పిఎంఇండియా
యువత అభివృద్ధి, దేశ నిర్మాణానికి క్రీడాశక్తిని ఉపయోగించుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. 2026–27 నుంచి 2030–31 వరకు గల అయిదేళ్ల కాలానికి గాను రూ. 36,441 కోట్ల సంయుక్త కేటాయింపుతో మార్పులు చేసిన ఖేలో ఇండియా పథకానికి, బలోపేతం చేసిన ‘జాతీయ క్రీడా సమాఖ్యలకు ఆర్థిక సహాయం (ఏఎన్ఎస్ఎఫ్)’ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఖేలో ఇండియానే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా అభివృద్ధి కార్యక్రమం. ఇది క్రీడల పట్ల దేశ యువత ఆశయాలకు ఒక పెద్ద ఊతమివ్వటంతో పాటు రాబోయే దశాబ్దంలో పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతుంది.
గత ఖేలో ఇండియా పథకంతో పోలిస్తే ఈ సరికొత్త పథకానికి దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. యువత అభివృద్ధికి, దేశ నిర్మాణానికి, ప్రపంచ క్రీడాశక్తిగా భారత్ అవతరించడానికి మూలస్తంభంగా– క్రీడల్ని మార్చాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
పాఠశాల మైదానాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాల నుంచి ఒలింపిక్ వేదిక వరకు ప్రతి ప్రతిభావంతమైన యువ భారతీయుడికి అన్ని వేళలా ఒక మార్గాన్ని సృష్టించేలా ఈ నూతన పథకం రూపుదిద్దుకుంది. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక నేపథ్యం లేదా అవకాశాలు లేకపోవడం వల్ల ఏ ఒక్క క్రీడాకారుడు గుర్తింపు లేకుండా మిగిలిపోకుండా ఉండటానికి ఇది భరోసానిస్తుంది.
ఖేలో భారత్ నీతి– 2025, జాతీయ విద్యా విధానం– 2020ల దృక్పథానికి అనుగుణంగా 2030 కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్– పారాలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలతో సహా దేశానికి ఉన్న దీర్ఘకాలిక క్రీడా ఆశయాలకు బలమైన ఆధారాన్ని ఏర్పాటు చేస్తూ ఈ పథకం క్రీడలను విద్య, ఫిట్నెస్, సాంకేతికత, అత్యున్నత స్థాయి శిక్షణతో అనుసంధానిస్తుంది.
ప్రతిభావంతుడైన ప్రతి యువకుడూ రాణించడానికి ఒక మార్గం:
మొట్టమొదటిసారిగా.. ప్రతిభావంతులను గుర్తించటం, శాస్త్రీయ శిక్షణ నుంచి అంతర్జాతీయ పోటీ– ఒలింపిక్ సన్నాహాల వరకు ప్రతి దశలో యువ అథ్లెట్లకు మద్దతుగా సమగ్ర అథ్లెట్ అభివృద్ధి మార్గాన్ని సృష్టించారు.
ఈ పథకం జాతీయ ఎక్సలెన్స్ కేంద్రాలు (ఎన్సీఓఈ– నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు), ఖేలో ఇండియా ఎక్సలెన్స్ కేంద్రాలు (ఖేఐసీఓఈ– ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు), సాయ్ శిక్షణ కేంద్రాలు (ఎస్టీసీఎస్), ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలు (కేఐఏఏలు), ఖేలో ఇండియా కేంద్రాలు (కేఐసీలు), సాయుధ దళాల యూత్ స్పోర్ట్స్ యూనిట్లతో (వైఎస్సీఎస్) కూడిన ఒక సమగ్ర దేశవ్యాప్త క్రీడా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి కోచింగ్, క్రీడా విజ్ఞాన మద్దతు, ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తాయి.
పాఠశాల క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి ‘ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్ (కేఐఎఫ్ఎస్), ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలు (కేఐయూవీ)’ అనే రెండు కొత్త కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇవి క్రీడలను ప్రధాన స్రవంతి చదువులతో అనుసంధానిస్తాయి. ప్రతిభావంతులైన పిల్లలను ముందుగానే గుర్తించి క్రమపద్ధతిలో వారి పురోగతికి వీలు కల్పిస్తాయి.
దాదాపు పది రెట్లు పెరగనున్న భారతదేశ అథ్లెట్ల సంఖ్య:
ఈ మెరుగుపరిచిన పథకం కింద ప్రధానంగా.. ఇప్పటికే ఉన్న ఖేలో ఇండియా అథ్లెట్ల కార్యక్రమంతో పాటు ‘ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్ (ఈ–కేఐఏ)’ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది సంస్థాగత అథ్లెట్ అభివృద్ధి వ్యవస్థను దాదాపు పది రెట్లు విస్తరింపజేస్తుంది. వేలాది మంది అదనపు యువ అథ్లెట్లను వృత్తిపరమైన కోచింగ్, శాస్త్రీయ మద్దతు, దీర్ఘకాలిక మార్గదర్శకత్వంలోకి తీసుకువస్తుంది.
నైపుణ్య గుర్తింపు అభివృద్ధి కమిటీలు, జోనల్ కమిటీలు, టాలెంట్ స్కౌట్స్, హై–పెర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, హై–పెర్ఫార్మెన్స్ మేనేజర్లతో కూడిన బలమైన దేశవ్యాప్త నైపుణ్య గుర్తింపు వ్యవస్థ.. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అథ్లెట్లను నిరంతరం గుర్తించడం, అభివృద్ధి చేయటాన్ని నిర్ధారిస్తుంది.
