ప్రయోజనాల సాధన కోసం రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరం. దీంతో ‘‘శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ-వినియోగాలకు సహకారం’’ దిశగా సంబంధిత బహుముఖ కార్యకలాపాలకు చోటుకల్పిస్తూ ముసాయిదా ఒప్పందం కుదుర్చుకోవాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయి.