Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని పత్రికా ప్రకటన

స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని పత్రికా ప్రకటన


గౌరవ అధ్యక్షులవారికీ,

 

ఇరు దేశాల ప్రతినిధులకూ,

 

మీడియా మిత్రులకూ,

 

నమస్కారం!

 

భారత్‌లో స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి ఆత్మీయంగా స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

 

ముందుగా.. భారత్ – స్విట్జర్లాండ్ సంబంధాల పట్ల ఆయన అంకిత భావానికి నా అభినందనలు. గతేడాది అక్టోబరులో ఆయన వ్యక్తిగత మద్దతుతో భారత్ – ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) దేశాల మధ్య చరిత్రాత్మక వాణిజ్య-ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేశాం. ఐరోపాలోని ఏ ఆర్థిక కూటమితో అయినా.. భారత్ కుదుర్చుకున్న తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే.

 

ఇది పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉద్యోగాలు, ఉమ్మడి శ్రేయస్సు దిశగా ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళిక కూడా. దీని ద్వారా వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 10 లక్షల ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యాలను సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.

 

మిత్రులారా,

 

భారత్, స్విట్జర్లాండ్ మధ్య మైత్రి శతాబ్దాల నాటిది. 19వ శతాబ్దంలో స్వామి వివేకానందుడు స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాలలో హిమాలయాల ఛాయను దర్శించారు. మహాత్మాగాంధీ కూడా స్విట్జర్లాండ్‌లో కొంతకాలం గడిపారు. అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆ చరిత్రాత్మక పర్యటనల జ్ఞాపకాలు నేటికీ మన స్నేహంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

 

ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత నేడు మన భాగస్వామ్యానికి బలమైన ప్రాతిపదికలుగా ఉన్నాయి. నేటి సదస్సు ద్వారా మన భాగస్వామ్యంలో నవోత్తేజాన్ని నింపి.. దాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాం.

 

మిత్రులారా,

 

స్విట్జర్లాండ్‌లో భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాల లభ్యతను మెరుగుపరిచేలా, ఇరుదేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేలా మేం అనేక కీలక చర్యలు తీసుకున్నాం.

 

స్విట్జర్లాండ్‌కు భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులను పెంచడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సులు, బ్యాంకింగ్, బీమా, ఆహార శుద్ధి, సుస్థిరత వంటి కీలక రంగాలకు సంబంధించి.. నూతన స్విస్ పెట్టుబడులను భారత్‌కు ఆకర్షిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధికి, అంతర్జాతీయ ప్రయోజనాలకు భరోసా ఇచ్చే వివిధ మార్గాల రూపకల్పనకు సమష్టిగా కృషిచేస్తాం.

మిత్రులారా,

 

సైనిక భాగస్వామ్యం, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో నూతన సహకార అవకాశాలను ఈ రోజు మేం గుర్తించాం. అణు ఇంధన రంగంలోనూ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది.

 

వారణాసి రోప్‌వే, నోయిడాలోని జెవార్ విమానాశ్రయం, పర్వత ప్రాంతాల్లోని రైల్వే, సొరంగ మార్గ ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాల్లో మన సహకారానికి అద్భుత ఉదాహరణలు. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా.. రవాణా, సంచార వ్యవస్థలు, మౌలిక వసతులకు సంబంధించిన ఒప్పందంపై ఈ రోజు మనం సంతకాలు చేశాం.

 

భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతోపాటు.. సామర్థ్యాభివృద్ధి, డిజైన్, తయారీ రంగాల్లో భాగస్వాములయ్యేలా స్విట్జర్లాండ్ మౌలిక సదుపాయాల కంపెనీలకు మేం ఆహ్వానం పలుకుతున్నాం.

 

మిత్రులారా,

 

శాస్త్ర, సాంకేతికత రంగాల్లో సహకారం కూడా మన భాగస్వామ్యానికి ఒక మౌలిక ప్రాతిపదిక. ఆరోగ్యం, శుద్ధ ఇంధనం, అంతరిక్షం వంటి ప్రాధాన్యతా రంగాల్లో త్వరలోనే మనం కొత్త ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నందుకు సంతోషదాయకం. భారత సైన్స్ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి జ్యూరిచ్ విశ్వవిద్యాలయంతో కుదిరిన ఒప్పందాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.

 

స్విట్జర్లాండ్‌లో యోగా, ఆయుర్వేదాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా.. ఈ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై కూడా ఈ రోజు మేం అర్థవంతంగా చర్చించాం.

 

మిత్రులారా,

 

ప్రజా సంబంధాలు మన భాగస్వామ్యానికి అతిపెద్ద బలం. ఈ రోజు కుదిరిన వలస, రాకపోకల భాగస్వామ్య ఒప్పందం, యువ నిపుణుల ఒప్పందం స్విట్జర్లాండ్‌లో భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు, యువతకు అనేక సరికొత్త అవకాశాలను అందిస్తాయి.

 

మిత్రులారా,

 

భారత్, స్విట్జర్లాండ్ రెండూ ప్రజాస్వామ్య విలువలను, సమన్యాయ పాలనను, చర్చలను, దౌత్యాన్ని విశ్వసిస్తాయి. ప్రపంచ శాంతి, స్థిరత్వం దిశగా ఎపట్లాగే మేం కలిసి పనిచేస్తాం.

 

ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా.. శాంతి దిశగా సాగే ప్రతి అర్థవంతమైన ప్రయత్నానికీ భారత్ ఎప్పుడూ మద్దతిస్తూ వచ్చింది.

 

పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడం కోసం.. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని కూడా మేం అంగీకరిస్తున్నాం.

 

మిత్రులారా,

 

భారీ వాణిజ్య ప్రతినిధి బృందంతో భారత్‌ను సందర్శించిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి కృతజ్ఞతలు. అక్టోబరు 7న ఆయన సమక్షంలో భారత్ – ఈఎఫ్‌టీఏ వాణిజ్యాధినేతలతో కలిసి ‘ప్రాస్పెరిటీ సమ్మిట్’ను మేం నిర్వహిస్తాం. మన వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యానికి సంబంధించిన హామీని ఆచరణాత్మక ఫలితాలుగా మలిచేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ సదస్సులో పాల్గొంటున్న వ్యాపార రంగ ప్రముఖులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

గౌరవ అధ్యక్షా,

 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సుకు భారత్ ఆతిథ్యమిచ్చింది. వచ్చే సంవత్సరం ‘జెనీవా ఏఐ సమ్మిట్’ ద్వారా స్విట్జర్లాండ్ ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లబోతోంది. జెనీవా ఏఐ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూ.. స్విట్జర్లాండ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింత బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా, మానవ ప్రయోజనాలే కేంద్రంగా కృత్రిమ మేధను వినియోగించుకునే దిశగా ఎప్పట్లాగే మనం కలిసి పనిచేస్తామన్న పూర్తి నమ్మకం నాకుంది.

 

భారత్‌లో సందర్శించి, భారత్ – స్విట్జర్లాండ్ సంబంధాలకు బలమైన మద్దతుదారుగా నిలిచిన మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

గమనిక-ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదమిది. మూల ప్రసంగం హిందీలో ఉంది.  

 

****