ఈ పథకం– కింది స్థాయి పోటీల నుంచి ఖేలో ఇండియా ద్వారా, ఆ తర్వాత టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) వరకు క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగేలా స్పష్టమైన పురోగతి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా అర్హులైన అథ్లెట్లు ప్రపంచ స్థాయి శిక్షణ, అంతర్జాతీయ అనుభవం, అత్యున్నత స్థాయిలో పతకాల కోసం పోటీ పడేందుకు సమగ్ర మద్దతును పొందుతారు.
మరిన్ని పోటీలు– గొప్ప అవకాశాలు:
క్రమం తప్పకుండా జరిగే పోటీలపై క్రీడా రంగంలో రాణించడం ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పథకం.. భారత దేశీయ క్రీడా పోటీల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. యువ క్రీడాకారులకు నిరంతరం పోటీ అనుభవాన్ని అందించడానికి.. జాతీయ ఛాంపియన్‌షిప్‌లతో పాటు పాఠశాల, విశ్వవిద్యాలయ, ప్రాంతీయ, క్రీడా-నిర్దిష్ట లీగ్‌లకు ఇది మద్దతు ఇస్తుంది.
మహిళా అథ్లెట్లు, పారా–అథ్లెట్లు, స్వదేశీ క్రీడలు.. శాంతికీ, సమాజ అభివృద్ధికీ ఒక సాధనంగా క్రీడా అవకాశాలను విస్తరించడంపై ఈ పథకం ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ క్రీడల నిర్వహణకు, భారత్‌లో ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈ పథకం మద్దతు అందిస్తుంది.
శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడం:
ముఖ్యంగా యువతలో శారీరక దృఢత్వాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా ప్రోత్సహించడానికి ‘ఫిట్ ఇండియా కార్యక్రమం‘ గణనీయంగా విస్తరించనుంది. చురుకైన జీవనశైలి, క్రీడలలో మహిళల భాగస్వామ్యం, సరిహద్దు– మారుమూల ప్రాంతాల్లో అవగాహన కల్పించటం, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా క్రీడా ఆధారిత కార్యక్రమాలను ఇది ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా సామాజిక పరివర్తనకు క్రీడలు ఒక సాధనంగా ఉపయోగపడతాయన్న విషయం మరోసారి స్పష్టమౌతుంది.
కోచ్‌లు, సాంకేతికత, ఆవిష్కరణలలో పెట్టుబడులు:
ప్రపంచ స్థాయి మద్దతు వ్యవస్థలతోనే అథ్లెట్లు రాణించగలరన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా కోచింగ్ అర్హతలను ప్రామాణీకరించడానికి, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరిచేందుకూ, కోచ్‌లు– సహాయక సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ‘నేషనల్ కోచ్ అక్రిడిటేషన్ బోర్డ్ (ఎన్ఏసీబీ)’ను ఏర్పాటు చేస్తుంది.
ఈ పథకం అథ్లెట్ డేటాబేస్లు, మౌలిక సదుపాయాలు, పోటీలు, కోచింగ్ వనరులు, నైపుణ్యాల అంచనాలు, నిధులు, ఫిట్ ఇండియా భాగస్వామ్యాన్ని అనుసంధానించే ఏకీకృత డిజిటల్ క్రీడా వేదికను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంది. ఈ వేదిక డేటా–ఆధారిత ప్రణాళిక, పారదర్శక పరిపాలన, వ్యక్తిగతీకరించిన అథ్లెట్ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.
క్రీడా శ్రేష్టత కోసం బలమైన భాగస్వామ్యాలు:
క్రీడా మౌలిక సదుపాయాలు, నైపుణ్యమైన క్రీడాకారుల అభివృద్ధి, అథ్లెట్‌కు సహాయం చేయటం, ఆవిష్కరణలు– నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం ప్రైవేట్ అకాడమీలు, కార్పొరేట్ భాగస్వాములు, ఇతర సంస్థలతో సహకారాన్ని మరింతగా పెంచుతుంది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే నిజమైన జాతీయ క్రీడా వ్యవస్థ తయారవుతుంది.
భారతదేశ ప్రపంచ స్థాయి క్రీడా ఆశయాలకు మద్దతు:
ఈ పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి తోడుగా 2026-31 కాలానికి గానుమెరుగుపరిచిన ‘జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం (ఏఎన్ఎస్ఎఫ్)’ పథకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కోచింగ్, క్రీడా విజ్ఞానం, ఆధునిక పరికరాలు, అంతర్జాతీయ అనుభవం, కోచింగ్ క్యాంపులు, విదేశీ నిపుణుల భాగస్వామ్యం, ప్రధాన అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం కోసం నిధులను అందించటం ద్వారా భారతీయ క్రీడాకారులు, జట్లకు మద్దతు ఇస్తుంది. ఇది గ్లోబల్ సౌత్ దేశాలతో క్రీడా సహకారానికి మద్దతు ఇస్తుంది.. అంతర్జాతీయంగా భారతదేశ స్వదేశీ క్రీడలను ప్రోత్సహిస్తుంది.
వికసిత్ భారత్ కోసం ఒక జాతీయ మిషన్:
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం భారతదేశ క్రీడా భవిష్యత్తు కోసం ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు.. యువ భారతీయులకు అవకాశం, ఆత్మవిశ్వాసం, శ్రేష్టతను అందించే ఒక జాతీయ మిషన్.
అట్టడుగు స్థాయి ప్రతిభ నుంచి ప్రపంచ క్రీడా విజయం వరకు ఒక సజావైన మార్గాన్ని సృష్టించడం ద్వారా ‘వికసిత్ భారత్– 2047′ దృక్పథం వైపు పయనిస్తోన్న దేశంలో ఛాంపియన్లను పెంపొందించడం, ఫిట్నెస్ సంస్కృతిని ప్రేరేపించడం, భారతదేశ క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దేశాలలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ పథకం ఉంది.
***