Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ్) కు ప్రపంచ బ్యాంకు సహాయం


స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) [ఎస్ బి ఎమ్ (జి)] కు 15 వందల మిలియన్ అమెరికా డాలర్ల మేర ప్రపంచ బ్యాంకు సహాయం చేసే ప్రాజెక్టు కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ప్రాజెక్టు మౌలికంగా ప్రస్తుతం ఎస్ బి ఎమ్ (జి) అమలులో ఉన్న రాష్ట్రాలను అవి కనబరుస్తున్న పనితీరును బట్టి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. 2014 సెప్టెంబర్ 24వ తేదీన స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్)ను ఆమోదించే సమయంలోనే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. తాజా ఆమోదం అటువంటి ప్రోత్సాహకాలను ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా అమలు చేసే వెసులుబాటును కల్పిస్తుంది.

ఆమోదం లభించిన ప్రాజెక్టులో భాగంగా, రాష్ట్రాల పనితీరును డిస్ బర్స్ మెంట్ లింక్ డ్ ఇండికేటర్స్ (డి ఎల్ ఐ లు) గా పిలిచే కొన్ని నిర్దిష్ట పనితీరు సూచికల ఆధారంగా పరిశీలిస్తారు. మూడు డి ఎల్ ఐ లను ఈ దిగువన పేర్కొనడం జరుగుతోంది..

i. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జనలను తగ్గించడం : దీని ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రాలలోని గ్రామీణ కుటుంబాలలో బహిరంగ ప్రదేశాలలో మల విసర్జనలు ఎ మేరకు తగ్గాయి అనే ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తారు.

ii ) పల్లెలలో బహిరంగ మల మూత్ర విసర్జన అలవాటు బారి నుంచి బయటపడిన (ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ.. ఒ డి ఎఫ్) స్థితిని పరిరక్షించ‌డం: దీని ప్రకారం ఒ డి ఎఫ్ గ్రామాలలో నివసిస్తున్న జనాభా ను అంచనా వేసి, తదనుగుణంగా నిధులను విడుదల చేస్తారు.

iii ) మెరుగైన ఘన వ్యర్థాల, ద్రవరూప వ్యర్థ పదార్థాల యాజమాన్య (ఎస్ ఎల్ డబ్ల్యు ఎమ్) సేవలను అందుకొంటున్న గ్రామీణ జనాభా శాతంలో నమోదైన పెరుగుదల : ఎస్ ఎల్ డబ్ల్యు ఎమ్ సేవలను ఆమోదయోగ్యమైన స్థాయిలో అందుకొంటున్న జనాభా ఆధారంగా నిధులను విడుదల చేస్తారు.

ఎమ్ ఒ డబ్ల్యు ఎస్ నుంచి రాష్ట్రాలు స్వీకరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక గ్రాంటు నిధులలో గణనీయ భాగాన్ని ( సుమారు 95 శాతానికి పైగా) సంబంధిత జిల్లాలు, బ్లాకులు, గ్రామ పంచాయతుల వంటి వివిధ స్థాయిలకు రాష్ట్రాలు బదలాయిస్తాయి. అయితే ఈ పథకంలో ప్రోత్సాహక గ్రాంటుల అంతిమ వినియోగం పారిశుద్ధ్య రంగానికి చెందిన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం.

2019 కల్లా పారిశుద్ధ్య రంగంలో స్థిరమైన ప్రతిఫలాలను సాధించేందుకు చేసే ప్రయత్నాలను ఈ ప్రాజెక్టు ముమ్మరం చేయగలదు. బహిరంగ మల విసర్జనను అరికట్టడం, బహిరంగ మల విసర్జనలు లేని గ్రామాలను సాధించడం, ఘన వ్యర్థాల, ద్రవ రూప వ్యర్ధ పదార్ధాల యాజమాన్యం లో మెరుగుదల వంటి పరిణామాల సాధనకు స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) ద్వారా తీసుకుంటున్న చర్యలకు ఈ ప్రాజెక్టు నుంచి అందజేసే ప్రోత్సాహకాలు మరింత ఊపునిస్తాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ పారిశుద్ధ్యంలో ఈ మేరకు అభివృద్ధి సాధించాము అనేది అంచనా వేయడానికి ఒక పటిష్టమైన స్వతంత్ర, విశ్వసనీయ పర్యవేక్షక విధానాన్ని కూడా ఏర్పాటు చేయాలి. బహిరంగ మల విసర్జనలు లేని పరిశుద్ధమైన వాతావరణాన్ని సాధించాలనే ఆశయాన్ని సాధించాలని అమలు చేస్తున్న స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమానికి ఈ ప్రాజెక్టు అండగా నిలుస్తుంది. అనారోగ్యానికి, పోషకాహార లోపానికి, విద్య అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే. అందువల్ల స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) నెరవేరితే, ఇటువంటి వాటిపై ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుంది. తద్వారా గ్రామీణ ప్రజలకు మంచి నాణ్యమైన జీవనాన్ని కల్పించవచ్చు.

పూర్వ రంగం :

ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తం రుణం 15 వందల మిలియన్ యు ఎస్ డాలర్లు (ఒక అమెరికా డాలరు విలువ 60 రూపాయలుగా లెక్క వేస్తే, ఈ రుణం మొత్తం విలువ రూ.9,000 కోట్లు ఉంటుంది). ఇందులో రాష్ట్రాలకు ప్రోత్సాహక గ్రాంటుగా అందజేసేది 1475 మిలియన్ యు ఎస్ డాలర్లు (రూ.8,850 కోట్లు). అలాగే తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కు సామర్ధ్య నిర్వహణ, కార్యక్రమ యాజమాన్యం కోసం 25 మిలియన్ యు ఎస్ డాలర్లు (రూ.150 కోట్లు) అందజేస్తారు. అందువల్ల ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు కొత్తదేమీ కాదు; కానీ, ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) లో ఇది ఒక భాగం మాత్రమే. రాష్ట్రాలకు ప్రోత్సాహకరమైన సహాయం చేయడానికి స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కు కొన్ని నిధులను విదేశీ ఆర్ధిక సహాయ ప్రాజెక్టు రుణం ద్వారా అందజేస్తున్నారు. మరో మాట లో చెప్పాలంటే స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్)లో భాగం గా పనితీరు ఆధారిత ప్రోత్సాహక గ్రాంటు పథకాన్ని ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో ప్రారంభించాలని ప్రతిపాదించారు.

2019 నాటికి గ్రామీణ భారతం లో బహిరంగ మల విసర్జనలను నిర్మూలించి, పరిశుభ్రతను పెంపొందించి, సార్వత్రిక పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలన్న లక్ష్య సాధన కోసం – స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) క్రింద చర్యలను వేగిరపరచాలన్న పూర్వ రంగంలో ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగింది. దేశంలో పారిశుద్ధ్యాన్నీ, పరిశుభ్రతను మెరుగుపరచాలని చేపట్టిన ఈ కార్యక్రమం భారతదేశం లో ఒక అతి పెద్ద ప్రయత్నంగా పరిగణించబడింది. ఈ కొత్త స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) క్రింద ప్రజల ప్రవర్తన లో మార్పు తీసుకురావడం, బహిరంగ మల విసర్జన లేని గ్రామాలను తయారుచేయడం పై దృష్టి సారిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన ను తగ్గించి, స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సామర్ధ్యాన్ని పటిష్టపరచడం ఈ ప్రతిపాదిత కార్యక్రమం ఉద్దేశం. అంటే బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్ర వాతావరణాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి వీలుగా స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుంది.

***