Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితమివ్వనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ; గుజరాత్ లో రెండు బహిరంగ సభలలో ఆయన ప్రసంగించనున్నారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని కేవడియా లో సర్దార్ సరోవర్ ఆనకట్టను దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారు.

ఆనకట్ట ఎత్తు ను ఇటీవలే 138.68 మీటర్లకు పెంచారు. దీనితో వినియోగించుకోదగ్గ నీటి నిల్వ సామర్థ్యం 4.73 మిలియన్ ఏకర్ ఫీట్ (ఎమ్ఎఎఫ్) కు చేరింది. ఈ ఆనకట్ట ఎత్తు పెంపుదల గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లకు గొప్ప ప్రయోజనకారి కాగలదు.

నర్మద నది జలాలను గుజరాత్ లోని జలాభావ ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ ప్రాజెక్టు సహాయకారిగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందే సేద్యపు జలాలు సుమారు 10 లక్షల మంది వ్యవసాయదారులకు లాభసాటిగా ఉండగలవని ఆశిస్తున్నారు. అంతే కాక, వేరు వేరు గ్రామాలు, పట్టణాలలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలకు త్రాగు నీటిని సరఫరా చేయడం కూడా దీని ద్వారా సాధ్యపడనుంది. నీటి చేరవేతకు ఇంతవరకు చేపట్టిన బృహత్ ప్రయత్నాలలో ఈ ప్రాజెక్టు ఒకటని ఇప్పటికే అభివర్ణించడమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి ఒక బిలియన్ యూనిట్ల జల విద్యుత్తు ను కూడా ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు.

ఆనకట్ట కట్టిన చోటు నుండి ప్రధాన మంత్రి సాధు బెట్ కు ప్రయాణిస్తారు. అక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మృత్యర్థం ఒక మహా విగ్రహం మరియు దానితో పాటు ఒక స్మారక భవన సముదాయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. 182 మీటర్ల ఎత్తయిన ఒక ప్రతిమ, ఒక ప్రదర్శన మందిరం, ఒక స్మారకోద్యానం, ఒక వీక్షకుల కేంద్రం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి.

ప్రధాన మంత్రి ‘నర్మద మహోత్సవ్’ ముగింపు ఉత్సవానికి హాజరు అవుతారు. దభోయి లో సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమ సమయంలోనే జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయానికి ఆయన పునాదిరాయిని వేస్తారు.

ఆ తరువాత, అమ్ రేలీని ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఎపిఎమ్ సి కి చెందిన ఒక కొత్త మార్కెట్ యార్డు ను ఆయన ప్రారంభిస్తారు. అమర్ డెయిరీ లో కొత్త యంత్రాలను కూడా ప్రారంభిస్తారు; తేనె ఉత్పాదక కేంద్రానికి పునాదిరాయిని వేస్తారు. అమ్ రేలీ లో ఓ సహకార్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

***